Tenth exam
-
ప్రశాంతంగా పది పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విద్యార్థులు పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పరీక్ష రాయవలసిన అభ్యర్థులు 6,17,971 మంది కాగా 6,11,832 మంది (99.01 శాతం) హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. ఈసారి 26 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హడావుడి నెలకొంది. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేయడం, వాటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది సకాలంలోనే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్నిచర్‌తోపాటు మంచినీరు అందుబాటులో ఉంచారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా విస్తృతమైన ప్రచారం కల్పించింది. అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లతో సహా ఎవరి ఫోన్లను అనుమతించలేదు. విద్యార్థులకు కూడా ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇయర్ఫోన్లు, బ్లూటూత్ వంటి డిజిటల్ పరికరాలను పూర్తిగా నిషేధించింది. ప్రతి కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పోలీసు స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ల సంఖ్యను పెంచింది. లీక్‌లు, ఫేక్ ప్రచారాలు చేయకుండా ఈ చర్యలు అడ్డుకట్ట వేశాయి. ఎవరైనా ఎక్కడైనా లీక్ లేదా ఫేక్ ప్రశ్నపత్రాల ప్రచారం చేసినా వెంటనే పసిగట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సిద్ధం చేసింది. ప్రతి ప్రశ్నపత్రం మీద క్యూఆర్ కోడ్‌తో కూడిన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా ఎక్కడా నమోదు కాలేదు. డిజిటల్‌గా పరీక్ష రాసిన దివ్యాంగ విద్యార్థులు అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఇన్‌క్లూజివ్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ (దృష్టిలోపం ఉన్న) విద్యార్థినులు డిజిటల్‌గా పరీక్ష రాశారు. ఈ పాఠశాలకు చెందిన ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమెర చైత్రిక, ఏకుల సౌమ్య, మేఖ శ్రీధాత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చందుగారి పావని రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. వీరు డిజిటల్ విధానంలో కంప్యూటర్ ద్వారా స్క్రయిబ్ సహాయం లేకుండా పరీక్ష రాశారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
పరీక్షలకు భయపడి పాఠశాలకు రాని లక్షమంది విద్యార్థులు.. ఎక్కడంటే!
కొరుక్కుపేట(చెన్నై): పబ్లిక్ పరీక్షలకు భయపడి దాదాపు లక్ష మంది 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు రాకుండా నిలిచిపోయారు. ప్రసుత్త విద్యా సంవత్సరంలో లక్షమందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేసినట్లు వెల్లడైంది. తమిళనాడు వ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్వహించిన సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఈనేపథ్యంలో ఆ విద్యార్థులను పబ్లిక పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గైర్హాజరైన విద్యార్థుల పేర్లు, వివరాలు సేకరించి పరీక్షకు తీసుకురావాలని, ఆ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని తేల్చింది. -
జాబ్ నిలవాలంటే టెన్త్ పాసవ్వాలన్నారు, ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో
భువనేశ్వర్: ఒడిశాలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న స్వర్ణలత పాటి చిన్ననాటి నుంచి కష్టాలను చాలా దగ్గర్నుంచి చూశారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో ఆమెను పెద్దగా చదివించలేదు. ఏడో తరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. ఆమెకు 27 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. తన ఇద్దరు పిల్లలనే ఆమె తన జీవితంగా భావించి వారికోసం కష్టపడుతూ వచ్చింది. ఏదైనా జాబ్ చేయాలని అనుకున్నా ఆమెకు సరైన విద్యార్హత లేకపోవడంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. చివరికి తన ఊర్లోని స్కూల్లో వంద రూపాయలకు కుక్‌గా చేరి తన పిల్లలిద్దరిని పోషించుకుంది. కాగా 2005లో ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆమె తాను పని చేస్తున్న గ్రామంలోనే ఆశావర్కర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆశావర్కర్‌గా ఆమె చూపిన పనితనానికి, ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తనకు వచ్చిన డబ్బుతో ఇద్దరి పిల్లలను ప్రస్తుతం పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిస్తోంది. అయితే 2019లో ఒడిశా ప్రభుత్వం ఆశావర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు టెన్త్ తప్పనిసరిగా ఉండాలని మెలిక పెట్టింది. టెన్త్ పాస్ అయితేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో స్వర్ణలతా తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి పది పరీక్షలు రాయడానికి సిద్ధమైంది. 2019 డిసెంబర్లో మెట్రిక్ పరీక్షలు రాసేందుకు ఓపెన్ స్కూల్లో అప్లికేషన్ పెట్టుకుంది. కరోనా కారణంగా 2020 మార్చిలో జరగాల్సిన పరీక్షలు సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. కష్టపడి చదివిన స్వర్ణలత సెప్టెంబర్‌లో రాసిన పరీక్షల్లో ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్టులు పాసయ్యింది. ఇంగ్లీష్ కూడా కేవలం నాలుగు మార్కులతో ఫెయిల్ అయింది. తాను ఫెయిల్ అయ్యానని కుంగిపోకుండా మరోసారి ఇంగ్లీష్ పరీక్ష రాసింది. ఈసారి కూడా ఫలితం ఆమెకు వ్యతిరేకంగానే వచ్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో స్వర్ణలతకు ఓడిశా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈసారి ఆమెను దేవుడు కరోనా రూపంలో కరుణించాడు. కరోనా కారణంగా గతేడాదితో పాటు ఈ ఏడాది ఓపెన్‌లో అప్లై చేసుకున్న అందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకేముంది తాను పాసయినట్లు తెలుసుకున్న స్వర్ణలతా దాన్ని ఒక పెద్ద పండగలా చేసుకుంది. ఇక తన జాబ్ ఎక్కడికి పోదని.. తనకు అన్ని సౌకర్యాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా -
సాంకేతిక పంథాలో పది పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ స్వీకరణ ప్రక్రియలను ప్రభుత్వ పరీక్షల విభాగం తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలోకి తీసుకువచ్చింది. దీంతో పాటు విద్యార్థులకు హాల్‌టికెట్లను సైతం ఆన్లైన్లో జారీకి ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలల యాజమాన్యాలకు దీనిపై అవగాహన కల్పించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశముంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఎస్ఏ–1 పరీక్షల హడావుడి నెలకొంది. దీంతోపాటు నామినల్ రోల్స్ సమర్పించేందుకు తుది గడువు ముంచుకొస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల వివరాల నమోదు, నామినల్ రోల్స్ అప్లోడింగ్ పనులు జరుగుతున్నాయి. మార్చి 18 నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు జిల్లాలో 60 వేల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఆన్లైన్ అనుసంధానంతో కొత్త ఒరవడి ప్రస్తుత ఏడాది నుంచి పరీక్ష ఫీజుల చెల్లింపు, నామినల్ రోల్స్ సమర్పించే విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్పు చేశారు. అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ సంఖ్య ఆధారంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన వివరాలను ఆధారంగా చేసుకుని పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో నిక్షిప్తం చేసింది. ఆయా వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం తన వెబ్సైట్లో పొందుపర్చగా, టెన్త్ విద్యార్థుల వివరాలను సైతం ఇదే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంది. దీనిపై ఈనెల 24న గుంటూరులో జరిగిన సదస్సులో ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఆన్లైన్లో పక్కాగా వివరాలు నమోదు ఆన్లైన్ విధానంలో విద్యార్థికి సంబంధించిన సమగ్ర వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. పాఠశాలలకు ఇచ్చిన యూడైజ్ కోడ్, ఎస్సెస్సీ కోడ్ ఆధారంగా ఒక్కో విద్యార్థికి ప్రత్యేక అప్లికేషన్ ఫారం ఆన్లైన్లో పొందుపర్చారు. ఇందులో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సామాజిక వర్గం, నివాస, పుట్టిన తేదీ, పరీక్ష లాంగ్వేజ్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులకు అవే వివరాలతో హాల్ టికెట్లు జారీ చేస్తారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు. ఇప్పటివరకూ ఫీజు చెల్లించని విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశముంది. హెచ్ఎంలు సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా ఫీజు జమ చేసేందుకు తుది గడువు డిసెంబర్ ఒకటి. నామినల్ రోల్స్‌ను డీఈవో కార్యాలయంలో సమర్పించేందుకు తుది గడువు డిసెంబర్ 3. రూ.50 అపరాధ రుసంతో డిసెంబర్ 15, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 24, రూ.500 అపరాధ రుసుంతో కలిపి పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 3 వరకూ అవకాశముంది. జిల్లాలోని పలు ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, ఉన్నా ఫొటోలు, సంతకాన్ని స్కాన్ చేసేందుకు స్కానర్లు లేక హెచ్ఎంలు ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. సందేహాల నివృత్తికి వాట్సాప్ గ్రూపు నామినల్ రోల్స్‌ను ఆన్లైన్లో పంపే విధానంపై హెచ్ఎంలకు ఇప్పటికే అవగాహన కల్పించాం. ఇందుకోసం డీవైఈవోల ద్వారా హెచ్ఎంలను అనుసంధానం చేస్తూ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. హెచ్ఎంలకు ఏమైనా సందేహాలుంటే దాని ద్వారా నివృత్తి చేస్తున్నాం.–ఆర్ఎస్ గంగా భవానీ, డీఈవో -
కొడుకు పరీక్ష కోసం ఓ తండ్రి ఏం చేశాడంటే..?
కోల్‌కతా : ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశిస్తారు. అందుకోసం వారి జీవితాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధమవుతారు. మరికొందరు తాము పొందలేని అవకాశాలు పిల్లలకు కల్పించి వారి భవిషత్తులో ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాంటి కోవకు చెందిన వారే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రజబ్ అలీ. ఆయన కథేంటో ఓసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్‌కు చెందిన అలీ పేదరైతు. వంశపారంపర్యంగా వచ్చిన భూమి తప్ప తనవద్ద ఇంకేమీ లేదు. చిన్ననాటి నుంచి అతనికి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆరుగురు పిల్లలు ఉండటంతో కుటుంబ పోషణ తండ్రికి భారమైంది. అందుకే మూడో తరగతిలోనే డ్రాపౌట్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది. అలా పదేళ్ల వయస్సుకే పొలం పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబంలో ఇంతవరకు ఎవరూ కూడా పదో తరగతి వరకు చదివిన దాఖలాలు లేవు. అందుకే కొడుకు ద్వారా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని అలీ కోరుకుంటున్నాడు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తన కొడుకు షమీమ్ షేక్‌ను దీవించాలంటూ ఏకంగా 700 మందికి విందు ఏర్పాటు చేశాడు. తమ కుటుంబంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న మొదటి వ్యక్తి కనుక తాహతుకు మించిన ఈ పనికి సిద్దపడ్డానని తెలిపాడు. కొన్నాళ్ల కిందట ‘నాకు తారసపడిన కొందరు వ్యక్తులు.. గ్రామస్తుల దీవెనలుంటే మీ కొడుకు తప్పక ఉత్తీర్ణుడవుతాడని చెప్పారు. అందుకే సంవత్సర కాలంగా ఈ విందు కోసం డబ్బు పొదుపు చేస్తున్నా’ని తెలిపాడు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆహ్వాన పత్రిక కూడా అచ్చువేయించి అందరికీ పంచాడు. అతిథులను ఆనందపరిచేందుకు తన స్థోమతకు తగ్గట్టుగా చికెన్, పప్పు, కూరగాయలు, స్వీట్లతో విందు ఏర్పాటు చేశాడు. ఆ అతిథులు కూడా పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలను షమీమ్‌కు కానుకలుగా ఇచ్చారు. కానీ వారిచ్చిన బహుమతుల కన్నా వారి దీవెనలే మహాభాగ్యమని మురిసిపోతున్నాడు అలీ. తన కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఊరంతా స్వీట్లు పంచుతానని చెబుతున్న అలీ వంటి తండ్రిని తామెక్కడా చూడలేదని స్థానిక స్కూల్ టీచర్ సుశాంత చౌదరీతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులకు ‘కోహ్లి’ పరీక్ష
కోల్‌కతా: ప్రపంచ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు పరీక్షగా నిలుస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. తాజాగా విదార్థులకు సైతం 'పరీక్ష'గా నిలిచాడు. ఎప్పుడూ బ్యాట్‌తో మెరిసే విరాట్ కోహ్లి విద్యార్థులకు పరీక్షగా నిలవడమేమిటి అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. కాకపోతే విద్యార్థులకు ఓ ప్రశ్న రూపంలో కోహ్లి ఎదురయ్యాడు. పశ్చిమ బెంగాల్లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కోహ్లి గురించి అడిగారు. అందులో కొంత సమాచారమిచ్చి దాని గురించి వివరిస్తూ రాయమన్నారు. తప్పక సమాధానం రాయల్సిన పది మార్కుల ప్రశ్న అది. ఆ ప్రశ్న కోహ్లి గురించి కావడంతో తొలుత ఆశ్యర్యపడ్డ విద్యార్థులు.. ఆ తర్వాత ఆనందంతో జవాబు రాయడం ప్రారంభించారు. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో విద్యార్థులకు కోహ్లి గురించి పరిచయం అక్కర్లేదు. క్రికెట్ అభిమానించేవారికే కాదు, ప్రతి ఒక్కరికి అతని గురించి తెలుసు. అందుకే పరీక్షలో ఈ ప్రశ్న ఇవ్వడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు కోహ్లి గురించి కొంత సమాచారం ఇచ్చారని, అది ఇవ్వకపోయినా మేము సమాధానం రాసేవారమని కొంత మంది విద్యార్థులు కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇది తమ జీవితంలో చిరకాలం గుర్తిండిపోతుందన్నారు. -
టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈనెల 23
నెల్లూరు (టౌన్): 2018 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లకు రూ.125, విద్యార్థి 3 సబ్జెక్ట్‌లకు రూ.110, 3 సబ్జెక్ట్ పైన రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. వచ్చే నెల 8వ తేదీలోపు అయితే అపరాధ రుసుం రూ.50, 20వ తేదీలోపు రూ.200, జనవరి 4వ తేదీలోపు అయితే అపరాధ రుసుం రూ.500లతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ప్రధానో ఎడ్యుకేషన్ స్పోర్ట్స్, అర్ట్స్, కల్చర్, జనరల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, అదర్ రిసిప్ట్స్ పద్దుల్లో చలానా రూపంలో చెల్లించవచ్చన్నారు. -
దైవం పెట్టిన పరీక్ష
మెట్పల్లి(కోరుట్ల): పదో తరగతి పరీక్షకు సిద్ధమైన ఓ విద్యార్థికి దైవం విషమ ‘పరీక్ష’ పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం దుబ్బాడాకు చెందిన వాల్గొట్ నరేశ్ శనివారం పదో తరగతి ఫిజిక్స్ పరీక్ష రాయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అతడి తండ్రి గుండెపోటుతో మరణించాడు. అటు పది పరీక్ష.. ఇటు తండ్రి మరణం.. ఎటుతేల్చుకోలేక తీవ్ర విషాదంలో మునిగిన నరేష్‌ను నిఖిల్ భరత్ స్కూల్ కరస్పాండెంట్ భృగు మహర్షి ఓదార్చి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అతన్ని పరీక్షకు హాజరయ్యేలా చేశాడు. నరేష్ పరీక్ష రాసి అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
‘టెన్త్’లో 5 నిమిషాల ఆలస్యం.. ఓకే
⇒ ఇంటర్ పరీక్షల్లో మాత్రం నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ⇒ జిల్లా కలెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఐదు నిమిషాల వరకు ఆలస్యాన్ని అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 14 నుంచి మొదలవనున్న ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకే ప్రారంభం కానుండగా.. 9:35 గంటల వరకు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. అదే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాత్రం నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జిల్లాల్లో ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షల ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలివీ.. ► పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కూడా ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. అత్యవసరమైతే బయట బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీసుల ఫోన్‌ను వినియోగించాలి. దానికి సంబంధించి ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌కు ఫోన్ చేశారు, ఎందుకు చేశారు, ఎంత సమయం మాట్లాడారన్న వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి. ► ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించవద్దు. దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి గంట ముందు నుంచే (ఉదయం 8 గంటల నుంచి) హాల్లోకి అనుమతిస్తారని, ముందుగానే రావాలని తెలియజేయాలి. ► పదో తరగతి పరీక్షలకు మాత్రం ఐదు నిమిషాల వరకు ఆలస్యాన్ని అనుమతించవచ్చు. ► పరీక్ష కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేలా చూడాలి. విద్యార్థులకు ఏ రూట్ పాస్ అయినా అనుమతించాలి. ► పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంను అందుబాటులో ఉంచాలి. ప్రథమ చికిత్స కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ► పరీక్షలకు ఆటంకం కల్పించే వారిపై సెక్షన్ 25 ప్రకారం‡ చర్యలుంటాయి. చిట్టీలు అందించినా, పరీక్ష కేంద్రం గోడలు దూకి వచ్చినా, మాల్‌ప్రాక్టీస్‌కు సహకరించినా, మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించినా కేసులు నమోదు చేస్తారు. ► విద్యార్థులు పాఠశాలల యూనిఫారాలు వేసుకురావద్దు. ► పరీక్ష కేంద్రం లొకేటర్ యాప్ వినియోగం ఇంటర్ పరీక్షల్లో విజయవంతమైతే.. వచ్చే ఏడాది నుంచి టెన్త్‌కు కూడా అమలు చేస్తారు. -
ఉగాది రోజున టెన్త్ పరీక్ష తేదీని మారుస్తాం
సాక్షి కథనంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సాధారణ సెలవుల ప్రకటన కంటే ముందుగానే పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు చేసిన నేపథ్యంలో 2017 మార్చి 29న ఉగాది నాడు పదో తరగతి సోషల్ పేపరు-1 పరీక్ష వచ్చిందని, ఆ తేదీని మార్పు చేస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ‘ఉగాది రోజున టెన్త్ సోషల్ పరీక్ష’ శీర్షికన బుధవారం సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన డీఈవోల సదస్సులో కడియం శ్రీహరి ఈ అంశంపై స్పందించారు. 2017 మార్చి 30వ తేదీతో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేలా ఉన్న షెడ్యూలును 31వ తేదీతో పూర్తయ్యేలా మార్పు చేస్తామన్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
రావుకుప్పం/యాదమరి(చిత్తూరు జిల్లా): పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరై తండ్రుల ఆశయాలను నెరవేర్చారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు. యాదమరి మండలం వరదరాజలుపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి ఆదివారం సాయంత్రం మరణించాడు. అతని కుమార్తె చేతన సోమవారం పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరై తండ్రి ఆశయాలను నెరవేర్చింది. అలాగే రావుకుప్పం వుండలం పల్లికుప్పం గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమారుడు కార్తీక్ పదోతరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి సోమవారం హఠాత్తుగా మరణించాడు. కానీ ఈ విషయాన్ని విద్యార్థికి తెలియనీయకుండా అధికారులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. పరీక్ష రాసిన తర్వాత విషయం తెలుసుకున్న కార్తీక్ బోరున విలపించాడు. -
సమస్యలను పరిష్కరించకుంటే టెన్త్ పరీక్షల బహిష్కరణ
పీఆర్టీయూ-టీఎస్ తీర్మానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే మార్చి 21వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను బహిష్కరించాలని పీఆర్టీయూ-టీఎస్ తీర్మానించింది. హైదరాబాద్‌లో ఆదివారం యూనియన్ రాష్ట్ర ప్రథమ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. అధికారులు ఎస్ఎంఎస్ల ద్వారా ఉపాధ్యాయుల హాజరు సమాచారం తెలుసుకోవడాన్ని ఉపసంహరించాలని, వేసవిలో రెండు పూటలా బడులను నిలిపివేయాలని, ఈ సమావేశం డిమాండ్ చేసింది. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని కోరింది. యూనియన్ అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లతో పరీక్ష రాసి పది పాస్...
దేవరుప్పుల: కాళ్లతో టెన్త్ పరీక్ష రాసిన వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి హైస్కూల్‌కు చెందిన దారావత్ స్వామి ఉత్తీర్ణుడయ్యాడు. మండలంలోని దారావత్ తండాకు చెందిన స్వామి పుట్టుకతో అంగవైకల్యం పొందినప్పటికీ అధైర్యపడకుండా కడవెండి ప్రభుత్వ హైస్కూల్లో పదోతరగతి విద్యనభ్యసించాడు. దేవరుప్పుల హైస్కూల్లో టెన్త్ పరీక్ష రాయడానికి అధికారులు అనుకూలమైన పరిస్థితిని కల్పించారు. దీంతో అతడికి వీలైన రీతిలో పరీక్ష రాయించారు. ఫలితాల్లో స్వామి 6.7 జీపీఏతోప్రతిభ కనబర్చాడు. -
దుఃఖం తోనే పది పరీక్షకు
అదిలాబాద్: తండ్రి చనిపోయి పుట్టెడు బాధలో ఉండి కూడా పదో తరగతి విద్యార్థి పరీక్షకు హజరయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం పెద్దపేటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాశ నవేని సుభాష్ స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. సుభాష్ తండ్రి శంకరయ్య అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఈ రోజే విద్యార్థికి ఆంగ్ల పరీక్ష ఉండటంతో అతను దుఃఖంతోనే హాజరయ్యాడు. -
‘ప్రయోగం’.. ప్రశ్నార్థకం
టెన్త్ పరీక్షల షెడ్యూల్ రెడీ. విద్యాసంవత్సరం ఇంచుమించుగా చివరి దశలో ఉంది. కొన్ని నెలల్లో విద్యార్థులు తరగతులు మారిపోతారు. మారందల్లా ఒక్కటే...జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రయోగశాలల తీరు. స్కూళ్లకు మంజూరైన పరికరాలు హాయిగా బీరువాల్లో రెస్ట్ తీసుకుంటున్నాయి. టీచర్లు పాఠాలు పూర్తిచేసినా...ప్రాక్టికల్స్ వద్దకు వచ్చే సరికి ఎప్పటిలా అలవాటైన రీతిలో మమ అనిపించేస్తున్నారు. సైన్స్ అంశాలపై ప్రయోగానుభవం లేకుండానే స్టూడెంట్లు తరగతులు దాటేస్తున్నారు. ఇదీ లేబ్లున్నా ప్రాక్టికల్స్ లేని పాఠాల తీరు. జిల్లాలో 600కు పైగా ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పరిజ్ఞానం లేకుండానే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. పాఠ్యాంశంలో ఫలానా అంశంపై విద్యార్థులకు ప్రయోగం ద్వారా వివరించాలని స్పష్టంగా పేర్కొన్నా...90 శాతం స్కూళ్లలో ఆ పరిస్థితి కరువైంది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ప్రయోగశాలల ద్వారా సైన్స్ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించాల్సి ఉంది. ప్రధానంగా 8,9,10వ తరగతి విద్యార్థులకు వారానికి నాలుగు వం తున జీవ, రసాయన శాస్త్రాల్లో ప్రయోగ శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఆర్‌ఎంఎస్‌ఏ కింద 152 పాఠశాలల్లో ప్రయోగశాలల ఏర్పాటుకు 150 గదులు నిర్మించగా.. వీటిని తరగతి గదులుగా మార్చి ప్రయోగపరికరాలను బీరువాలకే పరిమితం చేశారు. గతంలో ప్రభుత్వం అయిల్చార్ట్లను పంపేది, ప్రస్తుతం బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకుంటుండటంతో ఉపాధ్యాయులు స్థానికంగా దొరికే నాణ్యతలేని చార్ట్‌లతో సరిపెడుతున్నారు. గాలిలో ధ్వని వేగం కనుక్కోవడం, ఎలక్ట్రికల్, మోటర్స్‌కు సంబంధించిన కొన్నింటిపై మాత్రమే అవగాహన క ల్పిస్తున్నారు. హీట్, మెల్ట్ చేయాలంటే గ్యాస్ తప్పనిసరి, కానీ ఆ సిస్టమ్‌ను హైస్కూల్లో ఏర్పాటు కాక రసాయనాల ద్వారా రంగుల మార్పుతో పాటు ఇతర ప్రయోగాలేవీ విద్యార్థులకు తె లుసుకునే వీలు లేకపోతోంది. మైక్రోస్కోప్‌లు, స్ప్రింగ్త్రాసులు వంటివి పని చేయడంలేదు. భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాల్లో మారిన పాఠ్యాంశాల మేరకు కొత్త ప్రయోగ పరికరాలు లేకపోవడంతో పాత పాఠ్యాంశాల్లోని పరికరాలతోనే ప్రయోగ విద్యను తూతూమంత్రంగా బోధిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చాలా పాఠశాలలను పరిశీలించగా చాలా వరకు ప్రయోగాలు నిర్వహించనట్లుగా విద్యార్థుల ద్వారా తెలిసింది. ఒక్కసారి కూడా నిర్వహించలేదు.. రసాయనశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు ఒక్కసారి కూడా చేయించలేదు. కేవలం బౌతికశాస్త్రానికి సంబంధించిన పరికరాలు చూపించారు. దీనితో మాకు సబ్జెక్టు అర్థం కావడం లేదు. ఇప్పటికైన ప్రయోగాలు చేయించాలి. - వసంత,10వతరగతి పోలీసులైన్ ఉన్నత పాఠశాల ప్రత్యేక గది లేదు... ప్రయోగాలకు ప్రత్యేక గది లేదు. లాబ్ పరికరాలు ఉన్నచోటే మాకు తరగతులు బోధిస్తారు ఇప్పటి వరకు రసాయన, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు చేయించలేదు. అప్పుడప్పుడు చార్ట్‌ల ద్వారా మాత్రమే బోధిస్తున్నారు. - విష్ణువర్ధన్, 10వ తరగతి షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాల. ప్రయోగాలు లేవు.. పాఠశాలలో ఎన్నో సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన రసాయనాలే ఉన్నట్లుగా ఉపాధ్యాయులు చెబుతున్నారు. రసాయన శాస్త్ర ప్రయోగాలపై మాకు ఎలాంటి అవగాహన రాలేదు. - శిరీష, షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాల ఆ ఊసేలేదు.. పాఠశాలలో ప్రయోగాల ఊసే లేదు. కేవలం చార్టుల ద్వారా మాత్రమే అప్పుడప్పుడు బోధిస్తున్నారు. ప్రయోగాలు రెగ్యులర్‌గా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు చేయించడం లేదు. - రమాదేవి, పోలీసులైన్ ఉన్నత పాఠశాల ప్రయోగాలు నిర్వహించని వారిపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థులకు ప్రయోగాలు నిర్వహించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. స్కూల్ గ్రాంట్స్‌ను సద్వినియోగం చేసుకోవడం లేదు. చాలా వరకు ప్రధానోపాధ్యాయులు జేబుల్లోకే వెళ్తున్నాయి. ప్రయోగ పరికరాలు దుమ్ముపట్టి పోతున్నాయి. ప్రయోగాలపై అవగాహన కల్పించక పోవడం వల్ల విద్యార్థులు ఇంటర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైన అధికారులు పాఠశాలల్లో ప్రయోగాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. - నరేష్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రత్యేక నిధులు అవసరం.. విద్యార్థులకు ప్రయోగాలు నిర్వహించేందుకు, రసాయానాల, పరికరాల కొనుగోలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ప్రయోగాత్మకంగా బో దన చేయడం ద్వారా ఎక్కువగా గుర్తుంటుంది. సిసిఈ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రయోగాలు నిర్వహించక పోవడం భాధాకరం, చాలా పాఠశాలల్లో తేది అయిపోయిన రసాయానాలు ఉన్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించాలి. లేదా స్కూల్ గ్రాంట్స్‌ను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. - రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రతీ ఉపాధ్యాయుడు ప్రయోగాలు నిర్వహించాలి.. ప్రతి సైన్స్ ఉపాధ్యాయుడు ప్రయోగాలు విద్యార్థులకు చేసి చూపించాలి. చాలా తక్కువ ఖర్చుతో, అసలు ఖర్చు లేకుండా చేసే చిన్న చిన్న ప్రయోగాలను కూడా విద్యార్థులకు బోదించనట్లుగా తెలిసింది. సైన్స్ ఉపాధ్యాయులు ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. - చంద్రమోహన్, డీఈఓ, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్కూళ్ల పరిస్థితి ఇలా... జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో ప్రయోగశాల ప్రత్యేకంగా లేక పోవడం వల్ల టెన్త్ విద్యార్థులు కూర్చునే గదిలోనే ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. పరికరాలు కేవలం బీరువాలకే పరిమితం చేశారు. పోలీసులైన్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారికూడా ప్రయోగాలు చేయించలేదు. కేవలం భౌతిక శాస్త్రానికి సంబంధించిన పరికరాలు మాత్రమే రెండుసార్లు చూపినట్లు తెలిసింది. షాబజార్ ఉన్నత పాఠశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రయోగశాలకు ప్రత్యేకమైన గది లేదు. పరికరాలు బీరువాల్లో దాచి తాళాలు వేశారు. ఏడో తరగతి నిర్వహిస్తున్న గదిలోనే ప్రయోగపరికరాలకు సంబం ధించిన బీరువాలను ఉంచారు. ప్రయోగాలు ఒక్కసారి కూడా నిర్వహించలేదని విద్యార్థులు వెల్లడించారు. మార్కెట్‌రోడ్ ఉన్నత పాఠశాలలోనూ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇక్కడ విద్యార్థులదీ అదే మాట. ఏనుగొండ ఉన్నత పాఠశాలలో సైన్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి అప్పుడప్పుడు బోధిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. మాడల్‌బేసిక్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక గది ఉన్నప్పటికి గత సైన్స్ టీచర్లు దాని జోలికి వెళ్లక పోవడం వల్ల దుమ్ముపట్టి పోయింది. ఇటీవల వచ్చిన ఓ సైన్స్ ఉపాధ్యాయుడు గదిని మూడు రోజుల పాటు శుభ్రం చేయించి ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోనే పాఠశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే మారుమూల ప్రాంతాలలో ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.