సాక్షి, ప్రొద్దుటూరు : ఆయన అవధానంలో పాండిత్య ప్రదర్శన ఉండదు. అందమైన కవిత్వం ఉంటుంది. సాహిత్యంలో బరువైన పదసంపద ఉండదు. సున్నితమైన భావాలతో హృదయ స్పందన కలిగించడమే ఆయన శైలి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు 1980 ప్రాంతంలో సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులకు సాహిత్య రంగంలో గౌరవ డాక్టరేట్‌ను బహూకరించారు. 42 ఏళ్ల తర్వాత వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అవధాని నరాల రామారెడ్డికి ఇదే యూనివర్సిటీ వారు గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
1948 జూన్ 22న నరాల బాలిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు రెండో సంతానంగా రామారెడ్డి జన్మించారు. ఐదో తరగతి తర్వాత 6 నుంచి 11వ తరగతి వరకు శ్రీకృష్ణ గీర్వాణ ఉన్నత పాఠశాలలో చదివారు. అక్కడ తన పెద్దనాన్న కుమారుడు నరాల వెంకటరామిరెడ్డి ప్రధానోపాధ్యాయుడు. 1959లో గీర్వాణ పాఠశాలలో చేరినప్పుడే జీవితం మలుపు తిరిగింది. సంస్కృతాంధ్ర భాషలపై పట్టు సాధించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు పల్లె వెంకటరెడ్డి తెలుగు పాఠాలు బోధించారు. తెలుగు పండితులైన పల్లె వెంకటరెడ్డి పారిజాతపహరణం నాటకాన్ని రచించారు. ఆయనలాగే పద్యాలు రాయాలని రామారెడ్డి ప్రయత్నం చేశారు.
1964లో 11వ తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు ప్రొద్దుటూరులో డిగ్రీ కళాశాల లేదు. స్థానికంగా పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఉండగా.. ఆ చదువుపై ఇష్టం లేకపోవడంతో తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఏ విద్వాన్ చదవడానికి సిద్ధపడ్డారు. చదువుతోపాటు ఉచిత భోజన వసతి కల్పిస్తుండటంతో ప్రాచ్య కళాశాలలో చేరారు. ప్రాచ్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత సంస్కృతాంధ్ర భాషలపై మక్కువ పెంచుకుని పద్యాలను అలవోకగా అల్లే శక్తిని సంపాదించారు.
16వ ఏటనే అవధానం
1965లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో బులుసు వెంకటరామమూర్తి అష్టావధానం జరిగింది. ఈ అవధానాన్ని చూసిన రామారెడ్డి హాస్టల్ గదుల్లోనే తోటి విద్యార్థులతో అవధానం నిర్వహించేవారు. అదే ఏడాది స్థానిక రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రప్రథమ అవధానం జరిగింది. విజయవంతంగా నిర్వహించినందుకు పండితులు ఆయనను ప్రశంసించారు. విద్యార్థి దశలోనే శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో 20 అవధానాలు నిర్వహించారు. 1968లో ఎ.విద్వాన్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తాను విద్యాభ్యాసం చేసిన శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలను చేపట్టాలనుకున్నారు.
తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి, తండ్రి చేసిన రూ.10 వేలు అప్పు తీర్చడానికి సోదరుడైన నరాల వెంకటరామారెడ్డి ప్రోద్బలం వల్ల ప్రొద్దుటూరులోని శ్రీమలయాళస్వామి ఓరియంటల్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. అధ్యాపకునిగా పని చేస్తూ.. ప్రైవేటుగా ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. 1972 మార్చి 30న కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన గువ్వల యల్లారెడ్డి, పుల్లమ్మ ఏకైక పుత్రిక సరోజను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు సతీష్, కుమార్తెలు మనస్విని, ఉదయని ఉన్నారు. వీరు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డారు. అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2006లో పదవీ విరమణ చెందారు. చంధస్సు, అలంకారాలు, ప్రబంధాలను బోధించి విద్యార్థుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు.
దేశ, విదేశాల్లో అవధానాలు
దేశ, విదేశాల్లో వందల అవధానాలు నిర్వహించారు. 1968లో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లెలో చేసిన అవధానం జయప్రదం కావడం వల్ల.. అవధాన రంగంలో గుర్తింపు లభించింది. 1969లో బెంగళూరు ఆంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో, 1972లో జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెల్లూరులో, 1974లో గుంటూరులో ప్రముఖుల సమక్షంలో అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. 1973లో చెన్నైలో తాజ్‌కోరమండల్, అశోక్ హోటల్‌లో వేర్వేరుగా ప్రముఖల సమక్షంలో నిర్వహించారు. ఓ కార్యక్రమానికి పద్మశ్రీ డి.భానుమతి, మరో కార్యక్రమానికి సినీ నిర్మత ఎంఎస్ రెడ్డి అధ్యక్షత వహించారు. దేశ విదేశాల నుంచి ఆహ్వానాలు అందాయి.
అమెరికాలో...
1992లో జూలైలో ‘ఆటా’ అధ్యక్షుడు టి.సదాశివారెడ్డి ఆహ్వానం మేరకు 9 వారాలపాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అష్టావధానాలను నిర్వహించి ప్రవాసాంధ్రుల ప్రశంసలు అందుకున్నారు. న్యూయార్క్‌లో శిరోమణి అవార్డు, న్యూజెర్సి, శాన్‌ఫ్రాన్సిస్‌కో, లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్, హ్యూస్టన్, సెయింట్‌లూయిస్, డెట్రాయిట్ నగరాల్లో ప్రతిభ చాటారు. తర్వాత నాటా ఆహ్వానంతో మూడు మార్లు, ఆటా ఆహ్వానంతో నాలుగు మార్లు, తానా ఆహ్వానంతో ఒక సారి మొత్తం 8 సార్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అవధాన నైపుణ్యం ప్రదర్శించారు. డాలస్‌లో అష్టావధానం నిర్వహించి ‘అవధాన కౌస్తుభ’ బిరుదు పొందారు. చికాగోలో అష్టావధానం నిర్వహించి కనకాబి సత్కారంతోపాటు ‘అవధాని సౌరభౌమ’ బిరుదు పొందారు.
► నరాల రామారెడ్డి 1965 నుంచి 2018 వరకు సుమారు వెయ్యి అష్టావధానాలు నిర్వహించారు.
► 2012లో సంస్కృతంలో ప్రసిద్ధి గాంచిన శాలివాహన గాథాసప్తశతిలోని 300 శ్లోకాలను అనువాదం చేసి భావకవితా శైలిలో 300 తేటగీతులను తెలుగు పాఠకులకు అందించారు. 2018లో 400 పద్యాలతో ‘అవధాన సౌరభం’ గ్రంథాన్ని ప్రచురించారు. సంస్కృత సాహిత్యంలో అలంకార శాస్త్రంలో సుప్రసిద్ధ సంస్కృత శ్లోకాలు, కొన్ని చాటు శ్లోకాలు, ప్రసిద్ధం సంస్కృత కవుల శ్లోకాలను తెలుగులో అనువాదం చేసి ‘అనువాద మాధురి’ పేరుతో ప్రచురిస్తున్నారు. కర్ణుని జీవితంలో విశిష్ట ఘట్టాల ఆధారంగా కర్ణ జననం నుంచి సూర్యునిలో కలిసిపోవు వరకు ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది ‘కర్ణభారతం’ అనే కావ్య రచన చేశారు.
► 978–80 ప్రాంతంలో శోభన్‌బాబు నటించి న ‘కార్తీక దీపం’, కృష్ట నటించిన ‘కలవారి సంసారం’ సినిమాలకు పాటలు రాశారు.
► 2000లో డాక్టర్ సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, బండారు దత్తాత్రేయ సమక్షంలో రసమయి అవార్డు అందుకున్నారు.
► 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా హంస అవార్డు అందుకున్నారు.
► తిరుపతిలో చదివిన నరాల రామారెడ్డి 1971లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ అధ్యక్షతన, 1980లో దివాకర్ల వెంకట అవధాని, ఆ ఏడాదిలోనే శ్రీనివాస ఆడిటోరియంలో బీఎన్ రెడ్డి, 1981లో యూనివర్సిటీ రజతోత్సవం సందర్భంగా మహాకవి దాశరథ అధ్యక్షతన అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రతిభను గుర్తించిన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment