ఇళ్లు కోల్పోయిన వారికి నెలాఖరులోగా మంజూరు: మంత్రి పొంగులేటి
కూసుమంచి/తిరుమలాయపాలెం/నేలకొండపల్లి: గతనెల 31 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో రూ. 10,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా లోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో శనివారం మంత్రి పర్యటించారు. పాలేరు ఎడమ కాల్వ గండి మరమ్మతులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంటల వ్యవధిలో 37 నుంచి 38 సెం.మీ. మేర వర్షం కురవడంతో అన్ని విభాగాల్లో నష్టం ఎదురైందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, సీఎం వినతితో కేంద్ర బృందాలు పర్యటించాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి వరద సాయం కోసం విన్నవించడమే కాక ప్రజలను ఆదుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి సాయం అందినా, అందకున్నా వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం త్వరలో అందిస్తామని, పూర్తిగా ఇళ్లు నష్టపోయిన ప్రజలకు నెలాఖరులోగా ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్ల నుంచి 100 మంది సిబ్బందిని ఎంపిక చేసి వరద సహాయక చర్యలపై శిక్షణ ఇప్పించి కావాల్సిన పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. వచ్చేవారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన కలిసి విపత్తు సాయం కోసం ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment