అంతుపట్టని  పరకాల తీర్పు | Parakala Constituency Political Information | Sakshi
Sakshi News home page

అంతుపట్టని  పరకాల తీర్పు

Published Mon, Nov 12 2018 8:44 AM | Last Updated on Mon, Nov 12 2018 8:44 AM

Parakala Constituency Political Information - Sakshi

సాక్షి, పరకాల రూరల్‌: పోరాటాల గడ్డగా పేరుగాంచిన పరకాల నియోజకవర్గం సంచలనాలకు కేంద్ర బిందువు. నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. పరకాలలో గెలుపోటములను అంచనా వేయడం కష్టం. ఇక్కడి నుంచి ఇద్దరు మాత్రమే రెండోసారి విజయం సాధించారు. మిగతావారు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. 1952లో పరకాల నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 15 సార్లు ఎన్నికలు జరుగగా ఇద్దరికి మాత్రమే రెండోసారి గెలుపు వరించింది. జిల్లా నుంచి తొలి మహిళ మంత్రిని అందించిన ఘనత పరకాలకే దక్కింది.

ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి రాష్ట్రమంత్రి వర్గంలో అవకాశం దక్కింది.1952లో జనరల్‌ సీటుగా ఉన్న పరకాల ఆ తరువాత ఎస్సీకి రిజర్వుడ్‌ అయింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత మళ్లీ జనరల్‌ సీటుగా మారింది. పోరుగడ్డగా ఉన్న పరకాల గతంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లితోపాటు రేగొండ మండలంలోని తొమ్మిది గ్రామాలు మినహా మిగితా మండలం ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో అప్పటి శాయంపేట నియోజవర్గంలోని ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట నియోజకవర్గంలోని సంగెంతో పరకాల నియోజకవర్గం ఏర్పాటుచేశారు.  1952 నుంచి 72 వరకు జనరల్‌గా, 1978 నుంచి 2004 వరకు ఎస్సీలకు కేటాయించగా 2009 నుంచి జనరల్‌ స్థానంగా కొనసాగుతుంది. 15 సార్లు ఎన్నికలు జరిగితే పీడీఎఫ్‌ ఒక్కసారి, కాంగ్రెస్‌ ఆరు సార్లు, బీజేపీ మూడు సార్లు, టీఆర్‌ఎస్‌ రెండు సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఐ ఒక్కసారి గెలుపొందాయి.

తొలి మహిళా మంత్రి సురేఖ...
పరకాల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆరు నెలల పాటు పనిచేశారు. హ్యాట్రిక్‌ విజయం సాధించిన అనంతరం వైఎస్సార్‌ మంత్రివర్గంలో చోటు లభించడంతో సురేఖ జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి 1983లో గెలిచిన బొచ్చు సమ్మయ్య కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 1972లో గెలిచిన పి ధర్మారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావు మంత్రివర్గంలో పనిచేశారు. పరకాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ముగ్గురు మంత్రి పదవులు చేజిక్కించుకున్నారు.

సమ్మయ్య, జయపాల్‌కు రెండోసారి అవకాశం...
1952లో ఏర్పడిన పరకాల నియోజకవర్గంలో నాటినుంచి నేటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే రెండుసార్లు గెలిచే అవకాశం దక్కింది. మొదట్లో జనరల్‌ స్థానంలో ఉన్న పరకాల 1978లో ఎస్సీ రిజర్వుడ్‌ అయింది. దాంతో 78లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బొచ్చు సమ్మయ్య గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి మంత్రి పదవి పొందారు. 1985లో బీజేపీ నుంచి ఒంటేరు జయపాల్‌ గెలుపొందగా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం వరించింది. అప్పటి నుంచి పొత్తులతో సీట్లు తారుమారుతూ వచ్చాయి. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒకేసారి ప్రాతినిథ్యం వహించగా సమ్మయ్య, జయపాల్‌ మాత్రం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

పరకాలకు మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరే...
నియోజకవర్గ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ ఫలితంగా అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ తరపున అనూహ్యంగా టికెట్‌ దక్కించుకున్న బండారి శారారాణి 34వేల 597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సష్టించారు. ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానానికే వ్యతిరేక గళం వినిపించారు.  2009లో కొండా సురేఖ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు.

తిరుగులేని నేతగా ఎదిగిన జంగన్న..
పరకాల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత చందుపట్ల జంగారెడ్డికి పరకాల అసెంబ్లీ సీటు  ఎదురులేని నేతను చేసింది. 1967లో జనసంఘ్‌ నుంచి దీపం గుర్తుతో గెలుపొందిన జంగారెడ్డి సంచలనం సృష్టించారు. ఆ తదుపరి శాయంపేట నుంచి రెండు సార్లు విజయం సాధించారు.  హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావును ఓడించి చరిత్ర సష్టించారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండుస్థానాల్లో గెలువగా అందులో ఒకటి జంగారెడ్డిదే కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement