Jyothirmayam
-
మీనాక్షీ
అమ్మవారి మీద ముత్తు స్వామి దీక్షితుల వారు రచించిన ఎన్నో కృతులలో ‘మీనాక్షీ! మే ముదం దేవా!’ అన్న కృతి చాలా ప్రసిద్ధం. అందులో ఆమెను దీక్షితుల వారు ‘మీన లోచనీ! పాశమోచనీ!’ అని కూడా సంబోధిస్తారు. జగజ్జననిని ఆరాధించే భక్తులకు చేపల ఆకారంతో అత్యంత సుందరంగా ఉండే ఆ కన్నుల నుంచి ప్రసరించే కటాక్ష వీక్షణం– కడగంటి చూపు– కావాలి. ఫలానా దుఃఖం పోగొట్టమనీ, ఫలానా సుఖం కలిగించమనీ ఆమెను ప్రత్యేకంగా వేడుకోనక్కర్లేదు. ఆమె చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే భావిస్తారు.ఇలా భావించటం వెనుక ఒక ప్రకృతి విచిత్రం ఉన్నది. ప్రకృతిలో ప్రాణులన్నిటికీ తమ సంతానం మీద మమతానురాగాలు ఉండటం స్వాభావికం. కోతులలో పిల్ల కోతులు, తల్లి పొట్టను తామే గట్టిగా కరచుకొని తల్లితో వెళుతుంటాయి. బిడ్డ శ్రద్ధగా ఉంటేనే తల్లి సహకారం లభిస్తుంది. ఇది ‘మర్కట కిశోర న్యాయం’. పిల్లి పిల్లలది మరో దారి. తల్లి పిల్లి పిల్లను అతి జాగ్రత్తగా నోట కరచుకొని తనతో తీసు కువెళ్లి వాటిని సురక్షితంగా ఉంచుతుంది. ఇక్కడ తల్లి ప్రమేయమే ఎక్కువ, పిల్లలేమీ చేయనక్కర్లేదు. ఇది ‘మార్జాల కిశోర న్యాయం’. పక్షులు పిల్లల్ని మోయవు. కేవలం గుడ్లు పెడతాయి. వాటిని అవసరమైనంత మేరకు తమ శరీరాలతో పొదిగి, తమ శరీరం వేడిని వాటికిచ్చి, అవి ఎదిగేందుకు దోహదం చేస్తాయి. పక్షుల పిల్లలకు ఆ మాత్రమే చాలు. తాబే ళ్లది వేరే మార్గం. తల్లి తాబేలు గుడ్లు పెట్టి ఎటో వెళ్లి పోతుంది. ఎటు వెళ్లినా ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుందట. చేపలలో మాతృత్వం మరీ చిత్రం. చేప కూడా గుడ్లు పెడుతుంది. పెట్టిన తరువాత వాటికి దూరంగా జరుగుతుంది. దూరాన్నుంచి వెనక్కు తిరిగి తన చూపులు మాత్రం ఆ గుడ్ల మీద ప్రసరింపజేస్తుంది. ఆ తల్లి చేప చల్లని చూపు శక్తి వల్ల, గుడ్లు పొదిగి పిల్లలై తమ జీవితాలు తాము జీవిస్తాయి. అలాగే భగవతికీ భక్తులకూ ఉండే సంబంధం కూడా తల్లీ బిడ్డలవంటి సంబంధమే. అమ్మవారిని ‘మీనాక్షి’ అనటంలో ఉద్దేశం ఆమె కళ్లు మీనాల ఆకారంలో అందంగా ఉంటాయని వర్ణించటమే కాదు. తల్లి చేప తన చల్లని చూపుల మంత్రంతో తన బిడ్డలకు వృద్ధిని కలిగించినట్టు, జగ జ్జనని కూడా తన భక్తులకు చల్లని చూపుల మంత్రం ద్వారా సర్వైశ్వర్యాలని ప్రసాదించగలదన్న సూచనను కూడా గమనించమంటారు పెద్దలు. – ఎం. మారుతి శాస్త్రి -
సంబరాల సంక్రాంతి
మకర సంక్రాంతిలాగా తెలుగుల సంస్కృతికి అద్దం పట్టే పండుగ మరొకటి లేదు. అందుకే పండుగలెన్ని ఉన్నా తెలుగు వారికి ‘పెద్ద పండుగ’ సంక్రాంతే. నూరేళ్ల క్రితం వరకూ విడదీయలేనంతగా జన జీవన స్రవంతిలో భాగంగా నిలిచిపోయిన మకర సంక్రాంతి, సంప్రదాయాలు ఇవ్వాళ నామమాత్రంగానే ఉన్నా యని చెప్పవచ్చు. ముఖ్యంగా నగరాలలో, పట్టణాలలో ఆధునికత ఆనాటి జీవన విధానాన్నీ, ఆర్థిక సామాజిక స్థితులనూ, మానవ సంబంధాలనూ, ఆనాటి విలువ లనూ నానాటికీ కనుమరుగు చేస్తున్న కాలం కదా. అతి వేగంగా మారుతున్న కాలంలో ఉధృతమైన వర దలా మనల్ని ముంచెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో, ఒక్కొక్క సంవత్సరం గడిచేసరికి, మనం మరెంత ఎక్కువ దూరం కొట్టుకు వచ్చామో స్ఫుటంగా చూసి హెచ్చరించే సందర్భంగా ఇప్పుడు మకర సంక్రాంతి ఏటేటా మన ముందు నిలుస్తున్నది. సూర్యుడు తన నిరంతర పయనంలో మరొక సారి మకర రాశిలో ప్రవేశించే పుణ్య దినం మకర సంక్రాంతి. ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభ దినం. ధర్మాచరణకూ, పుణ్యకార్యాల ప్రారంభానికీ మకర సంక్రాంతి అనువైన కాలం. అన్నిటినీ మించి మానవ సంబంధాల విలువలను సంక్రాంతి సంప్రదా యాలు చాటి చెప్తాయి. పంటలు చేతికివచ్చి, శ్రమ ఫలం అర్ధరూపంలో చేతికొస్తుంది కనుక అన్నిరకాల దానధర్మాలకూ çసంక్రాంతి తగిన కాలం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో యావత్ ప్రజానీకంలోనూ అంద రికీ ఆనందదాయకమైంది సంక్రాంతి. అన్ని పండగల కంటే ఈ పండగ సంబరాల ఆనందం అంబరాన్ని అంటటానికి ముఖ్యకారణం ఆర్థికం.ధనధాన్యాలూ, పాడిపంటలతో గ్రామాలు కళ కళలాడే కాలంలోవచ్చే పండగ కదా. అందుకే గ్రామీణ సమాజంలో అన్ని వర్గాల వారూ అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండగ సంక్రాంతి. సంక్రాంతి ముగ్గులు దిద్దడంలో, గొబ్బెమ్మల అలంకరణలో, హరిదాసుల పాటలలోనూ, గంగి రెద్దుల ఆటలలోనూ ఎక్కడ చూసినా కళాత్మకత కనిపిస్తుంది. అయితే అదంతా ఆత్మానందం కోసం చేసే కళా ప్రతిభ ప్రకటన అవటం వల్ల, అందులో వాణిజ్య కళలకు ఎన్నోరెట్లు మించిన సహజత్వమూ, సృజనాత్మకతా, ఉత్సాహమూ ప్రతిబింబిస్తాయి. ప్రతి గ్రామీణ కళాకారుడికి సంక్రాంతి అంటే తన కళకు మెప్పునూ, లక్ష్మీ కటాక్షాన్ని కురిపించే సందర్భమే. ఆధునిక జీవితం అందించే సౌకర్యాలతోపాటు, అలనాటి ఆప్యాయతా మానవ సంబంధాల సౌర భాలు కలబోసుకుంటే, మనిషి జీవితం వెలుగుల మ యమౌతుందనేది సంక్రాంతి మనకిచ్చే సందేశం‘ ( ఎం. మారుతి శాస్త్రి ) -
చీమలా పని చేయటం
నెమ్మదిగా పనిచేసే వారిని చీమలాగా పని చేస్తున్నారు అని అంటాం. అది తక్కువ చేసి మాట్లాడటంలా అని పిస్తుంది. ఎప్పుడైనా ఒక్క చీమ నిద్రపోతూగానీ, కదల కుండాగానీ కనపడుతుందేమో చూడండి. చూడటానికి నెమ్మదిగా చేస్తున్నట్టుండటంతో పని తెమిలినట్టు ఉండదు. కానీ దాని పుట్ట చూస్తే తెలుస్తుంది. ఎంత ధాన్యం సేకరించి ఉన్నదో. చీమ శరీరమెంత? దానిలో కాలెంత? ఆ కాలితో భూమిని తొలుచుకుంటూ అవి తమ నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి సాధన సంపత్తి, పరికరాలు ఉండవు. చేతనయిన పని చేసుకుంటూ పోవటమే. త్వరగా చేయాలనే తొందర, ఆందోళన, ఒత్తిడి ఉండవు. సంఘీభావంతో, కలసికట్టుగా చీమలు తయారు చేసుకున్న నివాసం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఏర్పాటు చేసుకున్నది నేల లోపలే అయినా చిన్న నలుసు కూడా ఉండదు. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చక్కగా అలికినట్టు నున్నగా ఉంటుంది. నేలని ఎంత తెలివిగా తొలుస్తాయంటే ఒక్క చుక్క నీరు కూడా వాటి కన్నాల్లోకి చొరబడదు. వాటి గృహ నిర్మాణ విజ్ఞా నానికి జోహార్లు. వీలైతే మనుషులు వాటి నుంచి నేర్చు కోవాలి. అయితే, ఆ విజ్ఞానాన్ని మానవులు కాదు కానీ, పాములు బాగా ఉపయోగించుకుంటున్నాయి. తాము ఉండటానికి తగిన ఇల్లు నిర్మించుకోవటం పాములకి తెలియదు. బొరియల్లో ఉంటాయి. కానీ చీమలు చక్కని పుట్ట పెడితే హాయిగా వాటిని సొంతం చేసుకుంటాయి. అయినా చీమలు తమ పని మానవు. చీమలాగా పని చెయ్యటమంటే నిబద్ధతతో మాత్రమే కాదు. క్రమశిక్షణతో పనిచేయటం. చీమల గుంపు ఒక దారిలో వెడుతుంటే ఒక్కటి కూడా పక్కకి వెళ్లదు. ఒకదాని వెనుక మరొకటి శిక్షణ పొందిన సైనికుల్లాగా కదులు తాయి. చూడముచ్చటగా ఉండే ఆ వరుసని చూసి ఏదైనా అలా క్రమంగా ఉంటే చీమలబారు అని పోలుస్తారు. ఎటువంటి ఆర్భాటం హడావుడి లేకుండా నెమ్మదిగా తమ మానాన తాము పని చేసుకుంటూ పోయే చీమల పుట్ట లోపల చూస్తే ఎంత ధాన్యం నిలువ ఉంటుందో! తాము తినగా, తమ వారందరూ వర్షాకాలంలో తినటానికి సరిపడినంత ధాన్యం ఉంటుంది. తెలివైన వారు చేసే పని అదే కదా? పగటిపూట రాత్రి కోసం, వేసవిలో వర్షాకాలం కోసం, యవ్వనంలో వార్ధక్యం కోసం, ఇహలోకంలో పర లోకం కోసం జాగ్రత్తపడాలని మనిషికి చెప్పి, హెచ్చ రించవలసిన అవసరం వచ్చింది. చీమకు ఎవరూ చెప్ప లేదు. అందుకే ఎవరైనా కొద్ది కొద్దిగా కూడబెడితే చీమ లాగా కూడబెట్టాడు అంటారు. క్రమశిక్షణ, పరిశుభ్రత, పనిచేసే మనస్తత్వం, సంపా దించినదంతా ఖర్చు చేయకుండా కావలసినంత తిని, మిగిలినది దొరకని రోజుల కోసం కూడబెట్టడం, సంఘీ భావం మొదలైనవి చీమల పనికి ఉన్న లక్షణాలు. కనుక చీమలాగా పనిచేశారు అంటే కుదురుగా, నిలకడగా, నిబ ద్ధతతో, ఓర్పుతో, క్రమశిక్షణతో, పనిచెయ్యటమే తమ ధ్యేయంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా పనిచేశారు అని అర్థం. అందువల్ల చీమలాగా పని చేస్తున్నారని అనడం అంటే మెచ్చుకోవడమే అవుతుంది. – డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
చర్యల ఉద్దేశం
వ్యక్తులు చేసే పనులు, మాట్లాడే మాటలు మంచివా, చెడ్డవా అని ప్రధానంగా నిర్ణయించేది వాటి ఉద్దేశాన్ని బట్టే కాని పైకి కనిపించేవాటిని బట్టి కాదు. ప్రాణులను హింసించరాదు. మారణాయుధా లతో ఏ ప్రాణినీ గాయపర్చరాదు అనేది నీతి. కాని ప్రమాదాలు, ఇతరుల దాడుల్లో గాయపడిన వారికి ప్రాణహాని సంభవించకూడదనే ఉద్దేశంతో వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేస్తూ ఉంటారు. ఆ సమ యంలో వారు ఉపయోగించే పరికరాలపై ఎవరూ ఆంక్షలు విధించరు. ఎందుకంటే వారు రక్షించే ఉద్దే శంతోటే వైద్యం చేశారు. ప్రాణాలు నిలిపారు. అలాగే భగవంతుడు కూడా భక్తులు సమర్పించే పూలనో, పండ్లనో, వస్తువులనో, పదార్థాలనో కాకుండా భక్తుల ఉద్దేశాన్ని గ్రహిస్తాడు. వారు మంచి ఉద్దేశంతో సమర్పించారా లేదా అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తాడని ‘భావ గ్రాహీ జనార్దనః’ అనే వాక్యం స్పష్టం చేస్తుంది. హనుమంతుడు లంకా నగ రంలో ప్రవేశించిన తర్వాత సీతమ్మను వెతుకుతూ రావణాసురుని అంతఃపురంలోకి ప్రవేశించాడు. అంతఃపుర కాంతలెందరో హనుమం తునికి కనిపించారు కానీ సీతమ్మ దర్శనం కాలేదు. రావణుని శయన మందిరంలో నిద్రిస్తున్న వనితలను ఎందరినో చూశాను కానీ దానివల్ల నాకు ఏదైనా ధర్మలోపం ఏర్పడుతుందేమో అని హనుమంతుడు ముందుగా సంశయగ్రస్తుడయ్యాడు. కానీ పర్యాలో చన చేసిన తర్వాత, సీతమ్మను వెతికే దృష్టితోనే రావ ణుని అంతఃపుర కాంతలను చూశాను కానీ నాకు వేరే ఉద్దేశం లేనందున నేను చేసిన పనిలో ధర్మ విరుద్ధ మైన అంశం కానరావడం లేదని హనుమంతుడు నిర్ధారించుకున్నాడు. అంటే మంచి పనిలో కానీ, చెడు పనిలో కానీ ఇంద్రియాలను అన్నింటినీ ప్రవర్తింపచేసేది మనస్సే. ఆ మనస్సు నా వశంలోనే ఉన్నది. నా మనస్సులో కాని నా దృష్టిలో కాని చేష్టలలో కాని ఏ దురుద్దేశమూ లేనందున ప్రాజ్ఞులెవరూ నేను చేసిన పనిని తప్పుపట్ట రని హనుమంతుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. సమాజ హితాన్ని కోరేవారు, సద్గురువులు ప్రాచీన కాలంలో శాస్త్రకర్తలు ఏర్పరచిన నియమా లను కొన్నింటిని కొన్ని సందర్భాలలో ఉల్లంఘిం చినట్లు పైకి కన్పిస్తుండవచ్చు. కానీ వారలా ప్రవర్తిం చడానికి కారణమేమిటి? వారి ఉద్దేశం ఏమిటి అని ముందు తెలుసుకోవాలి. అపుడే వారు చేసిన పనిలో దాగివున్న ఆంతర్యం ఏమిటో బోధపడుతుంది. ఎక్కువమందికి మేలు కలిగించే ఉద్దేశంతో కాలానుగుణంగా కొన్ని నియమాలను ఉల్లంఘిం చినా తప్పులేదనే వాస్తవాన్ని గుర్తిద్దాం. ( సముద్రాల శఠగోపాచార్యులు ) -
లక్ష్య శుద్ధి
ఏదైనా సాధించాలంటే లక్ష్య శుద్ధి ఉండాలి. లక్ష్య శుద్ధి ఉంటేనే లక్ష్య సిద్ధి ఉంటుంది. చాలామంది తమ జీవితంలో ఏదీ సాధించలేక పోవటానికి కారణం తమకేం కావాలో తెలియక పోవటమేనట. నీకేం కావాలి? అని అడిగితే చాలామంది వెంటనే చెప్పలేరు. ఎంతోమంది ఆలోచించినా చెప్ప లేరు. ఎక్కువ మందికి అసలు ఏం కావాలో వారికే తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. పైగా తమకు ఏదీ కలిసి రావటం లేదని, దేవుడిని, ఇంకా వీలైనంత మందిని ఆడిపోసుకుంటారు. ఈ లక్ష్యం నిశ్చయించుకో వటం చిన్నతనం నుండి అలవాటు చేయవలసి ఉంది. నేటి యువత రంలో ఇటు వంటి నిర్దిష్ట లక్ష్యం కనపడటం అరుదు. చిన్నతనం నుంచి దిశా నిర్దేశం చేయటం అవసరం. చిన్న పిల్ల లను ఎవరినైనా– నువ్వు పెద్ద అయినాక ఏమవాల నుకుంటున్నావు? అని, పోనీ, నువ్వేం చదవాలనుకుం టున్నావు? అని అడగండి. ఏదో ఒకటిలే అంటారు. దేనిలో సీటు వస్తే అదే చదువుతానంటారు. అంకెలను చూస్తే కంగారుపడేవాడు లెక్కలు ప్రధానంగా ఉండే ఇంజనీరింగ్ చదవవలసి వస్తే...? తరువాత ఎప్పుడో నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను నాకిష్టం లేదని అనే మాటలు తప్పవు. అందుకే చిన్నతనం నుండి ప్రతివారికి ఒక లక్ష్యం ఉండాలి. అపుడు ఈ నిరాశా నిస్పృహలు ఉండే అవ కాశం తక్కువ. జీవితం లక్ష్య సాధనతో సాగుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఫలితం కన్న ప్రయత్నంలోనే తృప్తి ఎక్కువ కనుక తనవంతు కృషి చేయటంలో ఆనందం పొందుతూ ఉంటారు. సరైన లక్ష్యమే లేనప్పుడు జీవి తం గాలివాటంగా సాగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక పిల్లవాడిని తల్లి డాక్టరు చెయ్యాలనుకుంటుంది. తండ్రి ఇంజనీర్ని చెయ్యాలను కుంటాడు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడి బుర్ర లోకి ఎక్కిస్తారు. ఏ ఒక్కదాని మీదా దృష్టి కేంద్రీ కరించటం జరుగదు. దొరికిన కోర్సులో చేరిపోయి, ఏ గుమస్తాగానో స్థిరపడటం జరుగుతుంది. అలా కాకుండా ఒక్కదానినే అనుకొని, దానిమీదే సర్వ శక్తులు కేంద్రీకరించి ఉంటే అతడు దానిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవాడు. ఒక్కటే తెలుసుకుని మిగి లినవి మానెయ్యాలా అనే సందేహం రావచ్చు. ప్రధా నమైన దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి మిగిలినవి ఆను షంగికంగా నేర్చుకోవాలి. అవన్నీ ప్రధాన లక్ష్యానికి సహకరించేట్టు చేసుకోవాలి. లక్ష్య శుద్ధికి ప్రబలోదహరణం అర్జునుడు పక్షి కంటిని కొట్టమంటే అతడికి అది ఉన్న చెట్టుగానీ, ఆకులుగానీ, పక్షి శరీరంగానీ కనపడలేదు. పక్షి కన్ను మాత్రమే కనపడింది. అదీ లక్ష్య శుద్ధి అంటే. దేని గురించి అయినా అటువంటి ఏకాగ్ర దృష్టి ఉంటే తప్పక సాధిస్తారు. అలా దృష్టి కేంద్రీకరించాలంటే తన లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోవటం ప్రధానం. సాధించవలసిన లక్ష్యాన్ని గుర్తించటం నేర్పితే చాలు. పెద్దలు ఇంకేమీ చెప్పనవసరం లేదు. తమకు కావ లసిన దాని కోసం వారే పాటుపడతారు. – డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
అందుబాటు
అందుబాటులో ఉండటం ప్రేమను వ్యక్తీకరించే పద్ధతులలో అతి ప్రధానమైనది. ఆ ప్రేమ–స్నేహం, వాత్సల్యం, దాస్యం, భక్తి, గౌరవం... ఏ రూపంలోనైనా ఉండవచ్చు. నా గుండెల నిండా నీమీద ప్రేమ ఉంది అని చెబితే సరిపోదు. ఆ ప్రేమ లేదా నిర్హేతుకమైన ఇష్టం ఎవరిమీద ఉన్నదో వారికి అన్నివిధాలా– భౌతి కంగా, మానసికంగా చేరువై ఉండాలి. ప్రేమ మాత్రమే కాదు, బాధ్యత విద్యుక్త ధర్మాల విషయమూ అంతే. చిన్న పిల్లవాడికి భయం వేసి అమ్మా! అని కేక పెడితే.. గజేంద్రమోక్షం చదువుతున్నాను, అయ్యాక వస్తాననో, టీవీ సీరియల్లో పతాక సన్నివేశం పూర్తి అయ్యాక వస్తాననో అంటే ఆ తల్లిదండ్రులు ఉండి ఏం ప్రయోజనం? ఎక్కడో విదేశాలలో ఉంటూ, పిల్లలను వసతి గృహాల్లో ఉంచిన దానికీ, దీనికీ తేడా లేదు. కార్యాలయాల్లోనూ అంతే. అవసరానికి తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి వెంటనే సమస్యను పరిష్కరించి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి తీసుకుంటున్న జీతానికి న్యాయం చెయ్యాలి. కొంతమంది ఎప్పుడూ తమ స్థానాల్లో కనపడరు. వినియోగదారుడికి అందుబాటులో లేకపోవటం ఉద్యోగి ధర్మం కాదు. అందుబాటులో ఉండటం అన్నది దైవీ లక్షణం. భగవంతుడు ఎప్పుడూ భక్తులకు అందుబాటులోనే ఉంటాడు. ఇప్పుడు తీరిక లేదనిగాని, అలసిపోయాననిగానీ, నీకు అర్హత లేదనిగానీ వాయిదా వెయ్యడు. అడగటం చేతకాక ఏమి అడగాలో, ఎలా అడగాలో తెలియకే చాలామంది కోరికలు తీరవు. ఆదర్శ మానవుడు శ్రీరాముడు తనను ఎప్పుడైనా ఎవరైనా కలవవచ్చును. నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను అని.. పిలవడానికి ఒక గంటను ఏర్పాటు చేశాడు. ఒకమారు తనకి అన్యాయం జరిగిందని ఆరోపించి, న్యాయం చెయ్యమని ఒక కుక్క వచ్చి అడిగితే వెంటనే దానికి హాని చేసిన వాడికి అది చెప్పిన శిక్షనే విధిం చాడు. మానవులకే కాదు. సర్వజీవులకు అందుబాటులో ఉండి తన ధర్మాన్ని నిర్వర్తించాడు. లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబ య్యె... కావవే వరద ‘సంరక్షింపు భద్రాత్మకా’ అని గజేంద్రుడు ప్రార్థించగానే ‘ఆట పూర్తి అయ్యాక వస్తాను.. అలంకరించుకుని, మంది మార్బలం కూర్చుకొని వస్తాను’ అని అనలేదు శ్రీమహావిష్ణువు. తన భక్తుణ్ణి కాపాడటానికి ఉన్నవాడు ఉన్నట్టుగా ఎలా పరుగెత్తాడంటే ‘సిరికిం జెప్పడు, శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడే/ పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం/ తరధమ్మిల్లము చక్క నొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచో/ పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహిౖయె’. అదీ అందుబాటులో ఉండటం అంటే.. (వ్యాసకర్త : డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి) -
అన్న మాట
రామ–లక్ష్మణ–భరత–శత్రుఘ్నులు అనే నలుగురు ఆదర్శ సోదరులుగా సుప్రసిద్ధిని పొంది ఉన్నారు. శ్రీరాముని వదిలి ఉండలేని లక్ష్మణుడు తనను కూడా అరణ్యానికి తీసుకుపొమ్మని శ్రీరామునితో వాదులాడి అంగీకారాన్ని పొందాడు. అరణ్యవాస సమయంలో సీతారాములకు వివిధ సేవలను అందించాడు. శ్రీరామచంద్రుడే రాజ్యాన్ని పాలించుటకు సమ ర్థుడు, అర్హుడు అని భావించిన భరతుడు సపరివా రంగా అరణ్యానికి వెళ్లాడు. రాజ్యాన్ని పరిపాలించటా నికి తిరిగి అయోధ్యకు రమ్మని శ్రీరాముణ్ణి కోరాడు. మీరు రాజ్యపాలన చేయటానికి అంగీకరించే వరకు నేను నీరు కూడా తీసుకోకుండా కఠినోపవాస దీక్షను చేస్తాను అని గట్టిగా తన అభిప్రాయాన్ని భర తుడు వెలిబుచ్చాడు. అయినప్పటికీ శ్రీరాముని ఆజ్ఞను పాటిస్తూ మహర్షుల, సిద్ధుల, గంధర్వుల ఉపదే శాలను శిరసావహిస్తూ భరతుడు రాజ్యపాలన బాధ్యతను స్వీకరిం చాడు. లక్ష్మణునివలె మొండిపట్టు పట్ట లేదు. పితృవాక్య పరిపాలనా వ్రతాన్ని తాను కొనసా గిస్తున్నానని, 14 ఏళ్లు పూర్తికాగానే తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని స్వీకరిస్తానని, అంతవరకు రాజ్య పరిపాలనలో నీకు ఈ పాదుకలు సహాయంగా ఉంటా యని భరతునితో శ్రీరాముడు పలికాడు. భరతుడు అంగీకార సూచకంగా శ్రీరామ పాదుకలను స్వీక రించి శిరస్సుపై ధరించాడు. అన్నకు ప్రదక్షిణం చేసి ఆజ్ఞ తీసుకొని నంది గ్రామానికి చేరి శ్రీరామ పాదు కలను రాజసింహాసనంపై ఉంచి శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం 14 ఏళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు. తాను రాజ్యాన్ని వదలటానికి, ఈ అరణ్యానికి రావటానికి కారణం కైకేయియే అనే భావనతో భర తుడు కైకేయిని కోపంతో నిందిస్తాడేమోనని శ్రీరా ముడు ఊహించాడు. అందుకే ఓ భరతా! నీవు కైకేయి మాతను దూషించవద్దు. ఆమెపై రోషాన్ని తెచ్చు కోవద్దు. ఆమెను కాపాడు.. అని శ్రీరాముడు భరతుణ్ణి ఆజ్ఞా పించాడు. అన్నమాట ప్రకారం భరతుడు రాజ్యాన్ని సక్ర మంగా పాలించి రాజ్యంయొక్క అభివృద్ధికి పాటు పడటమే కాకుండా కైకేయిపట్ల కూడా ఆదరభావాన్ని చూపాడు. శ్రీరాముడు అరణ్యం నుండి తిరిగి వచ్చి నాక అన్నగారూ! మీ మాట ప్రకారం నా తల్లి కైకేయిని గౌరవ భావంతో ఆదరించాను. ఆమెను కోపగించ లేదు. మీ ఆజ్ఞను పాటిస్తూ మీ ప్రతినిధిగా మీ పాదు కలు ముందు పెట్టుకొని ప్రజాసేవ చేశాను. తిరిగి మీకు రాజ్యాన్ని సమర్పిస్తున్నాను.. అని భరతుడు శ్రీరామ పట్టాభిషేక సమయంలో విన్నవించాడు. అన్నమాటను జవదాటని భరతుని భ్రాతృభక్తి ప్రశంసనీయమైనది. (వ్యాసకర్త : సముద్రాల శఠగోపాచార్యులు) -
దుఃఖ పరంపర
వివేక సంపన్నుడైన మానవుడు మంచి, చెడులను గుర్తించగలుగుతాడు. అద్భుత కార్యాచరణతో చరిత్రలో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. అయితే మానవునికి అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలు, బాధలు అతడిని దుఃఖ సముద్రంలో ముంచేస్తుంటాయి. బాల్యంలో దుఃఖాలకు చోటు లేదు అనిపిస్తుంది. కానీ యుక్తాయుక్త విచక్షణా జ్ఞాన ముండదు. అందువల్ల ప్రతి పనీ యోగ్యమైనదనే అని పిస్తుంది. అందుకే బాల్య చేష్టల వల్ల ఎన్నో దుఃఖాలను పొందవలసి వస్తుంది. బాల్యావస్థను దాటి యౌవనం లోకి అడుగుపెట్టిన వారికి శరీరంలో పటుత్వం ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగు తారు. పైగా యుక్తాయుక్తములను విచారించగల శక్తి యుక్తులు కూడా ఉంటాయి. కానీ యౌవనంలో మనస్సు, ఇంద్రియాలు భోగానుభ వమునకై ప్రేరేపిస్తుంటాయి. వ్యక్తిని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. యుక్త వయస్సులో ఉన్నవారిలో ఏ కొద్ది మందో తప్ప, అంతా సుఖానుభవమును పొందే ప్రయత్నంలో అనేక విధములైన దుఃఖాలను పొందుతూ ఉంటారు. ఇక ముసలితనంలో కోరికలు తగ్గుముఖం పడు తాయి. ఈ సమయంలోనైనా శాశ్వతానందాన్ని పొందగల కార్యాలను నిర్వహిద్దామనుకుంటే... శారీ రక బలహీనతవల్ల మనస్సు నీరసపడుతుంది. బుద్ధి చలిస్తూ ఉంటుంది. నిరాశా నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఈ విధంగా మనిషి జీవితంలో దుఃఖ పరం పరయే రాజ్యమేలుతూ ఉంటుంది. ‘‘నిర్వివేకతయా బాల్యం కామోన్మాదేన యౌవనం ‘ వృద్ధత్వం వికలత్వేన సదా సోపద్రవం నృణామ్’’ అనే శ్లోకం అదే వెల్లడిస్తుంది. ఈ చరాచర ప్రపంచం శాశ్వతమైనది కాదు. ఈ శరీరమూ నశించిపోయే స్వభావాన్ని కలిగినట్టిది. అయినప్పటికీ కూడా జనులు ఈ శరీర సౌఖ్యం కొరకు పడరాని పాట్లు పడుతూ ఆశ్చర్యకరమైన రీతిలో దుఃఖ పరంపరను పొందుతున్నారు ‘‘నిఖిలం జగదేవ నశ్వరం పునరస్మిన్ నితరాం కలేబరమ్ ‘ అథ తస్య కృతే కియానయం క్రియతే హన్త జనైః పరిశ్రమః’’ అనే శ్లోకం అదే చెబుతోంది. ‘‘వాస్తవాన్ని గుర్తించలేని స్థితిలోనున్న ఓ జను లారా! చెడు తలంపుతో జీవనయానాన్ని సాగించే మానవులారా! ఈ శరీరం కూడా సహజంగానే పరి మితమైన శక్తిని కలిగినట్టిది. వయసు పెరిగిన కొద్దీ మరింత బలహీనంగా తయారగునట్టిది. వృద్ధా ప్యంలో రోగాలతో కృశించి పోవునట్టిది. ఎన్నెన్ని ఔష ధాలు సేవించినా ఇట్టి శరీరానికి స్వస్థత చేకూరు తుందా? మరణం రాకుండా ఆగుతుందా? అందు వల్ల శ్రీకృష్ణ నామాన్ని మంత్రంగా భావించి నోరారా పలుకండి, ఔషధంగా స్వీకరించి ఆరోగ్యాన్ని పొందండి లేదా హృదయాభరణంగా ధరించండి’’ అని కులశేఖరులు అనే ఆళ్వార్లు ముకుందమాల అనే స్తోత్రంలో బోధించారు. మన పూర్వుల ఉపదేశాలను శిరసా వహిద్దాం. – సముద్రాల శఠగోపాచార్యులు -
యోగ సూత్రం
బ్రహ్మము నుంచి వచ్చిన జీవరాసులన్నిటిలోనూ మానవ జన్మ ఉత్తమమైనది. మానవులకు మాత్రమే జ్ఞానం సంపాదించి బ్రహ్మమును పొందగల శక్తి ఉంది. మనలోని జీవాత్మ మానసిక, సూక్ష్మ, స్థూలము అను మూడు పొరలచే కప్పి ఉండటం వల్ల పరమా త్మను తెలుసుకోలేకపోతున్నది. మనం చేసే కార్యాలు మనకు తెలియకుండా జరగడం వల్ల ఇదంతా మాయ వల్ల జరుగుతున్నదని అనుకుంటాం. పరమాత్మ నుండి బయటపడిన అణువును అంతరాత్మ అంటాం. పరమాత్మ నుంచి బయలుదేరిన తర్వాత దేహాన్ని ధరింపజేసేది కర్మ. కర్మను నశింపజేసి పరమాత్మను చేసేది యోగం. ఇలాంటి మోక్షం కలిగించే ఉద్దేశంతో తమిళ నాడులో కావేరీ తీరంలోని కుంభకోణంలో 1868లో జన్మించిన బ్రహ్మాంశ సంభూతుడు, సీవీవీగా పిలుచు కునే కంచుపాటి వెంకట్రావు వెంకాసామిరావు ఓ కొత్త యోగాన్ని మానవాళికి ప్రసాదించారు. అందరికీ అమరత్వం, బ్రహ్మత్వం అందించాలన్న ఉద్దేశంతోనే దీన్ని ప్రవేశపెట్టారు. నాశరహిత, మరణరహిత నిరం తర సంపూర్ణ ప్రజ్ఞా చైతన్య సహిత నూతన మానవుని ఆవిష్కరించడమే ధ్యేయంగా ఈ యోగాన్ని 1910 మే 29న మానవాళికి అందించారు. నాటి రుషుల తపస్సుకు అంతిమ లక్ష్యం- బ్రహ్మత్వం పొందడం. అది వ్యక్తికి మాత్రమే పరిమితం. దాని నుంచి దృష్టి మరల్చి సంసారం సాగిస్తూనే స్వధర్మాన్ని పాటిస్తూ తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్న చోటనే ఉంటూ అందరూ బ్రహ్మ త్వాన్ని పొందాలని ఈ యోగాన్ని ఆవిష్కరించారు. ఈ యోగసూత్రం ప్రకారం అందరూ కలసి సాధించాల్సిన ముక్తికి సి.వి.వి. అనే మూడు అక్షరాలు మంత్రశక్తిని ప్రసాదిస్తాయి. అవే మార్గాన్ని నిర్దే శిస్తాయి. అవే సర్వసిద్ధులను ప్రసాదిస్తాయి. సృష్టికి భంగం కలగకుండా సృష్టికార్యం యధావిధిగా జరుపుకుంటూ సృష్టిలోని దోషాలను సవరించేందుకు సీవీవీ పూనుకున్నారు. ‘యోగం’ అంటేనే శివం. కుండలిని యోగశక్తి. ప్రణవం (అంటే నాదం) వాటి సూత్రం. నాద తరంగాలు విశ్వవ్యాప్తమైనట్లే మాస్టరు యోగశక్తి సర్వవ్యాప్తమై ఉంది. అంటే సాధకులకు విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ లేదా పరమాత్మ మాస్టరు ద్వారా, మాస్టరు రూపంలో దర్శనమిస్తాడు. సాధకులకు శాశ్వతత్వం కలిగిస్తాననీ, మరో జన్మ ఉండదనీ, తనను నమ్మిన, తనకు నమస్కరిం చిన వారిని తనంతవారినిగా చేస్తాననీ అభయమి చ్చారు. ఈ యోగ సాధనా ప్రక్రియలో గ్రహచార దుష్ఫ లితాల నుంచి రక్షణ, శరీరంలోగల దోషాలు, కర్మ ప్రారబ్ధం నుంచి విముక్తి కలుగుతాయి. కేవలం ధ్యానం ద్వారా చేసే ఈ యోగాతో ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందవచ్చు. - మునిపల్లె శేషగిరిరావు -
విశ్వచిత్రం
ఒక చిత్ర రచనాక్రమంలో, ధౌతం, ఘట్టితం, లాం ఛితం, రంజితం అనే నాలుగు దశలున్నాయి. చిత్ర కారుడు చిత్ర రచనకు తెచ్చిన తొలి వినిర్మల వస్త్రమే ధౌతం. గట్టి పరచడానికి గంజి పెట్టగా ఏర్పడిన వస్త్రమే ఘట్టితం. ఆ గట్టి పడ్డ వస్త్రంపై ప్రాథమికంగా స్కెచ్ వేయటమే లాంఛితం. ఆస్కెచ్పై చిత్రానికి అను కూలంగా రంగుల్ని వేయటమే రంజితం. ఈ నాల్గు దశల్లో చిత్రం సిద్ధమవుతుంది. చిత్ర రచనకు తొలి దశలో ధౌతం ఉన్నట్లే, ఈ విశ్వచిత్ర రచనకూ ఆదిలో ఉన్నది చిత్ పదార్థమే. అప్పటి ఈ చిత్ పదార్థం మాయ కానీ, మాయా కార్య మైన ద్వైత సంస్పర్శ కానీ లేనిది. అదే విశ్వ చిత్ర రచ నలో తొలిదశ. ఆ చిత్ నేను చాలా కావాలి అని తల పోసి, మాయను పొంది, ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వి అనే పంచ తన్మాత్రల్ని సృజించి, అందులో తానే ప్రవేశాన్ని పొంది, అంతర్యామిగా మారింది. ఇది విశ్వ సృష్టిలో రెండవ దశ. ఈ అపంచీకృత పంచమహా భూతాల్లో, తన్మా త్రలు ఐదింటిలో, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క మహాభూతంలో ఒక్కొక్క గుణాన్ని వ్యష్టిగు ణమంటారు. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్విలో గల విడివిడి సత్వగుణం వ్యష్టి. ఐదింటిలో కల ఐదు సత్వగుణాంశలు కలిస్తే సమష్టి. అలాగే వ్యష్టి రజోగుణం, సమష్టి రజోగుణం. వ్య ష్టితమోగుణం, సమష్టి తమోగుణం. ఐదింటి ఐదు వ్యష్టి సత్వగుణాలవల్ల, శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వఘ్రాణాలనే పంచ జ్ఞానేంద్రియాలు జనించాయి. ఐదు తన్మాత్రల సమష్టి సత్వాంశచే, మనోబుద్ధి చిత్తా హంకారాలనే అంతఃకరణ పుట్టింది. ఐదింట ఐదు వ్యష్టి రజోగుణాల వల్ల, వాక్ పాణి పాద పాయు ఉపస్థ లనే పంచకర్మేంద్రియాలు పుట్టాయి. ఐదింటి సమష్టి రజోగుణాంశచే, పంచ ప్రాణాలు పుట్టాయి. ఇలా జనించిన పంచ జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణ చతుష్ట యం, ఈ పందొమ్మిదింటి కలయికనే సూక్ష్మ శరీరం అంటారు. ఒక్కొక్కడు తన సూక్ష్మశరీరాన్ని ఎలా అభి మానిస్తాడో, అలా ఈ విశ్వంలోని అన్ని వ్యష్టి సూక్ష్మ దేహాల్ని సమష్టిగా అభిమానించే వాడిని సూత్రాత్మ అంటారు. విశ్వ చిత్ర రచనలో ఇది మూడవ దశ. ప్రతి మహాభూతంలోనూ, దాని స్వీయ తత్వం సగం ఉండి, రెండవ సగంలో మిగిలిన నాల్గు మహా భూతాల తత్వాలు చేరటమనే పంచీకరణాన్ని పంచ మహాభూతాలు పొందాయి. ఈ పంచీకృత పంచమ హాభూతాల వల్ల చరాచరాత్మకమైన సృష్టి ఏర్పడింది. ఇదంతా స్థూల ప్రపంచం. ఒక్కొక్కడూ తన స్థూల దేహాన్ని ఎలా అభిమానిస్తాడో, అలా ఈ సృష్టిలోని సమష్టి స్థూల శరీరాల్ని అభిమానించేవాడు విరాట్. ఇది విశ్వచిత్ర రచనలో నాల్గవ దశ. ఈ నాల్గు దశల్లో విశ్వచిత్రం పరమాత్మపై చిత్‌పై ఆరోపితమైనది. ఈ సృష్టి మర్మాన్ని గ్రహించి, విశ్వచిత్రాన్ని దర్శిస్తూ జగత్ చిత్రానికి ఆధారమైన చిత్‌ను ధ్యానిస్తూ, మనమూ తత్వవేత్తలమై నిలుద్దాం. పరమాత్ముని -
మాటలు చూపులు లేని ప్రేమ
జ్యోతిర్మయం ఓ రోజున మెహెర్‌బాబా తన శిష్యుల్ని అడిగారు, ‘కోపంతో ఉన్నప్పుడు మనుషులు ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకొంటూ ఎందుకు మాట్లాడతారు?’ అని. అందుకు శిష్యులు, ‘మనుషులు కోపంతో ఉన్నా రు కాబట్టి అట్లా అరుచుకొంటూ మాట్లాడతారు. కోపం వ్యక్తంచేసే పద్ధతి అది’ అని జవాబిచ్చారు. అది విని బాబా మళ్లీ అడిగారు, ‘అది సరే, మీరు అన్నట్లు వాళ్లు కోపాన్ని ఆ విధంగా అరుస్తూ వ్యక్తం చేయవచ్చు. కోపం వచ్చినప్పుడు పక్క పక్కనే కూర్చొ ని ఉన్న వ్యక్తులు కూడా ఒకరితో ఒకరు దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడినట్లు గట్టిగా గొంతు చించు కొని అరుస్తూ మాట్లాడతారు. మెల్లగా మాట్లాడినా వాళ్లకు వినపడుతుంది కదా? అలాంటప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడినట్లు అరుస్తూ మాట్లాడటం ఎందుకు?’ దానికి శిష్యు లు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. కానీ ఏదీ బాబాకు తృప్తి నివ్వలేదు. బాబాయే ఇలా చెప్పారు. ‘ఒక వ్యక్తికి ఇంకొక అతని మీద కోపం వచ్చినప్పుడు, కోపంతో ఉన్న వ్యక్తి హృదయం నుండి ఆ ఇంకొక అతను దూరంగా తొలగిపోతాడు. అప్పుడు ఇద్దరి మధ్య సన్నిహితత్వం పోయి మానసి కంగా దూరం అయిపోతారు. దానివల్ల ఇద్దరూ ఒకరి నుండి ఒకరు భౌతికంగా కూడా చాలా దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఆ స్థితిలో వారు ఎంత దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందితే అంత బిగ్గరగా గొంతు చించుకొని అరుస్తారు. ఎంత ఎక్కువ దూరం అయితే అంత ఎక్కువగా అరుస్తారు. ప్రేమ అదృశ్యమవుతుంది. ప్రేమ లోపించటంతో ఇవ తలి వాడు ఎంత పెద్దగా అరిస్తే అవతలివాడు తిరిగి అంత పెద్దగానూ అరుస్తాడు. కోపం తగ్గేటంత వరకు, అంటే హృదయాలు మళ్లీ దగ్గరయ్యేటంత వరకు, ప్రేమ మళ్లీ మొలకెత్తేటంత వరకు, ఆ అరుచుకోవటం అనేది అలా సాగుతూనే ఉంటుంది.’ ‘ఇప్పుడు మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని తీసుకోండి. పరస్పరం ప్రేమతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుకుంటారు?’ అని అడిగారు బాబా. ‘వారు నెమ్మదిగా, మృదువుగా మా ట్లాడుకుంటారు’ అని సమాధానం చెప్పారు శిష్యులు. బాబా ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంకా ఇలా అన్నారు. ‘పరస్పరం ప్రేమతో ఉన్నవారు చాలా నెమ్మ దిగా మృదువుగా మాట్లాడుకొంటారు. వారి ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే వారి కంఠస్వరం అంత శాంతంగా, అంత నెమ్మదిగా, అంత మృదు వుగా ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అసలు మాటలే ఉండవు. మాటలాడే అవసరమే రాదు. అప్పుడు ఇద్దరూ ఒకరిని ఒకరు కేవలం చూసుకోవటంతోనే తృప్తిపడతారు. ప్రేమ ఇంకా పరాకాష్టకు చేరుకొన్నప్పుడు, ఆ చూసు కొనే అవసరం కూడా కలగదు.’ - దీవి సుబ్బారావు -
అంతర్వాణి చెప్పడం వరకే
జ్యోతిర్మయం ‘ఆద్యశాంతి’ అనే భారతీయ నామాన్ని ధరించిన ఒక అమెరికన్ ప్రారంభంలో జెన్ సాధకుడు. ఆద్యశాంతి ‘ఆధ్యాత్మికంగా మేల్కొన్నాడు’ అని గురువు గమనించి, ‘ఇక ఇతర్లు మేల్కొనడానికి మార్గం చూపు’ అని దీవించి పంపాడు. అప్పటి నుంచి (1996) ఆద్య శాంతి బోధిస్తూ ఉన్నాడు. అతడితో ఒకరు జరిపిన సంభాషణ ఇక్కడ ఇస్తున్నాను. ప్రశ్న: ఇరవై ఐదేళ్ల వయసులో మీ మొదటి ‘మేల్కొనడం’ జరిగిందంటా రు. ఆ సమయాన మీకేదో కంఠధ్వని వినిపించింది అని చెప్పారు. అది ఎవరిది? మీ ‘కాన్షెన్స్’ అంతరాత్మ అంటా రా? లేక, లోనవుండేటి మరే దైనా నిశ్చల కంఠస్వరమా? ఆద్యశాంతి: అదో అంతర్వాణి. దానికి మీరే పేరైనా పెట్టండి. ప్ర: అందరికీ ఆ వాణి ఉన్నదంటారా? ఆద్య: అంతా మానవులమే కాబట్టి, అందరి లోనూ ఉండి తీరాలి. కానీ సాపేక్ష న్యాయంగా మాట్లాడితే, ఆ ధ్వని ఉన్నా అందరూ ఆలకిస్తున్నారా? అనేది ప్రశ్న. ఎక్కువ మంది వినే స్థితిలో లేరు. అంత ర్వాణి, చిత్తశుద్ధి ఈ రెండూ ఒకటే. నా యవ్వనపు అనుభవాన్ని తరచూ ఉదహరిస్తూ ఉంటాను. ఎవరో యువతిని ‘డేట్’ చేసేటప్పుడు, ‘ఈ యువతితో నీకు పొసగదు. చివరికెలాగూ ఇది విఫలమవుతుంది.’ అని అంతర్వాణి చెపుతూనే ఉంటుంది. ముందే వింటే ఏ చిక్కూ లేదు. చివరకు మీ ఇద్దరి మధ్యా సంబంధం సరిగా లేదని తెలియవస్తుంది. తీరా విఫలమైన తర్వాత, ‘పొరపాటు చేశాను’ అని కనుక్కునే బదులు, మొదట్లోనే ఆ కంఠస్వరం సత్యాన్నే పలుకుతోంది అని తెలుసుకొని ఉంటే, ఏ తంటా ఉండేది కాదు. కానీ చివరకు ఆ అంతర్వాణే నెగ్గింది. ఆ కంఠస్వరం మర్మమైనదేం కాదు. ప్రజా నీకంలో అధిక భాగం అప్పుడప్పుడూ వినే ఉంటారు. కానీ దానిని తోసిపుచ్చుతాం. ఆ స్వరం తాను అలా ఎందుకంటున్నదో సమర్థన కూడా ఇవ్వాలిని డిమాండ్ చేస్తాం. మనలోని ఆ స్వరం సత్యమైనదని నిర్ధారణగా చెప్పడానికి, అది తనని తాను సమర్థిం చుకోకుండా ఉండటమే గుర్తు. ఎందుకిలా అంటు న్నావ్ అని నీ ‘అహాన్ని’ అడిగితే, నీ అహం నీకెన్ని కారణాలైనా చెప్తుంది. శాయశక్తులా తనని తాను సమర్థించుకుంటుంది. ఈ అంతర్వాణికి నిశ్చయధ్వని ఉండదు. నమ్మించడానికి ఏ ప్రయ త్నమూ చేయదు. ఈ అంతర్వాణి ఒక వరం లాంటిది. ఒకరు వింటారు, మరొకరు వినరు. నేనెందుకు విన్నానో తెలియదు. వింటున్నందుకు ఆనందిస్తూ ఉంటాను. అన్ని సందర్భాల్లో విన్నాను అనీ చెప్పలేను. కానీ అది చెప్తూనే ఉన్నది. ప్ర: అది మార్గదర్శి లాంటిదా, రక్షణ ఇస్తుం టుందా! మన మనసులో భాగమా? ఆద్య: అవన్నీ కలసినది. అది ఉనికికి చెందిన మహా ప్రవాహం. నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
ఆత్మసాక్షాత్కారం
జ్యోతిర్మయం ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు. ఒకే వ్యక్తి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీ, ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీ, ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ, ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీ నంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది. కనుక మన కున్న రెండు సాధనాల్లో అంతరంగమే ప్రధానం. శరీరం గౌణం. మనిషి జీవన యాత్రలో విజయాల్ని సాధించాలన్నా, పరాజ యాల్ని చవిచూడాలన్నా, రాజ్యాలేలాలన్నా, అంతరిక్షంలోకి ఎగ రాలన్నా, కావ్యాల్ని అల్లాలన్నా, వైజ్ఞానికంగా అభివృద్ధి చెందా లన్నా, ఇలా లౌకికంగా ఏ వ్యవహారాన్ని చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం. ఇంక అలౌకిక మార్గంలో జపతపాల్ని చేయాలన్నా, పూజాదికాల్ని నిర్వహించాలన్నా, యజ్ఞయాగాదుల్ని నిర్వర్తించాలన్నా, వ్రతాదుల్ని అనుష్టించాలన్నా, పారాయణల్ని చేయాలన్నా, మహాత్ముల ప్రవచనాల్ని వినాలన్నా, పుణ్యక్షేత్రాల్ని దర్శించాలన్నా, శాస్త్రాల్ని అధ్యయనం చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం. ఇంక ఆధ్యాత్మికంగా నేనెవర్ని, ఈ జగత్తేమిటి, పరమేశ్వరు డెవ్వడు అన్న విచారణ చేయాలన్నా, వేదాంత వాక్యాల్ని శ్రవణం చేయాలన్నా, మననం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఈ అంతరంగమే ప్రధాన సాధనం. ఆధ్యాత్మిక మూలాల్ని తరచి చూస్తే, అమనస్క స్థితియే అంటే మనసు లేని స్థితియే బంధ విముక్తి అనీ ముక్తి అనీ వేదాంతం ఘోషిస్తోంది. సూటిగా చెప్పా లంటే ముక్తిని సాధించాలంటే మనిషి, తనకున్న ఏకైక ప్రధాన సాధనమైన అంతరంగాన్ని కోల్పోవాలి. ఈ అమనస్క స్థితికి చేరాలన్నా, మనిషి మనస్సునే ఆశ్రయించాలి. అంటే మనస్సుతోనే మనస్సును నిర్వీర్యం చేయాలి. ఇది ఎలా సాధ్యం? మన నిత్యజీవితంలో మనకు తారసపడే అవస్థలు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు. జాగ్రత్ స్వప్నాలు మనసును ఆశ్రయించినవే. మనసులేని స్థితి సుషుప్తియే కదా! జీవన్ముక్తి పొందాలంటే మనసు అధీనంలో ఉన్న జాగ్రత్ దశలో ఉంటూనే, మనసు లేని సుషుప్తిని పొందగలగాలి. అంటే కర్మ చేస్త్తూనే కర్తృత్వ భోక్తృత్వాల్ని పరిత్య జింపగలగాలి. నేను కర్తను భోక్తను కాను, సర్వ వ్యవహారాలకు ఆధారమైన చైతన్యాన్నే నేను, అన్న నిష్ఠ కలిగి ఉండాలి. అదే ఆధ్యా త్మికం. నిన్ను నీవు చైతన్య స్వరూపంగా ధ్యానిస్తూ, ప్రాణులందరినీ చైతన్య స్వరూపాలుగా భావించాలి. ప్రపంచాన్నే ఒక చైతన్య స్రవం తిగా దర్శించాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ స్థితిలో తరతమ భేదాలుండవు. జయాపజయాలుండవు. సుఖదుఃఖాలుండవు. అప్పుడు కర్మల్ని మనం మరింత ఉత్తేజంగా చేయగలుగుతాం. ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాం. లోకహితాన్ని కోరగలుగుతాం. ఇహపరాల్ని సాధించగలుగుతాం. పరమాత్ముని -
జీవన్ముక్తుడు
ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్యజాతే, తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్య నశ్నన్నన్యో అభిచాకశీతి. ఒక చెట్టును రెండు పక్షులు ఆశ్రయించి ఉన్నాయి. ఆ రెండు పక్షుల్లో ఒకటి ఆ చెట్టు ఫలాల్ని ఆరగిస్తూ ఉన్నది. రెండవ పక్షి ఆ ఫలాల్ని ఆస్వాదించకుండా, జరుగుతున్న దానినంతటినీ చూస్తూ ఉన్నది. ఈ చెట్టు- రెండు పక్షులు అన్న ఉదాహరణ ద్వారా శ్వేతాశ్వతరో పనిషత్తు జీవేశ్వరుల స్థితిగతుల్ని అభివర్ణించింది. చెట్టు అంటే మానవదేహం. ఆ చెట్టును ఆశ్రయిం చిన రెండు పక్షుల్లో ఒకటి జీవుడు, రెండవది ఈశ్వ రుడు. జీవుడు ఈ దేహంతో ఉంటూ కర్మఫలాల్ని అను భవిస్తూ, సుఖదుఃఖాలకు లోనవుతూ ఉన్నాడు. ఈశ్వ రుడు ఈ దేహంలో ఉంటూనే, కర్మల, కర్మఫలాల సంపర్కం లేక, సుఖదుఃఖాలకు లోనుకాక, కేవలం సాక్షి స్వరూపంగా సర్వాన్ని దర్శిస్తున్నాడు. ఖాదిత్య దీపితే కుడ్యే దర్పణాదిత్య దీప్తివత్, కూటస్థ భాసితో దేహో ధీస్థ జీవేన భాస్యతే. ఇదే విషయాన్ని విద్యారణ్యస్వామి ‘వేదాంత పంచ దశి’లో ఒక మైదానంలోని గోడను తీసుకొని చెప్పారు. ఆ గోడపై ఎట్టి కప్పూలేదు. ఆకాశంలోని సూర్యుని కాంతి సరాసరి ఆ గోడపై ప్రసరిస్తోంది. ఆ గోడకు ఎదురుగా ఎన్నో అద్దాలు ఉన్నాయి. ఆ అద్దాల్లో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అద్దాల నేకం. ప్రతిబింబాలనేకం. అద్దా ల్లోని సూర్య ప్రతిబింబాల నుంచి బయల్పడిన కాంతివలయాలెన్నో ఆ గోడపై పడుతున్నాయి. ఇప్పుడు గోడపై రెండు ప్రకాశాలున్నాయి. ఒకటి గగనంలోని సూర్య ప్రకాశం. రెండవది దర్పణాల్లోని సూర్య ప్రతిబింబాల ప్రకాశం. ఈ రెంటికీ ఆధారం సూర్యుడే. తేడా అల్లా, మొదటి ప్రకాశం సరాసరి సూర్యుని నుంచి గోడపై పడుతున్నది. రెండవ ప్రకాశం సూర్యుడు అద్దాల్లో ప్రతిబింబించగా, ఆ ప్రతిబింబాల నుంచి వెల్వడినది. ఆ గోడలాగే మానవ దేహంలో రెండు చైతన్యాలు ఉన్నాయి. మొదటిది దేహంలో ప్రకాశించే పరబ్రహ్మ చైతన్యం. రెండవది బుద్ధి అన్న దర్పణాల్లో పరబ్రహ్మ అన్న సూర్యుడు ప్రతిబింబంగా, ఆ ప్రతిబింబం నుంచి వెల్వడిన అభాస చైతన్యం. ఇదే జీవచైతన్యం. ఈ రెంటికీ ఆధారం పరబ్రహ్మ చైతన్యమే. అయినా మొదట దానికి మాధ్యమం లేదు. రెండవ దానికి బుద్ధి అనే మాధ్యమం ఉంది. బుద్ధి అన్న మాధ్యమం నుంచి వెల్వ డిన జీవ చైతన్యం అభాస చైతన్యం, బుద్ధి వాసనలకు అనుగుణంగా కర్మల్ని చేస్తూ, కర్మఫలాల్ని సుఖదుః ఖాల్ని అనుభవిస్తుంది. పరబ్రహ్మ చైతన్యం కేవలం సాక్షిగా సర్వాన్నీ దర్శిస్తూ ఉంటుంది. బుద్ధి అన్న మాధ్యమం ద్వారా వెల్వడుతూ, ‘నేను’ గా అభివ్యక్తమయ్యే అభాస చైతన్యం, బుద్ధి వాసనలతో తాదాత్మ్యాన్ని పొంది, కర్మల్ని చేస్తూ కర్మఫలాల్ని, సుఖా ల్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే, జీవ భ్రాంతిలో మిగిలి పోతాడు. అలాకాక శరీర ఇంద్రియ మనః బుద్ధి చిత్త అహంకారాలనే తొడుగుల్లో ఉంటూనే, బుద్ధి వాసన లతో కాక, పరబ్రహ్మ చైతన్యంతో నిశ్చయాత్మకమైన తాదాత్మ్యాన్ని పొందితే, జీవన్ముక్తుడవుతాడు. జీవరూపంలో ఉన్న ఈ జీవన్ముక్తుడే, కర్మల్ని చేస్తూ కర్మఫలాన్ని పొందక, తన కర్మల ద్వారా లోకా లకు మహోపకారం చేస్తూ, మహాత్ముడై ప్రకాశిస్తాడు. పరమాత్ముని -
సహనం అంత సులువైనదా!
సహనం విలువ గురించి మహాభారతం సవివరంగా చర్చించింది. అది చెప్పినంత సులువు కాదని, సహనం సంపూర్ణంగా ఉన్నవారిదే ఉన్నత మానసిక స్థాయి అనీ సందర్భాన్నిబట్టి అనేకానేక ఉదా హరణలు చూపెడుతుంది. మన కవిత్రయం అనేకచోట్ల ‘సంక్షిప్తం’గా రాయడంవల్ల వ్యాస భారతంలోని కొన్ని అంశాలు మనకు అంద కుండాపోయాయి. అందువల్లే మూల గ్రంథ మైన వ్యాసభారతం కూడా విధిగా చదివితే అటు ‘సహనం’ పెరుగుతుంది, ఇటు కవిత్ర యం విడిచిపుచ్చిన ‘ఉదాహరణలు’, ‘ఉపకథలు’ పూర్తిగా దొరుకుతాయి. సహనం విషయంలో అగ్నిదేవుడికి సహితం ఓర్పు నశించిన ఘట్టం చూడండి. అడ్డూ ఆపూ లేకుండా చీటికీ, మాటికీ హోమాలు చేస్తుండటంవల్ల అగ్నిదేవుడికి సహనం నశించిందట. దాంతో నీళ్లలో అట్ట డుగున దాక్కున్నాడట. అగ్ని రాకతో ఏర్పడిన తాపాన్ని భరించలేక పాపం చేపలన్నీ వెళ్లి దేవతలకు మొరపెట్టుకున్నాయి. అయితే, ఈ వెర్రి చేపల తెలివి సంగతి ఆయనకు తెలిసి పోయింది. అవి దేవతలకు మొర పెట్టుకున్న విషయాన్ని ఎవరో అగ్నిదేవుడికి చేర్చారు. ఆయనకు రెండు విధాల సహనం నశిం చింది. వెనువెంటనే ‘‘ఎవరుబడితే వారు వేటాడి సులు వుగా చంపుదురుగాక’’ అని చేపల్ని శపించాడు. హోమా లు చేసేవారిపట్ల సహనం నశించి వచ్చిన అగ్ని దేవుడు చివరకు చేపలపై తన ప్రతాపాన్ని చూపాడు. కోపం ఒకరిపై, శాపం ఒకరిపై అన్నమాట! సహనమో, అసహ నమో... దాన్ని భరించగలిగినవారిపై చూపితే అతి హోమాల జోరు తగ్గేదా?! తనకొచ్చిన ఇబ్బంది కూడా పరిష్కారమయ్యేదా?! ఆయన ఆ పని చేయలేదు. సహనం నశించినవాడికి చిరాకు పెరిగి ‘ముఖమే విల్లుగా అయి, మాటలే వాడి బాణాలయి సూటిగా దిగబడి’ అటువారికీ, ఇటువారికీ తీరిగ్గా విచక్షణ కలిగినా జరగాల్సిన నష్టం జరుగుతుందని సర్వకాలాలనూ ఉద్దే శించి వ్యాసుడంటాడు. శత్రువుల సంగతి చెబుతూ ‘ముం దు ఆయా వ్యక్తుల మనసులోనూ, అవతల సమాజం లోనూ ఉండే శత్రువులనూ కనిపెట్టి ఓడించేవాడికి బయటి శత్రువులు ఒక లెక్క కాదంటాడు. దుస్సహనం, దర్పం, దురహంకారం ఒకలాంటివే. ‘‘...నల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తపః ఫలహాని...’’ చేయకపోదని చెబుతుంది మహాభారతం లోని ఉపకథ. యయాతి మహారాజుగారి బంధువులు ఆధ్యాత్మిక తిప్పలు ఏవో పడి ‘శిబి’ అనే నక్షత్రలోకానికి చేరుకున్నారు. అయితే, ఆ పైస్థాయికి చేర్చగల ఔన్నత్యాన్ని సాధించడానికి అవసరమైన సహనం కరువైంది వాళ్లకు. అందుకే ‘‘మాకు పుణ్యలోకాలు ఉన్నాయా?’’అంటూ అక్క డికి చేరిన యయాతిని అడిగారు. వారందరూ అంత స్థాయికి చేరుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్న యయా తికి ఈ ప్రశ్న మరింత విచిత్రం అనిపించింది. మానసిక ఔన్నత్యమనే పైస్థాయికి ఒక పరిమితి అంటూ లేదని ఈ సంభాషణ చెబుతుంది. ఇది ఉభయ భారతాల్లోనూ ఉంది. -తల్లావఝ్జల శివాజీ