‘టెన్త్’లో 5 నిమిషాల ఆలస్యం.. ఓకే
⇒ ఇంటర్ పరీక్షల్లో మాత్రం నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
⇒ జిల్లా కలెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఐదు నిమిషాల వరకు ఆలస్యాన్ని అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 14 నుంచి మొదలవనున్న ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకే ప్రారంభం కానుండగా.. 9:35 గంటల వరకు విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని పేర్కొంది. అదే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాత్రం నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జిల్లాల్లో ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షల ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలివీ..
► పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు కూడా ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. అత్యవసరమైతే బయట బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీసుల ఫోన్‌ను వినియోగించాలి. దానికి సంబంధించి ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌కు ఫోన్ చేశారు, ఎందుకు చేశారు, ఎంత సమయం మాట్లాడారన్న వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
► ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించవద్దు. దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి గంట ముందు నుంచే (ఉదయం 8 గంటల నుంచి) హాల్లోకి అనుమతిస్తారని, ముందుగానే రావాలని తెలియజేయాలి.
► పదో తరగతి పరీక్షలకు మాత్రం ఐదు నిమిషాల వరకు ఆలస్యాన్ని అనుమతించవచ్చు.
► పరీక్ష కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేలా చూడాలి. విద్యార్థులకు ఏ రూట్ పాస్ అయినా అనుమతించాలి.
► పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచాలి. ప్రథమ చికిత్స కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
► పరీక్షలకు ఆటంకం కల్పించే వారిపై సెక్షన్ 25 ప్రకారం‡ చర్యలుంటాయి. చిట్టీలు అందించినా, పరీక్ష కేంద్రం గోడలు దూకి వచ్చినా, మాల్‌ప్రాక్టీస్‌కు సహకరించినా, మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించినా కేసులు నమోదు చేస్తారు.
► విద్యార్థులు పాఠశాలల యూనిఫారాలు వేసుకురావద్దు.
► పరీక్ష కేంద్రం లొకేటర్ యాప్ వినియోగం ఇంటర్ పరీక్షల్లో విజయవంతమైతే.. వచ్చే ఏడాది నుంచి టెన్త్‌కు కూడా అమలు చేస్తారు.