Maruthi Sastry
-
‘అబ్బ! ఏమి ఎండలు...!’
ఎక్కడ చూసినా ఒకటే మాట. ‘అబ్బ! ఏమి ఎండలు...! ఇన్నాళ్ల జీవితంలో ఇంత ఎండలు ఎంత అరుదుగా చూశామో! ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రోహిణి కార్తె వచ్చేసరికి బతకగలమా అని భయంగా ఉంది. రావి శాస్త్రి గారు దాదాపు 70 ఏళ్ల క్రితం ఒక చిన్న నాటకం రచించి, ఆనాటి ‘భారతి’ పత్రికలో వేయించారు. చరిత్రలో వివిధ కాలాలలో జరిగిన అయిదారు చారిత్రాత్మకమైన ఘట్టాలను నేపథ్యంగా తీసుకొని, ‘అయ్యో! ఇంతటి ఘోరకలి ఇంతకు మునుపెన్నడైనా చూశామా! ఇక రేపో మాపో ప్రళయం తప్పదు, ఈ లోకం పని అయిపోయినట్టే!’ అని ఎప్పటికప్పుడు, ఏ కాలానికి ఆ కాలంలో లోకులు ఎలా భయాందోళనలు చెందుతుంటారో ఆ నాటకంలో ఎత్తి చూపుతారు. రామాయణ కాలమైనా, మహా భారత యుద్ధం నాడయినా, చంద్రగుప్తుడి సమయంలోనైనా, జవహర్లాల్ నెహ్రూ జమానాలో అయినా, వర్తమాన అనుభవాలలో ఒక తాజాతనం, ఘాటూ, వాడీ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలనో, మానవ స్వభావాల ఉచ్చనీచాల అంచులనో చవి చూసినప్పుడు, ఆ తీవ్రత అప్పటికప్పుడు ‘నభూతో, న భవిష్యతి’ అనిపిస్తుంది. జ్ఞాపకాలు జీవితానుభవాల ఛాయా చిత్రాల లాంటివి. ఈనాటి ఛాయా చిత్రం వెలుగూ మెరుపూ ఏడాది తిరిగేసరికి మారిపోతుంది. ఏ పాతికేళ్ల తరవాతో చూస్తే ఏవేవో కొత్త అందాలు కనిపించి, కొత్త ఆనందాన్నిస్తాయి. అందుకే, ముగిసి పోయిన తరువాత ఎంతటి దుఃఖానుభవమైనా, యధార్థంగా దాన్ని అనుభవిస్తున్నప్పుడు కలిగించిన వేదనను కలిగించదు. వెనక్కు తిరిగి, అయిపోయిన జీవితాన్ని అనుభవించిన దైన్యాన్నీ, మానావమానాలనూ, కష్టనష్టాలనూ నెమరు వేసుకుంటే, ‘మనోబలంతో ఎంతటి కష్టాలు ఎదుర్కొని బయటపడ్డాను!’ అన్న భావన అసలే చల్లబడిన ఆ పాత అనుభవాలకు, గంధపు పూత వేసి, ‘ఆ రోజులు మళ్లీ రావు!’ అనే సుఖకరమైన భావాన్ని కూడా కలిగిస్తుంది. అబ్బ! ఏమి ఎండలు! ఇంత రాత్రయినా, చల్లదనమన్నమాట లేదు. దోసె పోస్తుంటే ఆవిర్లు వచ్చినట్టు, ఒకటే వేడిగాడ్పులు! అదుగో, ఎండకి ఫెటిల్లుమని పగిలి బూరుగ కాయలు ఎలా దూది చిమ్ముతున్నాయో, ఎండ వేడికి ఈ లోకం అంతా బూడిదైపోయి, ఆ బూడిదే గాలిలో ఎగురుతున్నట్టుగా! ఈసారి ఎండలతో ఈ సృష్టి పనై పోయింది. కావాలంటే, ఆ దున్నపోతుల మీదా, పందుల మీదా, ఏనుగుల మీదా అట్టలు కట్టిన బురద చూడండి. అదేమనుకొంటున్నారు? బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టికి తయారీలు చేసుకొంటూ, ఈ ‘అచ్చు’లన్నీ పోసుకొని అట్టిపెట్టుకొంటున్నాడు...’ ఈ ఎండలు కృష్టదేవరాయల కాలం నాటివి. ఇవి ఆయన వర్ణనలు. అప్పటి ఎండలు అలా అనిపించాయి! వాటిని ఇప్పటి ఎండలతో పోలిస్తే...! – ఎం. మారుతి శాస్త్రి -
మీనాక్షీ
అమ్మవారి మీద ముత్తు స్వామి దీక్షితుల వారు రచించిన ఎన్నో కృతులలో ‘మీనాక్షీ! మే ముదం దేవా!’ అన్న కృతి చాలా ప్రసిద్ధం. అందులో ఆమెను దీక్షితుల వారు ‘మీన లోచనీ! పాశమోచనీ!’ అని కూడా సంబోధిస్తారు. జగజ్జననిని ఆరాధించే భక్తులకు చేపల ఆకారంతో అత్యంత సుందరంగా ఉండే ఆ కన్నుల నుంచి ప్రసరించే కటాక్ష వీక్షణం– కడగంటి చూపు– కావాలి. ఫలానా దుఃఖం పోగొట్టమనీ, ఫలానా సుఖం కలిగించమనీ ఆమెను ప్రత్యేకంగా వేడుకోనక్కర్లేదు. ఆమె చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే భావిస్తారు.ఇలా భావించటం వెనుక ఒక ప్రకృతి విచిత్రం ఉన్నది. ప్రకృతిలో ప్రాణులన్నిటికీ తమ సంతానం మీద మమతానురాగాలు ఉండటం స్వాభావికం. కోతులలో పిల్ల కోతులు, తల్లి పొట్టను తామే గట్టిగా కరచుకొని తల్లితో వెళుతుంటాయి. బిడ్డ శ్రద్ధగా ఉంటేనే తల్లి సహకారం లభిస్తుంది. ఇది ‘మర్కట కిశోర న్యాయం’. పిల్లి పిల్లలది మరో దారి. తల్లి పిల్లి పిల్లను అతి జాగ్రత్తగా నోట కరచుకొని తనతో తీసు కువెళ్లి వాటిని సురక్షితంగా ఉంచుతుంది. ఇక్కడ తల్లి ప్రమేయమే ఎక్కువ, పిల్లలేమీ చేయనక్కర్లేదు. ఇది ‘మార్జాల కిశోర న్యాయం’. పక్షులు పిల్లల్ని మోయవు. కేవలం గుడ్లు పెడతాయి. వాటిని అవసరమైనంత మేరకు తమ శరీరాలతో పొదిగి, తమ శరీరం వేడిని వాటికిచ్చి, అవి ఎదిగేందుకు దోహదం చేస్తాయి. పక్షుల పిల్లలకు ఆ మాత్రమే చాలు. తాబే ళ్లది వేరే మార్గం. తల్లి తాబేలు గుడ్లు పెట్టి ఎటో వెళ్లి పోతుంది. ఎటు వెళ్లినా ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుందట. చేపలలో మాతృత్వం మరీ చిత్రం. చేప కూడా గుడ్లు పెడుతుంది. పెట్టిన తరువాత వాటికి దూరంగా జరుగుతుంది. దూరాన్నుంచి వెనక్కు తిరిగి తన చూపులు మాత్రం ఆ గుడ్ల మీద ప్రసరింపజేస్తుంది. ఆ తల్లి చేప చల్లని చూపు శక్తి వల్ల, గుడ్లు పొదిగి పిల్లలై తమ జీవితాలు తాము జీవిస్తాయి. అలాగే భగవతికీ భక్తులకూ ఉండే సంబంధం కూడా తల్లీ బిడ్డలవంటి సంబంధమే. అమ్మవారిని ‘మీనాక్షి’ అనటంలో ఉద్దేశం ఆమె కళ్లు మీనాల ఆకారంలో అందంగా ఉంటాయని వర్ణించటమే కాదు. తల్లి చేప తన చల్లని చూపుల మంత్రంతో తన బిడ్డలకు వృద్ధిని కలిగించినట్టు, జగ జ్జనని కూడా తన భక్తులకు చల్లని చూపుల మంత్రం ద్వారా సర్వైశ్వర్యాలని ప్రసాదించగలదన్న సూచనను కూడా గమనించమంటారు పెద్దలు. – ఎం. మారుతి శాస్త్రి -
అవధాన చరిత్రకు అందలం
ఒకే విషయం మీద ధ్యాస ఉంచి, దానిని గురించి నిరుపహతి స్థలంలో నింపాదిగా ఆలోచించుకుంటూ మధురమైన కవిత్వాన్ని చెప్పటం ఒక రకమైన ప్రతిభ. ఈ ప్రతిభ కలవారు గృహ కవులు. వీరు లోకోత్తరమైన భావాలకు లోకాతిశాయి పద్యరూపాలను చెక్కి చెక్కి తీర్చి దిద్దుతారు.మరొక రకం కవులు సభాకవులు. దిగ్గజాల వంటి పండితులతో నిండి ఉన్న సభలో, ఏ రాజు గారో సభాధ్యక్షులుగా కూర్చొని ఉండగా, వాళ్ల ముందు నిలబడి తొణకక, బెణకక సభారంజకంగా, సలక్షణంగా, సద్యః స్ఫూర్తితో ఆశువుగా కవిత్వం చెప్పగలవారు. ఇది మరింత అరుదైన ప్రతిభ. అలాంటి సభలో, ఎనిమిదిమంది ఉద్దండులైన పృచ్ఛకులను ఏకకాలంలో ఎదుర్కొని, వారి జటిలమైన ప్రశ్నలకు చమత్కారం విరిసే పద్యాల సద్యో కల్పనలతో జవాబిస్తూ సదస్యులను సమ్మోహితులను చేయటం ఇంకా అరుదైన ప్రజ్ఞ. ఎనిమిది కవిత్వ, కవిత్వేతర విషయాలమీద ఏకకాలంలో ఏకాగ్రత– ‘అవధానం’– ఉంచగల మేధావి అష్టావధాని. నూరుగురు పృచ్ఛకులకు వారడిగిన వివిధ విషయాలమీద అప్పటికప్పుడు తలకొక పద్యం అల్లి విస్తృతమైన ప్రక్రియ శతావధానం. అలా వేయిమంది పృచ్ఛకులకు వారడిగిన విషయాల మీద ఆశువుగా పద్యాలు చెప్పే ధీశాలి సహస్రావధాని. కార్యక్రమం అంతంలో ఆ పద్యాలన్నింటినీ వరసగా, పొల్లుపోకుండా ఒప్ప చెప్తేనే అవధానం పూర్తయినట్టు. అవధానాలు చేయగోరే వారికి ఛందస్సూ, వ్యాకరణం, ఇతిహాస పురాణాలూ, శాస్త్రాలూ కరతలామలకంగా ఉండాలి. వేగంగా పద్యం అల్లి చెప్పగల ధారాశుద్ధి ఉండాలి. ధారతోపాటు ధారణ శక్తి. వాటితోపాటు– అన్నింటికంటే ముఖ్యం– సభను ఉర్రూతలూగించే సమయస్ఫూర్తీ, సంభాషణ చాతుర్యం, లోకజ్ఞతా ఉండాలి. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అవధాన కవిత్వానికి ముఖ్యమైన పాత్ర ఉంది. విద్వన్మణులైన అవధానుల అవధానాలు వినోదాన్నివ్వటమే కాదు, శ్రోతల సాహిత్యాభిరుచికి కొత్త చిగుళ్లు తొడిగిస్తాయి. తిరుపతి వేంకటకవులు వివిధ ప్రాంతాలలో, వివిధ రాజాస్థానాలలో అష్టావధానాలూ, శతావధానాలూ సాగించిన కాలంలో ఆంధ్రదేశంలో పద్య రచన ‘ఫ్యాషన్’, ‘ఫ్యాషన్’ అయిపోయిందని చెపుతూ వారి ప్రియ శిష్యులు వేలూరి శివరామశాస్త్రి (శతావధాని) గారు చెప్పిన పద్యం అక్షర సత్యం:ఎక్కడ చూచినన్ కవులె! ఎక్కడ చూడ శతావధానులే!/ఎక్కడ చూడ ఆశుకవు, లెక్కడ చూడ ప్రబంధ కర్తలే!/దిక్–కరులంచు పేర్వడిన తిర్పతి వేంకట సూరు లేగు ఆ/ప్రక్కల నెల్ల! నీ కడుపు పండినదమ్మ, తెలుంగు దేశమా! అప్పుడే కాదు, ఇప్పుడయినా సాహితీ ప్రపంచంలో అవధాన కార్యక్రమాల సందడికీ సామాన్యులలో సంప్రదాయ పద్య సాహిత్యాభిరుచికీ అనులోమానుపాతమే. డా‘‘ రాపాక ఏకాంబరాచార్యులు గారు సాహితీ సుగతులు (ర)సహృదయులూ, సారస్వతాభిలాషులూ. అందునా అవధాన ప్రక్రియను అభిమానించి, అవధాన కవిత్వాన్ని ఔపోసన పట్టిన అపర అగస్త్యులుగా ఆంధ్ర పాఠకులకు సుపరిచితులే.