ఆత్మసాక్షాత్కారం | Appearance of the soul | Sakshi
Sakshi News home page

ఆత్మసాక్షాత్కారం

Published Wed, Dec 24 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

ఆత్మసాక్షాత్కారం

ఆత్మసాక్షాత్కారం

జ్యోతిర్మయం

 ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు.

 ఒకే వ్యక్తి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీ, ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీ, ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ, ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీ నంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది. కనుక మన కున్న రెండు సాధనాల్లో అంతరంగమే ప్రధానం. శరీరం గౌణం.

 మనిషి జీవన యాత్రలో విజయాల్ని సాధించాలన్నా, పరాజ యాల్ని చవిచూడాలన్నా, రాజ్యాలేలాలన్నా, అంతరిక్షంలోకి ఎగ రాలన్నా, కావ్యాల్ని అల్లాలన్నా, వైజ్ఞానికంగా అభివృద్ధి చెందా లన్నా, ఇలా లౌకికంగా ఏ వ్యవహారాన్ని చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం. ఇంక అలౌకిక మార్గంలో జపతపాల్ని చేయాలన్నా, పూజాదికాల్ని నిర్వహించాలన్నా, యజ్ఞయాగాదుల్ని నిర్వర్తించాలన్నా, వ్రతాదుల్ని అనుష్టించాలన్నా, పారాయణల్ని చేయాలన్నా, మహాత్ముల ప్రవచనాల్ని వినాలన్నా, పుణ్యక్షేత్రాల్ని దర్శించాలన్నా, శాస్త్రాల్ని అధ్యయనం చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం.

 ఇంక ఆధ్యాత్మికంగా నేనెవర్ని, ఈ జగత్తేమిటి, పరమేశ్వరు డెవ్వడు అన్న విచారణ చేయాలన్నా, వేదాంత వాక్యాల్ని శ్రవణం చేయాలన్నా, మననం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఈ అంతరంగమే ప్రధాన సాధనం. ఆధ్యాత్మిక మూలాల్ని తరచి చూస్తే, అమనస్క స్థితియే అంటే మనసు లేని స్థితియే బంధ విముక్తి అనీ ముక్తి అనీ వేదాంతం ఘోషిస్తోంది. సూటిగా చెప్పా లంటే ముక్తిని సాధించాలంటే మనిషి, తనకున్న ఏకైక ప్రధాన సాధనమైన అంతరంగాన్ని కోల్పోవాలి. ఈ అమనస్క స్థితికి చేరాలన్నా, మనిషి మనస్సునే ఆశ్రయించాలి. అంటే మనస్సుతోనే మనస్సును నిర్వీర్యం చేయాలి. ఇది ఎలా సాధ్యం?

 మన నిత్యజీవితంలో మనకు తారసపడే అవస్థలు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు. జాగ్రత్ స్వప్నాలు మనసును ఆశ్రయించినవే. మనసులేని స్థితి సుషుప్తియే కదా! జీవన్ముక్తి పొందాలంటే మనసు అధీనంలో ఉన్న జాగ్రత్ దశలో ఉంటూనే, మనసు లేని సుషుప్తిని పొందగలగాలి. అంటే కర్మ చేస్త్తూనే కర్తృత్వ భోక్తృత్వాల్ని పరిత్య జింపగలగాలి. నేను కర్తను భోక్తను కాను, సర్వ వ్యవహారాలకు ఆధారమైన చైతన్యాన్నే నేను, అన్న  నిష్ఠ కలిగి ఉండాలి. అదే ఆధ్యా త్మికం. నిన్ను నీవు చైతన్య స్వరూపంగా ధ్యానిస్తూ, ప్రాణులందరినీ చైతన్య స్వరూపాలుగా భావించాలి. ప్రపంచాన్నే ఒక చైతన్య స్రవం తిగా దర్శించాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ స్థితిలో తరతమ భేదాలుండవు. జయాపజయాలుండవు. సుఖదుఃఖాలుండవు. అప్పుడు కర్మల్ని మనం మరింత ఉత్తేజంగా చేయగలుగుతాం. ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాం. లోకహితాన్ని కోరగలుగుతాం. ఇహపరాల్ని సాధించగలుగుతాం.
 పరమాత్ముని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement