ముందే చెప్పి ఉంటే.. ముంచేదా మున్నేరు! | Munneru Flood inundated Khammam city and rural areas | Sakshi
Sakshi News home page

ముందే చెప్పి ఉంటే.. ముంచేదా మున్నేరు!

Published Wed, Sep 4 2024 4:41 AM | Last Updated on Wed, Sep 4 2024 8:48 AM

Munneru Flood inundated Khammam city and rural areas

అధికారుల నుంచి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల నష్టపోయామంటున్న బాధితులు

కట్టుబట్టలతో మిగిలిన ముంపు బాధితులు.. ఖమ్మం నగరం, రూరల్‌ మండలాలను ముంచెత్తిన వరద

50కి పైగా కాలనీల్లో 10 వేల మందికి పైగా నిరాశ్రయులైన వైనం 

ఇళ్లు, దుకాణాల్లో బురద మేటలు 

చివరకు బురదే మిగిలిందంటూ రోదన.. ఆహారం, మంచినీటి కోసం ఎదురుచూపులు 

రూ.వేల కోట్లలో నష్టం!

ఉమేష్‌ చంద్ర, యాకేష్‌ సోదరులు. ఒకరు గ్రానైట్‌ బండలపై పేర్లు చెక్కే ఆర్టిస్ట్‌ కాగా.. మరొకరు సుతారి మేస్త్రి. ఈ కుటుంబాలు రెండూ మోతీనగర్‌లో రూ.14 లక్షలు వెచ్చించి నాలుగేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నాయి. గత ఏడాది వరద వచ్చినా వస్తువులు పాడయ్యాయే తప్ప ఇళ్లు దెబ్బతినలేదు. ఈసారి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.సామాన్లు, దర్వాజాలు, కిటికీలు కొట్టుకుపోయాయి. రేడియం స్టిక్కర్‌ మిషన్లు, కంప్యూటర్లు కొట్టుకుపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ముందస్తుగా వరద ముంపు సమాచారం ఇస్తే సామగ్రిని ఇతర చోట భద్రపరుచుకునే వారమని ఈ సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.  

సమాచారం ఇస్తే నష్టం తప్పేది.. 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేటి వరద ఖమ్మం నగరాన్ని, ఖమ్మం రూరల్‌ మండలాల్లోని పలు ప్రాంతాలను ముంచేసింది. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని జల ప్రళయం బీభత్సం సృష్టించింది. ఇళ్లను నేలమట్టం చేసింది. బియ్యం, ఉప్పు, పప్పుల్లాంటి నిత్యావసర సరుకుల్నే కాదు..విలువైన వస్తువుల్నీ ఊడ్చుకుపోయింది. ఉపాధికి, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన వందలాది మంది యువత సర్టిఫికెట్లూ కొట్టుకుపోయాయి. 

అనేక కాలనీల్లో రోడ్లపైనే కాదు..వేలాది ఇళ్లు, దుకాణాల్లో బురద మేటలు వేసింది. వరద ముంచెత్తే ప్రమాదంపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడం వల్లే సర్వం కోల్పోవాల్సి వచ్చిందని, కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న తమకు ఇప్పుడు బురదే మిగిలిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇలాంటి కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి.  

ఇళ్లు చూసి.. గొల్లుమంటూ.. 
గత నెల 31న మొదలైన వరద ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. 50కి పైగా కాలనీల్లో 10 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి మున్నేటి ఒడ్డున ఉన్న ఇళ్లకు చేరుకుంటున్న వారు అక్కడి పరిస్థితి చూసి కన్నీళ్లు పెడుతున్నారు. ఇళ్లల్లో బురద మేటలు వేయగా.. అనేకచోట్ల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయి నేలమట్టమయ్యాయి. మరికొన్నిచోట్ల పైకప్పులు లేచిపోయాయి. ఒక్కో ఇంట్లో రూ.5 లక్షల విలువైన గృహోపకరణాలకు నష్టం జరిగిందనుకున్నా.. మొత్తం నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

అప్రమత్తం చేయడంలో విఫలం 
గత ఏడాది జూలై 26 నుంచి 29వ తేదీ వరకు మూడురోజుల పాటు వరద వస్తే గరిష్టంగా 30.7 అడుగులుగా నమోదైంది. అప్పట్లో వరద ముంపును ముందే ఊహించి అప్రమత్తం చేయడంతో బాధితులు విలువైన సామగ్రితో పాటు పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లకు తరలిపోయారు. దీంతో ఆస్తినష్టం భారీగా తగ్గింది. అయితే ఈసారి మహబూబాబాద్‌ జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో 40 సెం.మీ.కు పైగా వర్షం కురవడం.. వరద ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్‌ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు పోటెత్తడం, దీనిపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడంతో బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 

గత నెల 31న రాత్రి 9 గంటలకు 11 అడుగులుగా ఉన్న మున్నేరు ఈనెల 1న తెల్లవారుజామున 3 గంటలకు 19 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత గంట గంటకూ వేగంగా పెరుగుతూ ఉదయం 11 గంటలకే 36 అడుగుల పైకి చేరింది. అయితే ఎగువన భారీ వర్షంతో వరద వస్తుందన్న సమాచారాన్ని గత నెల 29, 30 తేదీల్లోనే నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముంపు ప్రాంతాల ప్రజలకు చేరవేస్తే ఆస్తినష్టం ఇంతగా జరగకపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

గత ఏడాది మాదిరి ముందుగా వరద సమాచారం ఇవ్వకపోవడం వల్లే సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రూ.లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని.. అరకొర సాయమే తప్ప ప్రభుత్వం ఈ స్థాయిలో తమను ఆదుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. వరద ముంచెత్తుతుండటంతో విలువైన సామాన్లు అటకలపై భద్ర పరిచామని, కానీ ఊహించని స్థాయిలో వరద రావడంతో అన్నీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 


ఎక్కడ చూసినా బురదే 
మున్నేటికి ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, కరుణగిరి, రాజీవ్‌ గృహకల్ప, జలగం నగర్, పెదతండా, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, బొక్కలగడ్డ, మంచికంటినగర్, ప్రకాష్‌నగర్, పంపింగ్‌వెల్‌ రోడ్డు, ఎఫ్‌సీఐ గోడౌన్లు, టీఎన్‌జీవో కాలనీ, ధంసలాపురం, అగ్రహారం కాలనీలను వరద ఆగమాగం చేసింది. ముంపు కాలనీల్లో అంతా పేద, మధ్య తరగతి ప్రజలే నివసిస్తున్నారు. ఏళ్లుగా కూడబెట్టి కొన్న విలువైన వస్తువులు కొట్టుకుపోవడంతో తిరిగి తామెప్పుడు కోలుకుంటామోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపుగా అన్ని ఇళ్లల్లో బైక్‌లు, ఫ్యాన్‌లు, ఫ్రిడ్జ్‌లు, బీరువాలు, ఏసీలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు, వాషింగ్‌ మిషన్లు, టీవీలు, మిక్సీలు, గ్యాస్‌ స్టవ్‌లు, గ్యాస్‌ సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఏ వస్తువూ మిగల్లేదు. అక్కడక్కడా సామగ్రి ఉన్నా బురదతో నిండిపోయి పనికొచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఎగువ నుంచి కొట్టుకొచ్చిన చెత్తాచెదారం, చెట్ల మొద్దులు, వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. చిన్న కిరాణా షాపులు, మెకానిక్‌ షాపులు, పండ్ల దుకాణాల్లో సైతం బురద నిండిపోయింది. 

ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటున్న బాధితులు అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమవుతోంది. పరామర్శకు వచ్చే నేతలు, అధికారులు, సిబ్బంది బురదలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ బురద మేటలు, వ్యర్థాలు తొలగించడం సహాయక సిబ్బందికీ, బాధితులకు సవాల్‌గా మారింది. జేసీబీలు, ట్రాక్టర్లతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చెత్త, బురద తొలగిస్తున్నా ఇదంతా పూర్తికావడానికి ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. 

తిండి లేదు.. నీళ్లు లేవు 
వరద కాలనీల్లో బాధితులు తిండి, తాగునీటికి అల్లాడుతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న బాధితులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలు ఆహారాన్ని పంపణీ చేస్తున్నా.. ఇవి ఏ మూలకూ చాలడం లేదు. మధ్యాహ్నం భోజనానికి పొట్లాలు అందిస్తే.. మళ్లీ రాత్రి సమయానికి భోజనం అందుతుందో లేదోననే అనుమానం వ్యక్తవుతోంది. ఇక ఇళ్లల్లో తాగునీటి బోర్ల మోటార్లు, మిషన్‌ భగీరథ పైపులైన్లు ధ్వంసం కావడంతో నీటికి అల్లాడాల్సి వస్తోంది. వస్తున్న మంచినీటి ట్యాంకర్లు ఎటూ సరిపోవడం లేదు. 

చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ.. 
వరద ప్రభావంతో ఈ కాలనీల్లో వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయి. సబ్‌ స్టేషన్లు నీట మునిగాయి. దీంతో మున్నేటి లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ముంపు బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నా రాత్రివేళ చీకట్లోనే ఉంటున్నారు. పాములు, తేళ్ల బెడదతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.  

ఇళ్లు సాయం అందేదెన్నడు? 
ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్‌వీ కర్ణన్, వీపీ గౌతమ్, కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, సీపీ సునీల్‌దత్, కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, ఇతర శాఖల అధికారులు నష్టానికి సబంధించిన వివరాల సేకరణపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అయితే రూ.కోట్లలో నష్టం రూ.కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా..మున్నేరు ముంపు ప్రాంతమంతా బురద మేట వేయడంతో నష్టాన్ని ఎప్పటికి నిర్ధారిస్తారు? ఆపై సాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

వినాయకుడి బొమ్మలు కొట్టుకుపోయి రూ.2 లక్షల నష్టం 
సూర్యాపేట జిల్లా చంద్రన్నకుంటకు చెందిన సత్‌నామ్‌సింగ్‌ ఏటా కాలువ ఒడ్డులో వినాయక విగ్రహాలు అమ్ముతాడు. ఈసారి వంద విగ్రహాలు తీసుకురాగా మున్నేరు వరదతో 20 విగ్రహాలు కొట్టుకుపోయాయి. ఒక్కో విగ్రహం రూ.10 వేల చొప్పున రూ.2 లక్షలు నష్టపోయాడు. మిగిలిన విగ్రహాలకు సైతం కొన్ని భాగాలు దెబ్బతిని, రంగులు కోల్పోవడంతో మళ్లీ సిద్ధం చేసేందుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని సత్‌నామ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  

రూ.25 వేల విలువైన బియ్యం తడిసి ముద్ద.. 
ఖమ్మం వెంకటేశ్వరనగర్‌కు చెందిన భూమా ఉపేందర్, ధనలక్ష్మి ఇల్లు ఏటి ఒడ్డున ఉండడంతో సామగ్రి కొట్టుకుపోయింది. ఉపేందర్‌ గాందీచౌక్‌ లో హమాలీగా చేస్తున్నా డు. ఆయన ఇద్దరు పిల్ల లు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే రూ.25 వేలు వెచ్చించి నాలుగు క్వింటాళ్లు కొనుగోలు చేశాడు. అయితే భారీ వరదలో బియ్యం తడిసిపోయాయి. ఎందుకూ పనికి రాకుండా పోవడంతో తిండి గింజలు లేక దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కొట్టుకుపోయిన రూ.1.80 లక్షల క్యాష్‌బ్యాగ్‌ 
బొక్కలగడ్డకు చెందిన ఘంటసాల గోపాల్, బాలకృష్ణ సోదరులు. వీరి ఇళ్లు ఎదురెదురుగానే ఉన్నాయి. ఇద్దరి ఇళ్లల్లోనూ బురద చేరింది. బురదతో గోపాల్‌ ఆటో పాడైంది. పాత ఇనుము సామాను వ్యాపారం చేసే బాలకృష్ణ లావాదేవీల కోసం రూ.1.80 లక్షలు అప్పు తెచ్చి పెట్టాడు. వరదలో ఈ డబ్బుల బ్యాగ్‌ కొట్టుకుపోయింది. వీరి ఇళ్ల పైకప్పులు సైతం లేచిపోవడంతో రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement