నేను చనిపోయాను రాత్రి రెండుగంటలప్పుడు నీళ్లు తాగటానికని లేచి, తాగి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత నేను చనిపోయాను. నేనేమీ ముసలోణ్ణి కాదు ఆయుష్షు తీరిపోవటానికి. యాభై ఐదు మొన్ననే దాటింది. అయినా అదికాదు నేనాలోచించేది. నేను మందు ముట్టను. సిగరెట్టు తాగను. మాంసం పెద్దగా తినను. పేకాట ఆడను. ప్రతిరోజు వాకింగ్, యోగా చేస్తాను. సంవత్సరంలో దాదాపు మూడొందల రోజులు ఆరోగ్యం కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఎందుకిలా జరిగింది?
ఏమో తెలీదు. ప్రస్తుతానికి నన్నెవరూ చూడలేదు కాబట్టి కారణం తెలీదు. శరీరం మాత్రం ఇంకా మంచం మీదే వుంది నా భార్య ఉదయం కాస్త లేటుగా నిద్ర లేస్తుంది. అప్పటివరకూ నేను చనిపోయానన్న విషయం ఎవరికీ తెలీకపోవచ్చు. ఒక మనిషి పుట్టుక అతడి తలరాతని బట్టి వుంటుందట. మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా? ఒకవేళ చేసినా అవన్నీ చిన్నవా? లేక అనుభవించాల్సింది ఇంకా ముందు ముందు మిగులుందా?
మందు, విందు లాంటి బయటికి కనపడేవే చెడ్డ అలవాట్లు, పాపాలుగా పరిగణిస్తే .. నేను అవి చేసి వుండకపోవచ్చు. మరి అవతలి వాళ్ళను పరోక్షంగా బాధపెట్టటం, అసూయగా ఆలోచించటం, ఒంటరిగా వున్నప్పుడు మనసులో కలిగే చీకటి ఆలోచనలు/ అలవాట్లు పాపాలు కాదా? తెలిసో తెలియకో నేను ఎగ్గొట్టిన డబ్బులు, నా వల్ల బాధపడిన మనుషులు, నేను ఈర్ష్యపడేట్టు చేసిన నా స్నేహితులు (పదప్రయోగానికి క్షమించాలి.. బంధువుల, స్నేహితుల ఉన్నతికి నేను పడిన ఈర్ష్య అసూయలు) మరి ఇవన్నీ తప్పులు కావా? అసలు తప్పులకి, పాపాలకి సంబంధం ఉందా? ఉదాహరణకి నేనో పామునో, కప్పనో చంపితే అది చెడ్డ పనా? తప్పు పనా? దాన్ని తప్పుగా భావించి దేవుడు నాకు శిక్ష వేస్తాడా? లేక, పోయిన జన్మలోనో, వచ్చే జన్మలోనో.. దానికీ నాకూ ఉన్న సంబంధాన్ని బట్టి అది అలా జరగాలని రాసి వుంటుందా? మరైతే ఒకపని చేసేటప్పుడు అది ఇప్పటిదా లేక పోయిన జన్మలో చేసిన దాని పర్యవసానమా అనేది ఎలా తెలుస్తుంది?
అన్నట్టు పాపం అంటే గుర్తొచ్చింది. నా కొడుకు విడాకులనాడు మా వియ్యంకురాలు నన్ను తిట్టిన తిట్లమాటేమిటి? తన కూతురికి అన్యాయం చేసినందుకు ఆ పాపం ఊరికే పోదనీ, నాకు నా కుటుంబానికి ఆ పాపం తగులుతుందని, దాని వల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని శాపం కూడా పెట్టింది. మరి నా కొడుకు చేసిన పనిలో/ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుందా? ఒకరి పాపపుణ్యాల్లో మరొకరికి వాటా ఉంటుందా? అసలలా జరిగే వీలుంటుందా? ఏమో.. ఈసారి స్వర్గంలోనో, నరకంలోనో.. ఎవరైనా ప్రవచనకర్త కనిపిస్తే అడగాలి.
సమయం కొంత గడిచి, ఉదయం ఐదున్నర అయింది. నా భార్య నిద్రలేచింది. కళ్ళు మూసుకునే దేవుడికి దణ్ణం పెట్టి తర్వాత తాళి కళ్ళకద్దుకుంది. మా పెళ్ళైనప్పటినించీ నిద్ర లేచాక ఆమె చేసే మొదటి పని అదే. పక్కనే ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. రోజూ ఐదింటికల్లా వాకింగ్‌కి వెళ్లే నేను ఈ రోజు ఇంకా నిద్ర కూడా లేవకపోవటం చూసి పడిన ఆశ్చర్యం అది. చిన్నగా తట్టి ‘ఏమండీ..’ అంది. శరీరం అటు ఇటు కాస్త కదిలిందే తప్ప చలనం లేదు. దగ్గరకొచ్చి ‘ఏమండీ..’ అని తోసినట్టు గట్టిగా కుదిపింది.
ఉలుకు లేదు పలుకు లేదు. మొదటిసారి ఆమెకు అనుమానం వచ్చింది. రెండో నిమిషంలో అది రూఢి అయింది. ఇంకో గంటకి.. అక్కడ వందమంది దాక గుమికూడారు. వాళ్ళందరూ నేనెంత మంచివాణ్ణో(?) మాట్లాడుకుంటున్నారు. చిత్రమేమిటంటే.. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది వాళ్లెవరో కూడా నాకు తెలీదు.
ఒక మహానుభావుడు చెప్పినట్టు ‘నువ్వు హాస్పిటల్‌లో వున్నప్పుడు, కనీసం వందమంది నిన్ను పరామర్శించాలని నువ్వు భావిస్తే, ఆ వందమందికి బాలేనప్పుడు నువ్వెళ్ళి పరామర్శించి ఉండాలి’. కానీ, నేనా బాపతు కాదు. ఎవరినైనా పరామర్శించాల్సి వస్తే నేను వెళతాను కానీ, వాళ్లొచ్చి మళ్ళీ నా దగ్గిర అటెండె¯Œ ్స వేయించుకోవాలి అని నేనెప్పుడూ ఎదురుచూడను. చూడలేదు. అసలలాంటి ఆలోచన నేనెప్పుడూ చెయ్యను కూడా.
అంతదాకా వస్తే నేనెప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడింది లేదు. అవతలి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగింది లేదు. తిరగాలన్న కోరిక కూడా నాకెప్పుడూ ఉండేది కాదు. అలా తిరగటం తప్పని నా ఉద్దేశం కాదు. ఎవరి జీవన విధానం వాళ్ళది. ఎవరి ఆలోచనలు, పద్ధతులు వాళ్ళవి. నా ఆలోచనలన్నీ నా సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉండేవే తప్ప.. ఇతరులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాకెప్పుడూ లేదు. జీవితం పట్ల నా దృక్పథం వేరు. నా ఆలోచన, జీవన విధానమే వేరు. ఇలా ప్రతి ఒక్కరూ నేను వేరు అనుకుంటారేమో.. నాకు తెలీదు.
ఇంకో అరగంటకి.. పూలమాలలు తెచ్చారు. బాడీని మంచం మీద నించి ఒక చిన్న బల్ల మీదకు మార్చారు. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యలో దాని కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లిస్తున్నారు. ‘పిల్లలకి ఫోన్ చేశారా?’ అని ఎవరో అడుగుతుంటే, ‘చేశాం. రాత్రికల్లా వస్తాం అన్నారు’ అంటున్నారు మరెవరో.
అన్నట్టు చెప్పటం మరిచా. నాకు ఒక కొడుకు, కూతురు. కొడుకు బెంగళూరులో, కూతురు పుణెలో వుంటారు. నా పిల్లల్ని నేను కాలు కదపనీయకుండా.. అడుగు కింద పెట్టనీయకుండా.. లాంటివి కాదు కానీ ఉన్నంతలో బాగానే పెంచాను. వాళ్ళు అడిగినవి, అవసరమైనవి కొనివ్వగలిగాను. ఒక తండ్రిగా ఎంత చెయ్యాలో అంతా చేశాను. అలాని వాళ్ళకెప్పుడూ నేను ఆదర్శాలు వల్లించలేదు. నీతి సూక్తులు చెప్పలేదు. ధర్మం తప్పకుండా జీవించమని ఉద్బోధించనూ లేదు. పిల్లలు మనం చెప్పేదానికంటే, చేసేది చూసి నేర్చుకుంటారని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, కౌన్సెలర్లు చెప్పగా విని, పాటించాను. ఒక అనుభవం.. అది మంచైనా, చెడైనా వాళ్ళు దాన్నించి నేర్చుకోవాలనేది నా సంకల్పం.
ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు.నిజం చెప్పొద్దూ ఆమెను చూస్తే నాకు జాలేసింది. ఏమీ చెప్పకుండా సడన్‌గా నేనిలా వచ్చేస్తే.. తను ఎలా బతుకుద్ది? ఆ భారం తను మోయగలదా? ఆస్తులంటే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ, ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది, ఎవరికి ఎంత అప్పుంది.. లాంటి డబ్బు సంబంధమైన విషయాలు నేనెప్పుడూ తనతో కనీసం చర్చించింది కూడా లేదే. మరిప్పుడెలా?
పెళ్ళైనప్పటినించీ నేనే లోకంగా బతికింది. తను నన్ను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్క మా అబ్బాయి పెళ్లి మాత్రం తనిష్టప్రకారం తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో జరిపించాలంది. తెలిసిన వాళ్ళైతే సర్దుకుపోతారనేది తన ఆలోచన. ఆ ప్రకారమే తనూ మావాడూ ఇద్దరూ ఇష్టపడ్డ అమ్మాయితోనే మావాడి పెళ్ళిచేసింది.
ఆ సంసారం నాలుగైదేళ్లు సజావుగా సాగింది. ఏమైందో ఏమో గాని మనస్పర్థలు మొదలయ్యాయి. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో కేవలం భగవంతుడికే తెలుసు. అటువైపు నించీ, మా వైపు నించీ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి అది విడాకుల దాకా వెళ్ళింది. విడాకులు మంజూరైన రోజు.. మా వియ్యపురాలు నన్నూ, నా కుటుంబాన్నీ తిట్టని తిట్టులేదు. తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంది.
నడిరోడ్డు మధ్యలో అలా వదిలేసి వెళితే తమ పరిస్థితేంటని నిలదీసింది. అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా అర్ధాంతరంగా బయటికి గెంటేస్తే .. ఆ పాపం ఊరికే పోదనీ, దాని ఉసురు కచ్చితంగా తగులుతుందని శపించింది. చివరగా.. నీక్కూడా ఒక కూతురుందనీ దానికి కూడా ఇలాంటిది జరిగితే అప్పుడు తండ్రిగా ఆ బాధేమిటో తెలుస్తుందని దుమ్మెత్తి పోసింది. ఐతే అదృష్టవశాత్తూ అలాంటివేం జరగలేదు.
కానీ, ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో అంత వేదన అనుభవించటం అది రెండోసారి (మొదటిసారి.. శ్రుతిలయతో నేను విడిపోయినప్పుడు జరిగింది). చేయని తప్పుకి శిక్ష అనుభవించాలా? అయినా తప్పెవరిదో కూడా నిర్ణయించే పరిస్థితి లేనప్పుడు కేవలం నా కుటుంబాన్ని ఆడిపోసుకోవడం న్యాయమా? ఏదైతేనేం.. జరగకూడనిది జరిగిపోయింది. పచ్చని సంసారం పెటాకులైపోయింది. ఎదో దిగులు. మానసిక వ్యథ. కాస్తో కూస్తో పరువుగా బతుకుతున్న వాళ్ళం. ఎందుకిలా జరిగింది? సమాజం మారిందనటానికి ఇవన్నీ రుజువులేమో. కావొచ్చు కానీ ఎక్కడో జరిగితే మనం దానిమీద చర్చించొచ్చు, సులభంగా తీర్మానం చెయ్యొచ్చు. కానీ అది మనింట్లోనే జరిగితే..?
మనసు ఏ పని మీదా లగ్నం కావటం లేదు. నిద్ర రాదు. ఆకలి వేయదు. ఒకటే అంతర్మథనం. దాదాపు మూడు నెలలు. మానసికంగా కుంగిపోయాను. ఆలోచించే కొద్దీ ఎవరో రెండు అరచేతుల మధ్యకి నా గుండెని తీసుకుని ఒత్తిన ఫీలింగ్. కాలమే అన్ని గాయాల్ని మాన్పుతుందన్నట్టు కొన్నాళ్ళకు నేను తేరుకున్నాను.. తేరుకుని చూస్తే.. మా ఆవిడ తమ్ముడు ఫ్రీజర్ బాక్స్ తెచ్చి సర్దుతున్నాడు. నా మనసెందుకో కీడు శంకించింది.
ఇప్పటివరకూ లేని ఒక చిన్న జలదరింపు. నేనూహించినట్టుగానే నలుగురైదుగురు కలిసి ఆ బాడీని ఎత్తి ఫ్రీజర్‌లో పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. శరీరం ఆ చల్లటి వాతావరణానికి అలవాటు పడుతుంది. కానీ నేనే బయట ఉండలేకపోతున్నా. అప్పటివరకూ అది నేనే, ఆ శరీరం నాదే అన్న ఆలోచన నన్ను ఏమీ ఆలోచించనీయలేదు కానీ ఇప్పుడు తొలిసారిగా నన్నూ, నా శరీరాన్నీ విడదీస్తున్నారన్న భావన. పావుగంటలో ఆ బాడీని లోపల సర్దేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నేను బయట బిక్కుబిక్కుమంటూ బిగుసుకుపోయాను.
‘మనిషి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ అక్కడక్కడే తచ్చట్లాడుతుంటుంది. తిరిగి తన శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఒకసారి శరీరాన్ని వీడాక మళ్ళీ అందులోకి వెళ్ళటం అన్నది సృష్టి విరుద్ధం కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ కర్మలన్నీ ముగిశాక ఇక ఏ దారీ లేక అక్కణ్ణించి నిష్క్రమిస్తుంది’ నా స్నేహితుడు రవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి.. ఇప్పుడు నా పరిస్థితేంటి? మొదటిసారిగా నాకు భయం వేసింది.
ఫ్రీజర్ బాక్స్ చుట్టూ చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాతో వాళ్లకున్న జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అవన్నీ నా చెవికెక్కడం లేదు. నాకు తిరిగి ఆ బాడీలోకే వెళ్లాలని వుంది. కానీ దాన్ని ఫ్రీజర్‌లో పెట్టి ఆ చల్లదనం బయటికి పోకుండా చుట్టూ గ్లాసులతో బిగించేశారు. లోపలికి వెళ్లే మార్గమే కనపడటం లేదు.
నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేక పోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా?
ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు.
అప్పడు.. మొదటిసారిగా నాకు అనుమానం కలిగింది. ఇకమీదట నేను తిరిగి ఆ శరీరంలోకి చేరలేనేమో! తిరిగి నేను మనిషిని కాలేనేమో! ఒక్కసారిగా భయం వేసింది. ఏదైనా ప్రయత్నం చెయ్యాలని వుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. ‘ఆ శరీరం నాది. నన్ను అందులోకి వెళ్లనివ్వండి’ అని గొంతెత్తి అరవాలనుంది. కానీ మాట పెగలటం లేదు. శబ్దం బయటికి రావటం లేదు.
నాకేమీ పాలుపోవటం లేదు. ఇక ఇంతేనా? నేను నా శరీరంతో వేరైపోయానా? ఇక మీదట నాకు ఆ శరీరంతో ఏ సంబంధమూ లేదా? ఇలా నాకొక్కడికేనా? సృష్టిలో ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుందా? మరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు.. వీళ్లందరినీ ప్రజల సందర్శనార్థం కోసం అలానే గంటల తరబడి ఉంచుతారే? వీలయితే రోజుల తరబడి కూడా ఉంచుతారే మరి వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఎంతగా క్షోభించి ఉంటుంది? నా ఈ మానసిక క్షోభకి కారణం నేను చేసిన పాపాలేనా?
మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా?
పాపం అనగానే నాకు శ్రుతిలయ గుర్తొచ్చింది.శ్రుతిలయ నా కాలేజ్‌మేట్. మనిషి అందంగా ఉండేది. ఇష్టానికి, ప్రేమకు అందమే తొలిమెట్టు ఐతే.. నేనామెను ఇష్టపడ్డా. విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్టు ఆమె కూడా నన్నిష్టపడింది. ఎన్నో ఉత్తరాలు.. ఎన్నెన్నో కబుర్లు.. సమయం తెలిసేది కాదు. మొదటి సంవత్సరంలో మొదలైన మా పరిచయం చివరి సంవత్సరానికొచ్చింది.
పెళ్లి ప్రాతిపదికగా మేమెప్పుడూ ఒకరొకర్ని ఇష్టపడలేదు. అందువల్ల ఆ టాపిక్ ఎప్పుడూ మా మధ్య రాలేదు. కేవలం అభిప్రాయాలు, ఆలోచనలు కలవటం వల్లనే మా మధ్య బంధం మొదలైంది. ఆ బంధాన్ని ఒక అనుభూతిగా, తీయని జ్ఞాపకంగా, మధురస్మృతిగా వుంచుకోవాలనుకున్నామే తప్ప కలిసి జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఇష్టంలో, బంధంలో, ప్రేమలో ఉన్న అందం పెళ్ళిలో రాదేమో!
అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. చివరిరోజు ఇద్దరం కాలేజీ గ్రౌండ్‌లో.. ఒకరికొకరం రాసుకున్న ఉత్తరాలను వెనక్కి ఇచ్చేసుకున్నాం. డైరీలు చింపేసుకున్నాం. అనుభూతులు, అనుభవాలు చెరిపేసుకున్నాం. చెరిపేసుకోవడానికి ఇక ఏమీ మిగిలి లేవనుకున్నాం. కాని, జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గాయమైనట్టు ఒకటే బాధ. ఎర్రగా కాల్చిన కర్రుతో గుండెల్లో ఎవరో కెలుకుతున్న భావన.
చెరుకు మిషన్‌లో గుండెను పెట్టి తిప్పినంత నొప్పి. అంత మానసిక క్షోభ అనుభవించటం అదే మొట్టమొదటిసారి నాకు ( రెండోసారి మా వాడి విడాకులప్పుడు). కొన్నాళ్ళు అలా గడిచాయి. ఆ తర్వాత తను ఏమైందో, ఎక్కడుందో కూడా ఆచూకీ లేదు. ఆ విధంగా ఆ ప్రేమకథ ముగిసింది. కాని, అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వచ్చే జ్ఞాపకాలు నన్ను నిలువెల్లా దహించి వేస్తుంటాయి సరిగ్గా ఇప్పుడీ బాధలాగానే. ఇంత బాధలోనూ నాకు శ్రుతిలయ గుర్తొచ్చిందంటే మా బంధం ఏపాటిదో మీకు అర్థమయ్యేవుంటుంది.
జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి చూస్తే చీకటిపడి ఎంతసేపయ్యిందో. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. కాసేపటికి మా పిల్లలు వచ్చారు. మా మనవళ్లు, మనవరాళ్లు వాళ్లతో వున్నారు. నా భార్య వాళ్ళని దగ్గరకు తీసుకుంది. నా కూతురి కళ్ళు ఉబ్బి వున్నాయి. ఎంతగా ఏడ్చివుంటుందో. రాగానే నా శరీరం మీదపడి వెక్కివెక్కి ఏడుస్తున్నారు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది.
నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా? నేనేమంత గొప్ప పని చేశానని.. నా కోసం ఈ ఏడుపులు? చరిత్ర గతిని మార్చిన గొప్పగొప్ప వాళ్ళు తమ ఆనవాలు వదిలివెళతారు. వాళ్ళకోసం వుంచుకోమ్మా నీ కన్నీళ్లు. అల్పుడినైన నా కోసం ఎందుకు వృథా చేసుకుంటావు? అని నా కూతుర్ని, కొడుకుని బుజ్జగించాలని వుంది. కానీ, వీలవడం లేదు.
దేవుడా! ఎందుకయ్యా నాకీ కష్టాలు? ఓ దేవా.. మనుషుల మధ్య ఈ బంధాలు, పాశాలను ఎందుకు సృష్టించావు? ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయం అన్నట్టు.. మనుషుల మధ్య ఈ బంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వల్ల ఏర్పడేట్లు చేస్తావు. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగిపోయినట్లు ఈ అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మనిషికి మోక్షం రాదు. తన తర్వాత తన పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన మనిషిని నిలవనీయదు.
వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం, జారిపడే జాబిల్లి, ఆశల హారతి, కరిగే మబ్బు.. వీటన్నిటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది చివరికి తెగిన వీణలా బంధాలన్నిటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది. ఓ ఈశ్వరా! నీ సృష్టి ఎంత విచిత్రం? నువ్వే సృష్టిస్తావు. జ్ఞానమో, అజ్ఞానమో అన్నీ నువ్వే పంచుతావు. చివరికి ఏదీ శాశ్వతం కానట్టు, నువ్వే తీసుకెళతావు. ఓ ప్రభూ .. మనుషులుగా జన్మించినందుకు మాకిది తప్పదా? ప్రతి మనిషీ ఈ చట్రంలో బిగుసుకోవాల్సిందేనా? ఈ బంధాలనించీ, పునరావృతమయ్యే నీ లీలలనించీ ఎప్పుడయ్యా మాకు విముక్తి?
మనసు ధారాపాతంగా రోదిస్తూనే వుంది. తర్వాతరోజు ఉదయం పది గంటల వేళ.. శరీరం అగ్నిలో దహనమయ్యింది. బంధాల్ని తెంచుకుని ఆత్మ ఊర్ధ్వముఖంగా శూన్యంలోకి పయనమయ్యింది.
నడ్డా సుబ్బారెడ్డి
(మిత్రుడు వైవీకే రవి చెప్పిన మాటల సౌజన్యంతో )
Comments
Please login to add a commentAdd a comment