ఆస్ట్రేలియా దేశం నుంచి వికసించిన భాషాకమలం తటవర్తి గురుకులంలో మరో అద్భుతమైన అవధానం జూమ్ మాధ్యమంలో జరిగింది. ఇందులో పలు దేశాల నుంచి తెలుగు పండితులు, భాషాభిమానులు, అవధానులు పాల్గొన్నారు. తటవర్తి గురుకులం వ్యవస్థాపకులు సద్గురువులు, అవధాని తటవర్తి కల్యాణచక్రవర్తి గారు తమ గురుకులం నుంచి పద్య కవులకు అవధానులకు శిక్షణనిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు.
తటవర్తి గురుకులం విద్యార్ధి కుమారి అహల్య 13 ఏళ్ళ వయసులోనే తెలుగు సాహితి ప్రక్రియ అయిన అష్టావధానం దిగ్విజయంగా పూర్తి చేసి, చిన్నారి మహిళా అవధానిగా అవతరించారు. గొప్ప కవులకు, పండితులకు సైతం కష్టసాధ్యమైన అష్టావధానం ప్రక్రియలో , 8 మంది ప్రాశ్నికులు / పృచ్చకులు అడిగే ప్రశ్నలకు, అక్కడికక్కడే పద్యాల రూపంలో ఆశువుగా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
ఇటువంటి విశేషాన్ని చిన్నారి అహల్య 13 ఏళ్ళ వయసులోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఇదే గురుకులం నుండి కొన్ని వారాల క్రితం అక్టోబరు 12 విజయదశమి సందర్భంగా మరో చిన్నారి సంకీర్త్ వింజమూరి కూడా అష్టావధానం పూర్తి చేసి, పండితుల ప్రశంసలు అందుకున్నారు. చిన్నారి సంకీర్త్కి కూడ 13 ఏళ్ళు కావడం గమనార్హం. ఇద్దరు చిన్నారులు ఇంగ్లీషు మీడియంలో 8వ తరగతి చదువుతున్నారు.
విదేశాల్లో ఉంటూ తెలుగు మాట్లాడటం, చదవటమే గొప్ప అనుకునే రోజుల్లో, ఆస్ట్రేలియా తెలుగు భాష సేవకోసం గురుకులం స్థాపించి, స్వయానా తాము 120 కి పైగా అష్టావధానాలు చేసిన గురువు గారు కల్యాణ చక్రవర్తి గారు, గోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన వారు. ఈయన వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వివిధ దేశాల్లో విద్యార్థులకు, ఔత్సాహికులకు పద్య రచనలో మెళకువలు నేర్పుతూ, తెలుగు వారికే సొంతమైన పద్య రూపకాన్ని సుసంపన్నం చేస్తున్నారు.
ఆయన అవధానార్చన పేరుతో తెలుగు రాష్ట్రాల్లో జీర్ణ స్థితిలో ఉన్న ఆలయాలకు అంకితం ఇస్తూ , అష్టావధానాలు చేస్తున్నారు, అలాగే ఆయా ఆలయాలకు ఆర్థికంగా వీలైనంత సహాయం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 120కి పైగా అష్టావధానాలు పూర్తిచేశారు. ఆస్ట్రేలియాలో ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా అనేక పురాణ ప్రవచనాలు, భాష్యాలు చెప్తూ , తెలుగు సాహిత్యం, భక్తి ఆధ్యాత్మిక రంగాల్లో తటవర్తి గురుకులం, గురువులు తటవర్తి కల్యాణ చక్రవర్తి గారు తమదైన రీతిలో సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
పద్య రచన, పద్య కల్ప ద్రుమమ్ ( రాసిన ఒక్కో పద్యానికి ఒక్కో చెట్టు నాటడం) అనే కార్యక్రమం, ఆన్‌లైన్లో అవధాన పరిచయ కోర్సులు నడుపుతూ తెలుగు భాష కు మరింత జీవం పోస్తున్నారు. వీరి గురుకులంలో పద్యాలు వ్రాయడం నేర్చుకున్న కవులు , ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మొదటి తెలుగు పద్య శతకాలు రచించి చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా , యూకే, న్యూజీలాండు, సింగపూరు, దుబాయ్ ఇలా అనేక దేశాల నుంచి తొలి పద్య శతకాలు వీరి గురుకులం కవుల నుంచి వెలువడ్డాయి.
(చదవండి: లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ 5కే వాక్‌థాన్‌కు మంచి స్పందన)
Comments
Please login to add a commentAdd a comment