సుద్దరేవుల ఆనకట్ట వద్ద గాలింపు చర్యలు చేపట్టిన గ్రామస్తులు, అధికారులు, ఇన్‌సెట్లో గల్లంతైన స్వరూప (ఫైల్)
సాక్షి, చెన్నారావుపేట: మున్నేరువాగు (సుద్దరేవుల ఆనకట్ట)లో మహిళా కూలీ గల్లంతైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన చిట్టె మల్లమ్మ, మారాటి ఎల్లమ్మ, కుండె వినోద, మొర్రి స్వరూప కలిసి చిట్టె మల్లమకు చెందిన వరిపొలంలో కలుపు తీయడానికి మున్నేరు(పాకాల) వాగు అవతల మాటు వీరారం కాల్వ వద్దకు వెళ్తున్నారు. గ్రామంలో నుంచి పొలం వద్దకు వెళ్లడానికి మున్నేరువాగుపై నిర్మించిన సుద్ద రేవుల ఆనకట్టపై నుంచి దాటి వెళ్లాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరుద ఉధృతి పెరిగి సుద్దరేవుల ఆనకట్ట మత్తడి పోస్తుంది.
ఆనకట్ట పైనుంచి వెళ్తుండగా చిట్టె మల్లమ్మ, మరాటి ఎల్లమ్మ, మొర్రి స్వరూప ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోతున్నారు. కూలీల వెనకాలే వస్తున్న మొర్రి కట్టయ్య అనే రైతు వాగులో దూకి మల్లమ్మ, ఎల్లమ్మలను రక్షించాడు. వీరిని రక్షించి స్వరూపను రక్షిద్దామని చూసే సరికి స్వరూప(40) కనిపించకుండా గల్లంతైంది. వారి వెనకాలే ఉన్న కుండె వినోద మత్తడిపైనే ఉండి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రమాదంలో ముగ్దురు కూలీలు బయటపడగా మొర్రి స్వరూప గల్లంతైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై విఠల్, ఎంపీడీఓ కోర్ని చందర్ సంఘటనా స్థలానికి చేరుకుని స్వరూప ఆచూకీ కోసం వెతికారు. ఆర్డిఓ రవి, తహసీల్దార్ సదానందం, సీఐ పెద్దన్నకుమార్ జరిగిన సంఘటనను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట ఫైర్ సిబ్బందితో వాగు ప్రదేశాలు గాలింపు చర్యలు చేపట్టారు.
మిన్నంటిన రోదనలు..
కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాగులో కొట్టుకుపోతు సురక్షితంగా బయటపడ్డ చిట్టె మల్లమ్మ, కుండె వినోద, మరాటి ఎల్లమ్మలు గ్రామస్తుల సహాయంతో ఒడ్డుకు చేరడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మొర్రి స్వరూప ఆచూకి దొరకకపోవడంతో బర్త కుమారస్వామి, కూతురు ప్రత్యూష, కుమారుడు రాజులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మీ వెంకన్న, ఎంపీటీసీ మొగిళి రమాదేవికేశవరెడ్డి, నాయకులు సుదర్శన్‌గౌడ్, కంచ రాంచంద్రయ్య, మొగిళి వెంకట్‌రెడ్డి, బిల్లా ఇంద్రసేనారెడ్డిలు పరామర్శించారు. కాగా, కొట్టుకుపోయిన వ్యవసాయ కూలీ స్వరూప (37) ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్డీఓ రవి తెలిపారు.
చచ్చి బతికాం..
నిన్న కూడా వాగు దాటి కలుపు తీయడానికి వెళ్లాం.. అలాగే ఈ రోజు కూడా వెళ్తుండగా కాలు జారి వాగులో పడ్డాం.. కట్టయ్య కాపాడటం వల్ల చచ్చి బతికాం.. మాతో కలిసి పనికి వచ్చిన స్వరూప బ్రతికితే బాగుండేది. వరద ఎక్కువ కావడం వల్ల వాగులో పడ్డాం.. స్వరూప దొరకకపోవడం బాధేస్తుందని రోదిస్తూ మల్లమ్మ, వినోద, ఎల్లమ్మ తెలిపారు.
– ప్రాణాలతో బయటపడ్డ తోటి కూలీలు
Comments
Please login to add a commentAdd a comment