గురుకులంపై గురి... లేకుంటే ‘ప్రైవేటు’ సరి | Students are more inclined to join Gurukuls | Sakshi
Sakshi News home page

గురుకులంపై గురి... లేకుంటే ‘ప్రైవేటు’ సరి

Published Fri, Sep 8 2023 3:23 AM | Last Updated on Thu, Sep 14 2023 9:08 PM

Students are more inclined to join Gurukuls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకులంలో సీటొచ్చిందా... సరేసరి. లేకుంటే ప్రైవేటు కాలేజీనే బెస్ట్‌ అంటున్నారు ఇంటర్‌ విద్యార్థులు. 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 83,177 మంది చేరగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మోడల్‌ స్కూల్స్, కస్తూర్బా బాలికల విద్యా­లయాల్లో 98,536 మంది చేరారు. ఇక రాష్ట్రంలోని 1,285 ప్రైవేటు కాలేజీల్లో ఏకంగా 3,11,160 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు తీసుకున్నారు.

ఈ లెక్క గమనిస్తే సాధారణ ప్రభుత్వ కాలేజీల కన్నా, గురుకులాల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక హాస్టళ్లు ఉండటం, విద్యాబోధనలో ప్రమాణాలు పాటించడం వల్ల మంచి ఫలి­తా­లొస్తున్నాయని, అందుకే గురుకులాలకు తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్నారని అధికారులు అంటున్నారు. గురుకులాల తర్వాత ప్రైవేటు కళాశాలలవైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. 

గతేడాది కంటే ఇంటర్‌ ప్రవేశాలు తక్కువే 
నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్‌లో చేరిన వారి సంఖ్య తక్కువే. 2022–23లో రాష్ట్ర­వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 4,98,699 మంది ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థు­లు ఇంటర్‌లో చేరారు. అంటే, ఈ సంవత్సరం 5,826 మంది తగ్గిపోయారు. టెన్త్‌లో ఉత్తీర్ణత తగ్గడం దీనికి ఒక కారణమైతే, పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు రావడంతో కొంతమంది అటు వైపు మొగ్గు చూపారు. 

ఇంటరే కీలకం.. 
టెన్త్‌ వరకూ విద్యాభ్యాసం ఎలా ఉన్నా.. ఇంటర్‌ విద్యను కీలకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ భావిస్తున్నారు. ఇంటర్‌తో పాటే జేఈఈ, నీట్, ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని భావిస్తుంటారు. ఈ కారణంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచి అకడమిక్‌ విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన తర్ఫీదు తీసుకుంటున్నారు.

ఇంటి వద్ద నుంచి కాలేజీకి వెళ్లి రావడం వల్ల మంచి ఫలితాలు రావని తల్లిదండ్రులు భావిస్తున్నారు. హాస్టల్‌ వసతి ఉన్న చోటే పిల్లలను చదివించాలనే ఆలోచన కొన్నేళ్లుగా పెరిగింది. ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు వస్తే సరి... లేకుంటే వ్యయ ప్రయాసలు భరించైనా హాస్టల్‌ వసతి ఉన్న ప్రైవేటు కాలేజీల్లో చదువు చెప్పిం­చేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 3,178 ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement