Private Colleges Management
-
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హసన్‌పర్తి: హనుమకొండ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఆ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్ తండాకు చెందిన గుగులోతు శ్రీదేవి(16) నగరంలోని డబ్బాల్ జంక్షన్ వద్ద గల ఏకశిలా గర్ల్స్ క్యాంపస్‌లో ఇంటర్ (ఎంపీసీ) ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ నిర్వాహకులకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సదరు విద్యార్థి శ్రీదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే హాస్టల్ గదిలో ఉరివేసుకుందని చెప్పారు.విద్యార్థి సంఘాల ఆందోళన..శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు రాత్రి కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. మృతదేహంతో కాలేజీ ఎదుట బైఠాయించారు. శ్రీదేవి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతిఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000 / 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘దోస్త్’ కటీఫ్!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతమున్న ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్– తెలంగాణ (దోస్త్)’ విధానాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిగ్రీ ప్రవేశాలను పాత విధానంలోనే చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు పూర్తి స్వేచ్ఛ లభించే వీలుంది. ఎవరికి సీటివ్వాలి? ఎవరికి ఇవ్వకూడదనేది కాలేజీలే నిర్ణయించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఉన్నత విద్యామండలి దీనిపై ఇప్పటికే చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకోగా, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీన్ని ఆమోదిస్తే, వచ్చే విద్యా సంవత్సరం (2025–26) నుంచి దోస్త్‌ను ఎత్తివేసినట్టేనని మండలి వర్గాలు చెబుతున్నాయి. ‘దోస్త్’ను కొన్ని కాలేజీలు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి. అవి ఇప్పటికీ దోస్త్ జాబితాలో చేరలేదు. ఆయా కాలేజీల ఒత్తిడి మేరకే దోస్త్‌కు స్వస్తి చెప్పబోతున్నట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. దీనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏమిటీ దోస్త్? రాష్ట్రవ్యాప్తంగా 1,055 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. గతంలో డిగ్రీ సీటు కోసం ప్రతీ కాలేజీలోనూ రుసుం చెల్లించి దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీటు ఎక్కడ వచి్చందో తెలుసుకునేందుకు ప్రతీ కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. సీటు రాకపోతే మరో కౌన్సెలింగ్ పెట్టే వరకూ అన్ని కాలేజీలూ తిరగాలి. విభిన్న కోర్సుల కోసం వివిధ దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల విద్యార్థులు వ్యయ ప్రయాసలకు గురయ్యేవాళ్లు. దీనిపై జాతీయస్థాయిలో విస్తృత చర్చ జరగ్గా, ఆన్లైన్లో ఏకీకృత ప్రవేశాలు ఉండాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2015లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 2016 నుంచి దోస్త్ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థి కూడా ఆన్లైన్లో అన్ని కాలేజీలకు, అన్ని కోర్సులకు దరఖాస్తు చేసే అవకాశం వచి్చంది. ఎక్కడికీ వెళ్లకుండానే సెల్ఫోన్లోనే ఎక్కడ? ఏ కోర్సులో? సీటు వచ్చిందనే సమాచారం వచ్చే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అభ్యంతరాలేంటి? దోస్త్ ద్వారా కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు స్థానికంగా కాకుండా, మెరిట్ ప్రకారం ఎక్కడో సీట్లు వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరడం లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రైవేటు కాలేజీలు దోస్త్‌లో విద్యార్థుల చేత ఆప్షన్లు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో దోస్త్ ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయని, కొన్నిచోట్ల తక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దోస్త్ పేరుతో మండలి ఆధిపత్యం చేస్తోందని, ఫలితంగా కాలేజీలు కొత్త కోర్సులతో విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పాత విధానం వల్ల కాలేజీలపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గుతుందని, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసే అవకాశం వస్తుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. లోపాలుంటే సరిచేయాలి తప్ప, వ్యవస్థనే రద్దు చేయడం ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమేనని చెబుతున్నాయి. అధ్యయనం చేస్తున్నాందోస్త్పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఉండాలంటున్నారు. కొంతమంది ఉపయోగం లేదంటున్నారు. అన్నివైపుల నుంచి పరిశీలన జరుపుతున్నాం. మార్పులు అనివార్యమనిపిస్తే తప్పకుండా చేస్తాం. – ప్రొ. వి.బాలకిష్టారెడ్డి(ఉన్నత విద్యామండలి చైర్మన్) దోస్త్ వల్లే పారదర్శకతసాంకేతికత అభివృద్ధి చెందిన ఈ కాలంలో దోస్త్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా, వ్యయ ప్రయాసలు లేకుండా సీట్లు పొందుతున్నారు. ఇంట్లో కూర్చుని ఖర్చు లేకుండా ఎక్కడైనా సీటు వచ్చే పారదర్శకత దోస్త్ వల్లే సాధ్యం. దీన్ని ఎత్తివేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. – ప్రొ. ఆర్.లింబాద్రి(ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్) కార్పొరేట్ కాలేజీల కొమ్ముగాస్తారా?దోస్త్ వల్లనే ప్రైవేటు కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట పడుతోంది. ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తే గతంలో మాదిరిగా ప్రైవేటు కాలేజీలు దోచుకుంటాయి. పేద వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఇలాంటి చర్యలను ఆమోదించం. అవసరమైతే విద్యార్థి ఉద్యమాలకూ వెనుకాడం. – నాగరాజు(ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)ఆమోదయోగ్యం కాదు దోస్త్‌లో లోపాలుంటే సరిచేయాలి. ఎందుకు మార్పులు చేస్తున్నామో చెప్పాలి. అంతేతప్ప ప్రైవేటు కాలేజీల ఒత్తిడి మేరకు దోస్త్‌ను రద్దు చేస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఇది ఆమోదయోగ్యం కాదు. – చింతకాయల ఝాన్సీ రాణి(ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) -
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ముకుతాడు !
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రవేశాలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక రూ పొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేట్ కాలేజీల పెత్తనాన్ని అడ్డుకోవాల్సిన అవసరముందని, ఇది ఏ విధంగా సాధ్యమనే అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పలువురు ఉన్నతాధికారులతో సీఎం విద్యాశాఖపై శుక్రవారం సమీక్షించారు. సకాలంలో స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాల్సిన అంశాన్ని ప్రస్తావించారు. ఇంటర్ కాలేజీల ఫీజులపై తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందనే విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది. దీనిని కట్టడి చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా వీసీల నియామకం, పలు విద్యాశాఖ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. -
ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం పెరిగిన ఇంటర్ ఫీజులు...‘ఇంటర్’ ద డ్రాగన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ఫీజుల మోత మోగుతోంది. ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. గత ఏడాదితో పోలి స్తే ఏకంగా 40–50% అదనంగా డిమాండ్ చేస్తున్నా యి. ఇటీవలే టెన్త్ పరీక్షలు మొదలైన నేపథ్యంలో.. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్లో చేర్చేందుకు కాలేజీల్లో ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు దోపిడీకి తెరతీశాయి. నిర్వహణ ఖర్చు, బోధన వ్యయం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. కాలేజీలు చెప్తున్న ఫీజుల మొత్తాన్ని చూసి.. తల్లిదండ్రులు హతాశులవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల అడ్డగోలు ఫీజు వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫీజుల కట్టడిపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ప్రస్తుతం తామేమీ చేయలేమని అంటున్నారు. 4 లక్షల మంది విద్యార్థులపై భారం రాష్ట్రంలో ఏటా 4 లక్షల మంది వరకు విద్యార్థులు టెన్త్ పాసవుతున్నారు. గత ఏడాది గణాంకాలను చూస్తే ఇంటర్ ఫస్టియర్‌లో 3,27,202 మంది చేరారు. రాష్ట్రంలో మొత్తం 3,339 ఇంటర్ జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో ప్రైవే టువి 1,441 ఉన్నాయి. వాటిలో 2,02,903 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 2 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లోనే ఉంటారు. వారంతా కాలేజీల యాజ మాన్యాలు చెప్పినంత ఫీజులు కట్టాల్సి న పరిస్థితి. వాస్తవానికి కరోనా మహ మ్మారి ఎఫెక్ట్ తర్వాత కాలేజీలు ఏటా 10– 20% మేర ఫీజులు పెంచుతున్నాయి. ఈసారి గరిష్టంగా 50% వర కూ పెంచాయి. అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. కోవిడ్ సమయంలో కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారని, కొరత కారణంగా ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నాయి. నిర్వహణ భారం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. అఫిలియేషన్ ఫీజు పెంచకున్నా.. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మూడు కేటగిరీల కింద అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇస్తుంది. ప్రతీ విద్యాసంస్థలో గరిష్టంగా 960 మందిని చేర్చుకునేందుకు అనుమతిస్తారు. అఫిలియేషన్ ఫీజు కింద ఏటా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలేజీల నుంచి రూ.1.20 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీల నుంచి రూ.60 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల నుంచి రూ.20వేల చొప్పున వసూలు చేస్తారు. రెండేళ్లకోసారి ఈ ఫీజులను సమీక్షించి పెంచాల్సి ఉన్నా.. ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా పెంచలేదు. 50శాతం దాకా పెంపు.. సాధారణ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది వరకూ గరిష్టంగా రూ.60 వేల ఫీజు ఉంటే.. ఈసారి రూ.90 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు రూ.1.25 లక్షల నుంచి రూ. 2 లక్షలకుపైగా (కాలేజీని బట్టి) డిమాండ్ చేస్తున్నాయని.. అదే హాస్టల్‌నూ కలిపితే ఏకంగా రూ.3.25 లక్షల వరకు చెప్తున్నారని వాపోతున్నారు. కార్పొరేట్ కాలేజీలు ఫీజులు పెంచడాన్ని చూసి.. సాధారణ కాలేజీలు కూడా పెంచుతున్నాయని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలోనూ వార్షిక ఫీజులను రూ.75 వేలకు తక్కువ వసూలు చేయడం లేదని అంటున్నారు. మరోవైపు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కుల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 20శాతం మేర పెరిగాయని.. ప్రైవేటు కాలేజీల రవాణా, ఆటో చార్జీలు కూడా 30శాతం వరకూ పెంచారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంతో ఇంటరీ్మడియట్ విద్య కోసమే రూ.లక్షల్లో వెచి్చంచాల్సి వస్తోందని వాపోతున్నారు. అంత ఫీజు ఎలా కట్టగలం? ఇటీవల టెన్త్ పరీక్షలు రాసిన మా అబ్బాయిని చేరి్పంచాలంటూ ఓ ప్రైవేటు కాలేజీ సిబ్బంది వెంటపడ్డారు. అడ్మిషన్ కోసం వెళ్తే ఏటా రూ.2.25 లక్షల ఫీజు అని చెప్పారు. కావాలంటే ఓ రూ.25 వేలు రాయితీ ఇస్తామన్నారు. అంత ఫీజేమిటని అడిగితే ఈ ఏడాది ఖర్చులు పెరిగాయని, అందుకే ఫీజులు పెంచామని చెప్పారు. రెండేళ్లకు రూ.4 లక్షల ఫీజు ఎలా కట్టగలం. వేరే కాలేజీల్లో ఆరా తీసినా అడ్డగోలుగా పెంచారు. ప్రభుత్వం నియంత్రణ చేపడితే పేదలకు ఊరటగా ఉంటుంది. – సుచిత్ర, ఇంటర్ విద్యార్థి తల్లి, హైదరాబాద్ దోపిడీని నియంత్రించకుంటే ఆందోళన ప్రైవేటు కాలేజీల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సర్కారు నుంచి ఏ విధమైన ఆదేశాలూ లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు భరించలేని విధంగా కాలేజీలు ఫీజులు పెంచుతున్నాయి. తక్షణమే నియంత్రణ చేపట్టాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేట్ ఆగడాలను అడ్డుకోరా? అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవకుండానే ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు చేపట్టడం చట్ట విరుద్ధం. దీనికితోడు పేదలు ఏమాత్రం భరించలేని విధంగా ఫీజులు పెంచడం దుర్మార్గం. పాలక వర్గాలు దీన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీని అడ్డుకోవాలి. – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఫీజుల నియంత్రణ అవసరం కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు పెంచడం వల్ల అన్ని కాలేజీలూ ఆ నింద మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే కాలేజీలను కేటగిరీలుగా విభజించి, ఫీజుల నిర్ణయం చేయాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పేదలకు ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవడానికి ఫీజుల కట్టడి చట్టాలు అవసరం. – గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదులు వస్తున్నాయి.. పరిశీలిస్తున్నాం ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నియంత్రణ కోసం ఏం చేయాలనేది పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డ్ సిద్ధంగా ఉంది. – జయప్రదాబాయి, ఇంటర్ బోర్డ్ సీనియర్ అధికారి -
గురుకులంపై గురి... లేకుంటే ‘ప్రైవేటు’ సరి
సాక్షి, హైదరాబాద్: గురుకులంలో సీటొచ్చిందా... సరేసరి. లేకుంటే ప్రైవేటు కాలేజీనే బెస్ట్ అంటున్నారు ఇంటర్ విద్యార్థులు. 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో చేరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 83,177 మంది చేరగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 98,536 మంది చేరారు. ఇక రాష్ట్రంలోని 1,285 ప్రైవేటు కాలేజీల్లో ఏకంగా 3,11,160 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ లెక్క గమనిస్తే సాధారణ ప్రభుత్వ కాలేజీల కన్నా, గురుకులాల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక హాస్టళ్లు ఉండటం, విద్యాబోధనలో ప్రమాణాలు పాటించడం వల్ల మంచి ఫలితాలొస్తున్నాయని, అందుకే గురుకులాలకు తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్నారని అధికారులు అంటున్నారు. గురుకులాల తర్వాత ప్రైవేటు కళాశాలలవైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది కంటే ఇంటర్ ప్రవేశాలు తక్కువే నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్లో చేరిన వారి సంఖ్య తక్కువే. 2022–23లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 4,98,699 మంది ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్లో చేరారు. అంటే, ఈ సంవత్సరం 5,826 మంది తగ్గిపోయారు. టెన్త్‌లో ఉత్తీర్ణత తగ్గడం దీనికి ఒక కారణమైతే, పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు రావడంతో కొంతమంది అటు వైపు మొగ్గు చూపారు. ఇంటరే కీలకం.. టెన్త్ వరకూ విద్యాభ్యాసం ఎలా ఉన్నా.. ఇంటర్ విద్యను కీలకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ భావిస్తున్నారు. ఇంటర్‌తో పాటే జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని భావిస్తుంటారు. ఈ కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి అకడమిక్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన తర్ఫీదు తీసుకుంటున్నారు. ఇంటి వద్ద నుంచి కాలేజీకి వెళ్లి రావడం వల్ల మంచి ఫలితాలు రావని తల్లిదండ్రులు భావిస్తున్నారు. హాస్టల్ వసతి ఉన్న చోటే పిల్లలను చదివించాలనే ఆలోచన కొన్నేళ్లుగా పెరిగింది. ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు వస్తే సరి... లేకుంటే వ్యయ ప్రయాసలు భరించైనా హాస్టల్ వసతి ఉన్న ప్రైవేటు కాలేజీల్లో చదువు చెప్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 3,178 ఉన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
హిమాయత్‌నగర్: ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రోడ్డుపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికురాలిని వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూసింది. నారాయణగూడ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా, కళ్లెం గ్రామానికి చెందిన సునీత(42) జీహెచ్ఎంసీ సర్కిల్–15లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమెకు భర్త గోవర్దన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త గోవర్దన్ గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా సునీత సీతాఫల్‌మండీలో పిల్లలతో కలిసి ఉంటోంది. సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఆమె బయోమెట్రిక్ అనంతరం రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన ‘ఆయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని రాంకోఠి నుంచి కింగ్‌కోఠి వైపు వెళుతుంది. నాంపల్లి, బజార్‌ఘాట్‌కు చెందిన డ్రైవర్ మహ్మద్ మోమిన్ అతి వేగంగా బస్సు నడుపుతూ పిస్తాహౌజ్ సమీపంలో రోడ్డు శుభ్రం చేస్తున్న సునీతను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె తలకు, చేయి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తోటి కార్మికులు ఆమెను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. నారాయణగూడ పోలీసులు డ్రైవర్ మహ్మద్ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేయర్ దిగ్భ్రాంతి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సునీత మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సునీత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామ ని హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన ఆర్థిక సాయాన్ని తక్షణం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరో పక్క యూనియన్ నాయకులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన చేయూత అందించాలంటూ ఇనిస్టిట్యూట్ యాజమాన్యాన్ని కోరారు. విద్యార్థులకు గాయాలు అతి వేగంగా వచ్చిన బస్సు సునీతను ఢీకొట్టిన అనంతరం చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న విద్యార్థులు ముందు సీట్లకు గుద్దుకోవడంతో గాయాలపాలయ్యారు. తన వల్ల ఓ నిండుప్రాణం బలైన విషయాన్ని కూ డా డ్రైవర్ మహ్మద్ మోమిన్ గుర్తించకపోగా ‘క్యాహువా’ అంటూ సంబోధించడాన్ని చూసిన తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సునీత తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెంద డంతో ఆమె ఉద్యోగాన్ని సునీత చేస్తున్నట్లు తెలిసింది. అతి వేగం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. నారాయణగూడ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందగా, బేగంపేటలో కారు ఢీ కొని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి.. -
‘బి’ గ్యాంగ్ బేరాల జోరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడో దశలో కన్వీనర్ కోటాలో చేరే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. కన్వీనర్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ 70,627 కేటాయించారు. ఇంకా 13,139 సీట్లు ఉన్నాయి. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిపోయే సీట్లను ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లుగా భర్తీ చేయడం సర్వసాధారణం. వాస్తవానికి వీటిని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజులతోనే భర్తీ చేయాలి. కానీ కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులకు ఎక్కువ మొత్తం తీసుకుంటూ సీట్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు యాజమాన్య కోటా సీట్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 33 వేల వరకూ ఉంటాయి. ఇందులో సగం బి కేటగిరీ కింద, మిగతా సగం ఎన్ఆర్ఐ కోటా కింద ఉంటాయి. వీటితో కాసుల పంట పండించుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. రంగంలోకి ఏజెంట్లు, కన్సల్టెన్సీలు ప్రధాన ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు దాదాపు భర్తీ అయ్యాయి. అయితే టాప్ టెన్ కాలేజీలను మినహాయిస్తే మిగతా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. వీటిని ఈ నెలాఖరు వరకూ భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో కాలేజీలు ఏజెంట్లను, కన్సల్టెన్సీలను భారీగా కమీషన్లు ఆశచూపి రంగంలోకి దించుతున్నాయి. ఏజెంట్లు, కన్సల్టెన్సీల ప్రతినిధులు ఎంసెట్ అర్హుల జాబితా ఆధారంగా వారి ఫోన్ నంబర్లు సంపాదించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఏదో రకంగా నమ్మబలుకుతూ తమకు అనుకూలమైన కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సీట్లు అయిపోతున్నాయని, త్వరగా అప్రమత్తం కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వద్దకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నారు. కంప్యూటర్ కోర్సుకు గిరాకీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 56,811 కంప్యూటర్ సైన్స్ సీట్లున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో 19 వేల వరకు సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 53,034 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 3,777 సీట్లు మిగిలిపో యాయి. ఇవన్నీ టాప్‌టెన్ కాని కాలేజీల్లోనే ఉన్నా యి. ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు, కోరు కున్న కాలేజీలో, కోరుకున్న బ్రాంచీలో సీట్లు రాని వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్ని స్తున్నారు. సీఎస్సీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందంటూ కాలేజీల యాజమాన్యాలు, ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. ఒక్కో సీటు రూ.12 నుంచి రూ.16 లక్షలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో రూ.2 లక్షల వరకూ కన్సల్టెన్సీలకు కమీషన్లుగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బి కేటగిరీ సీట్లను ఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుకు, మెరిట్ ప్రకారమే ఇవ్వాలి. ఈ నిబంధన ఎక్కడా పాటించడం లేదని తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉండటంతో అవి మిగిలిపోతున్నాయి. వీటిని కూడా భారీగా డబ్బులు తీసుకుని ఎన్ఆర్ఐ కోటా మాదిరి పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారని, యాజమాన్య కోటా సీట్ల దందా అపాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రైవేటు మాయకు చెక్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను చేర్చుకుని కూడా ఇంటర్ బోర్డ్‌కు ప్రవేశాలు చూపని ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27లోగా ప్రతి విద్యార్థి అడ్మిషన్ వివరాలను పంపేలా జిల్లా ఇంటర్ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ‘ఇంటర్ లెక్కల్లో కాలేజీల మాయ’ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 2లక్షల మంది టెన్త్ పాసయిన విద్యార్థులు ఎక్కడ చేరారు? వారి వివరాలు తెలియజేయాలని ఆమె అధికారు లను కోరారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు చేరినా, వాటి డేటా ఇంటర్ బోర్డ్‌కు చేరలేదనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులతో చర్చించారు. పనులు పూర్తికాకపోతే ఎలా: సబిత రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశా లల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని నవీన్ మిత్తల్‌కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్‌ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారంలోగా పుస్తకాలు అందాలి విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయ డానికి ఆర్టీసీపైనే ఆధారపడకుండా ప్రయివేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదన్నారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వివిధ జిల్లాల ఇంటర్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. డేటా పంపకపోతే విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీకి జరిమానా ఈ నెల 27లోగా ప్రైవేటు కాలేజీల్లో చేరిన విద్యార్థుల డేటా పంపాలని, అలా చేయకుండా తర్వాత పంపితే నెలాఖరు వరకూ ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీపై జరిమానా విధించాలని బోర్డ్ అధికారులకు మిత్తల్ సూచించారు. ఆ గడువు కూడా దాటితే విద్యా ర్థికి రూ. వెయ్యి చొప్పున కాలేజీపై జరిమానా విధించా లని తెలిపారు. ఆఖరి నిమిషం వరకూ వేచి చూసి ఆ తర్వాత సెక్షన్లు పెంచుకోవడం, ఒక క్యాంపస్‌లో ప్రవే శాలు, మరో క్యాంపస్‌లో అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు కాలేజీలపై నిఘా పెట్టాలని, ఇలాంటి చర్యలకు పాల్ప డే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నని, అవసరమైతే సదరు కాలేజీ అనుమతి కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారు లను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశించారు. -
2 లక్షల ర్యాంకు దాటినా.. కన్వినర్ సీటు
సాక్షి, హైదరాబాద్: నీట్ ఫలితాలు వెలువడ్డాయి. ఇక త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎంత ర్యాంకుకు ఎంబీబీఎస్‌లో కన్వినర్ కోటాలో సీటు వస్తుందన్న దానిపై విద్యార్థుల్లో చర్చ జరుగుతోంది. పైగా గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలో 9 కొత్తగా వస్తున్నాయి. అంటే 900 ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరుగుతాయి. గతేడాది లెక్క ప్రకారం చూసినా 2 లక్షల ర్యాంకు దాటినా రిజర్వు కేటగిరీలో సీటు వచ్చే అవకాశముంది. అలాగే అన్ రిజర్వుడు కేటగిరీలోనూ 1.25 లక్షల ర్యాంకుకూ కన్వీనర్ సీటు వచ్చే అవకాశం ఉంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో రెండు లక్షలకుపైగా ర్యాంకులు వచ్చి న వారికి కూడా కన్వినర్ కోటాలో సీ ట్లు వస్తాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చి న వారి కి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు. రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో 2023–24 వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. మంగళవారం ‘నీట్’ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చి ంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి నీట్లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. ‘నీట్’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్రస్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. 15 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కేటాయింపు... ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. -
‘బీ’టెక్ బేరం షురూ!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ ఎక్కువైంది. ప్రైవేటు కాలేజీలు బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఇప్పటికే ద్వారాలు తెరిచాయి. బేరసారాల కోసం ఆయా కాలేజీలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాయి. తల్లిదండ్రులూ ప్రముఖ కాలేజీల వద్ద బారులు తీరుతున్నారు. మధ్యస్థంగా ఉండే కాలేజీలు డిమాండ్ సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కన్సల్టెన్సీలు, పీఆర్వోల ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంసెట్‌లో 50 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు మంచి కాలేజీలో కోరుకున్న సీటు రాదని భావిస్తున్నారు. దీంతో యాజమాన్య కోటాలో సీటు తెచ్చుకునేందుకు ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు ప్రముఖ కాలేజీల్లో రోజూ 20 మంది వరకూ కళాశాల ప్రతినిధులతో బేరసారాలు ఆడుతున్నారు. ఈ కేటగిరీలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉన్నతాధికారులు ఉంటున్నారు. వాస్తవానికి కన్వినర్ కోటా సీట్ల భర్తీ తర్వాతే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఉంటుంది. కానీ కాలేజీలు అనధికారికంగా ముందే బేరం కుదుర్చుకుంటున్నాయి. నిబంధనలకు పాతరేస్తున్నా అధికారులు మాత్రం ఇవేవీ తమ దృష్టికి రావడం లేదని చెబుతున్నారు. రూ.లక్షల్లో బేరం రాష్ట్రంలో దాదాపు 176 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 145 ప్రైవేటు కాలేజీలే. 71 వేల ఇంజనీరింగ్ సీట్లు కన్వినర్ కోటా కింద, 30 వేల సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. ఇందులో సగం సీట్లను జేఈఈ ర్యాంకులు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక రుసుం తీసుకోవాలి. కాకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. మిగిలిన సగం సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు, ఎన్ఆర్ఐలు స్పాన్సర్ చేసే వారికి ఇవ్వాలి. ఈ సీట్లకు ఎక్కువ ఫీజు వసూలు చేయొచ్చు. అందుకే ముందుగానే అనధికారికంగా డొనేషన్ల రూపంలో తీసుకుంటున్నాయి. ఒక్కో సీటుకు రూ. 8 నుంచి 12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఫీజులతో కలిపి రూ.20 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. బేరం కుదిరితే ఇప్పుడే సగం కట్టాలని షరతు పెడుతున్నట్లు సమాచారం. కంప్యూటర్ సైన్స్ హాట్ కేక్ యాజమాన్య కోటా కింద సీట్లు ఆశిస్తున్న విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్, అనుబంధ బ్రాంచ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీలు సీఎస్సీ సీటుకు వార్షిక ఫీజుకు అదనంగా రూ.8–10 లక్షలు అడుగుతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులైతే రూ.12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో కన్వినర్ కోటా కిందే సీట్లు భర్తీ కావడం లేదు. కాబట్టి ఎంసెట్‌లో లక్షల్లో ర్యాంకు వచ్చిన వాళ్లు, క్వాలిఫై కాని వాళ్లే ఈ సీట్లను ఆశిస్తున్నారు. ప్రముఖ కాలేజీలైతే రూ. 2 లక్షల వరకూ అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలి యాజమాన్య కోటా సీట్లయినా నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలి. ఈ విషయంలో మండలి సీరియస్‌గా ఉంది. బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మెరిట్ పద్ధతి పాటించాల్సిందే. అందుకు విరుద్ధంగా డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకున్నట్టు ఫిర్యాదులొస్తే విచారణ జరిపిస్తాం. ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరు కోం. తల్లిదండ్రులు కూడా నోటిఫికేషన్ రాకుండా యాజమాన్య కోటా సీట్లు ఆశించడం సరికాదు. - ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) -
దూకుడు పెంచిన ఇంటర్ బోర్డు.. కాలేజీలపై చర్యలకు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంటర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు దూకుడు పెంచింది. ప్రతి కాలేజీకి సంబంధించిన వ్యవహారాలపై నివేదికలు తెప్పించుకోనుంది. వాటి పరిశీలన బాధ్యతను జిల్లా ఇంటర్ అధికారులకు అప్పగిస్తోంది. పరీక్షలు దగ్గపడుతున్న నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు అప్రమత్తమైనట్లు అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలను అదుపు చేయాలన్నదే అసలు ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ సీరియస్‌గా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి నివేదికలు అందాక కొన్ని కాలేజీలపై వేటు తప్పదని తెలుస్తోంది. విద్యార్థులను వేధించే కాలేజీలపై ఆరా.. రాష్ట్రవ్యాప్తంగా 1,856 ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఉండగా చాలా కాలేజీల్లో బోధన విధానం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్గత పరీక్షల ద్వారా విద్యార్థులను కేటగిరీలుగా చేసి కొన్ని సెక్షన్ల విద్యార్థుల్లో మానసిక ధైర్యం కోల్పోయేలా చేస్తున్నారని తెలుసుకున్నారు. అలాంటి కాలేజీలు అనుసరిస్తున్న విధానాలు ఏమిటనే సమాచారం సేకరిస్తున్నారు. మెరిట్ ఉన్న విద్యార్థులకు ఒక తరహా ఫ్యాకల్టీ, వెనకబడ్డ వారికి నాణ్యత లేని ఫ్యాకల్టీతో బోధన చేస్తున్న కాలేజీలపైనా దృష్టి పెట్టాలని జిల్లా అధికారులు ఆదేశాలు వెళ్లాయి. మార్కులు తక్కువ వస్తున్న విద్యార్థులను మానసికంగా వేధించడం, ఇతర కాలేజీల నుంచి పరీక్షలు రాయించే చర్యలపైనా ఫిర్యాదులున్నాయి. వాటిని పరిశీలించాలని బోర్డు ఆదేశించింది. వాటిపై మరింత దృష్టి.. - అకాడమీల పేరుతో విద్యార్థులను చేర్చుకోవడం బోర్డు నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ కొన్ని కాలేజీలు ఆయా విద్యార్థులను ఇతర కాలేజీల పేరిట పరీక్షలు రాయిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో ఏ కాలేజీ ద్వారా ఏ అకాడమీ విద్యార్థుల చేత పరీక్షలు రాయిస్తున్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. - చాలా ప్రైవేటు కాలేజీలపై గతంలో అవకతవకల ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న అధికారులెవరు? వారికి సహరించిన యాజమాన్యాలు, వ్యక్తులు ఎవరు? ఈ తంతు లో ఎంత మేర ముడుపులు చేతులు మారాయి? అనే వివరాలనూ తెలుసుకుంటున్నారు. - కొన్నేళ్లుగా కొందరు బోర్డు అధికారులు, కొన్ని కాలేజీల యాజమాన్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించిన వారి ప్రమేయం, సాగించిన అవినీతి కార్యకలాపాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి.. విద్యార్థులకు నష్టం కలిగించే కాలేజీలపై కొరడా ఝళిపించాలి. ర్యాంకుల కోసం విద్యార్థులను వేధిస్తున్న, నిబంధనలను అతిక్రమిస్తున్న కాలేజీలపై కఠిన చర్యల విషయంలో బోర్డు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. – గౌరీ సతీశ్ (ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు) అవినీతి అధికారులను తొలగించాలి విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ ర్యాంకులతో ప్రచారం చేసుకుంటున్న కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఆగడాల వెనుక కొందరు బోర్డు అధికారుల ప్రమేయం ఉంది. అవినీతికి పాల్పడుతూ ఆయా సంస్థలను వెనకేసుకొచ్చిన అధికారులను గుర్తించి తొలగించాలి. – మాచర్ల రామకృష్టగౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్) -
Telangana: వేధిస్తే ఉక్కుపాదమే!
ఇక యాజమాన్యాలదే బాధ్యత విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – నవీన్ మిత్తల్, కాలేజీ విద్య కమిషనర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులను వేధింపులకు గురిచేసే ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం హెచ్చరించింది. విద్యార్థుల పట్ల అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించడం, శారీరకంగా హింసించడం వంటివి చేసే లెక్చరర్‌ను రాష్ట్రంలోని ఏ కాలేజీలోనూ బోధించకుండా అనర్హుడిగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్య ఘటనల నేపథ్యంలో.. సోమ వారం ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు గౌరీ సతీశ్‌తోపాటు 14 కాలేజీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోవడానికి కారణాలు, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో నిబంధనల ఉల్లంఘనలు, విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి తదితర అంశాలపై చర్చించారు. వీటిని అదుపు చేయడానికి అనుసరిస్తున్న చర్యలపై కాలేజీల యాజమాన్యాలను అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మళ్లీ ఆత్మహత్య ఘటనలు జరగొద్దు.. సమీక్ష సందర్భంగా ప్రైవేటు కాలేజీల తీరుపై నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని, ఆదేశాలను కాలేజీల ప్రతినిధులకు వివరించారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సాత్విక్ ఘటనే ఆఖరిది కావాలి. ఇది పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని మీరే పరిష్కరించుకుంటారా? లేకపోతే 33 జిల్లాల అధికారులను రంగంలోకి దించాలంటారా? అధికారులు రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది’’ అని నవీన్ మిత్తల్ హెచ్చరించారు. ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా కాలేజీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ చేస్తున్నామంటూ యాజమాన్య ప్రతినిధులు చెప్పడాన్ని మిత్తల్ తోసిపుచ్చారని.. వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని నిలదీశారని తెలిసింది. గీత దాటితే వేటే.. ప్రైవేటు కాలేజీలకు నిబంధనల ఉల్లంఘన అలవాటుగా మారిందని.. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారి బోధన వేరేచోట ఉండటం ఏమిటని నవీన్ మిత్తల్ ప్రశ్నించారు. ఇక మీద ఇలా చేస్తే ట్రెస్పాస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాల్సిందేనని, కాలేజీల్లో బోధించే అధ్యాపకుల నాణ్యత ఏమిటో దీనితో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు పనీపాటా లేకుండా సమావేశాలు పెడుతుందనే భ్రమల నుంచి కార్పొరేట్ కాలేజీలు బయటపడాలని.. ఇక మీద ఎప్పుడు మీటింగ్‌కు పిలిచినా కాలేజీల ప్రిన్సిపాళ్లు మాత్రమే సమావేశానికి రావాలని తేల్చిచెప్పారు. విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రైవేటు కాలేజీలు ఇస్తున్న ప్రకటనలపైనా ఇక నుంచి పరిశీలన ఉంటుందని తెలిపారు. ర్యాంకు వచ్చిన విద్యార్థిని మూడు చోట్ల చూపించి గొప్పలు చెప్పుకునే విధానాలకు స్వస్తి పలికేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. చైతన్య గుర్తింపు రద్దు: నవీన్ మిత్తల్ కాలేజీల ప్రతినిధులతో సమావేశం అనంతరం నవీన్ మిత్తల్ ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన శ్రీచైతన్య నార్సింగి బ్రాంచి అనుబంధ గుర్తింపు రద్దు చేస్తున్నామని.. దీనిపై మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. విద్యార్థులను దూషించే, హింసించే లెక్చరర్లపై కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని.. తమ దృష్టికి వస్తే సదరు లెక్చరర్లను డీబార్ చేస్తామని చెప్పారు. స్టడీ అవర్స్ పేరిట వేధించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. మనోవేదనతో ఉన్న విద్యార్థులను ముందే గుర్తించి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని కాలేజీలకు సూచించామన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, క్రీడలను ప్రోత్సహించేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేటు కాలేజీల ఆగడాలను ఇక మీదట ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. గ్రేడింగ్ విధానంపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. అరెస్ట్ చేయకుండా చర్చలా?: పీడీఎస్‌యూ కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కాలేజీల యాజమాన్యాలను అరెస్ట్ చేయకుండా, చర్చలు ఎలా జరుపుతారని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. సోమవారం కాలేజీల యాజమాన్యాలతో భేటీ జరిగిన ఎంసీఆర్హెచ్ఆర్డీ వద్ద నిరసనకు దిగారు. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. -
ప్రైవేటు పీహెచ్‌డీలకు రెడ్ కార్పెట్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల నుంచి పీహెచ్డీ చేసేందుకు అనుమతించడం వివాదాస్పదమవుతోంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అధ్యాపక వర్గం అంటోంది. ఈ విధానం వల్ల పీహెచ్‌డీల నాణ్యతే దెబ్బతింటుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్జనలో అత్యున్నత స్థాయి డిగ్రీ అయిన పీహెచ్డీ (పరిశోధన)ని యూనివర్శిటీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేసేందుకు అనుమతిస్తూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ పీహెచ్డీ కేవలం యూనివర్శిటీల పరిధిలోనే జరుగుతోంది. వర్శిటీ నేతృత్వంలోని ఫ్యాకల్టీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీల్లో గత కొన్నేళ్ళుగా అధ్యాపకుల నియామకం జరగడం లేదు. దీంతో గైడ్‌గా ఉండే అధ్యాపకులకు కొరత ఏర్పడింది. పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవరోధంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం రీసెర్చ్‌కు అవసరమైన అన్ని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతిమంగా పీహెచ్‌డీలు ఇచ్చేది యూనివర్శిటీయేనని అంటున్నారు. అయితే, వర్శిటీ పట్టాలిచ్చే ఓ కర్మాగారంగా ప్రేక్షక పాత్ర పోషించే వీలుందని నిపుణులు సందేహిస్తున్నారు. నాణ్యత ఉంటుందా...? అఫ్లియేషన్ ఉన్న ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చేయడం వల్ల నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టిని ఎంపిక చేయడం లేదని నిపుణులు అంటున్నారు. కాలేజీల్లో ఒక్కో విభాగానికి ప్రొఫెసర్లను అర్హులైన వాళ్ళనే నియమించాల్సి ఉన్నా... నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని చెబుతున్నారు. పీహెచ్‌డీల వ్యవహారంలోనూ ఇదే జరిగే వీలుందని, అర్హతలేని గైడ్ల చేత పీహెచ్డీ పర్యవేక్షణ చేయించే వీలుందనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి పీహెచ్డీ పూర్తయ్యే వరకూ అధ్యాపకుడు అదే కాలేజీలో పనిచేయాలనే నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని కాలేజీలు అధ్యాపకులను తమ కాలేజీలోనే ఉండాలని వేధించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే వేతనాలు సకాలంలో ఇవ్వకపోయినా కాలేజీ యాజమాన్యాలను అడిగే దిక్కు ఉండటం లేదని వాపోతున్నారు. నిపుణులైన గైడ్స్ దీనివల్ల పైవేటు కాలేజీల్లో పనిచేసేందుకు మొగ్గు చూపకపోవచ్చనే విమర్శలొస్తున్నాయి. పీహెచ్‌డీకి గైడ్‌గా ఉండే వ్యక్తికి పీహెచ్డీ పూర్తయి.. ఏవైనా జనరల్స్‌లో మూడు ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలి. అయితే, యూనివర్శిటీలు పూర్తి అనుభవం ఉన్న వాళ్ళతోనే పీహెచ్డీ మార్గదర్శకత్వం ఇప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగిస్తే ఈ తరహా నాణ్యత ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాణ్యత దెబ్బతింటుంది ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు అనుమతిస్తే నాణ్యత దెబ్బతింటుంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. విద్యార్థి పీహెచ్డీ అయ్యే వరకూ అధ్యాపకులు అదే కాలేజీలో ఉండాలనే నిబంధన కూడా అన్యాయమే. దీనివల్ల ఫ్యాకల్టితో కాలేజీల యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటాయి. జేఎన్టీయూహెచ్ ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. – డాక్టర్ వి బాలకృష్ణా రెడ్డి టెక్నికల్, ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అర్హత ఉన్న వారికే అవకాశం గత ఏడాది రీసెర్చ్ కేంద్రాలున్న కాలేజీలను గుర్తించాం. అదే కాలేజీలో అర్హులైన వారిని ఎంపిక చేసి పీహెచ్డీ చేసే విద్యార్థిని సూపర్ వైజ్ చేసే బాధ్యత అప్పగిస్తాం. అంతిమంగా పీహెచ్డీ ఇచ్చేది యూనివర్శిటీనే. ఇది యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం కాదు. – ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి వీసీ, జేఎన్టీయూహెచ్ -
ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, న్యాయశాస్త్రం, వ్యాయామ విద్య, ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాలకు ఆయా కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంత కాలం కేవలం ఓయూ కాలేజీలకే పరిమితమైన పీహెచ్డీ కోర్సు కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుతో ఇక నుంచి ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా కొనసాగనుంది. రీసెర్చ్ సెంటర్ల అనుమతికి ఆన్లైన్ దరఖాస్తులకు ఈనెల 10 వరకు అవకాశం కలి్పంచారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వలన క్యాంపస్, అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ సీటు ఒక్కటి కూడా లేదు. దీంతో ఐదేళ్లుగా పీహెచ్డీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. వర్సిటీ అభివృద్ధికి చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిశోధనల కోసం పీహెచ్డీ ప్రవేశాలకు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లభించినందున ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా పీహెచ్డీ కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. ఓయూ పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గైడ్íÙప్ అర్హత గల ఇద్దరు అధ్యాపకులు ఉన్న కాలేజీలకు రీసెర్చ్ సెంటర్‌కు అనుమతి ఇవ్వనున్నారు. ఓయూ ద్వారానే పీహెచ్డీ ప్రవేశాలు, పరీక్షలు: రిజి్రస్టార్ రీసెర్చ్ సెంటర్లకు అనుమతి లభించిన ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ ప్రవేశాలతో పాటు ప్రీ పీహెచ్డీ పరీక్షలు, వైవా (సెమినార్) ఓయూ చేపడుతుందని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్ కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్డీ ఫీజులు కూడా ప్రైవేట్, అటానమస్ కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్‌లో హాస్టల్ వసతి ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. -
ఏపీ: ప్రైవేటు కాలేజీలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్ఐవో(రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు. -
తెలంగాణ: కాలేజీలకు తాళం!
నల్లగొండ జిల్లా మునుగోడులో పదేళ్లకు పైబడి కొనసాగిన ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ సొసైటీ మార్పునకు దరఖాస్తు చేసుకుంది. విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలతో కళాశాల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రస్తుత సొసైటీ తప్పుకుంటూ హైదరాబాద్‌లోని మరో సొసైటీకి అప్పగించనుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ కాలేజీ ఇకపై హైదరాబాద్‌లో కొనసాగనుంది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలు త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఓ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సైతం సొసైటీ మార్పునకు దరఖాస్తు చేసుకున్నాయి. జూనియర్ కాలేజీని మల్కాజ్గిరి జిల్లాకు చెందిన సొసైటీ పేరిట మార్పునకు దరఖాస్తు సమర్పించగా, డిగ్రీ కాలేజీని హైదరాబాద్ జిల్లాలోని మరో సొసైటీ పేరిట మార్చేందుకు అర్జీ పెట్టుకుంది. మార్పు చేయించుకునే సొసైటీలు ఇప్పటికే పలు కళాశాలలను నిర్వహిస్తుండటంతో ప్రక్రియ వేగవంతంగా పూర్తికానుంది. సాక్షి, హైదరాబాద్: నిర్వహణభారంతో సతమతమవుతున్న గ్రామీణ ప్రాంత కాలేజీలను వదిలించుకునే దిశగా యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి మొదలైన తర్వాత ఈ విద్యాసంస్థల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఒకవైపు అడ్మిషన్లు కొనసాగుతున్నా విద్యార్థుల నుంచి ఫీజులు పెద్దగా రాకపోవడం, మరోవైపు ప్రభుత్వం కూడా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో ఆ కాలేజీలు ఆర్థికంగా చితికిపోయాయి. అనుబంధ గుర్తింపునకు పదిశాతం దూరం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న 2,400 ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య తాజాగా 1,680కు పడిపోయింది. ప్రతి ఏటా సగటున 50 నుంచి 100 జూనియర్ కాలేజీలు మూతపడుతున్నట్లు తెలుస్తోంది. 2021–22 విద్యాసంవత్సరంలో కేవలం 1,520 కాలేజీలు మాత్రమే అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. పదిశాతం కాలేజీలు ఇప్పటికీ అనుబంధ గుర్తింపు కోసం ఫీజు చెల్లించకపోవడం గమనార్హం. బకాయిల భారం... 201–20 ఆర్థిక సంవత్సరం నుంచి సగానికిపైగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ముప్పావువంతు కాలేజీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌తో మూతపడ్డ కాలేజీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ఈ విద్యాసంవత్సరం కూడా ఇంకా ఆన్లైన్ తరగతులకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలను నిర్వహించడానికి బదులు తప్పుకోవడమే ఉత్తమమనే ఆలోచనతో పలువురు ఇతర సొసైటీల చేతుల్లో పెడుతున్నారు. ప్రస్తుతం సొసైటీ మార్పు కోసం దాదాపు 42 కాలేజీలకు సంబంధించిన ఫైళ్లు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రోత్సహించకుంటే కష్టం.... ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య ఎక్కువ. గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు దొరక్క ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. సేవా దృక్పథంతోనే కొనసాగుతున్న గ్రామీణ కాలేజీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ కాలేజీలు మూతపడితే గ్రామీణ విద్యార్థులు పదో తరగతికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. కోర్సు ఫీజులను కూడా కాస్త పెంచి యాజమాన్యాలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. –గౌరిసతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం మూతపడితే కాలేజీ విద్యకు నోచుకోరు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఏటా పెద్ద సంఖ్యలో మూతపడుతున్నాయి. విద్యార్థుల నుంచి తీసుకునే ఫీజుల కంటే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీలు సైతం నామమాత్రపు ఫీజులు తీసుకుంటున్నాయి. అవి కూడా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడుతున్నాయి. ఇలాంటప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసే చర్యలు తీసుకోవాలి. –ఎం.దుర్గేశ్వర్‌రెడ్డి, టీపీజేఎంఏ, ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా -
డిగ్రీ ప్రవేశాలకు ‘45%’ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనతో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. వీరంతా ఇంటర్లో పాసైనా ప్రయోజనం లేకుండాపోతోంది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, లా వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా కనీస పాస్ మార్కులు 35 శాతం ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. గతేడాది రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు నిర్వహించినా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించలేదు. అలాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది వేల మంది విద్యార్థులు నష్టపోగా, ఈసారి కూడా అదే ప్రమాదం పొంచి ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేస్తున్నప్పుడు కనీస మార్కులైన 45 శాతం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 45% కావాలంటున్న ప్రైవేటు సంస్థలు ఇంటర్ తరువాత చదివే న్యాయ, వ్యవసాయ, వైద్య,, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే కనీసం 45 శాతం మార్కులు ఉండాలని దాదాపుగా అన్ని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఆ నిబంధన తొలగించినా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం కొనసాగిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షలు రాసేందుకు, ఐఐటీల్లో చేరేందుకు 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కరోనా కారణంగా తొలగిస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు అందుకు ఒప్పుకోవడం లేదు. చివరకు రాష్ట్రంలోనూ ఎంసెట్ విషయంలో సమస్య తప్పలేదు. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మినహాయింపునిచ్చారు. కానీ న్యాయ, ఇతరత్రా వృత్తి విద్యా కోర్సుల్లో ఆ మినహాయింపు అమలు కాలేదు. దీంతో కనీస పాస్ మార్కులైన 35 శాతంతో ఉత్తీర్ణులైన ఓపెన్ ఇంటర్ విద్యార్థులు, రెగ్యులర్ ఇంటర్మీడియట్లో 45 శాతం లోపు మార్కులు కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారు. ఇలా ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 30 వేల మంది, రెగ్యులర్ ఇంటర్మీడియట్లో మరో 15 వేల మంది నష్టపోవాల్సి వచ్చింది. మళ్లీ మొదలైన ఆందోళన.. ఈసారి ఇంటరీ్మడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. సెకండియర్ పరీక్షలు వాయిదా వేసింది. ఫస్టియర్ వారిని ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినా ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కరోనా వచ్చే రెండు మూడు నెలల్లో అదుపులోకి రాకపోతే ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదు. అలాంటపుడు వారికి కనీస పాస్మార్కులే 35 శాతం ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 1.47 లక్షల మందిని, గతేడాది వార్షిక పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నా, పరీక్షలకు హాజరు కాని 27 వేల మందిని 35 శాతం మార్కులతోనే పాస్ చేసింది. ఈసారి కూడా 4.5 లక్షల మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను, మరో 30 వేల మంది వరకు ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు 35 శాతం మార్కులే ఇచ్చి పాస్ చేసే పరిస్థితి. అలా చేస్తే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. సెకండియర్‌లో కష్టపడాల్సిందే ఈసారి ఇంటర్మీడియట్ విద్యారి్థకి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 45 శాతం మార్కులు ఉండాలంటే ఆ విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 55 శాతానికి పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా విద్యార్థులకు కనీస మార్కులైన 45 శాతం మార్కులు లభిస్తాయి. ఆ మేరకు రాకపోతే వచ్చే విద్యా సంవత్సరంలోనూ (2022–23) ప్రవేశాలకు విద్యార్థులు అనర్హులయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వారు రాష్ట్రంలో లక్షన్నర మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంటర్ ఒక సంవత్సరమే కావడంతో ద్వితీయ సంవత్సరంలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా వీరికి లేదు. దీంతో అందరికీ 45 శాతం మార్కులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 45 శాతం ఇస్తే చివరి విద్యార్థి వరకు మేలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనందున విద్యార్థులందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కులను బోర్డు కేటాయించింది. ఓపెన్ ఇంటర్ వారికి 35 శాతం మార్కులను ఇచ్చింది. దీనితో ఇతర రాష్ట్రాల్లో చేరాలనుకున్న విద్యార్థులకు నష్టం తప్పదు. ఇప్పుడు ప్రమోట్ చేసిన విద్యార్థులకు 45 శాతం ఇస్తే భవిష్యత్తులో వారికి నష్టం ఉండదు. 35 శాతంతో ఎలాగూ పాస్ చేస్తున్నప్పుడు 45 శాతం ఇస్తే పోయేదేమీ లేదు. పైగా విద్యార్థులందరికీ మేలు జరుగుతుంది. – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు ఇంటర్ మార్కులు, డిగ్రీ ప్రవేశాలు, తెలంగాణ, ప్రైవేటు కాలేజీలు -
కార్పొ‘రేటు’.. 'తల్లిదండ్రులకు పోటు'
నవీన్‌చంద్ అనే విద్యార్థి విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో 2019–20లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో చేరాడు. హాస్టల్, కాలేజీ ఫీజులన్నీ కలిపి రూ.1.70 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు సెకండియర్‌కు వచ్చేసరికి ఆ ఫీజు రూ.2 లక్షలకు పెరిగింది. వంశీకృష్ణ విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి. గత ఏడాది ఫస్టియర్ ఫీజు రూ.1.80 లక్షలు. ఈ ఏడాది సెకండియర్‌లో అది కాస్తా 2.30 లక్షలకు పెరిగింది. లైబ్రరీ, ల్యాబ్, బుక్స్ కోసం అదనంగా డబ్బు వసూలు చేశారు. హాస్టల్లో ఉండే వారికి దోబీ చార్జీల కింద రూ.7 వేల వరకు వీటికి అదనం. కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవనప్పుడు ఇంతలా ఫీజులు అన్యాయం అని తల్లిదండ్రులు అడిగితే, నచ్చితేనే మీ పిల్లాడిని ఉంచండి.. లేదంటే తీసుకుపోండి.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు తగ్గించమని చెప్పింది కదా.. అంటే మాకు హెడ్డాఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు కనుక పూర్తి ఫీజు కట్టాల్సిందేనంటూ కాలేజీల సిబ్బంది సమాధానమిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల తీరు విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు.. ఇలా ఎక్కడ చూసినా ఈ కాలేజీల వ్యవహారం ఇదే రీతిలో ఉంది. ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలోని పరిస్థితులపై చేపట్టిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ విభాగానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నందున గత ఏడాది ఫీజులను 30 శాతం మేర తగ్గించి, మిగతా మొత్తం మాత్రమే ఈ ఏడాది వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలు దీన్ని అమలు చేయడం లేదని కమిషన్ సభ్యుల పరిశీలనలో తేలింది. ఫీజులు తగ్గించకపోగా కొన్ని కాలేజీలు గత ఏడాది కన్నా భారీగా పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్ని ఫీజులు పెంచి ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు డ్రామాలకు తెర తీశాయి. కొన్ని ఏడాదికి కొంత మంది నుంచి 1.50 లక్షలు తీసుకొంటే, మరికొంత మంది నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయ శారదా రెడ్డి వెల్లడించారు. వసూళ్లకు లెక్కాపత్రాల్లేవు ► ఆయా కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు ఎక్కడా లెక్క పత్రాలు, ఫీజుల వివరాలు, అకౌంట్సు బుక్స్ ఆ విద్యా సంస్థల్లో ఉండడం లేదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా, ఆ ఫీజులో దేనికెంత అనే వివరాలు లేవు. ► ఆయా సంస్థల్లో పరిశీలనకు వెళ్తున్న కమిషన్ బృందాలు ఫీజులు, ఇతర వివరాల రికార్డుల గురించి అడిగితే అవన్నీ సెంట్రల్ ఆఫీసులో ఉంటాయని, కేవలం తాము అకడమిక్ వ్యవహారాలే చూస్తామంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కమిషన్ బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడు అకౌంట్సు సిబ్బందిని అందుబాటులో లేకుండా చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఫీజుల లెక్కలు చూపకుండా తప్పించుకుంటున్నాయి. ► కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవలేదు. పాఠాల బోధన లేనేలేదు. నిర్వహణ ఖర్చులు కూడా చాలా తగ్గాయి. అయినా సరే కాలేజీలు గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతుల కోసం ప్రతి విద్యార్థికి నెలకు రూ.10 వేలు ఖర్చంటూ లెక్క చెబుతున్నాయి. ఈ ఏడాదిలో సెకండియర్లోకి వచ్చిన విద్యార్థుల ఫీజులను భారీగా పెంచాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగడం, విద్యార్థులను తీసుకుపొమ్మని చెబుతుండడంతో పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందేమోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోంది. ల్యాబ్‌లు, లేబ్రరీలు లేకున్నా అదనపు ఫీజులు ► ఇటీవల కమిషన్ బృందాలు వరుసగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాయి. కాలేజీల్లో లైబ్రరీ, ల్యాబ్ వంటి వసతులు లేకపోయినా వాటి పేరిట అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ► హాస్టళ్లలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. అయినా హాస్టల్ విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. గతంలో ఒక్కో గదిలో ఆరుగురు విద్యార్థులను ఉంచే వారమని, ఇప్పుడు ముగ్గురు లేదా నలుగురినే ఉంచుతున్నందున అదనంగా కొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ► హాస్టళ్లలో పిల్లలకు సరైన సదుపాయాలు కూడా లేవని కమిషన్ తనిఖీల్లో బయట పడింది. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో వాటిని తినలేక వారు నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క కరోనాతో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్లోని పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రుద్దుడే.. ► కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలతో విద్యార్థుల చదువులు తాపీగా సాగాయి. కాలేజీలు, హాస్టళ్లను తెరచిన యాజమాన్యాలు సిలబస్‌ను పూర్తి చేసేందుకు తొందర తొందరగా బోధన సాగిస్తున్నాయి. పిల్లలకు అర్థమవుతోందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. ► ఉదయం ఏడు గంటల నుంచి తరగతులు ప్రారంభించి.. రాత్రి 9 గంటల వరకు పాఠాలు చెబుతున్నారని, లంచ్ ఇతర విరామ సమయాలు కొద్ది నిముషాలు కూడా ఉండడం లేదని విద్యార్థులు కమిషన్ సభ్యుల దృష్టికి తెచ్చారు. స్టడీ అవర్‌లో కనీసం మూత్ర విసర్జనకూ అనుమతించడం లేదని విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కరోనా సమయంలో కార్పొరేట్ కాలేజీలు అనేక మంది సిబ్బందిని తొలగించాయి. వారికి వేతనాలు కూడా చెల్లించలేదు. గత్యంతరం లేక వారంతా వేర్వేరు ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ఇప్పుడు కాలేజీలు తెరచినా వారెవ్వరూ తిరిగి రాక యాజమాన్యాలు అరకొర సిబ్బందితోనే నడిపిస్తున్నాయి. ► పలు కాలేజీల్లో సరైన బోధనా సిబ్బంది కూడా లేరు. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కాకుండా, వారు రూపొందించిన మెటీరియల్‌తో బోధన సాగిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా వారికి ఆటపాటలు కూడా ఉండాలని ప్రభుత్వం సూచించినా ఏ ఒక్క యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. ► 30 మంది పట్టే తరగతి గదిలో ఏకంగా 80 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న దృశ్యాలు అన్ని కార్పొరేట్ కాలేజీల్లో మామూలైపోయింది. దీంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. -
ప్రిన్సిపాల్ టు టిఫిన్ సెంటర్
పైన ఫొటోలో దోశ వేస్తూ కనిపిస్తున్నది చిట్టిమళ్ల చిరంజీవి. ఈయనది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం గ్రామం. భార్య, ఇద్దరు కుమార్తెలు, అమ్మా, నాన్నలు ఉన్నారు. ఆలుమగల సంపాదన మీదే కుటుంబం నడిచేది. భార్యాభర్తలు స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేసేవారు. చిరంజీవి ఎంఎస్సీ, బీఈడీ చేశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ఉన్నత తరగతులకు గణితం బోధించేవారు. ఆయనకు, భార్యకు కలిపి యాజ మాన్యం రూ.25 వేల వేతనం ఇచ్చేది. కుటుంబం హాయిగా గడిచేది. కరోనాతో పాఠశాలలు మూతపడి ఆర్థిక పరి స్థితులు తలకిందులయ్యాయి.కొందరు మిత్రుల సలహాతో టిఫిన్ సెంటర్ పెట్టాడు. చిరంజీవిని ‘సాక్షి’ పలకరించగా.. ‘నాతో పాటు కుటుంబసభ్యులు టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండటంతో రోజుకు ఖర్చులుపోను రూ.1,000 నుంచి 1,500 వరకు మిగులుతున్నాయి’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి, నెట్వర్క్ : పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే గురువులు వారు. సమాజంలో హోదా, గౌరవం. పది మంది చేతులెత్తి దండం పెట్టేవారు. ‘సారూ.. బాగున్నారా’ అంటూ అత్మీయ పలకరింపులు. పిల్లల చదువులపై ఆరాలు. పొద్దున లేస్తూనే బడి ధ్యాస. పాఠాలు, హోంవర్కులు... రోజంతా పిల్లలతో హడావుడి. అకస్మాత్తుగా కరోనా వచ్చిపడింది. 10 నెలలుగా బడులు మూతపడ్డాయి. ప్రైవేటు మాస్టార్ల బతుకులు ఆగమయ్యాయి. జీతాలు ల్లేవు. జీవితాలు గడవాలి. కుటుంబాన్ని పోషించాలి. అక్షరాలు దిద్దించిన చేతులే అట్లు వేస్తున్నాయి. కరెంటు పని, మగ్గం నేత... ఏ పని వస్తే అది చేస్తున్నాయి. పట్ట ణాల్లో అద్దె భారమైంది. సొంతూళ్లకు వెళ్లిపోయారు. పొలంలోకి దిగారు. కూలి పనులకు వెళుతున్నారు. గురువులకు కరోనా నేర్పిన జీవిత‘పాఠం’ ఇది. భారంగా బతుకుబండిని లాగుతున్న ప్రైవేటు ఉపాధ్యాయుల ‘గోస’ ఇది.. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన మద్ది వెంకటేశ్వర్లుతోపాటు అతని భార్య ఇద్దరూ స్థానికంగా ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవారు. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. వీరికి పనులు లేకుండా పోయాయి. వెంకటేశ్వర్లు గతంలో నేర్చుకున్న ఎలక్ట్రీషియన్ పనిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు రోజుకు 400 నుంచి రూ. 500 వరకు సంపాదిస్తున్నారు. ‘గతంలో మా ఇద్దరికి కలిపి రూ.20 వేలు వస్తుండేవి.. ఇప్పుడు అందులో సగం వచ్చినా.. సంసారం సాఫీగానే నడుస్తోంది’ అని వెంకటేశ్వర్లు ఒకింత ధైర్యంగా చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన శ్రీనివాస్... లెక్కల మాస్టారు. 6 నెలల క్రితం ఎంతో గౌరవంగా బతికారు. పిల్లలకు లెక్కలు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారన్న పేరుంది. కానీ కరోనా తలకిందులు చేసింది. ఇప్పుడు మండల కేంద్రంలో దొరికే కూరగాయలు, ఇతర వస్తువులను తీసుకువచ్చి చిన్నగదిలో అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ‘అటు పాఠశాల యాజమాన్యం.. ఇటు ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలల టీచర్లను పట్టించుకోవడం లేదు. అయినా బతకాలంటే ఏదో పనిచేయాలి.. అందుకే కూరగాయలు అమ్ముతున్నా’అని శ్రీనివాస్ తెలిపారు. ఇన్నాళ్లు ‘నమస్తే సార్’అనే పిలుపుకు అలవాటుపడ్డ చెవులవి. ఇప్పుడా సంబోధన లేదు. మరో పిలుపు. పర్వాలేదు... కుటుంబ నావను నడిపించడంలో అవేమీ అడ్డుకావు అని సర్దుకుపోతున్నారు. సొంతకాళ్లపై నిలబడ్డామనే సంతృప్తి ఒకవైపు... గుండెను మెలిపెడుతున్న గత తాలూకు జ్ఞాపకాలు మరోవైపు. కోవిడ్–19తో లాక్డౌన్ కారణంగా గత ఏడాది మార్చిలో అన్ని విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. ఇక..ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో.. అందరినీ పక్కన పెట్టాయి. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని సాకాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే. కొందరు గతంలో నేర్చుకున్న వృత్తులపై దృష్టి పెట్టగా, మరికొందరు సొంతూళ్లకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొందరు కిరాణ, టిఫిన్ సెంటర్లు, పాలకేంద్రాలు తదితర వ్యాపారాలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. కరోనా గురువుల జీవితాల్లో ఎలాంటి కల్లోలం రేపింది.. ప్రత్యామ్నాయ ఉపాధిలో ఎలా ముందుకెళ్తున్నారు.. కుటుంబ నావను ఎలా నడిపిస్తున్నారనే అంశాలపై ‘సాక్షి’దృష్టి సారించింది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు ఉపాధ్యాయులు, లెక్చరర్లను పలకరించి అందిస్తున్న ‘గ్రౌండ్ రిపోర్ట్’ఇది... – సాక్షి నెట్వర్క్ మగ్గం పనిచేస్తూ.. ఉపాధి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నానచర్ల రమేష్ ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో మార్చిలో పాఠశాలను మూసివేశారు. ఇంతవరకు తెరుచుకోలేదు. ఆన్లైన్ తరగతులు కూడా నడవని పరిస్థితి. పాఠశాల యాజమాన్యం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కుటుంబం గడవడం కోసం సుమారు రూ.లక్ష వరకు అప్పు చేశారు. పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అతను ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన ఇంటి పక్కన ఉన్న పద్మశాలి ఇంట్లో మగ్గం పని నేర్చుకున్నాడు. అప్పట్లో నేర్చుకున్న మగ్గం పని ఇప్పుడు అక్కరకు వచ్చింది. స్థానికంగా ఉన్న నేతన్న దగ్గర పనికి కుదిరాడు. నెలకు రూ.17 వేల దాకా ఆదాయం వస్తోంది. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ‘సుమారు 10 నెలల నుంచి పాఠశాలలు తెరవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అలా అని కుంగిపోలేదు. అప్పడు నేర్చుకున్న పని ఇప్పుడు అక్కరకు వచ్చింది’అని రమేష్ చెప్పారు. వాయిద్యాలతోనే పూట గడుస్తోంది ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ టీచర్లు. ఒకరు గంగారపు రాజయ్య, మరొకరు కాసగోని వెంకటేశ్వర్లు. రాజయ్య వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని సిలోయమ్ స్కూల్లో పీఈటీగా పని చేస్తూ వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషించేవారు. కాసగోని వెంకటేశ్వర్లు సైతం హన్మకొండ సమీపంలోని చింతగట్టు క్యాంపులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి వేయడంతో వీరికి జీవనోపాధి ఇబ్బందిగా మారింది. దీంతో వీరు కూలి పనులతో పాటు గ్రామాల్లో జరిగే శుభకార్యాలలో వాయిద్యాలు వాయిస్తూ వచ్చే డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. చేపలు అమ్ముతున్నా.. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. బీఎడ్ చేశాను. పదేళ్లు స్థానిక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాను. మా ఇంట్లో నలుగురు సభ్యులం. కుటుంబపోషణ భారం నాదే. కరోనా వల్ల కళాశాలలు తెరిచే పరిస్థితి లేనందున కుటుంబ పోషణ కోసం చేపలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నా. ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా... అందుకే ధైర్యంగా చేపలు విక్రయిస్తూ ముందుకు సాగుతున్నాను. కళాశాలలు పునఃప్రారంభమైతే మళ్లీ లెక్చరర్‌గా పని చేస్తా. – సాయికుమార్, నిజామాబాద్ పొలం లీజుకు తీసుకున్న.. వ్యాయామ వృత్తి విద్య పూర్తి చేశాను. కరీంనగర్‌లోని సిద్ధార్థ పాఠశాలలో పీఈటీగా పనిచేశాను. కరోనా ప్రభావంతో స్కూల్ జీవితం ముగిసినట్లయ్యింది. మా సొంతూరు చిమ్మనపల్లి గ్రామం.. సిరికొండ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. కరీంనగర్లో రూం కిరాయి కట్టలేక ఖాళీ చేసి సొంతూరికి వచ్చేశాను. ఇక్కడ మాకున్న రెండెకరాల పొలంలో పనిచేసుకుంటున్నాను. ఇంకా పక్క వారి మూడు ఎకరాలు లీజుకు తీసుకుని అందులో కూడా పొలం చేస్తున్నాను. స్కూల్ లైఫ్‌లో పొలం పని చేసేవాడిని కాను. చివరకు పెద్దల నుంచి వచ్చిన భూమి నాకు జీవనోపాధి అయింది. స్కూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను తప్ప అందరినీ ఆదుకుంది. ఇప్పటికైనా మాకు నిరుద్యోగ భృతి చెల్లించాలి.– బి.రఘుపతి, ప్రైవేటు పీఈటీ, రాజన్న సిరిసిల్ల జిల్లా. మాస్కులు, టాయ్స్, సానిటైజర్స్ అమ్ముతున్నా నేను కరీంనగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు టీచింగ్ ఫీల్డ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. కరోనా వైరస్ వచ్చి అందరినీ అతలాకుతలం చేస్తుందని ఊహించలేదు. స్కూళ్లు మూతపడి... జీవనోపాధి కరువై ప్రైవేటు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఆర్థిక స్థోమత లేక... ఏం చేయాలో అర్థం కాకా చివరికి మాస్క్‌లు, టాయ్స్, సానిటైజర్స్, కర్చీఫ్స్ అమ్ముతూ బతుకుబండిని లాగిస్తున్నా. జగిత్యాల రోడ్ రేకుర్తి శివారులో చిన్న గుడిసెలో పెట్టి అమ్ముతున్నాను. ప్రైవేటు ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకోండి లేదంటే పాఠశాలలు తెరవండి అని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నా. – ఎస్.సతీష్, కరీంనగర్ కిరాణం కొట్టులో పనికి కుదిరి.. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన శిరీష స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నెలకు రూ.6 వేల వేతనంతో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. జీతాలు ఇవ్వలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో ఓ కిరాణ కొట్టులో పనికి కుదిరింది. ‘ఇప్పటికైతే బాగానే ఉంది. పాఠాలు చెప్పడంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. పాఠశాలలు తెరుచుకుంటే తిరిగి టీచర్‌గా వెళ్తాను. లేదంటే ఇక్కడే పనిచేస్తాను’ అని శిరీష తెలిపింది. -
ప్రైవేట్ వైద్య విద్యార్థులకు ఊరట..
సాక్షి, అమరావతి: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద వైద్యవిద్య అభ్యసించే ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఇందుకు సంబంధించిన ఫీజులు తగ్గిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా కోర్సుల ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేటు, మైనార్టీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకూ ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తుండగా, ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తాజాగా నిర్ణయించిన ఫీజులు 2020–21 నుంచి 2022–23 వరకూ అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. కాగా, మొత్తం 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేటు కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్ చెల్లించాలన్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..) సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.15 లక్షలు రాష్ట్రంలో ఐదు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా ఉన్నాయి. అవి జీఎస్ఎల్, కాటూరి, నారాయణ, ఎన్ఆర్ఐ, పిన్నమనేని సిద్ధార్థ కాలేజీలు. వీటిల్లో ట్యూషన్ ఫీజు రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు కూడా మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండ్రోజుల్లో నోటిఫికేషన్ ఫీజుల నిర్ణయం జరిగింది. ఇక అడ్మిషన్లకు రెండు మూడ్రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. అడ్మిషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లూ చేశాం. అత్యంత పారదర్శకంగా అడ్మిషన్లు జరుగుతాయి. – డా.శ్యాంప్రసాద్, వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులు రద్దు
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండా కొనసాగుతుండటం, ఎలాంటి ప్రవేశాలు లేకుండానే నిర్వహిస్తుండటం, ప్రవేశాలు చేపట్టినా చేరికలు 25% కన్నా తక్కువగా ఉండటం వంటి కారణాలతో 246 ప్రయివేట్ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి షోకాజ్ నోటీసులు జారీచేసింది. వీటిపై విచారణ కమిటీని నియమించిన మండలి ఆ షోకాజ్ నోటీసులకు నిర్ణీత డాక్యుమెంట్లతో కమిటీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కొన్ని కాలేజీలు కమిటీ ముందు హాజరై సమాధానాన్ని తెలియజేయగా, మరికొన్ని విచారణకు హాజరుకాలేదు. కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు 61 డిగ్రీ కాలేజీల్లోని కొన్ని ప్రోగ్రామ్‌లను ఉన్నత విద్యామండలి ఉపసంహరించింది. -
ప్రైవేట్ కాలేజీల్లోనూ పక్కాగా రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: ఇంటర్, డిగ్రీ కోర్సులు నిర్వహించే ప్రైవేట్ కాలేజీల్లోనూ రిజర్వేషన్ల ప్రకారమే పేద విద్యార్థులకు సీట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇష్టారాజ్యంగా ప్రవేశాలు కల్పిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల మాయాజాలానికి ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా అడ్డుకట్ట పడనుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లకు శ్రీకారం చుడుతుండడంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కాగా అమలు కానుంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఇప్పటికే జీవో 34 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేయనున్నారు. బోర్డు వెబ్సైట్లో అడ్మిషన్ల వివరాలు.. ఇంటర్ కాలేజీలకు అనుమతులతో సహా ప్రవేశాలను ఆన్లైన్లోనే నిర్వహించేలా బోర్డు సన్నాహాలు పూర్తిచేసింది. ఆన్లైన్ ప్రవేశాల విధి విధానాలను సోమవారం రాత్రి వెబ్సైట్లో పొందుపరిచింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఆన్లైన్లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. రిజర్వేషన్ల వారీగా సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. స్టూడెంట్ లాగిన్ ద్వారా వివరాలను పూరించి ప్రాధాన్యత క్రమంలో ఐదు కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. సీటు లభించిన కాలేజీ వివరాలను సూచిస్తూ వెబ్సైట్లోనే అలాట్మెంట్ లెటర్ వస్తుంది. నిర్ణీత ఫీజు చెల్లించి కాలేజీలో చేరవచ్చు. ఇక సెక్షన్‌కు 40 మంది మాత్రమే.. ఇన్నాళ్లూ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను పట్టించుకోకుండా ప్రైవేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు నిర్వహిస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం ఇక సెక్షన్‌కు 40 మందిని మాత్రమే చేర్చుకోవాలి. పక్కాగా రిజర్వేషన్లు.. తాజా నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా అందులో బీసీ ‘ఏ’ 7 శాతం, బీసీ ‘బీ’ 10 శాతం, బీసీ ‘సీ’ 1 శాతం, బీసీ ‘డి’ 7 శాతం, బీసీ ‘ఈ’ విద్యార్థులకు 4 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులకు 3 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33 శాతం సీట్లు బాలికలకు కేటాయించాలి. ఇంటర్ బోర్డు ఆన్లైన్లో ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో నిబంధనల ప్రకారం ఆయా వర్గాల విద్యార్థులకు సీట్లు దక్కనున్నాయి. -
డిగ్రీ అక్రమ ప్ర‘వేషాలు’
‘కరీంనగర్ పట్టణ ప్రైవేటు కళాశాల నిర్వాహకులు పట్టణంలోని పాతబజార్ ప్రాంతానికి చెందిన ఇంటర్ పాసైన ఒక విద్యార్థిని ఇంటికి వెళ్లారు. వారి కళాశాలలో ప్రవేశం తీసుకుంటే వారు ఇస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఆమ్మాయి ఫోన్‌నంబర్ తీసుకొని వెళ్లారు. ఇదే పద్ధతిలో నగరానికి చెందిన మరో రెండుకళాశాల వారు రవాణా ఉచితమని, ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని కేవలం ఇన్కమ్ సర్టిఫికెట్‌తోపాటు సర్టిఫికెట్లు ఇస్తే తామే చూసుకుంటామని చెప్పారు. కోర్సు పూర్తయ్యే వరకు నాదే బాధ్యతని కళాశాల అధ్యాపకుడు హామీ కూడా ఇచ్చాడు. ఆఫర్లు విన్న విద్యార్థిని, తల్లిదండ్రులు సర్టిఫికెట్లు ఇచ్చేశారు.’ ఇది ఈ ఒక్క అమ్మాయి విషయం కాదు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని చాలావరకు కళాశాలలు ప్రవేశాల సమయంలో పాటిస్తున్న పద్ధతి. సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు ఇటీవల ప్రకటన వెలువడడంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. ప్రభుత్వం పారదర్శకంగా డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలనే లక్ష్యానికి పలు కళాశాలలు తూట్లు పొడుస్తూ అక్రమంగా అడ్డదారిలో ప్రవేశాలుపొందే పనిలో నిమగ్నమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని తమ కళాశాలల్లో నింపుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. నగదు, బహుమతులు వంటి విద్యార్థులకు ఆఫర్ చేస్తూ ప్రవేశాల పారదర్శకతకు మసి పూస్తున్నాయి. కమిషన్ విధానంలో పీఆర్వోలను, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు సిబ్బందిని సీట్లు నింపే ప్రక్రియలో ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే చాలు శాతవాహన యూనివర్సిటీలో 90 ప్రైవేటు కళాశాలలుండగా ఇందులో 36410 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ప్రవేశాల కారణంగా వివిధ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మధ్య తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ నెలకొంది. పలు కళాశాలలు అయితే సీట్లు ఖాళీ ఉంచుకునే బదులు కొంతనైనా లాభపడవచ్చనే ధోరణితో ఆదాయ ధ్రువపత్రం తీసుకొస్తేచాలు అంతా మేమే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. మరికొందరు కళాశాలకు వచ్చే విద్యార్థులకు బస్సుల ద్వారా రవాణా ఉచితమని, ఇంకొందరు నగదు, సెల్ఫోన్లు, వివిధ రకాల బహుమతులతో ప్రలోభపెడుతూ అడ్మిషన్లు ‘కొని’తెచ్చుకుంటున్నారు. అడ్మిషన్ తీసుకునే వరకూ ఒకమాట చివరగా పరీక్షల సమయంలో హాల్‌టికెట్ ఇచ్చేందుకు నానా తిప్పలు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి కళాశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టిపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫ్రీగా ఇస్తున్నారని జాయిన్ కావొద్దు కళాశాలలు ఫ్రీగా ప్రవేశాలిస్తున్నాయని వెళ్తే తర్వాత నాణ్యత ప్రమాణాలు లేక భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని గుర్తించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆలోచించి మంచి నాణ్యత ప్రమాణాలు ఉన్న కళాశాలల్లో చేర్పిస్తేనే బంగారు భవిష్యుత్ ఉంటుందని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా కళాశాలలో ప్రవేశాలు తీసుకునేముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను సంప్రదించి అందులోని సదుపాయాలు, విద్యాప్రమాణాలు లోతుగా తెలుసుకొని ప్రవేశాలు పొందితే మంచి భవిష్యత్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. -
కార్పొరేట్ కాలేజీల దోపిడీ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఇంకా అనుబంధ గుర్తింపును ప్రకటించకున్నా కార్పొరేట్ కాలేజీలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకున్నాయి. కరోనా వైరస్ తాకిడి వల్ల ఓవైపు మిగతా విద్యాసంస్థలన్నీ మూతబడి ఉన్నా ఈ కాలేజీలు మాత్రం అప్పుడే ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేల చొప్పున అడ్వాన్స్‌లు వసూలు చేసి మరీ ఆన్లైన్ తరగతులు ప్రారంభించేశాయి. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సాధారణ జూనియర్ కాలేజీలు ఏం చేయాలో అర్థంకాక ఆందోళనలో పడ్డాయి. కార్పొరేట్ కాలేజీల దెబ్బతో తమ కాలేజీల్లో ప్రవేశాలపై ప్రభావం పడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్టులో మొదలు కావాల్సి ఉన్నా... రాష్ట్రంలో 2,558 జూనియర్ కాలేజీలుండగా వాటిలో 1,583 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అందులో హాస్టల్ వసతిగల కార్పొరేట్ కాలేజీలు 570 వరకు ఉన్నాయి. వాటిల్లోనే ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ కాలేజీలే ముందస్తుగా ప్రవేశాలను చేపట్టి తరగతులను ప్రారంభించేశాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కావాలి. ద్వితీయ సంవత్సర తరగతులు కొనసాగాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తరగతుల ప్రారంభం వాయిదా పడింది. మరోవైపు జూలై 20 వరకు అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత అనుబంధ గుర్తింపు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అంటే ఆగస్టులోనే ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయినా కార్పొరేట్ కాలేజీలు అప్పుడే ఆన్లైన్ తరగతులను ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుబంధ గుర్తింపుపై స్పష్టత రాకున్నా.. రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రమాదం పొంచి ఉంది. గతేడాది ఇంటర్ బోర్డు నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న 68 కాలేజీలను హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ కాలేజీలు వేరే భవనాల్లోకి వెళ్తేనే వాటికి అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వాటిల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే కొత్తగా ఏ కాలేజీకి అనుబంధ గుర్తిం పు వస్తుందో, ఏయే కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కార్పొరేట్ కాలేజీలు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలను చేపట్టి తల్లిదండ్రుల నుంచి ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్న ఇంటర్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాయితీల పేరిట టెస్టులు.. రాయితీల పేరుతోనూ కార్పొరేట్ కాలేజీలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నా యి. తమ కాలేజీలో చేరేందుకు, ఫీజు రాయితీ పొందేందుకు ముందుగా రూ. 10 వేలు చెల్లించాల్సిందేననన్న నిబంధనను విధించి తల్లిదండ్రుల నుంచి డబ్బు దండుకుంటున్నాయి. కరోనా కారణంగా ఈసారి టెన్త్ విద్యార్థులందరినీ ప్రభుత్వం పరీక్షల్లేకుండానే పాస్ చేయగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం తాము పెట్టే టెస్టులో టాప్ మార్కులు వచ్చిన వారికి ఫీజులో రాయితీ ఇస్తామంటూ పరీక్షలను నిర్వహిస్తున్నా యి. ఇటీవల నిజాంపేటలో ఓ కార్పొరేట్ కాలేజీ అడ్మిషన్ టెస్టు పెట్టగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అయినా టెస్టు ల పరంపర కొనసాగుతూనే ఉంది. కఠిన చర్యలు తీసుకోవాలి... ఇంటర్ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. అయినా కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాయి. భారీగా డబ్బు గుంజుతున్నా 4 వేల మంది అధ్యాపకులను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించాయి. ఈ చర్యలకు పాల్పడిన కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు