చీమలా పని చేయటం | Opinion on Jyothirmayam by Dr.N.Anantha Lakshmi | Sakshi
Sakshi News home page

చీమలా పని చేయటం

Published Wed, Jan 11 2017 1:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

చీమలా పని చేయటం

చీమలా పని చేయటం

నెమ్మదిగా పనిచేసే వారిని చీమలాగా పని చేస్తున్నారు అని అంటాం. అది తక్కువ చేసి మాట్లాడటంలా అని పిస్తుంది. ఎప్పుడైనా ఒక్క చీమ నిద్రపోతూగానీ, కదల కుండాగానీ కనపడుతుందేమో చూడండి.

చూడటానికి నెమ్మదిగా చేస్తున్నట్టుండటంతో పని తెమిలినట్టు ఉండదు. కానీ దాని పుట్ట చూస్తే తెలుస్తుంది. ఎంత ధాన్యం సేకరించి ఉన్నదో. చీమ శరీరమెంత? దానిలో కాలెంత? ఆ కాలితో భూమిని తొలుచుకుంటూ అవి తమ నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి సాధన సంపత్తి, పరికరాలు ఉండవు. చేతనయిన పని చేసుకుంటూ పోవటమే. త్వరగా చేయాలనే తొందర, ఆందోళన, ఒత్తిడి ఉండవు.

సంఘీభావంతో, కలసికట్టుగా చీమలు తయారు చేసుకున్న నివాసం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఏర్పాటు చేసుకున్నది నేల లోపలే అయినా  చిన్న నలుసు కూడా ఉండదు. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చక్కగా అలికినట్టు నున్నగా ఉంటుంది. నేలని ఎంత తెలివిగా తొలుస్తాయంటే ఒక్క చుక్క నీరు కూడా వాటి కన్నాల్లోకి చొరబడదు. వాటి గృహ నిర్మాణ విజ్ఞా నానికి జోహార్లు. వీలైతే మనుషులు వాటి నుంచి నేర్చు కోవాలి.

అయితే, ఆ విజ్ఞానాన్ని మానవులు కాదు కానీ, పాములు బాగా ఉపయోగించుకుంటున్నాయి. తాము ఉండటానికి తగిన ఇల్లు నిర్మించుకోవటం పాములకి తెలియదు. బొరియల్లో ఉంటాయి. కానీ చీమలు చక్కని పుట్ట పెడితే హాయిగా వాటిని సొంతం చేసుకుంటాయి. అయినా చీమలు తమ పని మానవు.

చీమలాగా పని చెయ్యటమంటే నిబద్ధతతో మాత్రమే కాదు. క్రమశిక్షణతో పనిచేయటం. చీమల గుంపు ఒక దారిలో వెడుతుంటే ఒక్కటి కూడా పక్కకి వెళ్లదు. ఒకదాని వెనుక మరొకటి శిక్షణ పొందిన సైనికుల్లాగా కదులు తాయి. చూడముచ్చటగా ఉండే ఆ వరుసని చూసి ఏదైనా అలా క్రమంగా ఉంటే చీమలబారు అని పోలుస్తారు.

ఎటువంటి ఆర్భాటం హడావుడి లేకుండా నెమ్మదిగా తమ మానాన తాము పని చేసుకుంటూ పోయే చీమల పుట్ట లోపల చూస్తే ఎంత ధాన్యం నిలువ ఉంటుందో! తాము తినగా, తమ వారందరూ వర్షాకాలంలో తినటానికి సరిపడినంత ధాన్యం ఉంటుంది. తెలివైన వారు చేసే పని అదే కదా? పగటిపూట రాత్రి కోసం, వేసవిలో వర్షాకాలం కోసం, యవ్వనంలో వార్ధక్యం కోసం, ఇహలోకంలో పర లోకం కోసం జాగ్రత్తపడాలని మనిషికి చెప్పి, హెచ్చ రించవలసిన అవసరం వచ్చింది. చీమకు ఎవరూ చెప్ప లేదు. అందుకే ఎవరైనా కొద్ది కొద్దిగా కూడబెడితే చీమ లాగా కూడబెట్టాడు అంటారు.

క్రమశిక్షణ, పరిశుభ్రత, పనిచేసే మనస్తత్వం, సంపా దించినదంతా ఖర్చు చేయకుండా కావలసినంత తిని, మిగిలినది దొరకని రోజుల కోసం కూడబెట్టడం, సంఘీ భావం మొదలైనవి చీమల పనికి ఉన్న లక్షణాలు. కనుక చీమలాగా పనిచేశారు అంటే కుదురుగా, నిలకడగా, నిబ ద్ధతతో, ఓర్పుతో, క్రమశిక్షణతో, పనిచెయ్యటమే తమ ధ్యేయంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా పనిచేశారు అని అర్థం. అందువల్ల చీమలాగా పని చేస్తున్నారని అనడం అంటే మెచ్చుకోవడమే అవుతుంది.
– డాక్టర్‌ ఎన్‌. అనంతలక్ష్మి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement