
సప్తగిరికాలనీ: ఓ వైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు తల్లి హఠాన్మరణంతో ఆ విద్యార్థి తల్లిడిల్లిపోయాడు. బాధతప్త హృదయంతో పదో పరీక్షకు హాజరయ్యాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అమరం జనార్దన్‌రెడ్డి – మౌనిక దంపతుల కుమారుడు అమన్‌రెడ్డి కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో పదో తరగతి చదివాడు. పిల్లల చదువు నిమిత్తం కరీంనగర్ మంకమ్మతోటలోనే నివాసముంటున్నారు.
తండ్రి నిమ్మపల్లి ఐకేపీ సెంటర్‌లో సీసీగా పనిచేస్తున్నాడు. సోమవారం తల్లి లత గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఓ పక్క తల్లిని కోల్పోయిన అమన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జ్యోతినగర్‌లోని సెయింట్ ఆల్‌ఫోన్స్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరయ్యాడు. అమన్ రెడ్డిని బుధవారం ఉదయం పరీక్ష కేంద్రం వద్ద మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి ఓదార్చారు. అమన్ రెడ్డిని ఉపాధ్యాయులు ముకుందం, సుధాకర్ రెడ్డి, సిలివేరి మహేందర్, శ్రీనివాస్, కుమారస్వామి, తోటి విద్యార్థులు, స్నేహితులు ధైర్యం చెప్పారు.
ఉన్నత స్థాయిలో రాణిస్తా
మా అమ్మ ఎప్పుడూ నన్ను ఉన్నతస్థాయిలో రాణించాలని చెప్పేది. బాగా చదవాలి. క్రీడల్లోనూ రాణించాలని సూచించేది. నేను జాతీయ జూడో పోటీలకు ఎంపికై నందుకు చాలా సంతోషపడింది. స్పోర్ట్స్‌లో పాల్గొనేలా ఉత్సాహం నింపింది. ఉన్నత స్థానంలో నిలిచి అమ్మకోరిక నెరవేర్చుతా.
– అమన్ రెడ్డి