avadhanam
-
దిగ్విజయంగా తొలి అంతర్జాతీయ "స్వరరాగ శతావధానం"
స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ తొలి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తైంది. "వీధి అరుఁగు, నార్వే", "యస్ యస్ మ్యూజిక్ అకాడెమీ - ఇంటర్నేషనల్" సంస్థలు సంయుక్తంగా ఒక అపూర్వ అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాల వేదికపై నిర్విరామంగా ఏప్రిల్ 14నుంచి -ఏప్రిల్ 22వ తేదీ వరకు 17 దేశాల నుంచి సంగీతజ్ఞులు108 మంది పృచ్ఛకులతో, 15 మంది సమన్వయకర్తలతో నిర్వహించిన కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. అవధాని గరికిపాటి వెంకట ప్రభాకర్, అవధాన ప్రక్రియలో భాగంగా సంగీతజ్ఞులైన పృచ్ఛకులు శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు అతి స్వల్పవ్యవధిలో ఒకసారి రాగ వర్ణనతో, మరోసారి నిషిద్ధస్వర విన్యాసంతో, ఒకతూరి రాగమాలికల కూర్పులతో, స్వరాక్షరాలతో, ఒకపరి రాగ తాళరసమార్పుల కూర్పులతో బదులిస్తూ, అప్రస్తుత ప్రసంగ ప్రభంజనాన్నిఅలవోకగా అడ్డుకుంటూ, మహాఅద్భుతంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి సమనవ్యకర్తగా ఖతార్‌నుంచి విక్రమ్ సుఖవాసి వ్యవహరించగా ముఖ్య అతిథులుగా తెలుగు భాషాసేవకులు, భాషాకోవిదులు కీ.శే. సముద్రాల లక్ష్మణయ్య గారి కుమారులు సముద్రాల విజయానంద్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డా. విజయ్ భాస్కర్ దీర్ఘాశి గారు, తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జయ్ తాళ్లూరి గారు, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెం రాజు తానా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర గారు, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు రత్నకుమార్, తదితరప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీధిఅరుఁగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల గారు ఇలాంటి కార్యక్రమాలు ముందు తరాల వారికి ఒక నిఘంటువుగా ఉంటాయన్నారు. ఆయన కృషికి గౌరవ డాక్టరేట్ రావాలని అభిలషించారు. విజయోత్సవ సభలో అవధానకర్తతోపాటు, మిగిలిన అందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించారు. అంతర్జాతీయంగా మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ శతావధానం కార్యక్రమాన్ని వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పొందుపరిచి అంగీకార పత్రాన్ని అందజేశారు. గురుదేవులు అందరికీ శుభం కలగాలని, ప్రతి ఒక్కరికీ శుభాశీస్సులు అందించటంతో ఈ 4 రోజుల అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం మహాద్భుతంగా పూర్తయినది. -
ఆస్ట్రేలియాలో అవధానార్చన
తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం, సమయస్ఫూర్తి, ధారణ ఏక కాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్యప్రక్రియ తెలుగు భాషా వైభవానికి నిత్యసాక్ష్యం. తటవర్తి గురుకులం ద్వారా వివిధ దేశాల పృచ్ఛకులతో అంతర్జాలంలో జరుగుతున్న అవధానార్చన ఈ ఏడాది ఇప్పటిదాకా 55 అవధానాలను పూర్తి చేసుకుని, 56వ అష్టావధానం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరం వేదికగా భాషాభిమానుల నడుమ డిసెంబరు మూడున ప్రత్యక్షంగా జరుగుతోంది. తెలుగుభాషను తమ సామాజిక భాషలలో ఒకటిగా గుర్తించిన ఆస్ట్రేలియాలో, తెలుగు భాషాభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూ, పద్యరచనను నేర్పి నూతన పద్య కవులను తయారుచేస్తూ అవధానార్చనలు నిర్వహిస్తోంది తటవర్తి గురుకులం. ఈ కార్యక్రమం భారతదేశంలో ఆలయాల అభివృద్ధికి అంకితం చేస్తూ ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి నిర్వహిస్తున్నారు. అవధాని, పృచ్ఛకులు, సంచాలకులు అందరూ మెల్బోర్న్ వారే అవ్వడం, అందులోనూ చంటిపిల్లల తల్లులు కూడా పృచ్ఛకులుగా వస్తూ తమ భాషాభిమానాన్ని తెలుగు వైభవాన్ని చాటడానికి పూనుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమానికి సంచాలకులుగా, ఆస్ట్రేలియాలో ప్రముఖ పద్యకవి డా.వేణుగోపాల్ రాజుపాలెం వ్యవహరిస్తున్నారు. పృచ్ఛకాంశాలైన సమస్యాపూరణం యామిని చతుర్వేదుల , దత్తపది మనోజ్ మోగంటి , వర్ణన అమరేందర్ అత్తాపురం , నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం, న్యస్తాక్షరి రాజశేఖర్ రావి, ఆశువు రంజిత ఓగిరాల, చిత్రానికి పద్యం అర్చన విస్సావజ్ఝుల , అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహిస్తున్నారు. ఈ అవధానార్చనను ఆంధ్రప్రదేశ్ కొవ్వూరులో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంకితంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ATAI వారు సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా తెలుగు సాహిత్యానికి నూతన సొబగులద్దేందుకు సిద్ధమౌతున్నఈ విశిష్ట అవధానార్చన, ప్రవాసతీరాలలో తెలుగుభాషా వికాసానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిద్దాం. -
Narala Rama Reddy: అవధాన ఉద్దండుడు
సాక్షి, ప్రొద్దుటూరు : ఆయన అవధానంలో పాండిత్య ప్రదర్శన ఉండదు. అందమైన కవిత్వం ఉంటుంది. సాహిత్యంలో బరువైన పదసంపద ఉండదు. సున్నితమైన భావాలతో హృదయ స్పందన కలిగించడమే ఆయన శైలి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు 1980 ప్రాంతంలో సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులకు సాహిత్య రంగంలో గౌరవ డాక్టరేట్‌ను బహూకరించారు. 42 ఏళ్ల తర్వాత వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అవధాని నరాల రామారెడ్డికి ఇదే యూనివర్సిటీ వారు గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1948 జూన్ 22న నరాల బాలిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు రెండో సంతానంగా రామారెడ్డి జన్మించారు. ఐదో తరగతి తర్వాత 6 నుంచి 11వ తరగతి వరకు శ్రీకృష్ణ గీర్వాణ ఉన్నత పాఠశాలలో చదివారు. అక్కడ తన పెద్దనాన్న కుమారుడు నరాల వెంకటరామిరెడ్డి ప్రధానోపాధ్యాయుడు. 1959లో గీర్వాణ పాఠశాలలో చేరినప్పుడే జీవితం మలుపు తిరిగింది. సంస్కృతాంధ్ర భాషలపై పట్టు సాధించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు పల్లె వెంకటరెడ్డి తెలుగు పాఠాలు బోధించారు. తెలుగు పండితులైన పల్లె వెంకటరెడ్డి పారిజాతపహరణం నాటకాన్ని రచించారు. ఆయనలాగే పద్యాలు రాయాలని రామారెడ్డి ప్రయత్నం చేశారు. 1964లో 11వ తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు ప్రొద్దుటూరులో డిగ్రీ కళాశాల లేదు. స్థానికంగా పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఉండగా.. ఆ చదువుపై ఇష్టం లేకపోవడంతో తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఏ విద్వాన్ చదవడానికి సిద్ధపడ్డారు. చదువుతోపాటు ఉచిత భోజన వసతి కల్పిస్తుండటంతో ప్రాచ్య కళాశాలలో చేరారు. ప్రాచ్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత సంస్కృతాంధ్ర భాషలపై మక్కువ పెంచుకుని పద్యాలను అలవోకగా అల్లే శక్తిని సంపాదించారు. 16వ ఏటనే అవధానం 1965లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో బులుసు వెంకటరామమూర్తి అష్టావధానం జరిగింది. ఈ అవధానాన్ని చూసిన రామారెడ్డి హాస్టల్ గదుల్లోనే తోటి విద్యార్థులతో అవధానం నిర్వహించేవారు. అదే ఏడాది స్థానిక రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రప్రథమ అవధానం జరిగింది. విజయవంతంగా నిర్వహించినందుకు పండితులు ఆయనను ప్రశంసించారు. విద్యార్థి దశలోనే శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో 20 అవధానాలు నిర్వహించారు. 1968లో ఎ.విద్వాన్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తాను విద్యాభ్యాసం చేసిన శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలను చేపట్టాలనుకున్నారు. తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి, తండ్రి చేసిన రూ.10 వేలు అప్పు తీర్చడానికి సోదరుడైన నరాల వెంకటరామారెడ్డి ప్రోద్బలం వల్ల ప్రొద్దుటూరులోని శ్రీమలయాళస్వామి ఓరియంటల్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. అధ్యాపకునిగా పని చేస్తూ.. ప్రైవేటుగా ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. 1972 మార్చి 30న కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన గువ్వల యల్లారెడ్డి, పుల్లమ్మ ఏకైక పుత్రిక సరోజను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు సతీష్, కుమార్తెలు మనస్విని, ఉదయని ఉన్నారు. వీరు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డారు. అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2006లో పదవీ విరమణ చెందారు. చంధస్సు, అలంకారాలు, ప్రబంధాలను బోధించి విద్యార్థుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశ, విదేశాల్లో అవధానాలు దేశ, విదేశాల్లో వందల అవధానాలు నిర్వహించారు. 1968లో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లెలో చేసిన అవధానం జయప్రదం కావడం వల్ల.. అవధాన రంగంలో గుర్తింపు లభించింది. 1969లో బెంగళూరు ఆంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో, 1972లో జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెల్లూరులో, 1974లో గుంటూరులో ప్రముఖుల సమక్షంలో అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. 1973లో చెన్నైలో తాజ్కోరమండల్, అశోక్ హోటల్లో వేర్వేరుగా ప్రముఖల సమక్షంలో నిర్వహించారు. ఓ కార్యక్రమానికి పద్మశ్రీ డి.భానుమతి, మరో కార్యక్రమానికి సినీ నిర్మత ఎంఎస్ రెడ్డి అధ్యక్షత వహించారు. దేశ విదేశాల నుంచి ఆహ్వానాలు అందాయి. అమెరికాలో... 1992లో జూలైలో ‘ఆటా’ అధ్యక్షుడు టి.సదాశివారెడ్డి ఆహ్వానం మేరకు 9 వారాలపాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అష్టావధానాలను నిర్వహించి ప్రవాసాంధ్రుల ప్రశంసలు అందుకున్నారు. న్యూయార్క్‌లో శిరోమణి అవార్డు, న్యూజెర్సి, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్, హ్యూస్టన్, సెయింట్‌లూయిస్, డెట్రాయిట్ నగరాల్లో ప్రతిభ చాటారు. తర్వాత నాటా ఆహ్వానంతో మూడు మార్లు, ఆటా ఆహ్వానంతో నాలుగు మార్లు, తానా ఆహ్వానంతో ఒక సారి మొత్తం 8 సార్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అవధాన నైపుణ్యం ప్రదర్శించారు. డాలస్‌లో అష్టావధానం నిర్వహించి ‘అవధాన కౌస్తుభ’ బిరుదు పొందారు. చికాగోలో అష్టావధానం నిర్వహించి కనకాబి సత్కారంతోపాటు ‘అవధాని సౌరభౌమ’ బిరుదు పొందారు. ► నరాల రామారెడ్డి 1965 నుంచి 2018 వరకు సుమారు వెయ్యి అష్టావధానాలు నిర్వహించారు. ► 2012లో సంస్కృతంలో ప్రసిద్ధి గాంచిన శాలివాహన గాథాసప్తశతిలోని 300 శ్లోకాలను అనువాదం చేసి భావకవితా శైలిలో 300 తేటగీతులను తెలుగు పాఠకులకు అందించారు. 2018లో 400 పద్యాలతో ‘అవధాన సౌరభం’ గ్రంథాన్ని ప్రచురించారు. సంస్కృత సాహిత్యంలో అలంకార శాస్త్రంలో సుప్రసిద్ధ సంస్కృత శ్లోకాలు, కొన్ని చాటు శ్లోకాలు, ప్రసిద్ధం సంస్కృత కవుల శ్లోకాలను తెలుగులో అనువాదం చేసి ‘అనువాద మాధురి’ పేరుతో ప్రచురిస్తున్నారు. కర్ణుని జీవితంలో విశిష్ట ఘట్టాల ఆధారంగా కర్ణ జననం నుంచి సూర్యునిలో కలిసిపోవు వరకు ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది ‘కర్ణభారతం’ అనే కావ్య రచన చేశారు. ► 978–80 ప్రాంతంలో శోభన్‌బాబు నటించి న ‘కార్తీక దీపం’, కృష్ట నటించిన ‘కలవారి సంసారం’ సినిమాలకు పాటలు రాశారు. ► 2000లో డాక్టర్ సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, బండారు దత్తాత్రేయ సమక్షంలో రసమయి అవార్డు అందుకున్నారు. ► 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా హంస అవార్డు అందుకున్నారు. ► తిరుపతిలో చదివిన నరాల రామారెడ్డి 1971లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ అధ్యక్షతన, 1980లో దివాకర్ల వెంకట అవధాని, ఆ ఏడాదిలోనే శ్రీనివాస ఆడిటోరియంలో బీఎన్ రెడ్డి, 1981లో యూనివర్సిటీ రజతోత్సవం సందర్భంగా మహాకవి దాశరథ అధ్యక్షతన అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రతిభను గుర్తించిన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. -
కెనడాలో సప్త ఖండ అవధానం
తెలుగు భాషకే చెందిన అవధాన ప్రక్రియను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో సప్త ఖంఢ అవధాన సాహితీ ఝర అనే కొత్త ప్రక్రియకి వద్దిపర్తి పద్మాకర్ శ్రీకారం చుట్టారు. అందులో ఇప్పటికే వర్చువల్‌గా 11 అష్టావధానాలు పూర్తయ్యాయి. 12వ అవధానం కెనడాలో పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది మహిళలు పాల్గొన్నారు. వీరితో పాటు పెరూ నుంచి శ్రీనివాస్ పోలవరపు సైతం ఈ అవధానంలో భాగమయ్యారు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ అవధానం సాహితీ ప్రియులు ఆకట్టుకుంది. ఈ అవధానం తిలకించిన శ్రీ కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ, పద్మాకర్‌ను ఆశీర్వదించారు. వద్దిపర్తి పద్మాకర్ ఇప్పటి వరకు 1242 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు పూర్తి చేశారు. తెలుగు, సంస్కృతం, హిందీలలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు వద్దిపర్తి పద్మాకర్‌ను గుర్తించాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు బింగి నరేంద్ర గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎం విజయలక్ష్మి మురుసుపల్లి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ సాయి శ్రీ, ఏలూరు జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ శివశంకర్ తదితర ప్రతినిధులు వద్దిపర్తి పద్మాకర్కి సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. -
అవధాన చరిత్రకు అందలం
ఒకే విషయం మీద ధ్యాస ఉంచి, దానిని గురించి నిరుపహతి స్థలంలో నింపాదిగా ఆలోచించుకుంటూ మధురమైన కవిత్వాన్ని చెప్పటం ఒక రకమైన ప్రతిభ. ఈ ప్రతిభ కలవారు గృహ కవులు. వీరు లోకోత్తరమైన భావాలకు లోకాతిశాయి పద్యరూపాలను చెక్కి చెక్కి తీర్చి దిద్దుతారు.మరొక రకం కవులు సభాకవులు. దిగ్గజాల వంటి పండితులతో నిండి ఉన్న సభలో, ఏ రాజు గారో సభాధ్యక్షులుగా కూర్చొని ఉండగా, వాళ్ల ముందు నిలబడి తొణకక, బెణకక సభారంజకంగా, సలక్షణంగా, సద్యః స్ఫూర్తితో ఆశువుగా కవిత్వం చెప్పగలవారు. ఇది మరింత అరుదైన ప్రతిభ. అలాంటి సభలో, ఎనిమిదిమంది ఉద్దండులైన పృచ్ఛకులను ఏకకాలంలో ఎదుర్కొని, వారి జటిలమైన ప్రశ్నలకు చమత్కారం విరిసే పద్యాల సద్యో కల్పనలతో జవాబిస్తూ సదస్యులను సమ్మోహితులను చేయటం ఇంకా అరుదైన ప్రజ్ఞ. ఎనిమిది కవిత్వ, కవిత్వేతర విషయాలమీద ఏకకాలంలో ఏకాగ్రత– ‘అవధానం’– ఉంచగల మేధావి అష్టావధాని. నూరుగురు పృచ్ఛకులకు వారడిగిన వివిధ విషయాలమీద అప్పటికప్పుడు తలకొక పద్యం అల్లి విస్తృతమైన ప్రక్రియ శతావధానం. అలా వేయిమంది పృచ్ఛకులకు వారడిగిన విషయాల మీద ఆశువుగా పద్యాలు చెప్పే ధీశాలి సహస్రావధాని. కార్యక్రమం అంతంలో ఆ పద్యాలన్నింటినీ వరసగా, పొల్లుపోకుండా ఒప్ప చెప్తేనే అవధానం పూర్తయినట్టు. అవధానాలు చేయగోరే వారికి ఛందస్సూ, వ్యాకరణం, ఇతిహాస పురాణాలూ, శాస్త్రాలూ కరతలామలకంగా ఉండాలి. వేగంగా పద్యం అల్లి చెప్పగల ధారాశుద్ధి ఉండాలి. ధారతోపాటు ధారణ శక్తి. వాటితోపాటు– అన్నింటికంటే ముఖ్యం– సభను ఉర్రూతలూగించే సమయస్ఫూర్తీ, సంభాషణ చాతుర్యం, లోకజ్ఞతా ఉండాలి. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అవధాన కవిత్వానికి ముఖ్యమైన పాత్ర ఉంది. విద్వన్మణులైన అవధానుల అవధానాలు వినోదాన్నివ్వటమే కాదు, శ్రోతల సాహిత్యాభిరుచికి కొత్త చిగుళ్లు తొడిగిస్తాయి. తిరుపతి వేంకటకవులు వివిధ ప్రాంతాలలో, వివిధ రాజాస్థానాలలో అష్టావధానాలూ, శతావధానాలూ సాగించిన కాలంలో ఆంధ్రదేశంలో పద్య రచన ‘ఫ్యాషన్’, ‘ఫ్యాషన్’ అయిపోయిందని చెపుతూ వారి ప్రియ శిష్యులు వేలూరి శివరామశాస్త్రి (శతావధాని) గారు చెప్పిన పద్యం అక్షర సత్యం:ఎక్కడ చూచినన్ కవులె! ఎక్కడ చూడ శతావధానులే!/ఎక్కడ చూడ ఆశుకవు, లెక్కడ చూడ ప్రబంధ కర్తలే!/దిక్–కరులంచు పేర్వడిన తిర్పతి వేంకట సూరు లేగు ఆ/ప్రక్కల నెల్ల! నీ కడుపు పండినదమ్మ, తెలుంగు దేశమా! అప్పుడే కాదు, ఇప్పుడయినా సాహితీ ప్రపంచంలో అవధాన కార్యక్రమాల సందడికీ సామాన్యులలో సంప్రదాయ పద్య సాహిత్యాభిరుచికీ అనులోమానుపాతమే. డా‘‘ రాపాక ఏకాంబరాచార్యులు గారు సాహితీ సుగతులు (ర)సహృదయులూ, సారస్వతాభిలాషులూ. అందునా అవధాన ప్రక్రియను అభిమానించి, అవధాన కవిత్వాన్ని ఔపోసన పట్టిన అపర అగస్త్యులుగా ఆంధ్ర పాఠకులకు సుపరిచితులే.ఆయన రచించిన ‘అవధాన విద్యాసర్వస్వం’ అనే పుస్తకం అక్షరాలా అదే. వెయ్యి పేజీలు దాటిపోయిన ఈ బృహద్రచన కోసం రాపాక వారు చేసిన నలభై సంవత్సరాల కృషి పుట, పుటలోనూ ప్రస్ఫుటం. అవధాన సాహిత్య చరిత్రకు సంబంధించినంతవరకూ ‘యదిహాస్తి తదన్యత్ర, యత్ నేహాస్తి న తత్ క్వచిత్’ (ఇక్కడ ఉన్నదే ఇతర చోట్లా ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడా ఉండదు) అన్నట్టు రూపొందిన ప్రామాణికమైన పుస్తకం ఇది.ఆరంభంలోనే రాపాక వారు అవధాన సాహిత్య చరిత్ర గురించీ, దాని వికాసాన్ని గురించీ, నూరు పేజీల విపులమైన పీఠిక అందించారు. అవధానాలలో విధాలూ, విధి విధానాలూ, చోటు చేసుకొనే అంశాలూ, ప్రక్రియలూ ఇత్యాదులన్నీ ఈ భాగంలో గ్రంథకర్త విపులంగా చర్చించారు. ఆ పైన, నూట ఎనభై రెండుమంది అవధానుల గురించిన జీవిత విశేషాలూ వారు చేసిన అవధానాల వివరాలూ పొందుపరి చారు. వారి వారి పద్య నిర్మాణ ధోరణికి నమూనాలుగా వివిధ అవధానాలలో వారు చెప్పిన పద్యాలను కొన్నింటిని ఉటంకించారు. ఒక్కొక్క అవధాని గురించిన అయిదారు పుటల వ్యాసంలో ఎంత సమగ్రత సాధ్యమో అంతా సాధించారు. అవధాన విద్యా పితామహుడూ, అభినవ పండితరాయలూ శ్రీ మాడభూషి వేంకటాచార్యులు (1835–97) నుంచి, 1990లో జన్మించిన ‘శతావధాన శారద’పుల్లాభొట్ల నాగశాంతిస్వరూప గారి వరకూ అయిదారు తరాల అవధాన కవులను ఈ ఉద్గ్రంథం పరిచయం చేస్తుంది. దాదాపు రెండు వేల పైచిలుకు కమ్మని అవధాన పద్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.వాటిద్వారా వందలాది అవధానుల అవధానపు బాణీలకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. అవధాన విద్య నేర్చుకోగోరే వారికి ఈ పుస్తకం కరదీపిక. అవధాన కవిత్వం అభిమానించే సాహిత్య పిపాసువులకు పుట్ట తేనెపట్టు. సామాన్య పాఠకులకు, వారి ముందు రాపాక వారు నిలిపిన అవధాన సాహిత్య విరాడ్రూపం. రాపాక వారు ఎంతో ఆపేక్షతో, శ్రమతో, ప్రేమతో కూర్చిన పుస్తకాన్ని ముద్రాపకులు అంత ముచ్చటగానూ, ఆకర్షణీయంగానూ ముద్రణ చేయించారు.పద్య సాహిత్యాన్ని ప్రేమించే వారి వ్యక్తిగత గ్రంథాలయాలలో ఈ పుస్తకం చోటు చేసుకోకపోతే, అది పెద్ద వెలితే అవుతుంది. ఇక సాహిత్య సంస్థలూ, విద్యాలయాలూ, కళాశాలల గ్రంథాలయాల మాట వేరే చెప్పనక్కర్లేదు. రచన: డా‘‘ రాపాక ఏకాంబరాచార్యులు, పే.1042 రూ. 1000, వివరాలకు: 86868 25108 – ఎం. మారుతిశాస్త్రి -
అబ్బుర పరిచిన అవధానం
♦ కాశీబుగ్గలో గణిత దశావధానం ♦ ఔరా అనిపించిన చిన్నారులు పలాస: కాశీబుగ్గ గురుకుల విద్యాలయంలో శుక్రవారం జన జాగృతి సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత అష్టావధానం అబ్బురపరిచింది. అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలమేధావి సప్ప సాయి(5వ తరగతి) గణిత దశావధానం, చిరుమేధావి సాలిన కౌశిక్(3వ తరగతి) విద్యార్థుల మేధాసంపత్తి ప్రదర్శన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ చిచ్చరపిడుగులు ప్రేక్షకులను ఔరా అనిపించారు. జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ తెప్పల కృష్ణమూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, గురుకుల విద్యాలయ డైరెక్టర్ కింతలి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పలాస–కాశీబుగ్గ లయన్స్‌క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆనందరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. 10 మంది పృచ్ఛకులు సంధించిన వారగణన 4“4 గణిత చదరం, 1000 సంఖ్యల మొత్తం చెప్పడం, దత్త భిన్నాంకం, మెమోరీ గేమ్, మనో సంకలనం 1, 3“3 గణిత చదరం, దత్తాంకం, మనః సంకలనం 2, సరస ప్రసంగాలకు సప్ప సాయి అవలీలగా సమాధానాలు చెప్పాడు. ప్రేక్షకులు అడిగిన ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు, రాజధానులు, ప్రపంచంలోని 100 ముఖ్య దేశాలు, రాజధానులు, వాటి కరెన్సీ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శాఖల పేర్లు, 60 తెలుగు సంవత్సరాలు, భారతదేశ రాష్ట్రపతి పేర్లు, వివిద పరికరాలు కనుగొన్న శాస్త్రవేత్తల పేర్లు, 2016 క్యాలెండర్లో అడిగిన తేదీనికి వారం పేరు చెప్పడం తదితర అంశాలకు సాలిన కౌశిక్ ప్రశ్న పూర్తవకముందే సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అవధానంలో గురుకుల పాఠశాలకు చెందిన 9, 10 తరగతుల బాలబాలికలు రుచిత, సమన్వి, ప్రజ్ఞ, సంహిత, చంద్రిక, సాయికుమార్, కుమారరాజు, సాయితేజ, తిరుమలసాయి, దివాకర్, పృచ్ఛకులుగా పాల్గొన్నారు. గణిత దశావధాని బాలమేధావులకు గురువు మడ్డు తిరుపతిరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో జనజాగృతి ప్రధాన కార్యదర్శి బమ్మిడి సుబ్బారావు, ఉపాధ్యక్షులు రేజేటి సతీష్‌కుమార్, సహాయక కార్యదర్శి ఎంఎస్ ప్రసాద్, పైల మల్లేశం, లాబాల సిరి, మడే శరత్చంద్రుడు, తంగుడు సాంభమూర్తి, ఎన్.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.