munneru canal
-
వరద బాధితులను ఆదుకుంటాం
కూసుమంచి/తిరుమలాయపాలెం/నేలకొండపల్లి: గతనెల 31 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో రూ. 10,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా లోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో శనివారం మంత్రి పర్యటించారు. పాలేరు ఎడమ కాల్వ గండి మరమ్మతులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంటల వ్యవధిలో 37 నుంచి 38 సెం.మీ. మేర వర్షం కురవడంతో అన్ని విభాగాల్లో నష్టం ఎదురైందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, సీఎం వినతితో కేంద్ర బృందాలు పర్యటించాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి వరద సాయం కోసం విన్నవించడమే కాక ప్రజలను ఆదుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి సాయం అందినా, అందకున్నా వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం త్వరలో అందిస్తామని, పూర్తిగా ఇళ్లు నష్టపోయిన ప్రజలకు నెలాఖరులోగా ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్ల నుంచి 100 మంది సిబ్బందిని ఎంపిక చేసి వరద సహాయక చర్యలపై శిక్షణ ఇప్పించి కావాల్సిన పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. వచ్చేవారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన కలిసి విపత్తు సాయం కోసం ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడించారు. -
నష్టం రూ.10,320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తద్వారా వెల్లువెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన దానికంటే రెట్టింపు నష్టం జరిగి నట్లు తేలింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో రెండురోజుల పాటు పర్యటించి వచి్చన కేంద్ర ఉన్నతాధికారుల బృందం.. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేయగా.. శుక్రవారం కేంద్ర బృందానికి ఇచి్చన నివేదికలో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడలేని పరిస్థితి.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్డీఆర్ఎఫ్ కింద అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని సీఎం రేవంత్.. కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం లక్ష రూపాయలు ఖర్చు చేయాలనే నిబంధన పెట్టారని, దీనితో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్) వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు.వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణనష్టం భారీగా తగ్గిందని చెప్పారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని చెప్పారు. చాలాచోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెరువులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. మున్నేరు సమస్యకు రిటైనింగ్ వాలే పరిష్కారం ⇒ ఖమ్మం నగరానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించాలంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం ఒక్కటే శాశ్వత పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం అందించాలని కోరారు. నివారణపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ⇒వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, వడగాడ్పుల వంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. విపత్తు పరిస్థితుల్లో తక్షణం స్పందించేలా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామంటూ ముఖ్యమంత్రి తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్‌లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం విషయంలో ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని తెలిపారు. 50 వేల చెట్లు నేలమట్టం మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన ఉదంతం సమావేశంలో చర్చకు వచి్చంది. ఇది అటవీ ప్రాంతంలో సంభవించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ నష్టం జరిగేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం వ్యాఖ్యానించింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారథ్యంలోని కేంద్ర బృందంలో అధికారులు శాంతినాథ్‌శివప్ప, మహేష్ కుమార్, నాయల్‌కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్‌రెడ్డి ఉన్నారు. నష్టం అంచనాలు ఇలా.. విభాగం అంచనా నష్టం (రూ.కోట్లలో) రహదారులు (ఆర్అండ్బీ, పంచాయతీరాజ్) 7693.53 సాగునీటి పారుదల 483.00 పురపాలక శాఖ 1216.57 తాగునీటి సరఫరా 331.37 విద్యుత్ శాఖ 179.88 వ్యవసాయం 231.13 ఆసుపత్రులు, అంగన్వాడీలు (కమ్యూనిటీ అసెట్స్) 70.47 మత్స్య శాఖ 56.41 గృహ నిర్మాణం 25.30 పశుసంవర్ధక శాఖ 4.35 పాఠశాల భవనాలు 27.31 వరదల్లో మరణించిన వారికి నష్టపరిహారం 1.40 మొత్తం 10,320.72 -
Telangana: మళ్లీ 'మున్నేరు' ముంపు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోనూ శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, వర్షాలు మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకేరు, మున్నేరుల్లో పెరుగుతూ తగ్గుతున్న వరద కలవరపరుస్తోంది. కనీవిని ఎరుగని కుండపోత నేపథ్యంలో ఈనెల 1న మున్నేరు, ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలను ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం సాయంత్రం 8.25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.80 అడుగులుగా నమోదైంది. ఆదివారం 15.75 అడుగులకు చేరుకుని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, ఈనెల 1నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి నుంచే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు కూడా ఇటీవలి భయానక పరిస్థితిని తలుచుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ భారీ వర్షం.. ఇక్కడ భయం ఖమ్మం జిల్లాకు ఎగువన మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఏ ప్రాంతంలో భారీ వర్షం పడినా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. ఆ విధంగానే ఈ నెల 1న భారీయెత్తున వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు, గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మండలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌లో భారీ వర్షాలు కురిస్తే ఖమ్మం జిల్లాలోని 11 మండలాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఇక ఆకేరు పరీవాహకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మండలాలు, ఖమ్మం జిల్లాలో రెండు మండలాలు ఉంటాయి. ఆకేరు వరద మున్నేరులోకి చేరుతుండటంతో మున్నేరు ఉధృతి మరింత తీవ్రమై ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని మండలాల్లో గత పది రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గత నెల 31న, ఈనెల 1న పలు ప్రాంతాల్లో 40.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ ఈ రెండు రోజుల్లో సగటు వర్షపాతం అన్ని మండలాల్లో కలిపి 20 సెం.మీ. పైగా నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయి వర్షం ఈ రెండు ఏర్ల పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయి వర్షాల నేపథ్యంలోనే వరద ఉప్పెనలా పోటెత్తి లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ రెండు వాగుల వేగ ఉధృతి కూడా గతంతో పోలిస్తే పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్ని గంటల్లో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవలి వరదలతో ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, ధంసలాపురం కాలనీ.. ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. నాటి వరదతో అప్రమత్తం మున్నేరు, ఆకేరు వరదలు అధికార యంత్రాంగాన్ని షాక్‌కు గురి చేశాయి. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. శని, ఆదివారాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిõÙక్ అగస్త్య.. వరద ముప్పు ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాలంటూ సూచించారు. శనివారం రాత్రి కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అర్ధరాత్రి ముంపు ప్రాంతాల ఇళ్లల్లో ఉన్న వారందరినీ మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఆయా కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. ఆదివారం కొందరు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుని రాత్రికి తిరిగి వచ్చారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు, మందుల పంపిణీని వేగవంతం చేశారు. -
మున్నేరుకు పెరుగుతున్న వరద
-
ఖమ్మం జిల్లాకు మున్నేరు ముప్పు...
-
మున్నేరు ముంచింది..
-
ఖమ్మం ప్రజలను నిండా ముంచిన మున్నేరు వాగు
-
ముందే చెప్పి ఉంటే.. ముంచేదా మున్నేరు!
ఉమేష్ చంద్ర, యాకేష్ సోదరులు. ఒకరు గ్రానైట్ బండలపై పేర్లు చెక్కే ఆర్టిస్ట్ కాగా.. మరొకరు సుతారి మేస్త్రి. ఈ కుటుంబాలు రెండూ మోతీనగర్‌లో రూ.14 లక్షలు వెచ్చించి నాలుగేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నాయి. గత ఏడాది వరద వచ్చినా వస్తువులు పాడయ్యాయే తప్ప ఇళ్లు దెబ్బతినలేదు. ఈసారి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.సామాన్లు, దర్వాజాలు, కిటికీలు కొట్టుకుపోయాయి. రేడియం స్టిక్కర్ మిషన్లు, కంప్యూటర్లు కొట్టుకుపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ముందస్తుగా వరద ముంపు సమాచారం ఇస్తే సామగ్రిని ఇతర చోట భద్రపరుచుకునే వారమని ఈ సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇస్తే నష్టం తప్పేది.. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేటి వరద ఖమ్మం నగరాన్ని, ఖమ్మం రూరల్ మండలాల్లోని పలు ప్రాంతాలను ముంచేసింది. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని జల ప్రళయం బీభత్సం సృష్టించింది. ఇళ్లను నేలమట్టం చేసింది. బియ్యం, ఉప్పు, పప్పుల్లాంటి నిత్యావసర సరుకుల్నే కాదు..విలువైన వస్తువుల్నీ ఊడ్చుకుపోయింది. ఉపాధికి, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన వందలాది మంది యువత సర్టిఫికెట్లూ కొట్టుకుపోయాయి. అనేక కాలనీల్లో రోడ్లపైనే కాదు..వేలాది ఇళ్లు, దుకాణాల్లో బురద మేటలు వేసింది. వరద ముంచెత్తే ప్రమాదంపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడం వల్లే సర్వం కోల్పోవాల్సి వచ్చిందని, కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న తమకు ఇప్పుడు బురదే మిగిలిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇలాంటి కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి. ఇళ్లు చూసి.. గొల్లుమంటూ.. గత నెల 31న మొదలైన వరద ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. 50కి పైగా కాలనీల్లో 10 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి మున్నేటి ఒడ్డున ఉన్న ఇళ్లకు చేరుకుంటున్న వారు అక్కడి పరిస్థితి చూసి కన్నీళ్లు పెడుతున్నారు. ఇళ్లల్లో బురద మేటలు వేయగా.. అనేకచోట్ల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయి నేలమట్టమయ్యాయి. మరికొన్నిచోట్ల పైకప్పులు లేచిపోయాయి. ఒక్కో ఇంట్లో రూ.5 లక్షల విలువైన గృహోపకరణాలకు నష్టం జరిగిందనుకున్నా.. మొత్తం నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్రమత్తం చేయడంలో విఫలం గత ఏడాది జూలై 26 నుంచి 29వ తేదీ వరకు మూడురోజుల పాటు వరద వస్తే గరిష్టంగా 30.7 అడుగులుగా నమోదైంది. అప్పట్లో వరద ముంపును ముందే ఊహించి అప్రమత్తం చేయడంతో బాధితులు విలువైన సామగ్రితో పాటు పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లకు తరలిపోయారు. దీంతో ఆస్తినష్టం భారీగా తగ్గింది. అయితే ఈసారి మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో 40 సెం.మీ.కు పైగా వర్షం కురవడం.. వరద ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు పోటెత్తడం, దీనిపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడంతో బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నెల 31న రాత్రి 9 గంటలకు 11 అడుగులుగా ఉన్న మున్నేరు ఈనెల 1న తెల్లవారుజామున 3 గంటలకు 19 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత గంట గంటకూ వేగంగా పెరుగుతూ ఉదయం 11 గంటలకే 36 అడుగుల పైకి చేరింది. అయితే ఎగువన భారీ వర్షంతో వరద వస్తుందన్న సమాచారాన్ని గత నెల 29, 30 తేదీల్లోనే నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముంపు ప్రాంతాల ప్రజలకు చేరవేస్తే ఆస్తినష్టం ఇంతగా జరగకపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది మాదిరి ముందుగా వరద సమాచారం ఇవ్వకపోవడం వల్లే సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రూ.లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని.. అరకొర సాయమే తప్ప ప్రభుత్వం ఈ స్థాయిలో తమను ఆదుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. వరద ముంచెత్తుతుండటంతో విలువైన సామాన్లు అటకలపై భద్ర పరిచామని, కానీ ఊహించని స్థాయిలో వరద రావడంతో అన్నీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బురదే మున్నేటికి ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, పెదతండా, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, బొక్కలగడ్డ, మంచికంటినగర్, ప్రకాష్‌నగర్, పంపింగ్‌వెల్ రోడ్డు, ఎఫ్‌సీఐ గోడౌన్లు, టీఎన్జీవో కాలనీ, ధంసలాపురం, అగ్రహారం కాలనీలను వరద ఆగమాగం చేసింది. ముంపు కాలనీల్లో అంతా పేద, మధ్య తరగతి ప్రజలే నివసిస్తున్నారు. ఏళ్లుగా కూడబెట్టి కొన్న విలువైన వస్తువులు కొట్టుకుపోవడంతో తిరిగి తామెప్పుడు కోలుకుంటామోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా అన్ని ఇళ్లల్లో బైక్‌లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌లు, బీరువాలు, ఏసీలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, మిక్సీలు, గ్యాస్ స్టవ్‌లు, గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఏ వస్తువూ మిగల్లేదు. అక్కడక్కడా సామగ్రి ఉన్నా బురదతో నిండిపోయి పనికొచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఎగువ నుంచి కొట్టుకొచ్చిన చెత్తాచెదారం, చెట్ల మొద్దులు, వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. చిన్న కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, పండ్ల దుకాణాల్లో సైతం బురద నిండిపోయింది. ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటున్న బాధితులు అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమవుతోంది. పరామర్శకు వచ్చే నేతలు, అధికారులు, సిబ్బంది బురదలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ బురద మేటలు, వ్యర్థాలు తొలగించడం సహాయక సిబ్బందికీ, బాధితులకు సవాల్‌గా మారింది. జేసీబీలు, ట్రాక్టర్లతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త, బురద తొలగిస్తున్నా ఇదంతా పూర్తికావడానికి ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. తిండి లేదు.. నీళ్లు లేవు వరద కాలనీల్లో బాధితులు తిండి, తాగునీటికి అల్లాడుతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న బాధితులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలు ఆహారాన్ని పంపణీ చేస్తున్నా.. ఇవి ఏ మూలకూ చాలడం లేదు. మధ్యాహ్నం భోజనానికి పొట్లాలు అందిస్తే.. మళ్లీ రాత్రి సమయానికి భోజనం అందుతుందో లేదోననే అనుమానం వ్యక్తవుతోంది. ఇక ఇళ్లల్లో తాగునీటి బోర్ల మోటార్లు, మిషన్ భగీరథ పైపులైన్లు ధ్వంసం కావడంతో నీటికి అల్లాడాల్సి వస్తోంది. వస్తున్న మంచినీటి ట్యాంకర్లు ఎటూ సరిపోవడం లేదు. చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ.. వరద ప్రభావంతో ఈ కాలనీల్లో వందలాది విద్యుత్ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. సబ్ స్టేషన్లు నీట మునిగాయి. దీంతో మున్నేటి లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ముంపు బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నా రాత్రివేళ చీకట్లోనే ఉంటున్నారు. పాములు, తేళ్ల బెడదతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లు సాయం అందేదెన్నడు? ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్వీ కర్ణన్, వీపీ గౌతమ్, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర శాఖల అధికారులు నష్టానికి సబంధించిన వివరాల సేకరణపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అయితే రూ.కోట్లలో నష్టం రూ.కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా..మున్నేరు ముంపు ప్రాంతమంతా బురద మేట వేయడంతో నష్టాన్ని ఎప్పటికి నిర్ధారిస్తారు? ఆపై సాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.వినాయకుడి బొమ్మలు కొట్టుకుపోయి రూ.2 లక్షల నష్టం సూర్యాపేట జిల్లా చంద్రన్నకుంటకు చెందిన సత్నామ్సింగ్ ఏటా కాలువ ఒడ్డులో వినాయక విగ్రహాలు అమ్ముతాడు. ఈసారి వంద విగ్రహాలు తీసుకురాగా మున్నేరు వరదతో 20 విగ్రహాలు కొట్టుకుపోయాయి. ఒక్కో విగ్రహం రూ.10 వేల చొప్పున రూ.2 లక్షలు నష్టపోయాడు. మిగిలిన విగ్రహాలకు సైతం కొన్ని భాగాలు దెబ్బతిని, రంగులు కోల్పోవడంతో మళ్లీ సిద్ధం చేసేందుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని సత్నామ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.25 వేల విలువైన బియ్యం తడిసి ముద్ద.. ఖమ్మం వెంకటేశ్వరనగర్‌కు చెందిన భూమా ఉపేందర్, ధనలక్ష్మి ఇల్లు ఏటి ఒడ్డున ఉండడంతో సామగ్రి కొట్టుకుపోయింది. ఉపేందర్ గాందీచౌక్ లో హమాలీగా చేస్తున్నా డు. ఆయన ఇద్దరు పిల్ల లు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే రూ.25 వేలు వెచ్చించి నాలుగు క్వింటాళ్లు కొనుగోలు చేశాడు. అయితే భారీ వరదలో బియ్యం తడిసిపోయాయి. ఎందుకూ పనికి రాకుండా పోవడంతో తిండి గింజలు లేక దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.కొట్టుకుపోయిన రూ.1.80 లక్షల క్యాష్‌బ్యాగ్ బొక్కలగడ్డకు చెందిన ఘంటసాల గోపాల్, బాలకృష్ణ సోదరులు. వీరి ఇళ్లు ఎదురెదురుగానే ఉన్నాయి. ఇద్దరి ఇళ్లల్లోనూ బురద చేరింది. బురదతో గోపాల్ ఆటో పాడైంది. పాత ఇనుము సామాను వ్యాపారం చేసే బాలకృష్ణ లావాదేవీల కోసం రూ.1.80 లక్షలు అప్పు తెచ్చి పెట్టాడు. వరదలో ఈ డబ్బుల బ్యాగ్ కొట్టుకుపోయింది. వీరి ఇళ్ల పైకప్పులు సైతం లేచిపోవడంతో రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. -
ఆరిన కంటి దీపాలు
చందర్లపాడు/సాక్షి, అమరావతి: మునేరులో సోమవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (11), కర్ల బాలయేసు (12), జట్టి అజయ్ (12), గురజాల అజయ్ చరణ్ (14) సోమవారం ఉదయం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన విషయం విదితమే. వీరంతా గ్రామంలోని మునేరులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు, యానాదులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారుల జాడ కోసం సోమవారం రాత్రి నుంచే మునేరుతోపాటు కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నల్లవాగు వరద మునేరులో కలిసే ప్రదేశంలో ఏర్పడిన గోతిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ బిడ్డలు ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటారని గంపెడాశతో రాత్రి నుంచి ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వారి మృతదేహాలను చూసి భోరున విలపించారు. నందిగామ ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఏటి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించి పిల్లల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతులంతా కూలీ కుటుంబాల వారే మృత్యువాతపడిన పిల్లల తల్లిదండ్రులంతా కూలీలే. కాయకష్టం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. మైల దానయ్య, ఆంథోనీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాకేష్ (11) స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కర్ల గురవయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు బాలయేసు (12)తో పాటు కుమార్తె ఉంది. ఆ బాలుడు స్థానిక పాఠశాలలోనే 7వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి గురవయ్య గతంలో మరణించడంతో ఆ కుటుంబం మగ దిక్కును కోల్పోయింది. ఇక జట్టి సుందరరావు, అరుణలకు ఇద్దరు సంతానం కాగా చిన్నవాడైన అజయ్ (12) 7వ తరగతి చదువుతున్నాడు. అలాగే గురజాల మరియమ్మ భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. ఆమె కుమారుడు అజయ్ చరణ్(14)ను అమ్మమ్మ, తాతయ్య పెంచుకుంటున్నారు. అజయ్చరణ్ 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, మాగులూరి సుబ్బారావు మేరీ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా.. మూడవ కుమారుడైన సన్నీ (12) 7వ తరగతి చదువుతున్నాడు. ఈ చిన్నారులంతా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో వంట కట్టెలు తేవడానికి సైకిళ్లపై వెళ్లి మునేరులో దిగి మృత్యువాత పడ్డారు. ఏటూరులో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ గ్రామానికి ఓ వైపు మునేరు మరోవైపు కృష్ణా నది ఉన్నాయి. 2016 అగస్టు 16న నందిగామ చైతన్య కళాశాలలో చదువుతున్న తోటరావులపాడు, జయంతి, చెరువు కొమ్ముపాలెం, నందిగామకు చెందిన ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో పడి మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఐదుగురు చిన్నారులు మునేరులో దిగి దుర్మరణం పాలయ్యారు. రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్టు కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. బుధవారం ఈ సొమ్మును అందజేయనున్నారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మంత్రి ఆదిమూలపు సంతాపం కాగా, విద్యార్థుల మృతిపై విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సంక్రాతి సెలవులు, కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఇళ్ల వద్ద ఉంటున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. -
అప్పటి వరకు ఆడుకున్నారు.. అంతలోనే!
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామశివారులోని మున్నేరువాగులో పడి ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలంలోని జమాండ్లపల్లి గ్రామానికి చెందిన భట్టుపల్లి బాబు – లలిత దంపతుల రెండో కుమారుడు యశ్వంత్ (10), బొల్లెపల్లి భద్రాచలం – నర్మద దంపతుల కుమార్తె సాయిసహస్ర(10) కలిసి గ్రామశివారులోని మున్నేరువాగు వద్దకు ఆడుకునేందుకు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే, రాత్రి పొద్దుపోయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం ఆరా తీశారు. మున్నేరువాగు సమీపంలో పిల్లల చెప్పులు కనిపించగా నీటిలో పడి ఉంటారనే అనుమానంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటలకు యశ్వంత్ మృతదేహం లభ్యం కాగా, సాయిసహస్ర మృతదేహం లభించలేదు. చీకటి పడినా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
మున్నేరువాగులో మహిళ గల్లంతు
సాక్షి, చెన్నారావుపేట: మున్నేరువాగు (సుద్దరేవుల ఆనకట్ట)లో మహిళా కూలీ గల్లంతైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన చిట్టె మల్లమ్మ, మారాటి ఎల్లమ్మ, కుండె వినోద, మొర్రి స్వరూప కలిసి చిట్టె మల్లమకు చెందిన వరిపొలంలో కలుపు తీయడానికి మున్నేరు(పాకాల) వాగు అవతల మాటు వీరారం కాల్వ వద్దకు వెళ్తున్నారు. గ్రామంలో నుంచి పొలం వద్దకు వెళ్లడానికి మున్నేరువాగుపై నిర్మించిన సుద్ద రేవుల ఆనకట్టపై నుంచి దాటి వెళ్లాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరుద ఉధృతి పెరిగి సుద్దరేవుల ఆనకట్ట మత్తడి పోస్తుంది. ఆనకట్ట పైనుంచి వెళ్తుండగా చిట్టె మల్లమ్మ, మరాటి ఎల్లమ్మ, మొర్రి స్వరూప ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోతున్నారు. కూలీల వెనకాలే వస్తున్న మొర్రి కట్టయ్య అనే రైతు వాగులో దూకి మల్లమ్మ, ఎల్లమ్మలను రక్షించాడు. వీరిని రక్షించి స్వరూపను రక్షిద్దామని చూసే సరికి స్వరూప(40) కనిపించకుండా గల్లంతైంది. వారి వెనకాలే ఉన్న కుండె వినోద మత్తడిపైనే ఉండి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రమాదంలో ముగ్దురు కూలీలు బయటపడగా మొర్రి స్వరూప గల్లంతైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై విఠల్, ఎంపీడీఓ కోర్ని చందర్ సంఘటనా స్థలానికి చేరుకుని స్వరూప ఆచూకీ కోసం వెతికారు. ఆర్డిఓ రవి, తహసీల్దార్ సదానందం, సీఐ పెద్దన్నకుమార్ జరిగిన సంఘటనను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట ఫైర్ సిబ్బందితో వాగు ప్రదేశాలు గాలింపు చర్యలు చేపట్టారు. మిన్నంటిన రోదనలు.. కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాగులో కొట్టుకుపోతు సురక్షితంగా బయటపడ్డ చిట్టె మల్లమ్మ, కుండె వినోద, మరాటి ఎల్లమ్మలు గ్రామస్తుల సహాయంతో ఒడ్డుకు చేరడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మొర్రి స్వరూప ఆచూకి దొరకకపోవడంతో బర్త కుమారస్వామి, కూతురు ప్రత్యూష, కుమారుడు రాజులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మీ వెంకన్న, ఎంపీటీసీ మొగిళి రమాదేవికేశవరెడ్డి, నాయకులు సుదర్శన్‌గౌడ్, కంచ రాంచంద్రయ్య, మొగిళి వెంకట్‌రెడ్డి, బిల్లా ఇంద్రసేనారెడ్డిలు పరామర్శించారు. కాగా, కొట్టుకుపోయిన వ్యవసాయ కూలీ స్వరూప (37) ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్డీఓ రవి తెలిపారు. చచ్చి బతికాం.. నిన్న కూడా వాగు దాటి కలుపు తీయడానికి వెళ్లాం.. అలాగే ఈ రోజు కూడా వెళ్తుండగా కాలు జారి వాగులో పడ్డాం.. కట్టయ్య కాపాడటం వల్ల చచ్చి బతికాం.. మాతో కలిసి పనికి వచ్చిన స్వరూప బ్రతికితే బాగుండేది. వరద ఎక్కువ కావడం వల్ల వాగులో పడ్డాం.. స్వరూప దొరకకపోవడం బాధేస్తుందని రోదిస్తూ మల్లమ్మ, వినోద, ఎల్లమ్మ తెలిపారు. – ప్రాణాలతో బయటపడ్డ తోటి కూలీలు -
మున్నేరువాగులో విద్యార్థి గల్లంతు
మహబూబాబాద్,న్యూస్‌లైన్ : మున్నేరు వాగుకు ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతైన సంఘటన మానుకోటలో ఆదివారం చోటుచేసుకుంది. విద్యార్థి బంధువుల కథనం ప్రకారం... మానుకోట పట్టణంలోని కంకరబోడ్ కాలనీకి చెందిన ఎండీ షరీఫ్‌ఖాన్, షబానా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రిజ్వాన్(17) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవు ఇవ్వడంతో రెండు రోజుల క్రితమే ఇంటికొచ్చాడు. ఈతపై అమిత ఆసక్తి ఉన్న అతడు ఆదివారం తన తొమ్మిది మంది స్నేహితులతో మున్నేరు వాగుకు వెళ్లాడు. వాగు మత్తడి వద్ద ఈత కొట్టారు. వారిలో కొంతమంది కొద్దిసేపటి తర్వాత ఒడ్డుపై సేద తీరుతుండగా రిజ్వాన్‌తోపాటు మరోస్నేహితుడు మాత్రమే ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో మత్తడి వద్ద నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఉధృతిలో రిజ్వాన్ కొట్టుకుపోయాడు. దీంతో అతడి స్నేహితులు, అక్కడే ఉన్న మునిసిపాలిటీ సిబ్బంది అతడి కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు వాగు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు, మునిసిపాలిటీ సిబ్బంది మళ్లీ నీటిలోకి దిగి విద్యార్థికోసం గాలించినా ఫలితం లేకపోయింది. రాత్రి కావడంతో వెలుతురు లేకపోవడం, నీటి ప్రవాహాన్ని తట్టుకోవడం కష్టమేనని తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. సోమవారం ఉదయం మళ్లీ గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతామని అధికారులు తెలిపారు. వాగు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది.