
మానవ అస్తిత్వాన్ని గురించిన చర్చ ప్రపంచంలో చిరకాలంగా ఉంది. మానవ దేహం సజీవంగా ఉన్నంత వరకు అందులో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్నే ప్రాణం అంటున్నాం. శరీరాన్ని విడిచి ప్రాణం పోవడమే మరణం. మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. మరణం తర్వాత ప్రాణం ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహలు ఉన్నాయి; దీనిపై రకరకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి; రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. శరీరాన్ని సజీవంగా నిలిపి ఉంచే చైతన్యాన్నే ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ అంటారు.
‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. గీతాసారం ప్రకారం ఆత్మ సమస్త ప్రకృతి శక్తుల ప్రభావానికీ అతీతమైనది. జీర్ణవస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్లే, జీర్ణశరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి కొత్త శరీరాన్ని వెతుక్కుని వెళుతుందనే నమ్మకం కూడా ఉంది. ‘పునరపి జననం పునరపి మరణం/ పునరపి జననీ జఠరే శయనం’ అని ఆదిశంకరుడు చెప్పాడు.
శరీరం మరణించినా, ఆత్మకు మాత్రం జనన మరణ పరిభ్రమణం తప్పదని ఆయన సారాంశం. ఆత్మకు మరణం లేదనే నమ్మకం ప్రపంచంలోని చాలా మతాల్లో ఉంది. ఆత్మ మరణం లేనిదే కాదు, ఆద్యంత రహితమైనది కూడానని జైనుల సిద్ధాంతం. సమస్త సృష్టిలోని సూక్షా్మతి సూక్ష్మ క్రిమి కీటకాలు మొదలుకొని మనుషులు సహా భారీ జంతువుల వరకు సమస్త జీవుల్లోనూ ఆత్మ ఉంటుందని జైనుల విశ్వాసం.
చైనాకు చెందిన తావో మతమైతే– ప్రతి వ్యక్తిలోనూ ‘హున్’, ‘పో’ అనే రెండు రకాల ఆత్మ ఉంటుందని, ఈ రెండు రకాలు ‘యాంగ్’, ‘యిన్’ అనే సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందని చెబుతుంది. తావో మతం కూడా పునర్జన్మలను నమ్ముతుంది. ఆధునికుల్లో చాలా మంది మతాలకు అతీతంగా ఆత్మ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, దానిని నిర్వచించడానికి ప్రయత్నించారు. ‘నేను’ అనే స్పృహ ఆత్మకు మూలమని, అలాగని ఆత్మ అస్తిత్వాన్ని నిరూపించడం గాని, ఖండించడం గాని సాధ్యం కాదని జర్మన్ తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పాడు.
ఆత్మ అస్తిత్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు, కల్పనలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ పదార్థమా, కాదా అనే సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ పదార్థమే అయితే, అది ఏ స్థితిలో ఉంటుందో కూడా చెప్పలేదు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డంకన్ మెక్‌డూగల్ ఆత్మకు బరువు ఉంటుందని, ఆ బరువు ఇరవై ఒక్క గ్రాములని ఒక ప్రయోగం చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో రాబర్ట్ ఎల్ పార్క్, బ్రూస్ హుడ్ వంటి శాస్త్రవేత్తలు మెక్‌డూగల్ ప్రయోగంలో శాస్త్రీయత లేదంటూ కొట్టి పారేశారు.
మరణానంతరం ఆత్మ ఏమవుతుందనే దానిపై మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా, దీనిపై చాలామందికి తీరని సందేహాలు ఉన్నాయి. మరణంతోనే ఒక జీవి చరిత్ర పరిసమాప్తమైపోతుందని, ఆత్మ అనేది ఏదీ ఉండదని హేతువాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తల్లోనే కాదు, సాహితీవేత్తల్లోనూ ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పరిపరి విధాల అభిప్రాయాలు ఉన్నాయి.
‘మరుజన్మ ఉన్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో’ అన్నారు ఆత్రేయ. ‘చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో/ ఏమి యగునో ఎవరికెరుగ రాదు/ ఎరుకలేని వారలేమేమొ చెప్పగా/ విని తపించువారు వేన వేలు’ అన్నారు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన తన జీవిత చరమాంకంలో చెప్పిన పద్యమిది.
ఆత్మ గురించి, ‘ఆత్మజ్ఞానం’ గురించి వివిధ మతాల్లో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ అస్తిత్వంపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ ఉందనేందుకు శాస్త్ర సాంకేతిక నిరూపణలు లేకున్నా, ఆత్మ అనే భావన సహస్రాబ్దాలుగా మానవాళిపై ప్రభావం చూపుతోంది. ఆత్మ భావన ప్రభావం మత సిద్ధాంతాలతో పాటు తత్త్వశాస్త్రంలోను, సాహిత్యంలోను, ఇతర సృజనాత్మక కళలలోను కనిపిస్తుంది.
‘ఆత్మ’ భావన చాలావరకు ఆస్తికుల ప్రవర్తనను నియంత్రిస్తూ వస్తోంది. కర్మ సిద్ధాంతానికి, పాప పుణ్యాల విచక్షణకు, పాపభీతికి మూలం ‘ఆత్మ’ భావనే! ఆత్మ అస్తిత్వాన్నే గుర్తించనివారు ప్రపంచ జనాభాలో అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. కృత్రిమ మేధ మనుషుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న వర్తమాన కాలంలో కూడా ఆత్మ అస్తిత్వాన్ని నమ్మేవాళ్లే ఎక్కువ.
ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసి ఆధునిక శాస్త్రవేత్తలెవరూ ఆత్మ అస్తిత్వాన్ని గురించి పెద్దగా పరిశోధనలు సాగించలేదు. అయితే, అమెరికా రక్షణశాఖ ప్రధాన కేంద్రం ‘పెంటగాన్’ ఈ అంశంపై 1983లోనే పరిశోధన చేసింది. మనిషి మరణించినా ఆత్మ మరణించదంటూ లెఫ్టినెంట్ కల్నల్ వేయన్ మెక్‌డోనల్ తన పరిశోధన పత్రంలో రాశారు. అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ 2003లో బహిర్గతపరచిన రహస్య పత్రాల్లో ఇది కూడా ఉంది.
అయితే, ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో పాశ్చాత్య పత్రికలు, ప్రసార సాధనాల్లో పలు వ్యాఖ్యానాలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ధ్యానస్థితిలో సూక్ష్మశరీరయానం అనుభవాల గురించి ఆధ్యాత్మికవేత్తలు, యోగసాధకులు చెబుతుంటారు. దీనినే ‘ఔటాఫ్ బాడీ ఎక్స్‌పీరియెన్సెస్’ అంటున్నారు. గూఢచర్యంలో ఇలాంటి అనుభవాలను ఉపయోగించుకోవడం ఎలా అనేదానిపైనే మెక్‌డోనల్ పరిశోధన చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమేరకు ఆత్మావలోకనం చేసుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment