యంగ్‌ టాలెంట్‌: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు | Young Talent: These Childrens Who Show Their Talent At Young Age | Sakshi
Sakshi News home page

యంగ్‌ టాలెంట్‌: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు

Published Fri, Nov 15 2024 8:53 AM | Last Updated on Fri, Nov 15 2024 9:54 AM

Young Talent: These Childrens Who Show Their Talent At Young Age

అవధాన సుధ పద్యాలు చదివే పిల్లలు ఈరోజుల్లో అరుదైపోయారు. అయితే హైదరాబాద్‌కు చెందిన సంకీర్త్‌ అలా కాదు. పద్యాలు చదవడమే కాదు అలవోకగా  పద్యాలు అల్లుతూ ‘బాలావధాని’ అనిపించుకుంటున్నాడు...

పదమూడు సంవత్సరాల వింజమూరి సంకీర్త్‌ తటవర్తి గురుకులంలో పద్యరచనలో శిక్షణ ΄÷ందుతూ ఎన్నో పద్యాలు రాశాడు. ‘క్షాత్రసరణి’ అనే శతక కార్యక్రమంలో  మొదటిసారిగా తన పద్యాలు చదివి 
‘భేష్‌’ అనిపించుకున్నాడు. ‘భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని ఇచ్చిన సమస్యకు బాలావధాని ‘క్షేమము గూర్చగా ధరకి శ్రీయుత రూపము నెత్తె భూతలిన్‌ / ధామముగాను వెల్గు వరదాయకుడై రణధీరయోగియై/ స్వామిగ లోక రక్షణకు సంతసమొంద రణాన రాముడే / భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని చక్కగా పూరించాడు. దత్తపది అంశంలో ‘కరి వరి మరి తరి‘ పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించమని అడగగా...

‘దేవి శ్రీకరి శాంకరి దివ్యవాణి
నీదు సేవను తరియించి విత్యముగను 
లోకమును గావ రిపులను రూపుమాపి
కావుమమ్మ ధరన్‌ మరి కరుణ జూపి’ అంటూ పూరించాడు. వర్ణన అంశంలో ఉయ్యాల సేవ వర్ణన అడుగగా ‘వెంకటాచలమని వేంకటేశుని గొల్చి, ఊయలూపుచుండ హాయిగాను, భక్తులకు వరముగ భవ్య స్వరూవమై, వెలసినట్టి దేవ వినయ నుతులు‘ అంటూ చక్కగా వర్ణించాడు. ఒకటవ పాదంలో మొదటి అక్షరం శ, 2వ పాదంలో 2వ అక్షరం మ, 3వ పాదంలో 11వ అక్షరం సా, 4వ పాదంలో 19వ అక్షరం వచ్చే విధంగా దుర్గాపూజను వర్ణించమని అడిగితే...

‘శమియగు నీ స్వరూపము సుశక్తినొసంగగ దివ్య మాతవై / గమనము దెల్పుచున్‌ సుమతి కామితదాయిని సింహవాహిని/ సమత వహించుదేవతగ సారమునిచ్చుచు మమ్ముగావవే / మమతయె పొంగగా ధరణు మానితమూర్తి ముదంబు పాడెనే’ అంటూ పూరించి ధారతో కూడిన ధారణ చేసి అందరి మనసులను ఆకట్టుకున్నాడు.

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌
కూచిపూడి నృత్య సంప్రదాయంలో తలపై మూడు కుండలు, హిప్‌ హోల రింగ్‌  వేసుకుని, కుండపై నిలబడి నృత్యం చేయడం ద్వారా ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది నిడదవోలుకు చెందిన ఆరు సంవత్సరాల చిన్నారి మద్దిరాల కేతనరెడ్డి.

వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌
పదిహేను సంవత్సరాల వయసులోనే బహుముఖ ప్రజ్ఞతో వివిధ రంగాలలో ఎన్నో  విజయాలను సాధిస్తోంది అన్నమయ్య జిల్లా దేవరవాండ్లపల్లికి చెందిన కైవల్య రెడ్డి ‘వివిధ రంగాలలో బహుముఖప్రజ్ఞ చూపిన విద్యార్ధిని’గా వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. కూచిపూడి నుంచి కరాటే వరకు ఎన్నో విద్యల్లో ప్రతిభ చాటుతోంది. 

(చదవండి: మోడలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో..ఏకంగా డిజిటల్‌ స్టార్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement