కాలనీలు.. కన్నీళ్లు
- హైదరాబాద్‌లో నీట మునిగిన ప్రాంతాల్లో జనం అవస్థలు
- నాలుగు రోజులుగా జల దిగ్బంధం
నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వాన జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూడు రోజులుగా కరెంటు లేక.. తాగడానికి నీళ్లు లేక.. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీరు చేరడంతో బయటకు వెళ్లే దారిలేక.. ఆదుకునే వారు కనిపించక.. ఏ క్షణంలో ఏ ఉపద్రవం జరుగుతుందో తెలియక భయాందోళనలో మునిగిపోతున్నారు. నిండా నీటిలో మునిగిపోయిన భండారి లేఅవుట్, నిజాంపేట్‌ల నుంచి అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, రామంతాపూర్‌ల దాకా చాలా కాలనీలు, బస్తీల ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్
తుర్క చెరువు ఉగ్రరూపానికి వరద నీరు కాలనీల్లోకి చేరడంతో భయానక వాతావరణం నెలకొంది. అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లలో నీరు ఒకవైపు తోడి పోస్తుండగా.. మరోవైపు వరదనీరు వచ్చి చేరుతుండటంతో దిక్కుతోచని స్థితి నెలకొంది. భండారీ లేఅవుట్‌లోని 47 అపార్ట్‌మెంట్‌లలో 3 రోజులుగా కరెంట్ లేదు. పగటిపూట కూడా గాలి, వెలుతురు లేక బాల్కనీల్లోనే ఉంటున్నారు. తాగేందుకు నీళ్లు లేవు. ఇక్కడి ఓ అపార్ట్‌మెంట్‌లో పరిస్థితులను ‘సాక్షి’ స్వయంగా పరిశీలించింది. ఆ సమయంలో ఓ ఫ్లాట్‌లో సంగీతా మిశ్రా అనే గృహిణి కొవ్వొత్తుల వెలుగులో కూరగాయలు తరుగుతున్నారు. 4 రోజులుగా తమ కుటుంబం చీకట్లోనే మగ్గుతున్నట్లు ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కరెంట్ లేక దోమలతో అవస్థలు పడుతున్నామన్నారు.
మరో అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో ఉంటున్న కరుణను పలకరించగా.. బోరున విలపించారు. తనకు భర్త లేడని, ఇద్దరు ఆడపిల్లలని.. ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేక అవస్థలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నాలుగో అంతస్తులో ఉంటున్న సుజాత అనే మహిళ ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. చీకట్లోనే పిల్లలకు భోజనాలు పెట్టి వారితో కూర్చున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఖానాజీ గూడ శివనగర్‌లో నివాసం ఉండే సాదుల్లా లక్ష్మమ్మ (60) అనే వృద్ధురాలు శుక్రవారం రాత్రి ఇంటి పక్కనే ఉన్న నాలాలో పడి గల్లంతైంది.
దుర్గంధం.. అనారోగ్యాలు: ఇతర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీరంతా వర్షం, వరదల కారణంగా భండారీ లేఅవుట్‌లోని ఇళ్లలోకి, సెల్లార్‌లలోకి చేరడంతో భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తోంది. కొందరు ఇప్పటికే జ్వరం వంటి అనారోగ్యాల పాలయ్యారు. దీంతో చాలా మంది ఇళ్లను, ఫ్లాట్‌లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
నగర వ్యాప్తంగా..
► అల్వాల్ ప్రాంతంలోని భారతినగర్, శ్రీనివాసనగర్, ఆనంద్‌రావునగర్, వెస్ట్ వెంకటాపురం, రాంచంద్రయ్యకాలనీ, దినకర్‌నగర్, జోషినగర్, ఆర్‌బిఐ కాలనీ, పాలమూరు బస్తీ తదితర ప్రాంతాల్లో ప్రజలు నాలుగు రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లలేని పరిస్థితి.
► మల్కాజిగిరిలోని బండ చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో ఎన్ ఎండీసీ కాలనీ, షిర్డీనగర్ తదితర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారుల పై మూడు అడుగులకు పైగా నీరు ప్రవహించింది. ఇళ్లలోకి నీరు చేరడంతో శుక్రవారం రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడిపారు.
► ఉప్పల్‌లో చిలుకానగర్, స్వరూప్‌నగర్ రహదారి నీటితో నిండిపోయింది. నాలా ఉప్పొంగడంతో కావేరీనగర్, స్వరూప్‌నగర్, కేకేగార్డెన్ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి జనం తాళాలు వేసి వెళ్లిపోయారు.
► కాప్రా చెరువు నిండి, దిగువకు నీరు పోటెత్తడంతో దాబాగార్డెన్ , అశోక్ మనోజ్ కాలనీ, సాధన విహార్, గ్రీన్ పార్క్ కాలనీ, ఎస్టీ కాలనీల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. అశోక్ మనోజ్ కాలనీలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
► కూకట్‌పల్లి సర్కిల్ ధరణినగర్ నీటితో నిండిపోయింది. నీరు ఇళ్లలోకి చేరి వస్తువులన్నీ తడిసిపోయాయి. ఆల్విన్ కాలనీ, సారుునగర్, తులసీనగర్, దత్తాత్రేయనగర్ కాలనీలూ జలదిగ్బంధమయ్యాయి.
ఎప్పుడేం జరుగుతుందోననే భయం వేస్తోంది
‘‘మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మా కాలనీలోని అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లన్నీ వరదనీటితో నిండిపోయాయి. కరెంటు, తాగేనీరు లేకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి పూట కరెంటు లేకుండానే ఉండాల్సి రావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయం వేస్తోంది..’’
- అనూష, భండారీ లేఅవుట్ నివాసి
తాగేందుకు నీళ్లూ లేవు
‘‘మా అపార్ట్‌మెంట్‌లో అందరూ తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. మాది వేరే రాష్ట్రం కావడంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. రెండు రోజులుగా కరెంట్, తాగేనీళ్లు లేవు. పిల్లల కోసమైనా పాలు, నీళ్లు, ఇతర వస్తువులు తెచ్చుకోవడం ఇబ్బందికరంగా మారింది..’’
- పింకీ స్వెరుున్ , భండారీ లేఅవుట్ నివాసి
అసలు నగరంలోనే ఉన్నామా...?
‘‘అసలు మేం ఉంటున్నది హైదరాబాద్‌లోనా లేక సముద్రం పక్కనా అనిపిస్తోంది. ఎటు చూసినా నీళ్లే. మా బాధను పట్టించుకున్న వారెవరూ లేరు. ఇంట్లో వస్తువులన్నీ నీటిలో మునిగి పోయాయి. తిండి లేదు, నీళ్లు లేవు. అంతా దుర్గంధం వస్తోంది..’’
- పెంటమ్మ, అల్వాల్