నష్టం రూ.10,320 కోట్లు | Telangana Floods Causes Damages Worth Rs 10320 Crore Says Chief Minister | Sakshi
Sakshi News home page

నష్టం రూ.10,320 కోట్లు

Published Sat, Sep 14 2024 3:58 AM | Last Updated on Sat, Sep 14 2024 7:52 AM

Telangana Floods Causes Damages Worth Rs 10320 Crore Says Chief Minister

వర్షాలు, వరదలపై కేంద్ర బృందానికి  రాష్ట్ర ప్రభుత్వం నివేదిక

దెబ్బతిన్న వేలాది ఇళ్లు.. లక్షలాది ఎకరాల్లో పంట మునక.. 

చెరువులు పొంగడం... రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోవటంతో అంచనాలకు మించి నష్టం 

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.1,350 కోట్లలో రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి 

ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలని కేంద్ర సర్కారుకు వినతి 

విపత్తు నిధుల వినియోగంలో కఠిననిబంధనలు సడలించాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తద్వారా వెల్లువెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన దానికంటే రెట్టింపు నష్టం జరిగి నట్లు తేలింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో రెండురోజుల పాటు పర్యటించి వచి్చన కేంద్ర ఉన్నతాధికారుల బృందం.. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేయగా.. శుక్రవారం కేంద్ర బృందానికి ఇచి్చన నివేదికలో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు.  

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడలేని పరిస్థితి.. 
తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని సీఎం రేవంత్‌.. కేంద్ర    బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్‌ రోడ్డు దెబ్బతింటే కేవలం లక్ష రూపాయలు ఖర్చు చేయాలనే నిబంధన పెట్టారని, దీనితో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్‌) వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు.

వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణనష్టం భారీగా తగ్గిందని చెప్పారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని చెప్పారు. చాలాచోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెరువులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు.  

మున్నేరు సమస్యకు రిటైనింగ్‌ వాలే పరిష్కారం 
ఖమ్మం నగరానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించాలంటే రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం ఒక్కటే శాశ్వత పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం అందించాలని కోరారు.   
నివారణపై ఎక్కువగా దృష్టి పెట్టాలి 

వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, వడగాడ్పుల వంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. విపత్తు పరిస్థితుల్లో తక్షణం స్పందించేలా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామంటూ ముఖ్యమంత్రి తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్‌లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం విషయంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సాయం కోరుతున్నామని తెలిపారు.  

50 వేల చెట్లు నేలమట్టం 
మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన ఉదంతం సమావేశంలో చర్చకు వచి్చంది. ఇది అటవీ ప్రాంతంలో సంభవించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ నష్టం జరిగేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం వ్యాఖ్యానించింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్డీఎంఏ) సలహాదారు కల్నల్‌ కేపీ సింగ్‌ సారథ్యంలోని కేంద్ర బృందంలో అధికారులు శాంతినాథ్‌శివప్ప, మహేష్ కుమార్, నాయల్‌కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్‌రెడ్డి ఉన్నారు. 

నష్టం అంచనాలు ఇలా.. 
విభాగం                    అంచనా నష్టం (రూ.కోట్లలో) 
రహదారులు (ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌)        7693.53 
సాగునీటి పారుదల                    483.00 
పురపాలక శాఖ                    1216.57 
తాగునీటి సరఫరా                    331.37 
విద్యుత్‌ శాఖ                    179.88 
వ్యవసాయం                    231.13 
ఆసుపత్రులు, అంగన్‌వాడీలు (కమ్యూనిటీ అసెట్స్‌)    70.47 
మత్స్య శాఖ                        56.41 
గృహ నిర్మాణం                    25.30 
పశుసంవర్ధక శాఖ                    4.35 
పాఠశాల భవనాలు                    27.31 
వరదల్లో మరణించిన వారికి నష్టపరిహారం        1.40 
మొత్తం                        10,320.72  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement