సంబరాల సంక్రాంతి
మకర సంక్రాంతిలాగా తెలుగుల సంస్కృతికి అద్దం పట్టే పండుగ మరొకటి లేదు. అందుకే పండుగలెన్ని ఉన్నా తెలుగు వారికి ‘పెద్ద పండుగ’ సంక్రాంతే. నూరేళ్ల క్రితం వరకూ విడదీయలేనంతగా జన జీవన స్రవంతిలో భాగంగా నిలిచిపోయిన మకర సంక్రాంతి, సంప్రదాయాలు ఇవ్వాళ నామమాత్రంగానే ఉన్నా యని చెప్పవచ్చు. ముఖ్యంగా నగరాలలో, పట్టణాలలో ఆధునికత ఆనాటి జీవన విధానాన్నీ, ఆర్థిక సామాజిక స్థితులనూ, మానవ సంబంధాలనూ, ఆనాటి విలువ లనూ నానాటికీ కనుమరుగు చేస్తున్న కాలం కదా. అతి వేగంగా మారుతున్న కాలంలో ఉధృతమైన వర దలా మనల్ని ముంచెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో, ఒక్కొక్క సంవత్సరం గడిచేసరికి, మనం మరెంత ఎక్కువ దూరం కొట్టుకు వచ్చామో స్ఫుటంగా చూసి హెచ్చరించే సందర్భంగా ఇప్పుడు మకర సంక్రాంతి ఏటేటా మన ముందు నిలుస్తున్నది.
సూర్యుడు తన నిరంతర పయనంలో మరొక సారి మకర రాశిలో ప్రవేశించే పుణ్య దినం మకర సంక్రాంతి. ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభ దినం. ధర్మాచరణకూ, పుణ్యకార్యాల ప్రారంభానికీ మకర సంక్రాంతి అనువైన కాలం. అన్నిటినీ మించి మానవ సంబంధాల విలువలను సంక్రాంతి సంప్రదా యాలు చాటి చెప్తాయి. పంటలు చేతికివచ్చి, శ్రమ ఫలం అర్ధరూపంలో చేతికొస్తుంది కనుక అన్నిరకాల దానధర్మాలకూ çసంక్రాంతి తగిన కాలం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో యావత్ ప్రజానీకంలోనూ అంద రికీ ఆనందదాయకమైంది సంక్రాంతి.
అన్ని పండగల కంటే ఈ పండగ సంబరాల ఆనందం అంబరాన్ని అంటటానికి ముఖ్యకారణం ఆర్థికం.ధనధాన్యాలూ, పాడిపంటలతో గ్రామాలు కళ కళలాడే కాలంలోవచ్చే పండగ కదా. అందుకే గ్రామీణ సమాజంలో అన్ని వర్గాల వారూ అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండగ సంక్రాంతి.
సంక్రాంతి ముగ్గులు దిద్దడంలో, గొబ్బెమ్మల అలంకరణలో, హరిదాసుల పాటలలోనూ, గంగి రెద్దుల ఆటలలోనూ ఎక్కడ చూసినా కళాత్మకత కనిపిస్తుంది. అయితే అదంతా ఆత్మానందం కోసం చేసే కళా ప్రతిభ ప్రకటన అవటం వల్ల, అందులో వాణిజ్య కళలకు ఎన్నోరెట్లు మించిన సహజత్వమూ, సృజనాత్మకతా, ఉత్సాహమూ ప్రతిబింబిస్తాయి. ప్రతి గ్రామీణ కళాకారుడికి సంక్రాంతి అంటే తన కళకు మెప్పునూ, లక్ష్మీ కటాక్షాన్ని కురిపించే సందర్భమే.
ఆధునిక జీవితం అందించే సౌకర్యాలతోపాటు, అలనాటి ఆప్యాయతా మానవ సంబంధాల సౌర భాలు కలబోసుకుంటే, మనిషి జీవితం వెలుగుల మ యమౌతుందనేది సంక్రాంతి మనకిచ్చే సందేశం‘
( ఎం. మారుతి శాస్త్రి )