వరద బాధితులకు ప్యాకేజీ | New homes for the homeless | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు ప్యాకేజీ

Published Wed, Sep 18 2024 4:48 AM | Last Updated on Wed, Sep 18 2024 9:16 AM

New homes for the homeless

ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు

దుకాణాలు మునిగితే రూ.25 వేల సాయం

వరికి హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం

గత ప్రభుత్వ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెట్టాలి

అమరావతి మునిగిపోతుందనే నోళ్లకు తాళాలు వేయాలి

నీళ్లొస్తాయని ఆకాశంలో రాజధాని కడతారా

‘ఆపరేషన్‌ బుడమేరు’ త్వరలో ప్రారంభం

మీడియాతో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ మునిగిపోయిన అన్ని కుటుంబాలకు రూ.25 వేలు, మిగతా ఫ్లోర్లు మునిగిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లుమునిగిన వారికి రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు. ఆయా ఇళ్లలో అద్దెకు ఎవరైనా ఉంటుంటే పరిహౠరం వారికే చెల్లిస్తామన్నారు. కిరాణా షాపులు, చిన్న వ్యాపారులకు రూ.25 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికే ఆర్బన్‌ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్‌ పరికరాల మరమ్మతులు చేయిస్తున్నామన్నారు.

వ్యవసాయ రంగానికి పరిహారం ఇలా
వరి పంట దెబ్బతింటే హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారు, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున, మొక్కజొన్న, సజ్జలు, మినుము, పెసలు, కందులు, రాగులు, కొర్రలు, సామలు, రాగులు, నువ్వులు, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆముదం, జూట్‌ పంటలకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. 

తమలపాకు పంటకు హెక్టారుకు రూ.75 వేలు, అరటి, మిరప, పసుపు కంద, జామ, నిమ్మ, మామిడి, జీడిమామిడి, దానిమ్మ, సపోటా, డ్రాగన్‌ ఫ్రూట్‌తో పాటు కాఫీ, యాపిల్‌ బేర్‌ తోటలకు హెక్టారుకు రూ.35 వేలు, కూరగాయలు, బొప్పాయి, టమాటా, పూలు, ఉల్లి, మెలన్స్, నర్సరీ, కొత్తిమీర పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరి ఒక్కో చెట్టుకు రూ.1,500, మల్బరీ తోటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని వివరించారు. 

చనిపోయిన ఆవులు, గేదెలకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7,500, కోడిపిల్లకు రూ.100, పశువుల షెడ్లకు రూ.5 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టాలను ఆయా క్షేత్రాల్లో రైతులు సాగు చేస్తున్నారా లేదా కౌలు రైతులకు సాగు చేస్తున్నారా గుర్తించి వారికే అందజేస్తామన్నారు. వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లకు రూ.20 వేలు, మోటరైజ్డ్‌ బోట్లకు రూ.25 వేలు, ఫిష్‌ ఫామ్స్‌ (డిసిల్టింగ్, రిస్టోరేషన్, మరమ్మతులు)కు హెక్టారుకు రూ.18 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు.

మరమ్మతులకు రుణాలు
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల పరిధిలో దెబ్బతిన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఇళ్లకు రూ.50 వేలు, ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇళ్లకు రూ.25 వేల చొప్పున బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఎంఎస్‌ఎంఈల రుణాలను 24 నెలలపాటు రీషెడ్యూల్‌ చేయాలని కోరామని, బ్యాంకులు 12 నెలలపాటు రీషెడ్యూల్‌ చేయడానికి ముందుకొచ్చాయన్నారు. 

వ్యవసాయ రుణాలను ఐదేళ్లపాటు రీషెడ్యూల్‌ చేయిస్తామని, 12 నెలలపాటు మారటోరియం విధించాలని ఆదేశించామన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కొత్తగా పంట రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పారు.

ఆ భూతాన్ని పూడ్చిపెట్టాలి
గత ప్రభుత్వం విపత్తుల నిధులను ఖర్చుచేసి అకౌంట్స్‌లో చూపలేదని, దీంతో ఈ పార్థిక ఏడాది విపత్తుల నిధి నుంచి తొలి విడత రావాల్సిన నిధులు రూ.515 కోట్లు కేంద్రం నుంచి రాలేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేసిందని, గత ప్రభుత్వ భూతాన్ని మళ్లీ లేవకుండా శాశ్వతంగా పూడ్చిపెట్టాలని అన్నారు.

పంచాయతీరాజ్‌ నిధులతో పాటు పోలవరం నిధులను కూడా దారి మళ్లించిందని ఆరోపించారు. రూ.10.50 లక్షల కోట్లు అప్పులున్నాయని, రూ.లక్ష కోట్ల బిల్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో కేంద్రం త్వరగా ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే వరద సాయంపై ఇప్పుడే చెప్పలేనన్నారు.

అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం
అమరావతి మునిగిపోతుందని వైఎస్సార్‌సీపీ దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వారెవరూ ఇలా మాట్లాడరన్నారు. అలాంటి నాలుకలకు తాళం వేయాలన్నారు. కింద నీళ్లు వస్తాయని, రాజధానిని ఆకాశంలో కట్టుకుంటామా అని ప్రశ్నిచారు. ఏ సిటీ మునగకుండా ఉంటుందో చెప్పాలన్నారు. కర్నూలు, రాజమండ్రి మునిగిపోలేదా.. బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ మునిగిపోలేదా అని ప్రశ్నించారు. 

ఆ సిటీలు మునిగిపోయాయని రాజధానులను మార్చేశారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కొంతమంది రెచ్చగొడుతున్నారన్నారు. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ను తానే కాపాడితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్లకు లాభాలు వస్తుంటే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఎందుకు నష్టం వస్తోందో యాజమాన్యంతో పాటు పనిచేసే సిబ్బంది ఆలోచించుకోవాల్సి ఉందన్నారు.

త్వరలోనే ‘ఆపరేషన్‌ బుడమేరు’
గత ప్రభుత్వ తప్పుడు పనులు, ఆక్రమణల వల్లే ఇంత వరద వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. త్వరలోనే ఆపరేషన్‌ బుడమేరు ప్రారంభిస్తామన్నారు. మెడికల్‌ కాలేజీలపై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు చేస్తోందని, వాటిపై జీవో ఏమిచ్చారో ఆ జీవో మెడకు కట్టి ఊరంతా తిప్పుతానన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇలా 
కేటగిరీ                                                                       ఇచ్చే పరిహారం
»  విజయవాడలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ మునిగితే                           రూ.25 వేలు
» ఫస్ట్‌ ఫ్లోర్, ఆపై అంతస్తులు మునిగితే                           రూ.10 వేలు
»రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ మునిగితే      రూ.10 వేలు
» విజయవాడలో చిన్న దుకాణాలకు                                రూ.25 వేలు
»రిజిస్టర్డ్‌ వ్యాపార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు (రూ.40 లక్షల లోపు టర్నోవర్‌)    రూ.50 వేలు
»రిజిస్టర్డ్‌ వ్యాపార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు (రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్‌)    రూ.1 లక్ష
»రూ.1.50 కోట్లకు పైగా టర్నోవర్‌    రూ.1.50 లక్షలు
»ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు       రూ.3 వేలు
» దెబ్బతిన్న ఆటోలు వంటి 3 చక్రాల వాహనాలు                రూ.10 వేలు
» విజయవాడలో తోపుడు బళ్లు మునిగితే..                    కొత్త తోపుడు బళ్లు అందజేత
» ముంపునకు గురైన చేనేత, చేతివృత్తుల వారికి              రూ.25 వేలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement