ఆత్మకూరు: కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మొక్కజొన్నలను కాంటా వేయకపోవడం.. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం.. ఓ మహిళా రైతు ప్రాణాలు తీసింది. కొనుగోలు కేంద్రం వద్ద పది రోజులుగా వేచి ఉన్న ఆ మహిళా రైతు గుండెపోటుతో మృతి చెందడం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెంచికలపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి పది రోజుల క్రితం పెంచికలపేటకు చెందిన నరిగె బొందమ్మ (65) మొక్కజొన్నలను తీసుకొచ్చింది. అయితే, కేంద్రంలో అప్పటికే నిల్వ ఉన్న సరుకును తరలించకపోవడంతో బొందమ్మతో పాటు మరికొందరు రైతుల మొక్కజొన్నలను కాంటా వేయలేదు. రెండు రోజుల నుంచే లారీల ద్వారా నిల్వల తరలింపు ప్రారంభమైంది.
కాగా, పది రోజుల నుంచి ప్రతిరోజూ ఉదయం కేంద్రానికి రావడం, సాయంత్రం వరకు వేచి ఉండి ఇంటికి వెళ్తున్న బొందమ్మ.. సోమవారం ఉదయం కూడా తన మొక్కజొన్నలను కాంటా వేయాలని సిబ్బందిని ప్రాధేయపడుతున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రైతులు బొందమ్మ మృతదేహాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబసభ్యులతో మాట్లాడి బొందమ్మ మృతదేహాన్ని వారి ఇంటికి తరలించారు. తహసీల్దార్ ముంతాజ్, సీఐ రంజిత్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ లక్ష్మయ్య బొందమ్మ కుటుంబీకులను పరామర్శించడంతో పాటు సొసైటీ తరఫున కుటుంబానికి రూ.10 వేలు అందచేశారు. బొందమ్మ భర్త ఓదెలు 25 ఏళ్ల క్రితం, ఆమె కుమారుడు కుమారస్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె తన కోడలితో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment