
పూర్ణేందర్ అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ క్రైం/భీమారం/జనగామ: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చిటూరు వద్ద శనివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని వాహనానికి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కారు డ్రైవర్ (ఏఆర్ కానిస్టేబుల్) చిలకమర్రి పార్థసారథి(40), మంత్రి సోషల్ మీడియా ఇన్‌చార్జి తంగర్లపల్లి పూర్ణేందర్ (38) అంత్యక్రియలు ఆదివారం బంధువులు, మిత్రుల అశ్రునయనాల మధ్య జరిగాయి. అంతకు ముందు జనగామ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని స్వగృహాలకు తరలించారు. వారి భౌతిక కాయాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించిన మంత్రి దయాకర్‌రావు కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి స్వయంగా వారి పాడె మోశారు. మృతుల కుటుంబీకులను దగ్గరకు తీసుకుని నేనున్నానంటూ ఓదార్చారు.
రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి
తమ సామాజికవర్గానికి చెందిన తంగర్లపల్లి పూర్ణేందర్ మృతి పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం సంతాపం వ్యక్తం చేశారు. పూర్ణేందర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతడి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సంఘం తరపున పూర్ణేందర్ కుటుంబానికి బాసటగా ఉంటామని భరోసా యిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment