వణికిపోతున్న మున్నేరు వరద బాధితులు
పరీవాహక ప్రాంతాలను వదలని భారీ వర్షాలు.. ఉప్పొంగి
ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం
ఇంకొన్ని రోజులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలంటూ హెచ్చరికలు
ఈనెల 1న విరుచుకుపడిన వరదతో పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విధ్వంసం
ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
తాజా వరద పరిస్థితులు, వర్షాలు కొనసాగుతాయనే హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోనూ శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, వర్షాలు మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకేరు, మున్నేరుల్లో పెరుగుతూ తగ్గుతున్న వరద కలవరపరుస్తోంది. కనీవిని ఎరుగని కుండపోత నేపథ్యంలో ఈనెల 1న మున్నేరు, ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే.
అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలను ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం సాయంత్రం 8.25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.80 అడుగులుగా నమోదైంది.
ఆదివారం 15.75 అడుగులకు చేరుకుని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, ఈనెల 1నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి నుంచే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు కూడా ఇటీవలి భయానక పరిస్థితిని తలుచుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు.
అక్కడ భారీ వర్షం.. ఇక్కడ భయం
ఖమ్మం జిల్లాకు ఎగువన మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఏ ప్రాంతంలో భారీ వర్షం పడినా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. ఆ విధంగానే ఈ నెల 1న భారీయెత్తున వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు, గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి.
మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మండలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌లో భారీ వర్షాలు కురిస్తే ఖమ్మం జిల్లాలోని 11 మండలాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఇక ఆకేరు పరీవాహకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మండలాలు, ఖమ్మం జిల్లాలో రెండు మండలాలు ఉంటాయి. ఆకేరు వరద మున్నేరులోకి చేరుతుండటంతో మున్నేరు ఉధృతి మరింత తీవ్రమై ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది.
పరీవాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని మండలాల్లో గత పది రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గత నెల 31న, ఈనెల 1న పలు ప్రాంతాల్లో 40.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ ఈ రెండు రోజుల్లో సగటు వర్షపాతం అన్ని మండలాల్లో కలిపి 20 సెం.మీ. పైగా నమోదు కావడం గమనార్హం.
ఈ స్థాయి వర్షం ఈ రెండు ఏర్ల పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయి వర్షాల నేపథ్యంలోనే వరద ఉప్పెనలా పోటెత్తి లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ రెండు వాగుల వేగ ఉధృతి కూడా గతంతో పోలిస్తే పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్ని గంటల్లో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
ఇటీవలి వరదలతో ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, ధంసలాపురం కాలనీ.. ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది.
నాటి వరదతో అప్రమత్తం
మున్నేరు, ఆకేరు వరదలు అధికార యంత్రాంగాన్ని షాక్‌కు గురి చేశాయి. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. శని, ఆదివారాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిõÙక్ అగస్త్య.. వరద ముప్పు ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాలంటూ సూచించారు. శనివారం రాత్రి కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
అర్ధరాత్రి ముంపు ప్రాంతాల ఇళ్లల్లో ఉన్న వారందరినీ మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఆయా కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. ఆదివారం కొందరు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుని రాత్రికి తిరిగి వచ్చారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు, మందుల పంపిణీని వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment