warangal rural
-
వరంగల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు జిల్లాల సరిహద్దులతోపాటు వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ప్రభావం ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై, పాలకవర్గాలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల పాలక వర్గాలు కొనసాగుతాయని, పాత జిల్లాల ప్రాతిపదికనే వీటి అధికార పరిధి అమల్లో ఉంటుందని తెలిపింది. హన్మకొండ జిల్లా స్వరూపం... వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ రెవెన్యూ డివిజన్లోని హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వెలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వరంగల్ రూరల్ జిల్లా.. పరకాల రెవెన్యూ డివిజన్లోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలతో కొత్తగా హన్మకొండ జిల్లా ఏర్పాటైంది. వరంగల్ జిల్లా స్వరూపం..: వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్ రూరల్ జిల్లా.. వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలతో కొత్త వరంగల్ జిల్లా ఏర్పాటైంది. -
సర్పంచ్‌లకు సస్పెన్షన్ టెన్షన్!
సాక్షి, వరంగల్ రూరల్: గ్రామ సర్పంచ్‌లకు ‘సస్పెన్షన్’టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018–37(5) చట్టం ప్రకారం విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సర్పంచ్‌లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడంతో వారు దినదినగండంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, హరితహారం, పల్లెప్రకృతివనం పనుల్లో జాప్యం జరిగినా సస్పెండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలానా సమస్య పరిష్కరించుకుండా సర్పంచ్ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఫిర్యాదు చేసినా సరే వేటు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామాలుంటే 2,145 మంది సర్పంచ్‌లకు ఆయా జిల్లా కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వరంగల్ రూరల్‌లో ముగ్గురు, నిర్మల్‌లో ఇద్దరు.. మొత్తం ఐదుగురిని విధుల నుంచి తొలగించారు. ఇలా 2021 మే వరకు రాష్ట్రవ్యాప్తంగా 139 మంది సర్పంచ్‌లు సస్పెండయ్యారు. ప్రత్యర్థి పార్టీ వారిపై.. ► వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామం సర్పంచ్ శ్రీధర్ది కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీకి చెందిన ఆ గ్రామ నేతలు ఊరిలో పారిశుధ్యం లోపించిందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 2020 సెప్టెంబర్ 26న సస్పెండ్ చేశారు. అయితే ఇందుకు తగిన చర్యలు తీసుకుంటానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి తిరిగి అక్టోబర్ 9న విధుల్లో చేరారు. ► నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సర్పంచ్ శారద కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆమెపై గతేడాది నవంబర్ 3న సస్పెన్షన్ వేటుపడింది. నిధులు దుర్వినియోగం చేశారని, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేశారంటూ అధికార పార్టీకి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లు ఆమెపై ఫిర్యాదు చేయగా, కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆమె కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తే వారం తర్వాత సస్పెన్షన్ ఎత్తేశారు. ఆధిపత్య పోరు.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సర్పంచ్ వరలక్ష్మిపై సస్పెన్షన్ వేటు పడింది. నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు కొందరు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన అనంతరం అధికారులు సస్పెండ్ చేశారు. అధికార పార్టీ అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వర్గం కావడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు అధికారులపై ఒత్తిడి తేవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ దుమారం చెలరేగడంతో రెండు నెలల తర్వాత ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఏ జిల్లాలో ఎందరు సస్పెండయ్యారంటే.. వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 8, ములుగు 3, జనగాం 3, మహబూబాబాద్ 2, కరీంనగర్ ఒకటి, జగిత్యాల 7, మంచిర్యాల 7, ఖమ్మం 9, భద్రాద్రి కొత్తగూడెం 4, నిజామాబాద్ 4, కామారెడ్డి 11, మెదక్ 5, సంగారెడ్డి 8, రాజన్న సిరిసిల్లా 2, జోగుళాంబ గద్వాల 5, నాగర్ కర్నూలు 6, వనపర్తి 2, నల్లగొండ 12, సూర్యాపేట 1, ఆదిలాబాద్ ఒకటి, మేడ్చల్ మల్కాజ్గిరి 1, రంగారెడ్డి 19, వికారాబాద్ 1, యాదాద్రి భువనగిరి 7. కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ చిలుక లింగయ్య వైకుంఠ ధామం నిర్మాణపనులు చేయకపోవడంతో తొలుత షోకాజ్ నోటీసు ఇచ్చారు. సమాధానం సంతృప్తికరంగా లేదని కలెక్టర్ సస్పెండ్ చేశారు. చిలుక లింగయ్య హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా ఇంకా అధికారుల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఉప సర్పంచ్ చిరంజీవి సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన చిలుక లింగయ్య మండలంలో బీజేపీకి చెందిన సర్పంచ్ కావడం గమనార్హం. సబ్‌స్టేషన్ కోసం స్థలం అడిగితే సస్పెండ్ చేస్తారా? మా గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ కోసం స్థలం కేటాయించలేదని నాలుగో విడత పల్లెప్రగతి తొలిరోజు గ్రామసభను పాలకవర్గమంతా బహిష్కరించాం. దీంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 2021 జూలై 15న కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే ఊరి బాగు కోసం నేను ఈ విషయాన్ని లేవనెత్తితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమో కలెక్టర్ ఆలోచించుకోవాలి. - ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ పెద్దకోడెపాక, వరంగల్ రూరల్ జిల్లా గవర్నర్ జోక్యం చేసుకోవాలి చాలా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యంతో చిన్నచిన్న కారణాలకే ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. పంచాయతీ నిధుల దుర్వినియోగం, స్వ లాభానికి అధికార దుర్వినియోగం వంటి వాటికే సస్పెండ్ చేసే చేసేలా చట్టాన్ని సవరణ చేయాలి. ట్రిబ్యునల్‌లో అప్పీల్ ఫీజు రూ.25 వేల నుంచి రూ.100కి తగ్గించాలి. ఈ చట్ట సవరణ జరిగే వరకు చిన్న చిన్న కారణాలతో సర్పంచ్‌లను సస్పెండ్ చేయవద్దని సంబంధిత అధికారులకు తెలపాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు గ్రామ సభను బహిష్కరించిన పెద్దకొడెపాక గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్ చేయడం సరికాదు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం కూడా ఇచ్చాం. – ఎం.పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి -
దారుణం: కొడుకు పట్టించుకోలేదు.. కోడలు గెంటేసింది
సాక్షి, వరంగల్ రూరల్: ఉద్యోగ రీత్యా కన్నకొడుకు పొరుగు దేశంలో ఉన్నాడు.. ఇక్కడున్న కొడలు పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసింది. కాటికి కాలుజాపిన వయసులో గత్యంతరం లేక ఆ కన్నతల్లి కూతురు వద్ద తలదాచుకుంటోంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పరకాల పట్టణంలోని మమత నగర్‌కు చెందిన గుండెమీద రాజయ్య–నర్సమ్మ(76) దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వారికి వివాహం అయింది. సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొడుకు రవికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను ఉద్యోగ రీత్యా దుబాయిలో ఉంటున్నాడు. కుమార్తె హసన్‌పర్తిలోని అత్తవారి ఇంట్లో ఉంటోంది. 2014 డిసెంబర్ 20న రాజయ్య మృతి చెందడంతో నర్సమ్మకు కష్టాలు మొదలయ్యాయి. కోడలు మంజుల నర్సమ్మను పట్టించుకోకపోగా.. మమత నగర్లో ఉన్న ఇంటిని ఆక్రమించుకుని ఆమెను బయటకు పంపించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హసన్‌పర్తిలోని కూతురు ఇంట్లో మూడేళ్లుగా తలదాచుకుంటోంది. కన్నకొడుకు పట్టించుకోకపోవడం ఒక వైపు, మరోవైపు వృద్ధాప్యం కారణంగా జీవనం భారంగా మారడంతో నర్సమ్మ 2019 జూన్‌లో పరకాల ఆర్డీఓను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆమె అభ్యర్థనపై విచారించిన అప్పటి ఆర్డీఓ తల్లి పోషణ బాధ్యతను కొడుకు రవి, కోడలు మంజుల చూసుకోవాలని, పరకాల మమత నగర్‌లోని ఇంటికి చెందిన కిరాయి డబ్బులు నర్సమ్మకు చెందాలని ఈ ఏడాది ఫిబ్రవరి 9న తీర్పు వెల్లడించారు. నాలుగు నెలలు గడిచినా అమలు కాకపోవడంతో నర్సమ్మ హైకోర్టును ఆశ్రయించగా.. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు అమలు చేయాలంటూ కలెక్టర్ హరితను ఆదేశించింది. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చి పది రోజులు దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని బాధితురాలు వాపోయింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని నర్సమ్మ కోరుతోంది. ఈ విషయమై కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో పరకాల ఇన్చార్జి, వరంగల్ రూరల్ ఆర్డీఓ మహేందర్‌జీని వివరణ కోరగా.. గుండెమీద నర్సమ్మతో పాటు కోడలు మంజులను మంగళవారం కార్యాలయానికి పిలిపించి మాట్లాడుతానని, హైకోర్టు ఆదేశాల అమలుకు కృషి చేస్తానని చెప్పారు. చదవండి: వృద్ధురాలిపై లైంగిక దాడి, 20 సార్లు కత్తితో పొడిచి -
నేను చిన్నపిల్లను; నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా!
సాక్షి,గీసుకొండ: ‘సార్.. నేనింకా చిన్నపిల్లను. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉంది. ఎంత చెప్పినా పెద్దలు వినడం లేదు. పైగా 30 ఏళ్ల వ్యక్తికి, అదీ మొదటి భార్యతో విడాకులైన వ్యక్తికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. అందరికీ తెలిస్తే అడ్డుకుంటారని దొంగచాటుగా పెళ్లి చేయాలని ప్రయతి్నస్తున్నారు..నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఆపండి.. ఇదీ పద్నాలుగేళ్ల బాలిక తనకు వివాహం చేయాలని పెద్దలు యత్నించిన క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికతో వరంగల్ అర్బన్ జిల్లా వాసి, ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి పెద్దమనుషులు నిర్ణయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.., చదువుకుంటానని ఆ బాలిక మొరపెట్టుకున్నా పెద్దమనుషులు వినకుండా నిశి్చతార్థం చేశారు. దీంతో దిక్కుతోచని ఆ బాలిక తన స్నేహితురాలితో చైల్డ్‌లైన్‌కు సంబంధించి 1098 ఫోన్ చేయమని చెప్పింది. ఇంతలోనే స్థానిక ఎంపీటీసీ వీరన్న కూడా ఈ విషయాన్ని బాలల సంరక్షణ అధికారులకు తెలియజేశారు. ఇది తెలుసుకున్న పెద్దమనుషులు బుధవారం బాలిక అమ్మమ్మ గ్రామమైన గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించడానికి సిద్ధమవుతుండగా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పెళ్లి తంతును అడ్డుకున్నారు. చదవండి: 20 మీటర్లు.. 12 అడుగులు..! -
వరంగల్ రూరల్: కాకతీయనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
-
అంత్యక్రియలు పూర్తయ్యాక పాజిటివ్ రిపోర్టు..!
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు చాలామంది పాల్గొన్నారు. ఆ కొద్దిసేపటికే ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు తేలడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు వ్యక్తి కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురై.. పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. ఈనెల 12న మరోసారి ఏనుగల్ గ్రామంలో 104 అంబులెన్స్ ద్వారా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్ష ఫలితం పాజిటివ్‌గా ఆశ వర్కర్‌కు బుధవారం మెసేజ్ వచ్చింది. అప్పటికే ఆయన మృతి చెందడం, బుధవారం అంత్యక్రియలు ముగిశాక ఇది తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారంతా బెంబేలెత్తుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే 20కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చదవండి: విషాదం నింపిన అమెరికా పర్యటన -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - భూపాలపట్నం రహదారి 163 హైవేపై ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మృతులు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాన్.. వరంగల్ నుంచి దుగ్గొండి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోగా.. ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 19 మంది కూలీలు ఉన్నారు. వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి దుగ్గొండి మండలంలోని రంగాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో నీరుకుల్ల క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. -
ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్
సాక్షి, వరంగల్ రూరల్: నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ సర్పంచ్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉప సర్పంచ్ బండారి సమ్మయ్య కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సంపేట మండలం ఆకులతండా సర్పంచ్ బానోత్ రాము తీర్మానాలు లేకుండా పనులు చేస్తున్నాడని ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు రమ, శ్రీకాంత్, సమ్మాలు, అరుణ కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే సమన్వయంతో ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పంచాయతీల పరువు రచ్చకెక్కుతోంది. ఏదో ఒక సాకుతో విమర్శలు చేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల దాడులు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య జాయింట్ చెక్‌పవర్ విభేదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టంతో నేరుగా నిధులు.. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం–2018 అమలులోకి రావడంతో పంచాయతీలకు నేరుగా నిధుల మంజూరు, ప్రతి జీపీకి కార్యదర్శి నియామకం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఉండడంతో ఇద్దరి సమ్మతి లేనిదే నిధులు డ్రా చేసేందుకు వీలు లేకుండా పోయింది. పలు గ్రామాల్లో సర్పంచ్‌లు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్‌లకు చెప్పకుండానే అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. దీంతో ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు పెట్టకుండా మొండికేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆదిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకుంటుండగా.. మెజార్టీ గ్రామాల్లో నిధుల వినియోగంపై సమన్వయం లేక ఆ “పంచాయితీ’లను అధికారుల వద్దకు తెస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఒకరిమీద ఒకరు చేసుకున్న ఫిర్యాదులు 100కు పైగా వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో 50 వరకు పరిష్కరించినట్లు సమాచారం. ముందుకు సాగని పనులు మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య ఆదిపత్య పోరు.. సమన్వయ లోపం.. విభేదాల కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు అధికారుల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలుపొందిన సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమన్వయంతో ముందుకు సాగాలి.. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో ముందుకు సాగి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి. ఈ మేరకు వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం. చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని, సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు వారిని పలిపించి మాట్లాడడంతో పాటు ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నాం. – చంద్రమౌళి, డీపీఓ -
మల్లయ్య కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తికి చెందిన ఫణికర మల్లయ్య తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలసి వివాహ పత్రిక అందజేశారు. ఈ మల్లయ్య ఎవరో గుర్తుందా?.. 2008లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాయపర్తి పర్యటనకు వచ్చినప్పుడు మల్లయ్యను ‘ఏం గావాలె మల్లయ్యా’ అని పలకరించాడు. ‘నాకేమీ వద్దు.. మా తెలంగాణ మాకియ్యుర్రి... తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతై’ అంటూ బదులిచ్చాడు. -
ఘోర రోడ్డు ప్రమాదం : బావిలోకి దూసుకెళ్లిన జీపు
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సంగెం మండలం గవి చర్ల శివారులో ఓ జీపు అదుపు తప్పి బావిలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 10 మంది సురక్షితంగా బయటపడగా, మరో నలుగురు బావిలో పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. శనివారం కార్యదర్శికి ఫోన్ చేసిన సీఎం.. పంచాయతీలో గృహ నిర్మాణ రికార్డులు, అనుమతులు, నాలా కన్వర్షన్ తదితర వివరాలపై ఆరా తీశారు. ఏనుగల్ పంచాయతీలో రికార్డుల పరంగా ఎన్ని గృహాలు ఉన్నాయి? నమోదు కాని గృహాలు ఎన్ని.. తండ్రి నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తే ఏ విధంగా రికార్డు చేస్తారు..? తండ్రి చనిపోతే రికార్డుల్లో నమోదు చేసే విధానం ఏమిటి.. గృహ నిర్మాణ రికార్డులు రెవెన్యూ విభాగంలో పొందుపర్చి ఉంటాయా అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. నాలా కన్వర్షన్ తర్వాతనే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనతో పాటు కుమారుడు కేటీఆర్ పేరిట ఎర్రవల్లిలో వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇందులోని ఎకరన్నర స్థలంలో గృహ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతాధికారులతో ఆరా తీయగా.. నాలా కన్వర్షన్ అనంతరం గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. దీంతో నాలా కన్వర్షన్ తదుపరి ఎర్రవల్లి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకుని గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ భూముల్లో గృహం నిర్మించాలనుకుంటే ఇదే తరహాలో నాలా కన్వర్షన్ చేశాక నిర్మాణ అనుమతి పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా ప్రతీ గ్రామపంచాయతీలో రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా గృహ నిర్మాణాల రికార్డులను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ వ్యవస్థ నెమ్మదిగా ఉన్నా, భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని వివరించారు. కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ స్వగ్రామం ఏనుగల్ కావడం గమనార్హం. -
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, వరంగల్ రూరల్: ఇసుక లారీ అతి వేగం ఐదుగురు యువకులను బలితీసుకుంది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన యువకులను ఇసుక లారీ రూపంలో మృత్యువు కబలించింది. స్నేహితుడి సోదరుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారు అంతలోనే విగతజీవులుగా మారారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. కాళేశ్వరం నుంచి వరంగల్ వైపు వేగంగా వస్తున్న ఇసుక లారీ ఈ యువకులు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేశ్(23), హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్(23), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ సాబీర్(19) ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయ టకు తీశారు. అక్కడ లభించిన ఆధారాలతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కారులో స్నేహితుడిని దింపేందుకు.. పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్ డిగ్రీ చదువుతున్నాడు, నర్సంపేటకు చెందిన షేక్ సాబీర్ ఆటోనగర్‌లో ఉంటూ బేకరీలో పని చేస్తున్నాడు. హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్, ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్, పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేశ్ కూలి పని చేస్తున్నారు. రాకేశ్ సోదరుడు ప్రవీణ్ పుట్టిరోజు సందర్భంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి రాకేశ్ తన స్నేహితులను ఆహ్వానించాడు. వేడుకల్లో ఆరుగురు కలసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి కావడంతో ములుగుకు బస్సులు లభించవని, నరేశ్‌ను ఇంటి దగ్గర దింపేందుకు హన్మకొండలోని ఓ స్నేహితుని దగ్గర నుంచి కారును తీసుకొచ్చారు. ఆ ఐదుగురు యువకులు కారులో బయలుదేరారు. తెల్లవారు జామున పసరగొండ క్రాస్ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో లారీ వేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి బుధవారం పరిశీలించారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. రాకేశ్‌కు వివాహం అయింది. 3 నెలల కూతురు ఉంది. కాగా,రాత్రి అయిందంటే కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున ఇసుక లారీలు తరలి వెళుతుంటాయని జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన లారీ -
రంగారెడ్డి క్లీన్.. మంత్రి జిల్లా స్లీప్
సాక్షి, హైదరాబాద్: ‘పల్లె ప్రగతి’లో వరంగల్ రూరల్ జిల్లా వెనుకబడింది. ఈ జిల్లా గురించి ప్రత్యేక ప్రస్తావన ఎందుకంటే.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌శాఖకు ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి. ఆ మంత్రి సొంత జిల్లా వరంగల్‌రూరల్. అదీ అసలు సంగతి! ‘పల్లె ప్రగతి’లోని అంశాలపై పంచాయతీరాజ్ శాఖ అంతర్గత సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించింది. మొదటి ర్యాంకును రంగారెడ్డి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ములుగు, సిద్ది పేట ఉన్నాయి. చివరివరుసలో వరంగల్ అర్బన్, వికారాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలున్నాయి. మూడు నెలలకోసారి... ప్రతి మూడు నెలలకోసారి పల్లెప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో క్లీన్ అండ్ గ్రీన్, శిథిల భవనాల కూల్చివేత, మురుగు కాల్వల్లో వ్యర్థాల తొలగింపు, చెత్త సేకరణ, వర్షపునీరు నిల్వ ఉండకుండా గుంతల పూడ్చివేత, దోమల నివారణాచర్యలను పంచాయతీలు చేపడుతున్నాయి. వీటితోపాటు వైకుంఠధామం, నర్సరీల నిర్వహణ, డంపింగ్ యార్డుల పనుల పురోగతిని కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి ఒరవడిని రోజూ కొనసాగించాలని రాష్ట్ర సర్కారు పంచాయతీలను ఆదేశించింది. అయితే, ఈ పనులు ఎంతమేరకు అమలవుతున్నాయో తెలుసుకోవాలనుకుంది సర్కారు. అకస్మా త్తుగా గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వా లని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రొఫార్మాను కూడా ఇచ్చింది. వీధుల పరిశీలన, మురుగు కాల్వల శుభ్రం, అంగన్వాడీ, పాఠశాలలు, పీహెచ్సీ, వీధిదీపాల పనితీరు, యాంటీ లార్వా పనులు, కోవిడ్–19 నివారణాచర్యల పరిశీలనకుగాను ఉన్నతాధికారులు గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 1,037 గ్రామాల్లో పర్యటించి జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు. -
ఆస్పత్రి నుంచి తప్పించుకుని సొంతూరుకు
సాక్షి, తొర్రూరు : కరోనా వైరస్ బారిన పడి హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తప్పించుకుని వచ్చాడు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేసేవాడు. అక్కడ ఆయనకు వైరస్ సోకగా.. ఈనెల 15న కింగ్ కోఠి ఆస్పత్రిలో చేరాడు. అయితే, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి తప్పించుకుని హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఆర్టీసీ బస్సులో సూర్యాపేట వరకు, మరో బస్సులో తొర్రూరుకు చేరుకున్నాడు. కాగా, హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరే సమయంలో తన సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలుపగా.. అతను వెంటనే వైద్య, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం, ఎస్సై నగేష్, సిబ్బందితో కలసి తొర్రూరు బస్టాండ్‌లో కరోనా సోకిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పీపీఈ కిట్ తొడిగాక అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి కోవిడ్ వార్డుకు తరలించారు. తర్వాత అతను ఏ బస్సులో ఎక్కాడు, అందులో ఎందరు ప్రయాణించారనే అంశాలపై విచారణ చేపట్టారు. -
ఉసురు తీసిన నిరీక్షణ..
ఆత్మకూరు: కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మొక్కజొన్నలను కాంటా వేయకపోవడం.. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం.. ఓ మహిళా రైతు ప్రాణాలు తీసింది. కొనుగోలు కేంద్రం వద్ద పది రోజులుగా వేచి ఉన్న ఆ మహిళా రైతు గుండెపోటుతో మృతి చెందడం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెంచికలపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి పది రోజుల క్రితం పెంచికలపేటకు చెందిన నరిగె బొందమ్మ (65) మొక్కజొన్నలను తీసుకొచ్చింది. అయితే, కేంద్రంలో అప్పటికే నిల్వ ఉన్న సరుకును తరలించకపోవడంతో బొందమ్మతో పాటు మరికొందరు రైతుల మొక్కజొన్నలను కాంటా వేయలేదు. రెండు రోజుల నుంచే లారీల ద్వారా నిల్వల తరలింపు ప్రారంభమైంది. కాగా, పది రోజుల నుంచి ప్రతిరోజూ ఉదయం కేంద్రానికి రావడం, సాయంత్రం వరకు వేచి ఉండి ఇంటికి వెళ్తున్న బొందమ్మ.. సోమవారం ఉదయం కూడా తన మొక్కజొన్నలను కాంటా వేయాలని సిబ్బందిని ప్రాధేయపడుతున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రైతులు బొందమ్మ మృతదేహాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబసభ్యులతో మాట్లాడి బొందమ్మ మృతదేహాన్ని వారి ఇంటికి తరలించారు. తహసీల్దార్ ముంతాజ్, సీఐ రంజిత్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ లక్ష్మయ్య బొందమ్మ కుటుంబీకులను పరామర్శించడంతో పాటు సొసైటీ తరఫున కుటుంబానికి రూ.10 వేలు అందచేశారు. బొందమ్మ భర్త ఓదెలు 25 ఏళ్ల క్రితం, ఆమె కుమారుడు కుమారస్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె తన కోడలితో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. -
బాలుడి కాలుకు వైరు: 2కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ సంఘటన నడికూడా మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పత్తి గింజల లోడ్‌తో వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడపటంతో రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్ వైర్లు తెగి లారీకి చుట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్‌పై నడిచి వెళ్తున్న మిట్టి రాజు అనే 12 సంవత్సరాల బాలుడి కాలుకు సైతం లారికి చుట్టుకున్న వైరు పెనవేసుకుంది. అలా లారీ బాలుడ్ని 2 కిలో మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఇది గమనించిన గ్రామస్తులు బైకుల సహాయంతో లారీని అడ్డగించారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకట కృష్ణ విచారణ జరుపుతున్నారు. చదవండి : ముఖానికి నల్లరంగు: మెడలో చెప్పుల దండ.. -
పండుగ పూట విషాదం
సంగెం/భూపాలపల్లి అర్బన్/మల్హర్: హోలీ వేడుకలు ముగించుకుని స్నానాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసు కున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా కాపులకనిపర్తికి చెందిన కందికట్ల యశ్వంత్ (13) బర్ల రాజ్‌కుమార్ (13), సదిరం రాకేష్ (12), దౌడు రాకేష్ (9) స్నే హితులతో కలసి హోలీ ఆడారు. అనంతరం పాయచెరువులో స్నానానికి దిగా రు. యశ్వంత్, దౌడు రాకేష్ మొరం కోసం తీసిన గోతిలో పడి చనిపోయారు. వారి వెనుక వెళ్లిన సదిరం రాకేష్ తృటిలో బయటపడ్డాడు. అలాగే.. భూపాలపల్లి జవహర్‌నగర్ కాలనీ చెందిన మాచర్ల కల్యాణ్S(16) మల్హర్ మండలం తాడ్వాయి గ్రామ సమీప చెరువుకు వెళ్లాడు. అందులో స్నానం చేసేందుకు దిగి.. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. హసన్‌పర్తి మండలం నిరూప్‌నగర్ తండాకు చెందిన భూక్య తిరుపతి (16) గ్రామంలోని దామోదర చెరువులోకి ఈతకు వెళ్లి.. లోతైన గుంతలో పడి నీట మునిగి చనిపోయాడు. -
మహిళా కానిస్టేబుల్ హల్చల్
నర్సంపేట రూరల్: ఓ మామతో కోడలు ఆస్థి విషయంలో మాట్లాడేందుకు మామ అద్దె ఇంటికి రాగా వ్యభిచారం చేయడానికి వచ్చారా అంటూ పక్కనే ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంబడించి చితకబాదిన సంఘటన నర్సంపేట పట్టణంలో సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట డివిజన్లోని చెన్నారావుపేటకు మండలంలోని ఓ తండాకు చెందిన మామ నర్సంపేట పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నాడు. కాగా నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. కోడలు తన భూమి విషయంలో అద్దెకు ఉంటున్న తన మామ ఇంటి వద్దకు వచ్చి అరుగుమీద కూర్చొని భూమి పంపకాల విషయంలో చర్చించుకుంటున్నారు. అయితే అదే క్రమంలో పక్కనే మహిళా కానిస్టేబుల్ వ్యభిచారం చేయడానికి వచ్చారా అని నిలదీసింది. దీంతో అక్రమ సంబంధం ఎలా అంటకడుతావే అని కానిస్టేబుల్‌పై మామ, కోడలు ఆగ్రహం వ్యక్తం చేసి, డ్యూటీ ఎలా చేస్తావో చూస్తానంటూ ద్విచక్రవాహనం వస్తుండగా విన్న కానిస్టేబుల్, ఆయన భర్త కలిసి వారిని మరో ద్విచక్రవాహనంపై వెంబడించారు. నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు రాగానే వాహనాన్ని ట్రాప్ చేసి ఆపి మామ, కోడలును తీవ్రంగా కొట్టారు. ఇదంతా తతంగం అరగంట సేపు జరిగినప్పటికీ ఎవరూ ఆపకపోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ జామయింది. అనంతరం ఇరువర్గాలు స్థానిక స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన జరుగుతున్న క్రమంలో ఎంత పోలీసులైనా మాత్రం నడిరోడ్డుపై ప్రజలకు రౌడీలుగా కొడుతారా అని.. ఇదేనా ప్రెండ్లీ పోలీసింగ్ అంటే అంటూ పలువురు బహిరంగానే విమర్శిస్తున్నారు. దీనిపై స్థానిక ఎస్సై నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా విచారణ చేపడుతున్నామన్నారు. -
తండ్రీకొడుకుల గంజాయి స్మగ్లింగ్
సాక్షి, నెక్కొండ: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామానికి చెందిన కొంగర యేసు, వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం హరిశ్చంద్రు తండా గ్రామానికి చెందిన జాటోతు రాజ్‌కుమార్, జాటోతు సీతారాం(పరారీలో ఉన్నాడు).. పశ్చిమ గోదావరి జిల్లా చింతూరులో గంజాయి కొనుగోలు చేసి స్మగ్లింగ్‌కు చేస్తున్నారు. నిందితుల్లో జాటోతు సీతారాం అక్రమ దందాలకు పాల్పడుతుండేవాడు. ఆయన కుమారుడు, ఎంకాం చదివిన రాజ్‌కుమార్ కూడా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి మార్గాన్ని ఎంచుకున్నాడు. వీరిద్దరితోపాటు మరొకరి సాయంతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడే వారు. ఈ నెల 9న నెక్కొండకు రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేయగా రెండు సంచులతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో రాజ్‌కుమార్, యేసును అదుపులోకి తీసుకోగా పక్కనే ఉన్న సీతారాం ఉడాయించాడు. ఈ మేరకు రూ.12 లక్షల విలువైన శుద్ధి చేసిన 60 కిలోల(30 ప్యాకెట్లు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి తీసుకొచి్చన గంజాయిని రైలు మార్గంలో మహరాష్ట్రకు తరలించే క్రమంలో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ తిరుమల్, ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై ప్రతాప్‌సింగ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
ప్రమాద మృతులకు కన్నీటి వీడ్కోలు
వరంగల్ క్రైం/భీమారం/జనగామ: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చిటూరు వద్ద శనివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని వాహనానికి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కారు డ్రైవర్ (ఏఆర్ కానిస్టేబుల్) చిలకమర్రి పార్థసారథి(40), మంత్రి సోషల్ మీడియా ఇన్చార్జి తంగర్లపల్లి పూర్ణేందర్ (38) అంత్యక్రియలు ఆదివారం బంధువులు, మిత్రుల అశ్రునయనాల మధ్య జరిగాయి. అంతకు ముందు జనగామ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని స్వగృహాలకు తరలించారు. వారి భౌతిక కాయాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించిన మంత్రి దయాకర్‌రావు కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి స్వయంగా వారి పాడె మోశారు. మృతుల కుటుంబీకులను దగ్గరకు తీసుకుని నేనున్నానంటూ ఓదార్చారు. రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి తమ సామాజికవర్గానికి చెందిన తంగర్లపల్లి పూర్ణేందర్ మృతి పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం సంతాపం వ్యక్తం చేశారు. పూర్ణేందర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతడి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సంఘం తరపున పూర్ణేందర్ కుటుంబానికి బాసటగా ఉంటామని భరోసా యిచ్చారు. -
రామప్ప’ ఇక రమణీయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంçస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. అంతర్జాతీయ నిర్మిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్యాచరణ వేగంగా అమలు జరుగుతోంది. కాకతీయుల కాలం నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి త్వరలోనే ప్రపంచ గుర్తింపు రానుంది. రూ.5 కోట్లతో అత్యంత ఆధునికమైన, నాటి శిల్పకళా వైభవాన్ని చాటే విధంగా ఆడిటోరియం, సీఎస్ఆర్ నిధులతో రెండు స్వాగత తోరణాలు.. ఒకటి ప్రధాన రహదారి వద్ద, మరొకటి రామప్ప గుడి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిర్మిస్తున్నారు. రామప్ప గుడి పక్కనే ఉన్న చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్‌లో భారీ శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నమూనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో ఒక శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్ప కళా అధ్యయనం కోసం ఒక కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. కాగా యునెస్కోకి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాగా, సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో యునెస్కో బృందం రామప్పలో పర్యటించింది. యునెస్కో నుంచి వచ్చిన మన ప్రతినిధి బృందానికి పిలుపు రాగా, ఈ నెల 22న పారిస్ లో యునెస్కో బృందంతో సమావేశం జరగనుంది. కాగా, రామప్ప ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులతో సోమవారం సమీక్ష జరిపారు. -
ఉద్రిక్తతల మధ్య కండక్టర్ అంతిమయాత్ర
ఆత్మకూరు: ఆర్టీసీ కండక్టర్ ఏరుకొండ రవీందర్ అంతిమయాత్ర ఆదివారం ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కండక్టర్ ఏరుకొండ రవీందర్ (52) గురువారం టీవీ చూస్తూ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హన్మకొండకు తరలించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివా రం అర్ధరాత్రి తర్వాత మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఉద యమే పెద్ద ఎత్తున ఆత్మకూరుకు చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఊరుకునేది లేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులను పలుమార్లు అదుపులోకి తీసుకుని వదిలేశారు. కాగా, రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వెళుతున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కార్మికులు ఘెరావ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మృతుడు రవీందర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, ఎక్స్ గ్రేషియా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ ఆస్తులపై కన్ను పడిందని, కావాలనే కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిని ఫాలో కాకున్నా.. నిజాంను ఫాలో కావాలన్నారు. నిజాం హయాంలో ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉందని గుర్తుచేశారు. మహిళా కండక్టర్‌పై చేయిచేసుకున్న సీఐ కండక్టర్ రవీందర్ అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో వీఆర్‌లో ఉన్న సీఐ మధు మహిళా కండక్టర్ భవానీపై చేయిచేసుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు మళ్లీ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. కార్మికులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో భవాని రోడ్డుపై పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సీఐ మధు తమకు క్షమాపణ చెప్పే వరకూ కదిలేది లేదని కార్మికులు భీష్మించారు. దీంతో డీసీపీ నాగరాజు, ఏసీపీ శ్రీనివాస్ కార్మికులతో మాట్లా డి శాంతింపచేశారు. సీఐపై చర్య తీసుకుంటా మనడంతో వారు ఆందోళన విరమించారు. -
కుటుంబానికి ఒకే చోటు
ఈ ఊరిలో కుటుంబానికి ఒక సమాధి మాత్రమే ఉంటుంది. ఆయా కుటుంబాల్లో ఎవరైనా కన్నుమూస్తే సమాధి సిద్ధంగా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామంలో నిర్మల హృదయవనం ఏర్పాటు చేసుకున్నారు. అర ఎకరం స్థలంలో గత 30 సంవత్సరాలక్రితం హృదయవనం నిర్మించుకున్నారు. తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందులోనే వారిని సమాధి చేస్తారు... కొత్తగా సమాధి కట్టరు. అదేంటో చూద్దాం... గీసుకొండ మండలంలోని మరియాపురం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో 100 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారిలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు తమ వారెవ్వరైనా చనిపోతే హృదయవనంలో నిర్మించుకున్న సమాధిలో ఖననం చేసేలా అంతస్తుల మాదిరిగా సమాధులను నిర్మించుకున్నారు. ఇంతకీ ఎందుకిలా అంటే... సమాధుల కోసం స్థలాన్ని వృథా చేయడం ఇష్టం లేక అట.15 అడుగుల లోతులో దీర్ఘచతురస్రాకారంలో సమాధిని నిర్మిస్తారు. కిందిభాగంలో గచ్చు చేసి భూమి ఉపరితలంపై 2 లేదా 3 అంగుళాలు ఎత్తు వరకు గోడను కడతారు. సమాధి పైన బరువైన ఇనుప రేకును మూతలాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది తలుపులా ఉండి అవసరమైనప్పుడు తెరిచే వీలుంటుంది. ఇలా చేస్తారు కుటుంబాల్లో మొదటగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కిందిభాగంలో ఖననం చేసి, దానిపై ఉప్పు, సుగంధద్రవ్యాలు చల్లుతారు. పైన నాలుగు షాబాదు బండలు అమర్చి మూసి వేస్తారు. ఆ తర్వాత మూతను బిగిస్తారు. అదే కుటుంబంలో మరో వ్యక్తి చనిపోయినప్పుడు అదే పద్ధతిలో ఖననం చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువమంది చనిపోతే సమాధిలో ఖాళీ లేనప్పుడు అంతకుముందు సమాధి చేసిన వారి కపాలం, ఎముకలను అందులోనుంచి తీసేసి లోపలి గోడల పక్కనున్న స్థలంలో వాటిలో భద్రపరుస్తారు. అనంతరం అప్పుడే చనిపోయిన వారి మృతదేహాన్ని అందులో ఖననం చేస్తారు. ప్రపంచవ్యాప్త పండుగ రోజు నవంబర్ 2న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆత్మల పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా తమ పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడం వాటి రంగులు వేయడం, పూలతో అలంకరించడం చేస్తారు. సమాధుల వద్దకు వెళ్లి తమ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థిస్తారు. చిన్న తప్పులు చేసిన వారు స్వర్గానికి, నరకానికి మధ్యలో ఉండిపోతారని, అటువంటి వారి ఆత్మలు దైవసన్నిధికి చేరడానికి సంవత్సరంలో వారు మృతి చెందిన దినోత్సవం జరుపుకోవడాన్ని సమాధుల పండుగ అని అంటారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్ ►మా గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక సమాధి ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా అందులోనే ఖననం చేస్తాం. చనిపోయిన తరువాత అందరం ఒకేదగ్గర ఉంటామని, సమాధులు నిర్మించేందుకు స్థలం ఇబ్బంది లేకుండా ఉండేందుకు. గత కొన్నిసంవత్సరాలుగా ఇదేవిధంగా పాటిస్తున్నాం. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పద్ధతిలో పలు గ్రామాల్లో చేస్తున్నారని తెలుస్తుంది. – అల్లం బాలిరెడ్డి, సర్పంచ్, మరియపురం -
మంచానికి కట్టేసి.. నిప్పంటించి..
నెక్కొండ: భూ వివాదం ఓ వృద్ధ దంపతుల పాలిట శాపంగా మారింది. చనిపోయాక చితికి నిప్పంటించాల్సిన కొడుకు బతికుండగానే కాల్చి చంపాడు. తల్లిదండ్రులను మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కన్నవారు అని కూడా కనికరించని ఆ కిరాతకుడు తన కొడుకుతో కలసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హృదయ విదారకమైన ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూక్యా దస్రు (68)కు 10 ఎకరాలు భూమి ఉండగా.. కుమారులు కేతూరాంకు 3.30 ఎకరాలు, వీరన్నకు నాలుగెకరాలు పంచి ఇచ్చాడు. తన వద్ద రెండున్నర ఎకరాల భూమి ఉంచుకున్నాడు. వీరన్న కొంతకాలం క్రితం మరణించగా దస్రు తన వద్ద ఉన్న భూమిని వీరన్న భార్య పేరిట పట్టా చేసేందుకు పూనుకున్నాడు.ఈ క్రమంలో తల్లిదండ్రుల పట్ల కక్ష పెంచుకున్న కేతూరాం, అతడి కుమారుడు వెంకన్న.. బుధవారం సాయంత్రం వృద్ధ దంపతులను మంచానికి కట్టేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించారు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నెక్కొండ పోలీసులు గ్రామస్తులతో కలసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంచం మీద ఉన్న వృద్ధ దంపతుల మృతదేహాలు అస్తిపంజరాలుగా మారగా.. కేతూరాం, వెంకన్నకు సైతం గాయాలయ్యాయి. వారు నెక్కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యూరియా కోసం పడిగాపులు
రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఆదివారం యూరియా పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్తోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారు జామున 3 గంటలకే చెన్నారావుపేట సొసైటీ ఆవరణకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలీసు బందోబస్తు మధ్య యూరియా అందించారు. అమీనాబాద్ సహకార సంఘం వద్దకు కూడా రైతులు అధికంగా తరలివచ్చారు. – చెన్నారావుపేట -
కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి
సాక్షి, నర్సంపేట : మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి వస్తున్న భార్యభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేసిన ఘటన నర్సంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన అంబటి వెంకన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. రోజు ఉదయాన్నే వెంకన్న తన భార్య విజయతో కలిసి వాకింగ్‌కు వెళుతుంటాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వెంకన్న కళ్లలో కారంపొడి చల్లి కత్తులతో దాడి చేసి పారిపోయారు. భార్య విజయ వెంటనే తీవ్రంగా గాయపడిన వెంకన్నను నర్సంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స నిర్వహించారు. కానీ వెంకన్న పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వరంగల్‌కు తరలించారు. కాగా, ఈ దాడికి భూవివాదమే కారణమై ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మున్నేరువాగులో మహిళ గల్లంతు
సాక్షి, చెన్నారావుపేట: మున్నేరువాగు (సుద్దరేవుల ఆనకట్ట)లో మహిళా కూలీ గల్లంతైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన చిట్టె మల్లమ్మ, మారాటి ఎల్లమ్మ, కుండె వినోద, మొర్రి స్వరూప కలిసి చిట్టె మల్లమకు చెందిన వరిపొలంలో కలుపు తీయడానికి మున్నేరు(పాకాల) వాగు అవతల మాటు వీరారం కాల్వ వద్దకు వెళ్తున్నారు. గ్రామంలో నుంచి పొలం వద్దకు వెళ్లడానికి మున్నేరువాగుపై నిర్మించిన సుద్ద రేవుల ఆనకట్టపై నుంచి దాటి వెళ్లాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరుద ఉధృతి పెరిగి సుద్దరేవుల ఆనకట్ట మత్తడి పోస్తుంది. ఆనకట్ట పైనుంచి వెళ్తుండగా చిట్టె మల్లమ్మ, మరాటి ఎల్లమ్మ, మొర్రి స్వరూప ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోతున్నారు. కూలీల వెనకాలే వస్తున్న మొర్రి కట్టయ్య అనే రైతు వాగులో దూకి మల్లమ్మ, ఎల్లమ్మలను రక్షించాడు. వీరిని రక్షించి స్వరూపను రక్షిద్దామని చూసే సరికి స్వరూప(40) కనిపించకుండా గల్లంతైంది. వారి వెనకాలే ఉన్న కుండె వినోద మత్తడిపైనే ఉండి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రమాదంలో ముగ్దురు కూలీలు బయటపడగా మొర్రి స్వరూప గల్లంతైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై విఠల్, ఎంపీడీఓ కోర్ని చందర్ సంఘటనా స్థలానికి చేరుకుని స్వరూప ఆచూకీ కోసం వెతికారు. ఆర్డిఓ రవి, తహసీల్దార్ సదానందం, సీఐ పెద్దన్నకుమార్ జరిగిన సంఘటనను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట ఫైర్ సిబ్బందితో వాగు ప్రదేశాలు గాలింపు చర్యలు చేపట్టారు. మిన్నంటిన రోదనలు.. కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాగులో కొట్టుకుపోతు సురక్షితంగా బయటపడ్డ చిట్టె మల్లమ్మ, కుండె వినోద, మరాటి ఎల్లమ్మలు గ్రామస్తుల సహాయంతో ఒడ్డుకు చేరడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మొర్రి స్వరూప ఆచూకి దొరకకపోవడంతో బర్త కుమారస్వామి, కూతురు ప్రత్యూష, కుమారుడు రాజులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మీ వెంకన్న, ఎంపీటీసీ మొగిళి రమాదేవికేశవరెడ్డి, నాయకులు సుదర్శన్‌గౌడ్, కంచ రాంచంద్రయ్య, మొగిళి వెంకట్‌రెడ్డి, బిల్లా ఇంద్రసేనారెడ్డిలు పరామర్శించారు. కాగా, కొట్టుకుపోయిన వ్యవసాయ కూలీ స్వరూప (37) ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్డీఓ రవి తెలిపారు. చచ్చి బతికాం.. నిన్న కూడా వాగు దాటి కలుపు తీయడానికి వెళ్లాం.. అలాగే ఈ రోజు కూడా వెళ్తుండగా కాలు జారి వాగులో పడ్డాం.. కట్టయ్య కాపాడటం వల్ల చచ్చి బతికాం.. మాతో కలిసి పనికి వచ్చిన స్వరూప బ్రతికితే బాగుండేది. వరద ఎక్కువ కావడం వల్ల వాగులో పడ్డాం.. స్వరూప దొరకకపోవడం బాధేస్తుందని రోదిస్తూ మల్లమ్మ, వినోద, ఎల్లమ్మ తెలిపారు. – ప్రాణాలతో బయటపడ్డ తోటి కూలీలు -
ప్రగతి సింగారానికి వచ్చిన సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారానికి వచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 4న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం దశ దినకర్మ జరగగా సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ మేరకు మల్లారెడ్డి చిత్రపటం వద్ద పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ధర్మారెడ్డి, ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఆ తర్వాత మల్లారెడ్డి అనారోగ్యంపై ఆరా తీశారు. అనంతరం ధర్మారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భోజనం చేశారు. గంట పాటు ప్రజాప్రతినిధులతో భేటీ చల్లా ధర్మారెడ్డి ఇంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. భోజనం చేసిన అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను లోపలకు పిలిచారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సుమారు గంట పాటు చర్చించారని సమాచారం. కాళేశ్వరం ద్వారా త్వరలో సాగు నీరు వస్తుందని.. దీంతో వరంగల్ దశ మారుతుందని సీఎం ప్రజా ప్రతినిధులకరు చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం, దేవాదుల ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి రైతులు ఆనందం వ్యక్తం చేస్తారని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ఎంత సాగు అవుతుందని వివరించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గుడిమల్ల రవికుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, టీఆర్ఎస్ నాయకురాలు హరి రమాదేవిని సైతం లోపలకు పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. భారీ భద్రత ప్రగతి సింగారంలో మల్లారెడ్డి దశ దినకర్మను చల్లా ధర్మారెడ్డి, రఘుపతిరెడ్డి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆ తర్వాత ఆవరణను సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యాన డీసీపీ కే.ఆర్.నాగరాజు, ఏసీపీ సునీతామోహన్తో పాటు 450 మంది సిబ్బంది, 15 మంది సీఐలు, 10 మంది ఏసీపీలతో ముడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బంధువులందరినీ ఒక పక్కకు పంపించి రోప్‌ను కట్టారు. తొలుత మీడియా వారిని సైతం బయటకు పంపించారు. ఈ విషయమై జర్నలిస్టులు కలెక్టర్, కమిషనర్‌తో చర్చించడంతో ప్రత్యేక రోప్‌ను ఏర్పాటు చేసి బంధువుల పక్కన ఉండి కవరేజీ చేసుకునేలా అవకాశం కల్పించారు. 1.52 గంటల పాటు ప్రగతి సింగారంలో గంట యాభై రెండు నిముషాల పాటు ప్రగతి సింగారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నారు. మధ్యాహ్నం 1.50గంటలకు ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో ప్రగతి సింగారానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో మధ్యాహ్నం 2.02 గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3.29గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ 3.38గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకున్నాడు. అక్కడ 3.42గంటలకు హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. -
పాకాలకు ‘విదేశీ చుట్టాలు’
ఖానాపురం: వరంగల్ రూరల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన పాకాలకు వేసవి కాలంలో అనేక రకాల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న పక్షుల వలసలు ప్రస్తుతం పెరిగాయి. వాటిని గుర్తించడానికి ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయించడంతోపాటు పక్షులు సేదదీరడానికి అవసరమైన ఏర్పాట్లను ఖాజీపేట డీఎఫ్ఓ పురుషోత్తం ఆధ్వర్యంలో చేపట్టారు. వెరి డైట్ఫ్లై, క్యాచర్, పిగ్నిఉలిడక్, ఎల్లో వాట్ లెడ్, ల్యాప్వింగ్, రెడ్ అవైడవిట్, బార్ హెడ్ గీస్, ఆస్ప్రే, కామన్ ప్రొటైన్ కోల్, రెడ్ క్రాస్టెడ్, పోచార్ట్స్, బ్లూ టేబిల్డ్ బీ ఈటర్, విస్టింగ్ డక్స్, రోసే స్టార్లింగ్, చెస్ట నట్ హెడ్ బీ ఈటర్, రెడ్ నాఫ్ట్ ఇబస్, రివర్ టెర్న్, తిక్ బిల్డ్ గ్రీన్, నార్తర్న్ షోవ్లర్, కామన్ పోచర్డ్స్, కామన్ పిన్ టేల్స్, నార్తర్న్తోపాటు పలు ఇతర రకాల పక్షులు వేసవిలో ఇక్కడ సేదతీరుతున్నాయి. -
మాజీ మంత్రి కుమారుడికి బెదిరింపులు..?
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కుమారుడిని పలువురు శనివారం ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఓ హత్యతో సంబంధం ఉందని దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, బయటకు తెలియకుండా ఉండాలంటే తమకు రూ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని సమాచారం. దీనిపై పోలీసులకు మాజీ మంత్రి తనయుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
నో క్యూర్..
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పైన పటారం.. లోన లొటారం అనే రీతిలో బయట సూపర్‌స్పెషాలిటీ బోర్డులతో పాటు రకరకాల వైద్య నిపుణుల పేర్లు ఉంటున్నాయి. లోపల అడుగు పెడితే మాత్రం అందుకు విరుద్ధంగా ఒకరిద్దరు వైద్యులు మాత్రమే ఉంటారు. అర్హత లేకున్నా అన్నీ తామై వైద్య చికిత్సను ప్రారంభిస్తారు. కనీస సౌకర్యాలు లేకున్నా నాసిరకం వైద్యం అందిస్తూ కార్పొరేట్ స్థాయిలో ఫీజులు లాగుతారు. అవసరం లేకున్నా రకరకాల పరీక్షల పేరిట దండుకుంటారు. రోగి పరిస్థితి చేయిదాటితే వరంగల్, హైదరాబాద్‌లకు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటారు. మెజారిటీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే తంతు జరుగుతున్నా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇటీవల నెక్కొండలోని ఓ ప్రైవేట్ సర్జికల్ ఆసుపత్రిలో ఓ మహిళ వైద్యురాలిపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ఆస్పత్రి ప్రిస్పిక్షన్ పైన సైతం సదరు వైద్యాధికారి పేరు మీద ఉంది. కానీ ఆ వైద్యురాలు అందులో వైద్య సేవలు అందించడం లేదు. జిల్లా వైద్య అధికారుల తనిఖీలో వెలువడ్డ నిజాలు ఇవి. సదరు ఆస్పత్రిపై పలు ఆరోపణలు రావడంతో ఇటీవల డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. ఆ ఆస్పత్రిలో సర్జికల్ క్లీనిక్ నడిపే వైద్యాధికారి లేకుండా అర్హతలేని వైద్యులు సర్జికల్లు నిర్వహిస్తున్నారని తేలింది. దీంతో సదరు ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారి నోటీసులు అందించారు. ఇతర దేశాల్లో చదువులు.. జిల్లాలో అర్హతలేని వైద్యుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏ అర్హత లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతూ దవాఖానాలు ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. ఎంసెట్ రాసిన అభ్యర్థులకు వారికి వచ్చిన మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తారు. మెడికల్ సీటుకు అర్హత సాధించని వారు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు చెల్లించి ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉన్న కళాశాలలల్లో మాత్రమే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిని మాత్రమే వైద్యులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. స్థానికంగా ఎంబీబీఎస్ సీట్లు రాని వారు రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో ఫీజు తక్కువ కావడంతో చదువు సాగిస్తున్నారు. అక్కడ ఎంబీబీఎస్ లేకపోవడంతో ఎండీ చదివినట్లు అక్కడి ప్రభుత్వాలు సర్టిఫికెట్లు అందజేస్తాయి. విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించిన వారుదేశ వ్యాప్తంగా ఢిల్లీలో నిర్వహించే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇక్కడి ప్రభుత్వాలు వైద్యుడిగా గుర్తిస్తాయి. ఏటా దేశం నుంచి 15వేల మందికి పైగా విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నవారు ఇక్కడికి వచ్చిన తర్వాత పరీక్షల్లో పాసయిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇక్కడ ఆస్పత్రిపై ఏర్పాటు చేసిన బోర్డుపై పెద్ద అక్షరాలతో ఎండీ రష్యా, ఉక్రెయిన్ అని రాసి బ్రాకెట్లో ఎంబీబీఎస్ అని పెట్టుకోవాలి. కానీ రష్యా, ఉక్రెయిన్‌లో చదివినా ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లాల్లో ఎండీ వైద్యులుగా చెలామణి అవుతున్నారు. ఎండీగా ఇక్కడి ప్రభుత్వాలు గుర్తించాలంటే ఎంబీబీఎస్ తర్వాత మూడేళ్ల కోర్సు చేయాలి. కానీ ధనార్జనే ధ్యేయంగా వైద్య వృత్తిని చేపట్టిన కొందరు అర్హత లేని వైద్యులు చేస్తున్న పనులు వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకవస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 41 నర్సింగ్ హోంలు, రిజిస్టర్ ఇన్ పేషెంట్ ఆస్పత్రులు ఉన్నాయి. బోర్డులకే పరిమితం.. జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పలు వైద్యశాలల్లో డాక్టర్లు లేకున్నా వారి పేర్లు బయట బోర్డులపై రాస్తున్నారు. విజిటింగ్ వైద్యులు ఆయా ఆసుపత్రుల్లో వచ్చి వైద్యసేవలు అందించినప్పుడు వారు వచ్చే రోజు సమయం తప్పకరాయాలి. కానీ వైద్యశాల వద్ద ఏర్పాటు చేస్తున్న బోర్డులో 24 గంటల పాటు సదరు వైద్యుడు అక్కడే ఉన్నట్లు అర్థం వస్తుంది. ఆస్పత్రిలో ఇస్తున్న ఓపీ చిటీలో స్థానికంగా లేని వైద్యుల పేర్లు రాస్తున్నారు. మరికొన్ని ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ పేరిట ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అత్యవసర సేవల పేరుతో బోర్డులు ఏర్పాటు చేసిన అత్యవసర కేసులు వస్తే వరంగల్, హైదరాబాద్‌లకు రీఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల తనిఖీల కోసం కమిటీలు వేశాం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద.. అందుబాటులో ఉండేది మరొకరని మా దృష్టికి వచ్చింది. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసేందుకు రెండు కమిటీలను వేశాం. నర్సంపేటకు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, పరకాల, వర్ధన్నపేటలకు డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్యామ్ నీరజలను తనిఖీ అధికారులుగా నియమించాం. ఈ కమిటీ మూడు రోజు ల్లో తనిఖీ చేసి నివేదిక అందిస్తారు. ఈ నివేదికల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
సాయుధ పోరులో అగ్గిబరాటై
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): బూర్జువా పాలకులపై తుపాకీ ఎక్కుపెట్టి రాజీలేని పోరుసల్పిన ధీరత్వం...గోండు బిడ్డల ధీనత్వాన్ని ఆర్తిగా కవితల్లో ఆవిష్కరించే భావోద్వేగం... అయన జీవితమనే నాణానికి బొమ్మాబొరుసులు. తూటాలకు ఎదురొడ్డి సాయుధ పోరులో అగ్గిబరాటై కదం తొక్కి, అన్నార్తుల అక్రందనలకు అక్షర రూపమిచ్చిన ఆ శైలి స్ఫూర్తిమంతం. ఏక కాలంలో రచయిత, ఉద్యమకారుడిగా విశేష గుర్తింపు పొందిన సవ్యసాచి మాణిక్యాపూర్ ముద్దు బిడ్డ సాహు శనిగరం వెంకటేశ్వర్లు వర్ధంతి నేడు(శనివారం). వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో 1955 అక్టోబర్ 2న శనిగరం స్వామి–అయోధ్యలకు వెంకటేశ్వర్లు( సాహూ) జన్మించాడు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించిన ఆయన ఉన్నత విద్య కోసం హుజురాబాద్‌కు, డిగ్రీ కోసం జమ్మికుంటకు వెళ్లాడు. హుజురాబాద్‌లో చదువుకున్న రోజుల్లో 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. గో టు విలేజ్ క్యాంపస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే గ్రామాల్లో భూస్వాములు చేస్తున్న ఆగడాలు, పేదలు పడుతున్న కష్టాలు అతనిని విప్లవోద్యమం వైపు అడుగులేసేలా చేశాయి. ఆ క్రమంలోనే ‘గో టు విలేజ్ క్యాంపస్’ పేరిటా మాణిక్యాపూర్‌లో 20 రోజులపాటు దాదాపుగా వందలాది మందికి ఉద్యమ శిక్షణ తరగతులను నిర్వహించాడు సాహూ. మావోయిస్ట్ కీలక నేత గణపతితో పాటు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్ లాంటి మావోయిస్ట్ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.. - సాహూ, అతని భార్య శోభ అతని కలం పేరును సాహూగా పెట్టుకున్నాడు. ఉద్యమంలో క్రియశీలక పాత్ర పోషిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ స్థాయి వరకు వెళ్లి అదిలాబాద్ అడువుల్లో అరెస్ట్ అయ్యాడు. అనేక ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన సాహూ జైలు నుంచి విడుదలయ్యాడు. అకస్మాత్తుగా మార్చి 16, 1993న గుండె పోటుతో మృతి చెందాడు సాహూ రచనలు... కన్నీటి కథ–నీటి కథ, పెండ్లి కావాలి, ఖాయిదా, ఐదు రూపాయాల కథ, భూమి కోసం, జెండా కథ, ఆకలి నిర్ణయం, కిసింగార్ వెంతా, అమరుల రక్తం వృథా కాదు, రక్తపింజెర, మరట్ తుడుం పాయానా, మనుషుల్ని తినే వాళ్లం కోసం, ఒక తల్లి, పిల్ల రక్కసులు, రగల్ జెండా, విహంగ వీక్షణం, జాగీరిగాల్లు తదితర కథలు, కవితలు రాశాడు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి... మరుగున పడిన కొమురం భీం జీవిత చరిత్రను బాహ్య ప్రపంచానికి అందిచడంతోపాటుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన ఆయన ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరంఉంది. ఆయన విగ్రహాన్ని కరీంనగర్లోగాని, వరంగల్‌లో గాని ప్రతిష్ఠించాలని ఆయన స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. -
మొగ్గలోనే.. తుంచేస్తున్నారు
నర్సంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన 5 నెలల గర్భిణినిఈనెల 12వ తేదీ రాత్రి చెకింగ్ కోసం నెక్కొండకు వెళ్లింది. కాసులకు కక్కు ర్తిపడిన సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆడ శిశువని అబార్షన్ చేశారు. తీవ్ర గర్భస్రావమైన తర్వాత ఆమె గర్భంలో మగ శిశువు ఉందని తేలింది. ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వర్గాలను నిలదీయగా బాధితులకు రూ.2 లక్షలు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నెక్కొండ మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన వివాహిత లింగ నిర్ధారణ పరీక్ష కోసం మండల కేంద్రానికి వచ్చింది. సదరు వైద్యుడు పరీక్షలు చేసి ఆడ శిశువు ఉందని చెప్పారు. ఆమె నర్సంపేటలోని ఓ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంది. గర్భంలో ఉంది మగ శిశువు అని తేలడంతో ఆ గర్భిణి లబోదిబోమంది. తప్పుడు సమాచారం ఇచ్చిన సదరు వైద్యుడిని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నిలదీశారు. ఈ నేప«థ్యంలో ఇరువర్గాల నుంచి మధ్యవర్తుల ప్రమేయంతో రూ.1.5 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. చెన్నారావుపేట మండలం సూరిపల్లికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం ఉన్నారు. సదరు మహిళ మళ్లీ గర్భం దాల్చింది. కాగా నర్సంపేటలోని ఓ స్కానింగ్ సెంటర్లో పరీక్షలు చేయించడంతో ఆడపిల్ల అని తేలింది. వెంటనే ఆ మహిళను మహబూబాబాద్‌కు తీసుకువెళ్లి అబార్షన్ చేయించినట్లు సమాచారం. సాక్షి, వరంగల్ రూరల్: బాలికలపై వివక్ష కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ మొగ్గలోనే తుంచేస్తున్నారు. మరికొందరు భువిపైకి చేరిన గంటల వ్యవధిలోనే ముళ్ల కంపలు, చెత్త కుండీలు, కాల్వల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడడమో, ఊపిరి ఆగిపోవడమో నిత్యం జరుగుతోంది. జిల్లాలో వెయ్యి మంది బాలురుంటే 988 మంది బాలికలు ఉంటున్నారు. ఏటేటా లింగ నిష్పత్తిలో వ్యత్యాసం.. ఏటేటా బాలబాలికల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. స్కానింగ్ సెంటర్ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినా కాసుల కక్కుర్తికి స్కానింగ్ పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతి పొందిన 25 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రతి మండలం కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి బాలురు 1000 బాలికలు 988 ఇవే కాక మొబైల్ స్కానింగ్‌లు సైతం చేపడుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు మొబైల్ స్కానింగ్ చేస్తున్నారు. ఇద్దరు నుంచి ముగ్గురు గర్భిణులు స్కానింగ్ కోసం వస్తే వారి పేర్లను నమోదు చేసుకుని సదరు డాక్టర్‌ను పిలిపించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆడ పిల్ల అని తెలియగానే వెంటనే అబార్షన్ చేసి డాక్టర్ వెళ్లి పోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. మగ శిశువు అయితే సోమవారం.. ఆడ అయితే శుక్రవారం తల్లి గర్భంలో ఉన్నంది మగ శిశువు అయితే సోమవారం అని.. ఆడ శిశువు అయితే శుక్రవారం అని కోడ్ భాషలను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు వినియోగిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీలతో లింక్ పెట్టుకుంటున్నట్లు తెలసుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలకు గర్భిణులకు తీసుకువస్తే వారికి కమీషన్ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆడ శిశువు అయితే తొలగించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం.. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరిత్యా నేరం. పరీక్షలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. స్కానింగ్ సెంటర్ల పై ప్రత్యేక నిఘూ పెట్టాం. ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్ఓలు పర్యవేక్షిస్తున్నారు. – మధుసూదన్, జిల్లా వైద్యాధికారి -
‘స్మార్ట్’ అస్త్రం..
మొబైల్‌ను మొదట్లో ఇతరులతో మాట్లాడడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగించేవారు. కాలానుగుణంగా మారిన శాస్త్ర, సాంకేతికతతో మొబైల్ రంగంలో ఎన్నో మార్పులొచ్చాయి. సాంకేతికత మరింతగా విస్తరించింది. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు మొబైల్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. మహిళలకు ప్రత్యేకించి అనేక యాప్‌లు అందుబాటులోకి రావడం, వీటికి విస్తృత ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా అధునాతన యాప్‌ల రూపకల్పనలో చాలా సంస్థలు నిమగ్నమయ్యాయి. బ్యూటీ టిప్స్.. అతివల సౌందర్యానికి బ్యూటీటిప్స్ అనే యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుత జీవనవిధానం కారణంగా అందం పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ యాప్‌ద్వారా చక్కటి సూచనలు తెలుసుకునే అవకాశం ఉంది. పాదాలు, చర్మం, పెదవులు, కేశాలను రక్షించుకునే మెళకువల గురించిన పూర్తి సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య భద్రత.. మహిళల ఆరోగ్య భద్రతకు ఉమెన్ హెల్త్ డైరీ యాప్ అందుబాటులో ఉంది. ఈ డైరీలో పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం తెలుసుకునే వీలుంది. రుతుసంబంధ, మానసిక రుగ్మతలను ఈ యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా అధిగమించే అవకాశం ఉంది. కేశ సంరక్షణ.. స్త్రీల కేశసంరక్షణకు న్యూ హెయిర్ స్టైల్ అనే యాప్ అందుబాటులొకి వచ్చింది. దీని ద్వారా ప్రపంచంలో వచ్చే మార్పులకనుగుణంగా కేశాల రక్షణకు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్.. ఇంటి అలంకరణలో మహిళల పాత్ర కీలకం. వీరికోసం ఇంటీరియర్ డిజైన్ యాప్ అందుబాటులో ఉంది. నివసించే గది, భోజనశాల, వంటశాల, పడక గదులను అలంకరించడంలో ఈ యాప్ అధునాతన నమూనాలను అందిస్తున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్న నిర్మాణ శైలిని ఈ యాప్ ద్వారా కళ్లముందు చూపిస్తుంది. మేకప్.. వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించడానికి మేకప్ యాప్‌ను అధికసంఖ్యలో వినియోగిస్తున్నారు నేటి యువత. ఈ యాప్‌లో అధునాతన అలంకరణకు పెద్దపీట వేస్తున్నారు. వివాహం చేసుకునే యువతులు ఈ యాప్‌తో నూతన విషయాలను తెలుసుకొని అలంకరణలో కొత్తపుంతలు తొక్కుతున్నారు. రక్షణకు నిర్భయ.. మహిళల భద్రతకు నిర్భయ, రక్ష, ఉమెన్ సేఫ్టీ ఇలా 18రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో ఇచ్చిన సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేసుకుంటే భద్రతకు డోకా లేదు. ఒంటరిగా వెళ్తున్న మహిళలపై ఏప్రాంతంలో దాడులు అధికంగా జరుగుతున్నాయో ఈ యాప్‌ల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది. 100 నంబర్‌కు ఫోన్.. ఆపదలో ఉన్నప్పుడు మహిళలు 100 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే పోలీసులు వేగంగా స్పందించి రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. షీ-టీమ్స్, రక్షక్ వాహనం, బ్లూకోర్ట్సు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయాల్లో 100 డయల్‌కు ఫోన్ చేస్తే చాలు రక్షణ మీ ముందు ఉన్నట్లుగానే భావించే పరిస్థితులను పోలీసులు కల్పించారు. నగర పోలీసుల వాట్సప్ సేవలు.. నగర పోలీసులు కమిషనరేట్ పరిధిలో అత్యవసర సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను క్రియేట్ చేశారు. 94910–89257 నంబర్‌ను సెల్లో ఫీడ్ చేసుకుంటే చాలు వాట్సప్ ఆన్ అవుతుంది. మహిళలు ఏదైనా ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించి ఈ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు ఆ నంబర్‌ను ప్రత్యేక యాప్‌తో ఏ లోకేషన్లో ఉందో గుర్తించి సదరు వ్యక్తిని పోలీసులు కాపాడే అవకాశం ఉంటుంది. -
‘సన్నాహక’ సమరభేరి
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికలకు కరీంనగర్ నుంచి సమర శంఖారావం పూరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వరంగల్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఎన్నికల శంఖారావం పూరించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సన్నాహక సభ కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ‘ఓ సిటీ’ మైదానం ముస్తాబైంది. వరంగల్ మహా నగరం మొత్తం గులాబీమయమైంది. ఏర్పాట్లు పూర్తి.. సన్నాహక సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ నేతలు అందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి దయాకర్‌రావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఏ లోటూ రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశం ద్వారా సత్తా చాటేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. కేడర్‌కు దిశానిర్ధేశనం... టీఆర్ఎస్కు అన్ని విధాలా కలిసొచ్చే కరీంనగర్ వేదికగా కేటీఆర్ బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించగా... తెలంగాణలో రెండో సన్నాహక సమావేశం వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బా«ధ్యతలు చేపట్టిన కేటీఆర్ మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలతో పాటు ఆయా జిల్లాల నేతలతో ముఖాముఖి, సమన్వయం చేయడంలో నిమగ్నమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారం మేరకు 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సూచన మేరకు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాల నిర్వహణ పూర్తిగా కేటీఆర్ ఆధ్యర్యంలో జరుగుతుండగా, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో చర్చించి, షెడ్యూలు ఖరారు చేశారు. ఇందులో భాగంగానే గురువారం వరంగల్‌లో నిర్వహించే సన్నాహక సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ ఎన్నికల సమావేశమైనా బహిరంగ సభను మరిపించే రీతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ మార్గదర్శనం చేయనున్నారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో జరిగిన అభివృద్ధి, ఎంపీ కృషి, రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలపై నిర్వహించిన పాత్ర, పార్టీని పటిష్ఠం చేసేందుకు జరిగిన కృషి తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దేశానికి ఆదర్శంగా సాగుతున్న పాలన, అనేక సంక్షేమ పథకాలు, జాతీయ రాజకీయాల్లో పార్టీ పురోగమనం వంటి వాటిని ఆయన పార్టీ నేతలకు వివరించనున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వేదికకు... కరీంనగర్ నుంచి బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించిన కేటీఆర్ అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి బయలదేరనున్న ఆయనకు వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడి నుంచి మంత్రులు, ముఖ్యనేతలు వరంగల్ ఓ సిటీ మైదానం వరకు ఆయనను అనుసరిస్తారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, నగరపాలక సంస్థ మేయర్, పురపాలక సంఘాల ఛైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరుతారు. హసన్‌పర్తి నుంచి భారీ ర్యాలీ.. కరీంనగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30 గంటలకు హసన్పర్తికి వచ్చే కేటీఆర్‌కు అక్కడ భారీ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వందలాది వాహనాలతో వరంగల్ ఓ సిటీ సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హసన్‌పర్తి నుంచి భీమారం, కాకతీయ యూనివర్సిటీ, నయీంనగర్ పెట్రోల్‌పంపు, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ మీదుగా ఓ సిటీ మైదానం వరకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. ఇప్పటికే వరంగల్ మహానగరం మొత్తం గులాబీమయమైంది. ప్రతి చౌరస్తాలో గులాబీ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేశారు. రహదారులు, చౌరస్తాల్లో కేటీఆర్‌కు స్వాగత ఫ్లెక్సీలు నెలకొల్పారు. -
‘అతివ’కే పట్టం..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ జిల్లాల పునర్విభజనతో ఆరు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. వచ్చే జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు నూతన జిల్లాల వారీగా జరుగనున్నాయి. ఈ మేరకు నూతన జిల్లా ప్రజా పరిషత్‌ల వారీగా రిజర్వేషన్లు ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. రూరల్ జిల్లా అక్టోబర్ 11, 2016న ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోనే జిల్లా పరిషత్ కొనసాగింది. త్వరలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీలు రిజర్వేషన్లలో మహిళలకు కేటాయించిన వారికి ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌గా మహిళే ఉండగా, ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ మహిళలకు రిజర్వేషన్ కావడంతో వారికి ఉన్నత పదవులు లభించనున్నాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీలు ఉన్నాయి. పదవి ఎవరిని వరిస్తుందోనని చర్చలు మొదలయ్యాయి. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుం దో లేదోననే టెన్షన్లో ఉన్నారు. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కొన్నిచో ట్ల విందు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యా యి.రిజర్వేషన్లు ఖరారైతే మరింత వేగంగా పరి ణామాలు మారే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 4,31,778 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,16,008 మంది, స్త్రీలు 2,15,770 మంది ఉన్నారు. బీసీలు 2,53,384 మంది, ఎస్టీలు 64,058 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 77,076 మంది, ఓసీలు 37,277 మంది ఉన్నారు. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. రిజర్వేషన్లు 2011 గ్రామీణ జనాభా లెక్కల ప్రకారం, నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరిస్తూ ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్‌గా, జెడ్పీటీసీలకు జిల్లాను, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. ఎంపీటీసీల రిజర్వేషన్లను ఎంపీడీఓలు తయారుచేస్తే కలెక్టర్ ఫైనల్ చేయనున్నారు. రాష్ట్రం, జిల్లా, మండల యూనిట్‌గా రిజర్వేషన్ల కేటాయింపుల్లో ముందుగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తొలుత ఎస్సీలకు, తరువాత ఎస్టీలకు రిజర్వేషన్లను కేటాయించి మిగిలినవి బీసీలకు కేటాయిస్తారు. తర్వాత జనరల్ స్థానాలను ప్రకటిస్తారు. జిల్లా నుంచి నేడు(మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు రిజర్వేషన్ల ప్రకటనల కోసం తర్జనబర్జన అవుతున్నారు. మండలం ఎంపీటీసీ స్థానాలు ఆత్మకూరు 09 చెన్నారావుపేట 11 దామెర 08 దుగ్గొండి 12 గీసుకొండ 09 ఖానాపురం 09 నడికూడ 10 నల్లబెల్లి 11 నర్సంపేట 11 నెక్కొండ 16 పరకాల 05 పర్వతగిరి 14 రాయపర్తి 16 సంగెం 14 శాయంపేట 12 వర్దన్నపేట 11 మొత్తం 178 తమకు అనుకులంగా కావాలని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు తమకు అనుకులంగా వచ్చే విధంగా చేయాలని ఇప్పటికే ఆశావహులు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా, మండల నాయకుల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అనుకులంగా రిజర్వేషన్ తీసుకవస్తే గెలుపించుకుని వస్తామని జిల్లా, మండల నాయకులు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. పార్టీ ఫండ్ సైతం ఏమీ లేకుండానే స్వంత డబ్బులు పెట్టుకుని గెలుస్తాడని హామీలు ఇస్తున్నారు. ఎంపీలు, శాసన సభ్యులు సైతం గ్రామంలో బలమైన నాయకులకు అనుగుణంగా రిజర్వేషన్ వచ్చే విధంగా పావులు కదుపుతున్నారని సమాచారం. బలమైన నాయకుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితే పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తారని అధికార పార్టీ నేతలు రిజర్వేషన్లు అనుకులంగా ఉండే విధంగా చూస్తున్నారని తెలుస్తోంది. -
అంతుపట్టని పరకాల తీర్పు
సాక్షి, పరకాల రూరల్: పోరాటాల గడ్డగా పేరుగాంచిన పరకాల నియోజకవర్గం సంచలనాలకు కేంద్ర బిందువు. నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. పరకాలలో గెలుపోటములను అంచనా వేయడం కష్టం. ఇక్కడి నుంచి ఇద్దరు మాత్రమే రెండోసారి విజయం సాధించారు. మిగతావారు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. 1952లో పరకాల నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 15 సార్లు ఎన్నికలు జరుగగా ఇద్దరికి మాత్రమే రెండోసారి గెలుపు వరించింది. జిల్లా నుంచి తొలి మహిళ మంత్రిని అందించిన ఘనత పరకాలకే దక్కింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి రాష్ట్రమంత్రి వర్గంలో అవకాశం దక్కింది.1952లో జనరల్ సీటుగా ఉన్న పరకాల ఆ తరువాత ఎస్సీకి రిజర్వుడ్ అయింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత మళ్లీ జనరల్ సీటుగా మారింది. పోరుగడ్డగా ఉన్న పరకాల గతంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లితోపాటు రేగొండ మండలంలోని తొమ్మిది గ్రామాలు మినహా మిగితా మండలం ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో అప్పటి శాయంపేట నియోజవర్గంలోని ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట నియోజకవర్గంలోని సంగెంతో పరకాల నియోజకవర్గం ఏర్పాటుచేశారు. 1952 నుంచి 72 వరకు జనరల్‌గా, 1978 నుంచి 2004 వరకు ఎస్సీలకు కేటాయించగా 2009 నుంచి జనరల్ స్థానంగా కొనసాగుతుంది. 15 సార్లు ఎన్నికలు జరిగితే పీడీఎఫ్ ఒక్కసారి, కాంగ్రెస్ ఆరు సార్లు, బీజేపీ మూడు సార్లు, టీఆర్ఎస్ రెండు సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఐ ఒక్కసారి గెలుపొందాయి. తొలి మహిళా మంత్రి సురేఖ... పరకాల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆరు నెలల పాటు పనిచేశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన అనంతరం వైఎస్సార్ మంత్రివర్గంలో చోటు లభించడంతో సురేఖ జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి 1983లో గెలిచిన బొచ్చు సమ్మయ్య కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 1972లో గెలిచిన పి ధర్మారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు మంత్రివర్గంలో పనిచేశారు. పరకాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ముగ్గురు మంత్రి పదవులు చేజిక్కించుకున్నారు. సమ్మయ్య, జయపాల్‌కు రెండోసారి అవకాశం... 1952లో ఏర్పడిన పరకాల నియోజకవర్గంలో నాటినుంచి నేటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే రెండుసార్లు గెలిచే అవకాశం దక్కింది. మొదట్లో జనరల్ స్థానంలో ఉన్న పరకాల 1978లో ఎస్సీ రిజర్వుడ్ అయింది. దాంతో 78లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బొచ్చు సమ్మయ్య గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి మంత్రి పదవి పొందారు. 1985లో బీజేపీ నుంచి ఒంటేరు జయపాల్ గెలుపొందగా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం వరించింది. అప్పటి నుంచి పొత్తులతో సీట్లు తారుమారుతూ వచ్చాయి. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒకేసారి ప్రాతినిథ్యం వహించగా సమ్మయ్య, జయపాల్ మాత్రం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పరకాలకు మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరే... నియోజకవర్గ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ ఫలితంగా అనూహ్యంగా టీఆర్ఎస్ తరపున అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న బండారి శారారాణి 34వేల 597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సష్టించారు. ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానానికే వ్యతిరేక గళం వినిపించారు. 2009లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. తిరుగులేని నేతగా ఎదిగిన జంగన్న.. పరకాల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డికి పరకాల అసెంబ్లీ సీటు ఎదురులేని నేతను చేసింది. 1967లో జనసంఘ్ నుంచి దీపం గుర్తుతో గెలుపొందిన జంగారెడ్డి సంచలనం సృష్టించారు. ఆ తదుపరి శాయంపేట నుంచి రెండు సార్లు విజయం సాధించారు. హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావును ఓడించి చరిత్ర సష్టించారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండుస్థానాల్లో గెలువగా అందులో ఒకటి జంగారెడ్డిదే కావడం విశేషం. -
పేగుబంధం కలిసిన వేళ..!
ఖానాపురం: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 30 ఏళ్ల క్రితం బిడ్డలకు దూరమైన ఓ తల్లి అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. మతిస్థిమితం సరిగ్గా లేక కనిపించకుండాపోయిన ఆ మాతృమూర్తి శుక్రవారం ఇంటికి చేరింది. ఇక ఆశలు వదులుకున్నాక.. తమ తల్లి కళ్ల ముందే కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది కలనా.. నిజమా అని తల్లిని హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి రామక్క, వెంకటయ్య దంపతులకు కుమార్తెలు పద్మ, యశోద, కుమారుడు బండి కృష్ణ ఉన్నారు. వారిలో పద్మ, కృష్ణ ఖానాపురంలోనే నివాసం ఉంటున్నారు. రామక్క మతిస్థిమితం కోల్పోయి ఇంటి వద్ద ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. ఇలా ఆమె అదృశ్యమై ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. అయితే.. రామక్క రోడ్డు పక్కన మతిస్థిమితం కోల్పోయి ఉండగా మహారాష్ట్రలోని సేవా సంకల్ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఆ తర్వాత ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్ బాధ్యులు తీసుకొచ్చి వైద్యం చేయించారు. దీంతో కోలుకున్న రామక్క వివరాలను కనుక్కునే క్రమంలో తన తల్లిగారి గ్రామం వరంగల్ జిల్లా కోరుకొండపల్లి అని చెప్పింది. దీంతో ఫౌండేషన్ ప్రతినిధులు రహెన్, సురేఖ, ప్రదీప్, నితీష్, గణేష్ ఆమెను గురువారం ఉదయం కేసముద్రం మండలం కోరుకొండపల్లికి తీసుకొచ్చారు. అయితే.. రామక్క కుటుంబ సభ్యులు వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో ఉంటారని చెప్పడంతో వారు తిరిగి అంబులెన్స్‌లోనే వరంగల్‌కు వెళ్లారు. శుక్రవారం గూగుల్ మ్యాప్ సాయంతో ఖానాపురం చేరుకున్నారు. గ్రామానికి వచ్చి వివరాలు సేకరించే క్రమంలో ఆమె కుమార్తె పద్మ, కుమారుడు కృష్ణ రామక్కను గుర్తించి సంభ్రమాశ్చార్యానికి లోనై బోరున విలపించారు. ఇక లేదనుకున్న తల్లి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో ఆమెపై పడి వారు రోదిస్తున్న తీరును చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ‘మన ఇంటికి పోదాం పద బిడ్డా..’అంటూ రామక్క వారి కన్నీళ్లను తుడిచింది. తమ తల్లిని అక్కున చేర్చుకుని, అప్పగించిన శ్రద్ధ ఫౌండేషన్ బాధ్యులకు కుటుంబ సభ్యులు చేతులెత్తి నమస్కరించారు. రామక్కతోపాటు వెంకటేశ్వరమ్మ, బిందు, లక్ష్మిలను కూడా వారివారి కుటుంబాలకు అప్పగించేందుకు వెళ్తున్నట్లు ఫౌండేషన్ బాధ్యులు వెల్లడించారు. శ్రద్ధ ఫౌండేషన్ సభ్యుల కృషిని స్థానికులు అభినందించారు. -
కొత్తమార్గంలో బియ్యం దందా!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో రేషన్‌బియ్యం దందా దారి మళ్లింది. రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత కోసం మార్చి నెల నుంచి ఈ–పాస్ యంత్రాలను వినియోగిస్తున్నారు. అయినా ఈ దందాకు అడ్డుకట్ట పడటంలేదు. గతంలో రేషన్‌షాపుల నుంచే బియ్యాన్ని దారి మళ్లించగా, ఇప్పుడు వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వాహనాల్లో తరలిస్తుండటంతో రేషన్ బియ్యం పోలీసులకు తరుచూ పట్టుబడుతున్నాయి. గ్రామాల్లో సేకరణ గ్రామాల్లో కొందరు లబ్ధిదారులు దొడ్డుగా ఉన్న రేషన్ బియ్యం తినలేక చిన్న వ్యాపారులకు కిలోకు రూ.6 నుంచి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో బియ్యం దందా చేసే పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో మహారాష్ట్ర, హైదరాబాద్ పరిసరాల్లోని కోళ్లఫారాలకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లకు కిలోకు రూ.22కు విక్రయిస్తున్నారు. అంటే దళారులు కిలోకు రూ.16 నుంచి రూ.12 వరకు లాభం పొందుతున్నారు. అయితే గ్రామాల్లో నుంచి మిలర్ల వద్దకు తరలించేందుకు వ్యాపారులు కొత్త మార్గాలనే అనుసరిస్తున్నారు. ఈ దందాలో రోజువారీ కూలీల నుంచి బడా వ్యాపారుల వరకు ఉన్నారు. రెండు మూడు క్వింటాళ్లు సేకరించి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. రేషన్ బియ్యం అనేది గుర్తుపట్టకుండా బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి రవాణా చేస్తున్నారు. లాభసాటి వ్యాపారం రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్మడం అక్రమార్కులకు లాభసాటి వ్యాపారంగా మారింది. దొడ్డిదారిన కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఆగమేఘాల మీద ప్రభుత్వ సంచుల్లోకి మార్చేస్తున్నారు. తద్వారా మిల్లులో రికార్డులను తారుమారు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నారు. ఒక్కప్పుడు 30శాతం మాత్రమే ఉన్న రీసైక్లింగ్ వ్యాపారులు నేడు రెట్టింపైనట్లు తెలుస్తోంది. అధికారుల మధ్య సమన్వయలోపం రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాల్సిన రైల్వే, పౌరసరఫరాల అధికారులు, పోలీసుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం అక్రమార్కులకు కలిసివస్తోంది. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం ఉంటే అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపవచ్చు. దాడులు ఉధృతం చేస్తున్నాం.. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమో దు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవా ణా చేస్తే ఎన్ఫోర్స్మెంట్ వారితో దాడులు చేయిస్తున్నాం. వీరికి అదనంగా గ్రామ స్థాయి నుంచి నుంచి డివిజన్ స్థాయి వరకు టీంలు ఏర్పాటు చేసి రేషన్ అక్రమ తరలింపు అరికడతాం. – నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
బావిలో పడి బాలుడి మృతి
కమలాపూర్ (హుజూరాబాద్) వరంగల్ రూరల్ : ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు చేద బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో బుధవారం జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఉప్పల్‌లో నాయీబ్రాహ్మణ వృత్తితో పాటు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న విష్ణుభక్తుల రమేష్–వాణి దంపతులకు ఒక కూతురు, కుమారుడు రితిక్ (3) ఉన్నారు. బుధవారం ఉదయమే పనుల నిమిత్తం రమేష్ బయటకు వెళ్లగా, వాణి ఉపాధి పనులకు వెళ్లింది. సుమారు 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన రమేష్‌కు ఇంటి వద్ద రితిక్ కనిపించకపోవడంతో ఎక్కడకు వెళ్లాడా అని వెతికాడు. ఇలా మూడు గంటల పాటు వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. చివరకు తమ ఇంటి ఆవరణలోని చేద బావిపై వేసిన రేకు పక్కకు పడి ఉండడంతో అనుమానం వచ్చి బావిలో పాతాళ గరిగె వేసి చూడగా బాలుడు కొక్కానికి చిక్కాడు. స్థానికుల సాయంతో బాలుడి బావిలోంచి బయటకు తీయగా అప్పటికే రితిక్ చనిపోయినట్లు తెలిపారు. రితిక్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. -
ఫిల్టర్ ఇసుక..!
అనుమతి లేదు.. నిషేధాజ్ఞలు వర్తించవు.. రోజుల తరబడి తవ్వకాలు.. వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలింపు.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. రోడ్లు పాడవుతున్నాయి.. రైతులు అడ్డుకుంటే దాడులు.. అధికారులు వస్తే డబ్బులతో సమాధానం.. ఇదీ ఆకేరువాగు పరిసరాల్లో ఇసుక దందా జరుగుతున్న తీరు.. వర్ధన్నపేట: ఆకేరువాగు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. వాగుకు ఇరువైపులా ఉన్న అసైన్డ్, ప్రైవేట్ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. వర్ధన్నపేట పరిసర ప్రాంతాల నుంచి నిత్యం సుమారు 500 ట్రాక్టర్లలో ఇసుకను నగరానికి తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి చేపట్టిన తవ్వకాలతో వాగులో ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. దీంతో వాగుకు ఇరువైపుల ఉన్న మట్టిని తవ్వి ఫిల్టర్ చేసి ఇసుకను వెలికితీస్తున్నారు. ఇందు కోసం వాగులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనర్హం. ఇలా ఫిల్లర్ చేసినందుకు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.1600 వసూలు చేస్తున్నారు. ఇందులో కూలీలకు రూ.600, ఇసుకకు రూ.1000 ఖర్చు చేస్తున్నారు. ఇసుకను ఫిల్టర్ చేయడానికి బోరుబావుల నీటిని వినియోగిస్తున్నారు. ఆ నీటితో మట్టిని వేరుచేసి నాణ్యమైన ఇసుకనను ట్రాక్టర్లలో నింపుతున్నారు. ఇలా తయారీ చేసిన ట్రాక్టర్ ఇసుకను వరంగల్‌లో రూ.4వేల నుంచి రూ.4500 పైగా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో నెలకు రూ.6కోట్లపైగా అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. యథేచ్ఛగా తవ్వకాలు.. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. మైనింగ్‌ను తలపించే స్థాయిలో తవ్వకాలు చేపట్టి ఇసుకను తోడేస్తున్నారు. వర్ధన్నపేట, ఇల్లంద, ల్యాబర్తి, పర్వతగిరి, కల్లెడ, నారాయణపురం శివారుతండాల్లో ఇసుక కోసం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. అడ్డదారుల ద్వారా ఇసుకను వరంగల్‌కు తరలించడానికి వాహనదారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుని సాఫీగా రవాణా కొనసాగిస్తున్నారు. దాడులు చేస్తున్నా తగ్గని దందా.. ఇటీవల కాలంలో అధికారులపై వస్తున్న ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు ఆకేరువాగులో దాడులు నిర్వహిస్తున్నారు. ఈనెల 4న వాగులో ఆకస్మిక దాడులు నిర్వహించి వర్ధన్నపేట తహసిల్దార్ కనుకయ్య 12 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే 24న ఇల్లంద వాగులో దాడులు చేసి 10 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో ఆకేరువాగులో జరుగుతున్న ఇసుక ఫిల్టర్ దందా వెలుగుచూసింది. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఆకస్మిక దాడులు చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ఇసుక రవాణా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. గతంలో పలుమార్లు దాడులు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసి కొంత వరకు అరికట్టాం. స్పెషల్ క్యాంపెయిన్‌గా దాడులు చేసి పూర్తి స్థాయిలో అరికడుతాం. అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తాం. – కనకయ్య, తహసీల్దార్, వర్ధన్నపేట ఇసుక దందా ఇలా.. రోజుకు 500 ట్రాక్టర్లు(సుమారు) ట్రాక్టర్ ఇసుక ఫిల్టర్‌కు రూ.1000 కూలీలకు చెల్లించేది రూ.600 వరంగల్‌లో విక్రయిస్తున్న ధర రూ.4,500 ప్రతి రోజూ వ్యాపారం రూ.20లక్షలు -
భార్యపై దాడికి దిగి.. చివరికి తానే!
సాక్షి, వరంగల్ రూరల్ : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు భర్త ప్రాణాలు తీసింది. చేతిలో ఉన్న అద్దంతో భార్యపై దాడి చేయడానికి యత్నించిన భర్త.. ప్రమాదవశాత్తూ అదే అద్దం బారిన పడి మృతిచెందాడు. ఈ విషాదం వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జంగాల యాకన్న(45) శుక్రవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అద్దం ముక్కతో ఆమెపై దాడి చేయడానికి యత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ అద్దం యాకన్న చేతికి గుచ్చుకోవడంతో పెద్ద గాయం అయి భారీగా రక్తస్రావం జరిగింది. దీంతో అతన్ని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే భారీగా రక్తస్రావం జరగడంతో యాకన్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ విషాదంపై గ్రామస్తులు విదస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త కొట్లాట
వరంగల్ రూరల్ జిల్లా పరిధి ఓ చోట.. పాలనా కేంద్రం మరోచోట జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కేంద్రం కోసం ఆందోళనలు నర్సంపేట, పరకాల, గీసుకొండల్లో విడివిడిగా ఉద్యమాలు మొదటి ముసాయిదా మార్చినప్పటి నుంచే రగడ తూర్పు నియోజకవర్గాన్నిరూరల్లో కలిపితే అందరికీ ఆమోదయోగ్యం! సాక్షి, హన్మకొండ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కొన్నిచోట్ల సరికొత్త పంచాయితీలకు తెరతీసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 21జిల్లాలు చేయడంతో జిల్లాల సంఖ్య మొత్తం 31కి చేరుకుంది. దీన్ని ప్రజలు ఆమోదించినప్పటికీ వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం విభిన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో జిల్లాలో గందరగోళ వాతావరణం నెలకొంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న 15 మండలాల్లోని మూడు ప్రాంతాల్లో జిల్లా కేంద్రం కోసం ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఇందులో ఒక నియోజకవర్గంలోనే రెండు చోట్ల విడివిడిగా ఆందోళనలు చేపట్టడం విశేషం. ఎక్కడా లేని పరిస్థితి రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా వరంగల్ రూరల్ జిల్లా రెవెన్యూ పరిధిలో లేని వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న హన్మకొండలో రూరల్ జిల్లా కలెక్టరేట్, వరంగల్ నగరంలో వివిధ రూరల్ జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. వరంగల్ రూరల్ జిల్లాకు ఒక ప్రత్యేక జిల్లా కేంద్రం లేకపోవడంతో వరంగల్ రూరల్ రెవెన్యూ జిల్లా పరిధిలోనే కలెక్టరేట్, ఇతర అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ రూరల్ జిల్లా పరిధిలోని మూడు ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష పోరాటాలు సైతం ప్రాంరభించారు. ఇవి రోజురోజుకూ మరింత ఉధృతం దాలుస్తున్నాయి. ఒకవైపు నర్సంపేటలో జిల్లా కేంద్రం కోసం కొన్ని నెలలుగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. మరోవైపు పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ వివిధ సంఘాలు ఆందోళనలు చేపట్టగా, అదే పరకాల నియోజకవర్గం పరిధిలోని గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ మరో ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడ అఖిలపక్షాలు ఇప్పటికే మూడు సార్లు సమావేశాలు నిర్వహించుకుని ప్రత్యక్ష కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు విడిగా ప్రయత్నించిన టీఆర్ఎస్ కూడా అఖిలపక్షంతో కలిసి వస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాలు అర్బ¯ŒS జిల్లా పరిధిలోని వరంగల్ నగరం చుట్టూ విస్తరించి ఉన్నాయి. రూరల్ జిల్లా పరిధిలోని 15మండలాల్లో గీసుకొండ, సంగెం మండలాలు నగరానికి ఆనుకుని ఉన్నాయి. దీంతో గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. గీసుకొండ మండలంలో ప్రభుత్వ భూములు సైతం అందుబాటులో ఉన్నందున ఇక్కడే కార్యాలయాలు నెలకొల్పాలనేది అఖిలపక్ష నాయకుల డిమాండ్. ’పాకాల’ జిల్లా కోసం.. జిల్లాల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కాకముందునుంచే నర్సంపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన మొదటి ముసాయిదాలో వరంగల్, హన్మకొండ అనే రెండు జిల్లాలు ఉండడంతో హన్మకొండ బదులు నర్సంపేటను జిల్లా కేంద్రంగా చేసి పాకాల జిల్లాగా పేరు పెట్టాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. చివరకు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు కావడంతో జిల్లా కార్యాలయాలు నర్సంపేటలో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికీ జేఏసీ ఆందోళనలు చేస్తోంది. గతం నుంచే రెవెన్యూ డివిజ¯ŒSగా ఉన్న నర్సంపేటలో సబ్ డీఎఫ్‌వో కార్యాలయం, సబ్ కోర్టు, మినీ స్టేడియం, సమీపంలో పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పాటు డీసీపీ కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేస్తుండడంతో జిల్లా కేంద్రం డిమాండ్ మరింత పెరుగుతోంది. పరకాలలో రెండు డిమాండ్లు చారిత్రక ప్రాధాన్యం కలిగిన పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ పరకాలలోనూ వారం కిందట ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అఖిల భారత విద్యార్ధి పరిషత్, తెలంగాణ విద్యార్ధి సంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పరకాలను జిల్లా కేంద్రంగా చేయాలని, లేనిపక్షంలో రెవెన్యూ డివిజ¯ŒSగా చేసి భూపాలపల్లి జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరకాల ఉనికి దెబ్బతింటున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే చ ల్లా ధర్మారెడ్డి పట్టించుకోవడం లేదంటూ ఆందోళనలు చేయడంతో పాటు, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ సైతం తగులబెట్టి పరకాల ప్రాంతం వారు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి.ఏది ఏమైనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ వరంగల్ రూరల్ జిల్లా విషయంలో మాత్రం సరికొత్త పంచాయతీకి తెరతీసినట్లైంది. నర్సంపేట, పరకాల నియోజకవర్గ కేంద్రాల్లో పోరాటాలు ఎక్కడికక్కడ జరుగుతుండగా, పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం ప్రత్యేకంగా మరో పోరాటం ప్రారంభం కావడం గమనార్హం. ‘తూర్పు’ కలిపితే ఓకే.. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో వివిధ ప్రాంతాల మధ్య విభిన్నమైన ఆకాంక్షలు ఉన్నప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూరల్ జిల్లాలో కలిపితే జిల్లా కేంద్రం రగడకు తెర పడే అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు అదే రెవెన్యూ ప్రాంతంలో ఒక పాలనా కేంద్రం ఉండడంతో పాటు జిల్లాలో నగరం చేరినట్లవుతుంది. మూడు ప్రాంతాల మధ్య జిల్లా కేంద్రం రగడకు ఫుల్స్టాప్ పడే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ చేస్తే చాలు.. పోరాటల పురిటి గడ్డ, తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపకుండా పోరాడిన చరిత్ర పరకాల వాసులది. అయితే, జిల్లాల పునర్విభజనతో పరకాలకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి పరకాలను రెవెన్యూ డివిజ¯ŒSగా మార్చాలి. ఆ తర్వాత రూరల్ జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటుచేసినా మాకు అభ్యంతరం లేదు. కుమార్, టీఆర్ఎస్ నాయకుడు, పరకాల ’తూర్పు’ను జిల్లా కేంద్రం చేయాలి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని వరంగల్ అర్బన్ జిల్లా నుంచి విడదీసి రూరల్ జిల్లాలో చేర్చి జిల్లా కేంద్రం చేస్తే బాగుంటుంది. దీంతో జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే వివాదాలు, ఆందోళనలు సమసిపోతాయి. లేదంటే మా రెండో డివిజ¯ŒS ప్రాంతాన్ని వరంగల్ అర్బ¯ŒS జిల్లాలోనే చేర్చాలి. అప్పటి వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి. ఆడెపు రమేశ్, జేఏసీ కన్వీనర్, మొగిలిచర్ల ‘తూర్పు’ అందరికీ అనుకూలం వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా వరంగల్ తూర్పును చేయాలి. పరకాల, నర్సంపేట కాకుండా వరంగల్ తూర్పు అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. జిల్లా కేంద్రంగా తూర్పు ప్రాంతాన్ని ఎంపిక చేస్తే కార్యాలయాల ఏర్పాటు, ప్రజలు వచ్చివెళ్లేందుకు కానీ అనువుగా ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలి. ఉప్పునూతుల శ్రీనివాస్, ఆత్మకూరు -
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ!
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ! మూడు డివిజన్లు, 17 పంచాయతీలూ రూరల్ జిల్లాలోకి.. అభ్యంతరం చెబుతున్న స్థానికులు గీసుకొండ : కొత్తగా ఏర్పాటు కానున్న వరంగల్ రూరల్ జిల్లాలోకి గీసుకొండ మండలం రాబోతోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉండగా.. ఈ ప్రాంతం నగరాన్ని ఆనుకుని ఉండి, కొంత మేర గ్రేటర్ వరంగల్‌లో భాగమైనా జిల్లాల పునర్విభజనలో భాగంగా మొత్తం మండలాన్ని వరంగల్ రూరల్ జిల్లాలో చేర్చనున్నారు. ఈమేరకు కలెక్టర్ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పొందుపరినట్లు తెలుస్తోంది. గతంలో 25 గ్రామపంచాయతీలతో గీసుకొండ మండలం ఉండగా.. ఎనిమిది గ్రామపంచాయతీలను గ్రేటర్ వరంగల్ 2013 ఆగస్టు 1న విలీనం చేశారు. దీంతో మండలంలోని రెడ్డిపాలెం, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, గొర్రెకుంట, కీర్తీనగర్, ధర్మారం, జాన్‌పాక, గరీబ్‌నగర్, స్తంభంపెల్లి, వసంతాపూర్, దూపకుంట ప్రాంతాలు నగరంలోకి చేరగా వీటిని 2, 3, 4వ డివిజన్లుగా ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 17 గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు మండలానికి ఎంపీపీ, జెడ్పీటీసీ ఉన్నారు. తాజాగా జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో నగరంలో విలీనమైన ప్రాంతం వరంగల్ జిల్లాలో, మిగతాది రూరల్ జిల్లాలో కొనసాగుతుందని అంతా భావించారు. కానీ మండలం మొత్తం వరంగల్ రూరల్ జిల్లా కిందికి వెళ్లనున్నట్లు ప్రతిపాదనల్లో పొందుపర్చడంతో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వరంగల్ జిల్లాలోనే మండలాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. కాగా, సంగెం మండలం నుంచి గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన బొల్లికుంట, గాడెపల్లి గ్రామాలు ప్రస్తుతం 4వ డివిజన్లో ఉన్నాయి. ఈ రెండు గ్రామాలతో పాటు సంగెం మండలం మొత్తం కూడా వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్లనుంది. -
తొమ్మిది మంది పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
వరంగల్ : విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు వరంగల్ రూరల్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న తొమ్మిది మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలు ప్రకటించిందని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పతకాలను సోమవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. సీఐ వెంకటేశ్వరబాబు, ఆర్ఎస్ఐ శెట్టి శ్రీనివాస్, ఏఎస్ఐ కె.సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్‌రావు, ఏఆర్పీసీలు పెద్దిరెడ్డి, మిర్జాఖాన్బేగ్, ఎంఎ. షకూర్, ఎం.దుర్గాప్రసాద్, సివిల్ పీసీ సామల శ్రీనివాస్ ఈ అవార్డులు అందుకోనున్నారు.