ఆయన రచించిన ‘అవధాన విద్యాసర్వస్వం’ అనే పుస్తకం అక్షరాలా అదే. వెయ్యి పేజీలు దాటిపోయిన ఈ బృహద్రచన కోసం రాపాక వారు చేసిన నలభై సంవత్సరాల కృషి పుట, పుటలోనూ ప్రస్ఫుటం. అవధాన సాహిత్య చరిత్రకు సంబంధించినంతవరకూ ‘యదిహాస్తి తదన్యత్ర, యత్ నేహాస్తి న తత్ క్వచిత్’ (ఇక్కడ ఉన్నదే ఇతర చోట్లా ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడా ఉండదు) అన్నట్టు రూపొందిన ప్రామాణికమైన పుస్తకం ఇది.ఆరంభంలోనే రాపాక వారు అవధాన సాహిత్య చరిత్ర గురించీ, దాని వికాసాన్ని గురించీ, నూరు పేజీల విపులమైన పీఠిక అందించారు. అవధానాలలో విధాలూ, విధి విధానాలూ, చోటు చేసుకొనే అంశాలూ, ప్రక్రియలూ ఇత్యాదులన్నీ ఈ భాగంలో గ్రంథకర్త విపులంగా చర్చించారు. ఆ పైన, నూట ఎనభై రెండుమంది అవధానుల గురించిన జీవిత విశేషాలూ వారు చేసిన అవధానాల వివరాలూ పొందుపరి చారు. వారి వారి పద్య నిర్మాణ ధోరణికి నమూనాలుగా వివిధ అవధానాలలో వారు చెప్పిన పద్యాలను కొన్నింటిని ఉటంకించారు. ఒక్కొక్క అవధాని గురించిన అయిదారు పుటల వ్యాసంలో ఎంత సమగ్రత సాధ్యమో అంతా సాధించారు. అవధాన విద్యా పితామహుడూ, అభినవ పండితరాయలూ శ్రీ మాడభూషి వేంకటాచార్యులు (1835–97) నుంచి, 1990లో జన్మించిన ‘శతావధాన శారద’పుల్లాభొట్ల నాగశాంతిస్వరూప గారి వరకూ అయిదారు తరాల అవధాన కవులను ఈ ఉద్గ్రంథం పరిచయం చేస్తుంది. దాదాపు రెండు వేల పైచిలుకు కమ్మని అవధాన పద్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.వాటిద్వారా వందలాది అవధానుల అవధానపు బాణీలకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. అవధాన విద్య నేర్చుకోగోరే వారికి ఈ పుస్తకం కరదీపిక. అవధాన కవిత్వం అభిమానించే సాహిత్య పిపాసువులకు పుట్ట తేనెపట్టు. సామాన్య పాఠకులకు, వారి ముందు రాపాక వారు నిలిపిన అవధాన సాహిత్య విరాడ్రూపం. రాపాక వారు ఎంతో ఆపేక్షతో, శ్రమతో, ప్రేమతో కూర్చిన పుస్తకాన్ని ముద్రాపకులు అంత ముచ్చటగానూ, ఆకర్షణీయంగానూ ముద్రణ చేయించారు.పద్య సాహిత్యాన్ని ప్రేమించే వారి వ్యక్తిగత గ్రంథాలయాలలో ఈ పుస్తకం చోటు చేసుకోకపోతే, అది పెద్ద వెలితే అవుతుంది. ఇక సాహిత్య సంస్థలూ, విద్యాలయాలూ, కళాశాలల గ్రంథాలయాల మాట వేరే చెప్పనక్కర్లేదు. రచన: డా‘‘ రాపాక ఏకాంబరాచార్యులు, పే.1042 రూ. 1000, వివరాలకు: 86868 25108 – ఎం. మారుతిశాస్త్రి -
సంబరాల సంక్రాంతి
మకర సంక్రాంతిలాగా తెలుగుల సంస్కృతికి అద్దం పట్టే పండుగ మరొకటి లేదు. అందుకే పండుగలెన్ని ఉన్నా తెలుగు వారికి ‘పెద్ద పండుగ’ సంక్రాంతే. నూరేళ్ల క్రితం వరకూ విడదీయలేనంతగా జన జీవన స్రవంతిలో భాగంగా నిలిచిపోయిన మకర సంక్రాంతి, సంప్రదాయాలు ఇవ్వాళ నామమాత్రంగానే ఉన్నా యని చెప్పవచ్చు. ముఖ్యంగా నగరాలలో, పట్టణాలలో ఆధునికత ఆనాటి జీవన విధానాన్నీ, ఆర్థిక సామాజిక స్థితులనూ, మానవ సంబంధాలనూ, ఆనాటి విలువ లనూ నానాటికీ కనుమరుగు చేస్తున్న కాలం కదా. అతి వేగంగా మారుతున్న కాలంలో ఉధృతమైన వర దలా మనల్ని ముంచెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో, ఒక్కొక్క సంవత్సరం గడిచేసరికి, మనం మరెంత ఎక్కువ దూరం కొట్టుకు వచ్చామో స్ఫుటంగా చూసి హెచ్చరించే సందర్భంగా ఇప్పుడు మకర సంక్రాంతి ఏటేటా మన ముందు నిలుస్తున్నది. సూర్యుడు తన నిరంతర పయనంలో మరొక సారి మకర రాశిలో ప్రవేశించే పుణ్య దినం మకర సంక్రాంతి. ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభ దినం. ధర్మాచరణకూ, పుణ్యకార్యాల ప్రారంభానికీ మకర సంక్రాంతి అనువైన కాలం. అన్నిటినీ మించి మానవ సంబంధాల విలువలను సంక్రాంతి సంప్రదా యాలు చాటి చెప్తాయి. పంటలు చేతికివచ్చి, శ్రమ ఫలం అర్ధరూపంలో చేతికొస్తుంది కనుక అన్నిరకాల దానధర్మాలకూ çసంక్రాంతి తగిన కాలం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో యావత్ ప్రజానీకంలోనూ అంద రికీ ఆనందదాయకమైంది సంక్రాంతి. అన్ని పండగల కంటే ఈ పండగ సంబరాల ఆనందం అంబరాన్ని అంటటానికి ముఖ్యకారణం ఆర్థికం.ధనధాన్యాలూ, పాడిపంటలతో గ్రామాలు కళ కళలాడే కాలంలోవచ్చే పండగ కదా. అందుకే గ్రామీణ సమాజంలో అన్ని వర్గాల వారూ అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండగ సంక్రాంతి. సంక్రాంతి ముగ్గులు దిద్దడంలో, గొబ్బెమ్మల అలంకరణలో, హరిదాసుల పాటలలోనూ, గంగి రెద్దుల ఆటలలోనూ ఎక్కడ చూసినా కళాత్మకత కనిపిస్తుంది. అయితే అదంతా ఆత్మానందం కోసం చేసే కళా ప్రతిభ ప్రకటన అవటం వల్ల, అందులో వాణిజ్య కళలకు ఎన్నోరెట్లు మించిన సహజత్వమూ, సృజనాత్మకతా, ఉత్సాహమూ ప్రతిబింబిస్తాయి. ప్రతి గ్రామీణ కళాకారుడికి సంక్రాంతి అంటే తన కళకు మెప్పునూ, లక్ష్మీ కటాక్షాన్ని కురిపించే సందర్భమే. ఆధునిక జీవితం అందించే సౌకర్యాలతోపాటు, అలనాటి ఆప్యాయతా మానవ సంబంధాల సౌర భాలు కలబోసుకుంటే, మనిషి జీవితం వెలుగుల మ యమౌతుందనేది సంక్రాంతి మనకిచ్చే సందేశం‘ ( ఎం. మారుతి శాస్త్రి )