అవధాన విద్యాసర్వస్వవము
ఒకే విషయం మీద ధ్యాస ఉంచి, దానిని గురించి నిరుపహతి స్థలంలో నింపాదిగా ఆలోచించుకుంటూ మధురమైన కవిత్వాన్ని చెప్పటం ఒక రకమైన ప్రతిభ. ఈ ప్రతిభ కలవారు గృహ కవులు. వీరు లోకోత్తరమైన భావాలకు లోకాతిశాయి పద్యరూపాలను చెక్కి చెక్కి తీర్చి దిద్దుతారు.మరొక రకం కవులు సభాకవులు. దిగ్గజాల వంటి పండితులతో నిండి ఉన్న సభలో, ఏ రాజు గారో సభాధ్యక్షులుగా కూర్చొని ఉండగా, వాళ్ల ముందు నిలబడి తొణకక, బెణకక సభారంజకంగా, సలక్షణంగా, సద్యః స్ఫూర్తితో ఆశువుగా కవిత్వం చెప్పగలవారు. ఇది మరింత అరుదైన ప్రతిభ. అలాంటి సభలో, ఎనిమిదిమంది ఉద్దండులైన పృచ్ఛకులను ఏకకాలంలో ఎదుర్కొని, వారి జటిలమైన ప్రశ్నలకు చమత్కారం విరిసే పద్యాల సద్యో కల్పనలతో జవాబిస్తూ సదస్యులను సమ్మోహితులను చేయటం ఇంకా అరుదైన ప్రజ్ఞ. ఎనిమిది కవిత్వ, కవిత్వేతర విషయాలమీద ఏకకాలంలో ఏకాగ్రత– ‘అవధానం’– ఉంచగల మేధావి అష్టావధాని. నూరుగురు పృచ్ఛకులకు వారడిగిన వివిధ విషయాలమీద అప్పటికప్పుడు తలకొక పద్యం అల్లి విస్తృతమైన ప్రక్రియ శతావధానం. అలా వేయిమంది పృచ్ఛకులకు వారడిగిన విషయాల మీద ఆశువుగా పద్యాలు చెప్పే ధీశాలి సహస్రావధాని. కార్యక్రమం అంతంలో ఆ పద్యాలన్నింటినీ వరసగా, పొల్లుపోకుండా ఒప్ప చెప్తేనే అవధానం పూర్తయినట్టు.
అవధానాలు చేయగోరే వారికి ఛందస్సూ, వ్యాకరణం, ఇతిహాస పురాణాలూ, శాస్త్రాలూ కరతలామలకంగా ఉండాలి. వేగంగా పద్యం అల్లి చెప్పగల ధారాశుద్ధి ఉండాలి. ధారతోపాటు ధారణ శక్తి. వాటితోపాటు– అన్నింటికంటే ముఖ్యం– సభను ఉర్రూతలూగించే సమయస్ఫూర్తీ, సంభాషణ చాతుర్యం, లోకజ్ఞతా ఉండాలి. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అవధాన కవిత్వానికి ముఖ్యమైన పాత్ర ఉంది. విద్వన్మణులైన అవధానుల అవధానాలు వినోదాన్నివ్వటమే కాదు, శ్రోతల సాహిత్యాభిరుచికి కొత్త చిగుళ్లు తొడిగిస్తాయి. తిరుపతి వేంకటకవులు వివిధ ప్రాంతాలలో, వివిధ రాజాస్థానాలలో అష్టావధానాలూ, శతావధానాలూ సాగించిన కాలంలో ఆంధ్రదేశంలో పద్య రచన ‘ఫ్యాషన్’, ‘ఫ్యాషన్’ అయిపోయిందని చెపుతూ వారి ప్రియ శిష్యులు వేలూరి శివరామశాస్త్రి (శతావధాని) గారు చెప్పిన పద్యం అక్షర సత్యం:ఎక్కడ చూచినన్ కవులె! ఎక్కడ చూడ శతావధానులే!/ఎక్కడ చూడ ఆశుకవు, లెక్కడ చూడ ప్రబంధ కర్తలే!/దిక్–కరులంచు పేర్వడిన తిర్పతి వేంకట సూరు లేగు ఆ/ప్రక్కల నెల్ల! నీ కడుపు పండినదమ్మ, తెలుంగు దేశమా!
అప్పుడే కాదు, ఇప్పుడయినా సాహితీ ప్రపంచంలో అవధాన కార్యక్రమాల సందడికీ సామాన్యులలో సంప్రదాయ పద్య సాహిత్యాభిరుచికీ అనులోమానుపాతమే. డా‘‘ రాపాక ఏకాంబరాచార్యులు గారు సాహితీ సుగతులు (ర)సహృదయులూ, సారస్వతాభిలాషులూ. అందునా అవధాన ప్రక్రియను అభిమానించి, అవధాన కవిత్వాన్ని ఔపోసన పట్టిన అపర అగస్త్యులుగా ఆంధ్ర పాఠకులకు సుపరిచితులే.ఆయన రచించిన ‘అవధాన విద్యాసర్వస్వం’ అనే పుస్తకం అక్షరాలా అదే. వెయ్యి పేజీలు దాటిపోయిన ఈ బృహద్రచన కోసం రాపాక వారు చేసిన నలభై సంవత్సరాల కృషి పుట, పుటలోనూ ప్రస్ఫుటం. అవధాన సాహిత్య చరిత్రకు సంబంధించినంతవరకూ ‘యదిహాస్తి తదన్యత్ర, యత్ నేహాస్తి న తత్ క్వచిత్’ (ఇక్కడ ఉన్నదే ఇతర చోట్లా ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడా ఉండదు) అన్నట్టు రూపొందిన ప్రామాణికమైన పుస్తకం ఇది.ఆరంభంలోనే రాపాక వారు అవధాన సాహిత్య చరిత్ర గురించీ, దాని వికాసాన్ని గురించీ, నూరు పేజీల విపులమైన పీఠిక అందించారు. అవధానాలలో విధాలూ, విధి విధానాలూ, చోటు చేసుకొనే అంశాలూ, ప్రక్రియలూ ఇత్యాదులన్నీ ఈ భాగంలో గ్రంథకర్త విపులంగా చర్చించారు.
ఆ పైన, నూట ఎనభై రెండుమంది అవధానుల గురించిన జీవిత విశేషాలూ వారు చేసిన అవధానాల వివరాలూ పొందుపరి చారు. వారి వారి పద్య నిర్మాణ ధోరణికి నమూనాలుగా వివిధ అవధానాలలో వారు చెప్పిన పద్యాలను కొన్నింటిని ఉటంకించారు. ఒక్కొక్క అవధాని గురించిన అయిదారు పుటల వ్యాసంలో ఎంత సమగ్రత సాధ్యమో అంతా సాధించారు. అవధాన విద్యా పితామహుడూ, అభినవ పండితరాయలూ శ్రీ మాడభూషి వేంకటాచార్యులు (1835–97) నుంచి, 1990లో జన్మించిన ‘శతావధాన శారద’పుల్లాభొట్ల నాగశాంతిస్వరూప గారి వరకూ అయిదారు తరాల అవధాన కవులను ఈ ఉద్గ్రంథం పరిచయం చేస్తుంది. దాదాపు రెండు వేల పైచిలుకు కమ్మని అవధాన పద్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.వాటిద్వారా వందలాది అవధానుల అవధానపు బాణీలకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. అవధాన విద్య నేర్చుకోగోరే వారికి ఈ పుస్తకం కరదీపిక. అవధాన కవిత్వం అభిమానించే సాహిత్య పిపాసువులకు పుట్ట తేనెపట్టు. సామాన్య పాఠకులకు, వారి ముందు రాపాక వారు నిలిపిన అవధాన సాహిత్య విరాడ్రూపం. రాపాక వారు ఎంతో ఆపేక్షతో, శ్రమతో, ప్రేమతో కూర్చిన పుస్తకాన్ని ముద్రాపకులు అంత ముచ్చటగానూ, ఆకర్షణీయంగానూ ముద్రణ చేయించారు.పద్య సాహిత్యాన్ని ప్రేమించే వారి వ్యక్తిగత గ్రంథాలయాలలో ఈ పుస్తకం చోటు చేసుకోకపోతే, అది పెద్ద వెలితే అవుతుంది. ఇక సాహిత్య సంస్థలూ, విద్యాలయాలూ, కళాశాలల గ్రంథాలయాల మాట వేరే చెప్పనక్కర్లేదు.
రచన: డా‘‘ రాపాక ఏకాంబరాచార్యులు, పే.1042 రూ. 1000, వివరాలకు: 86868 25108
– ఎం. మారుతిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment