ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రైవేటు డిగ్రీ కాలేజీల పట్టు
మరోసారి యాజమాన్యాల ఆందోళన బాట
ఇంతకుముందే దసరా తర్వాత నాలుగు రోజులు కాలేజీల మూత
వారంలో ఫీజులు చెల్లిస్తామన్న సర్కార్ హామీతో తెరిచిన తీరు
నెలైనా ఇవ్వకపోవడంతో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల బహిష్కరణకు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ..
రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి.
పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు.
బకాయిలు చెల్లించాలి
గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం.
– డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment