Funday special
-
పిల్లల కథ: మారిన కల్పకి
రాజాపురంలో రంగయ్య ఆనే వర్తకుడు ఉండేవాడు. అతను కొత్తగా ఓ పెద్ద బంగళా కట్టించాడు. కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు. అతని ఇంటి ముందు ఓ వేపచెట్టు ఉండేది. చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది.అది ఇతర కాకులతో కలవకపోగా, ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది. ఒకరోజు అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చొంది. యథాలాపంగా కిటికీ అద్దం వైపు చూసింది. అందులోని తన ప్రతిబింబాన్ని మరో కాకిగా భావించి.. ‘కావ్..కావ్’ మని అరిచింది. తన పదునైన ముక్కుతో కిటికీ అద్దాన్ని పొడవసాగింది. అదే చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది కల్పకి అద్దాన్ని పొడవటం చూసి ‘మిత్రమా! అద్దాన్ని పొడవకు. పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు’ అంటూ హెచ్చరించింది. కోతి మాటలను కల్పకి పట్టించుకోలేదు. కాకి చర్యను గమనించిన రంగయ్య.. పనివాడిని పిలిచి అద్దం మీద గుడ్డ కప్పమని చెప్పాడు. పనివాడు ‘ఉష్షో.. ఉష్షో..’ అని తరుముతూ కల్పకిని వెళ్లగొట్టాడు. అద్దాన్ని గుడ్డతో కప్పేశాడు. కొంతసేపటికి మళ్లీ వచ్చి గోడపై వాలింది కల్పకి. కిటికీ వైపు చూసింది. అక్కడ కాకి కనపడలేదు. దాంతో అది చెట్టు వైపు తిరిగి కోతితో ‘మన దెబ్బకు దడుచుకొని పారిపోయింది చూడు’ అంది గర్వంగా! ‘మిత్రమా.. అది అద్దం. అందులో కనిపించేది నువ్వే! ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కానీ, ఇలా పోట్లాడకూడదు. పైగా మీ కాకులు ఐకమత్యానికి పెట్టిన పేరు. నువ్వొక్కదానివే ఇలా ఎందుకున్నావ్?’ అంది కోతి. ‘ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి. ఇంకో కాకి ఇటు దిక్కే రాకూడదు’ అంటూ ఎగిరి పోయింది కల్పకి. అలా కాకి ఎగిరిపోవడంతో అద్దం మీది గుడ్డను తీసేయమని పనివాడికి చెప్పాడు రంగయ్య. మరునాడు కల్పకి తిరిగి గోడపై వాలింది. అద్దంలో కాకి కనిపించేసరికి మళ్లీ కోపంతో ఠపీ ఠపీమంటూ అద్దాన్ని పొడవసాగింది. దాంతో అద్దం పగిలింది. ఆ గాజుముక్కలు కోసుకుని కల్పకి ముక్కుకు గాయమైంది. అది చూసిన కోతి గబగబా నాలుగాకులు తెచ్చి.. కాకికి పసరు వైద్యం చేసింది. బుద్ధొచ్చిన కల్పకి కోతికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత తన కాకుల గుంపును చేరి, క్షమించమని వేడుకుంది. తప్పు తెలుసుకున్న కల్పకిని మిగిలిన కాకులన్నీ క్షమించి తమ గుంపులో కలుపుకున్నాయి. మారిన కల్పకిని చూసి కోతి ఆనందించింది. -
Pregnancy: గర్భిణీలు బరువు పెరగడం మంచిదేనా.?
నేను 85 కేజీల బరువున్నాను. ఇప్పుడు ఐదవ నెల. 3 కేజీల బరువు మాత్రమే పెరిగాను. మా స్నేహితులు 10 కేజీలు పెరగాలి అంటున్నారు. నా బరువు నియంత్రణలో ఉండటానికి మా డాక్టర్ నన్ను డైట్ ఫాలో అవ్వమన్నారు. దీని వల్ల నాకు ఏదైనా నష్టం ఉందా? – మౌళి, కోరంగిగర్భధారణలో బరువు తగ్గడం కష్టం, ఇది మంచిది కూడా కాదు. గర్భంతో ఉన్నప్పుడు సుమారు 8–10 కేజీల బరువు పెరుగుతారు. అంతకంటే ఎక్కువ బరువు పెరగకుండా ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే, గర్భం ధరించినపుడు, ఆ తరువాత కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ లాంటివి చూస్తున్నాము. మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఒబేసిటీ, దానితో వచ్చే ఇతర ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. డైటీషియన్ ఇచ్చే సలహాలతో అన్ని రకాల కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్లతో కూడిన ఆరోగ్యకమైన ఆహారాన్ని ఎంపిక చేసుకుని, తీసుకోవాలి. జంక్‌ఫుడ్ పూర్తిగా మానేయాలి. గర్భధారణ సమయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. వారంలో కనీసం ఐదు రోజులైనా 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. నడిచేటప్పుడు అనువైన షూస్ ధరించండి. నడక, వ్యాయామాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్, ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని స్విమింగ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య ఆక్వా నాటల్ క్లాసెస్ అని కొన్ని స్విమింగ్ సెంటర్లలో నడుపుతున్నారు. అలాంటి స్విమింగ్ ఏ నెలలో అయినా చేయొచ్చు. ఇప్పటి వరకు వ్యాయామం చెయ్యనివారు నడక, ప్రాణాయామంతో మొదలుపెట్టండి. ఆఫీస్, ఇంట్లో లిఫ్ట్‌కి బదులు మెట్లు వాడటం, ఇంటిపనులు చేసుకోవడం, నడవడం లాంటివి చేయండి. సైకిలింగ్, జాయింట్ స్ట్రెచెస్, ఫిట్నెస్ వ్యాయామాలు చెయ్యకూడదు. ఒకవేళ వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం వచ్చినా, ఊపిరి ఆడనట్టు ఉన్నా, ఛాతీలో, కడుపులో నొప్పి, బిడ్డ కదలికలు తగ్గడం లాంటివి ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవండి. మీ చుట్టపక్కల ఎవరైనా పొగ తాగుతుంటే దూరంగా ఉండండి. గర్భధారణ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. మానసిక సమస్యలకు సంబంధించి ఏమైనా మందులు వాడటం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మీ కోసం కొంత సమయం తీసుకుని ఇష్టమైన పనులు చెయ్యడం, మీకు కావలసిన వ్యక్తులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం, అవసరమైతే వారి సహాయం కోరడం చేయాలి. మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా గర్భవతులు ఉంటే వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామం సమంగా ఉండేటట్లు చూసుకుంటే ఏ విధమైన ఇబ్బందులూ ఉండవు. హెల్త్ ట్రీట్ఎండోమెట్రియాసిస్తో గుండెజబ్బుల ముప్పు!చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతుంటారు. దీని వల్ల మహిళలు నానా సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో విపరీతంగా బాధపడుతుంటారు. ఎండోమెట్రియాసిస్ సమస్య కేవలం గర్భాశయ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని డేనిష్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కోపన్హేగన్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఇవా హావెర్స్ బార్గర్సెన్ నేతృత్వంలో జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సదస్సులో డాక్టర్ ఇవా ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. డెన్మార్క్‌లో 1977–2021 మధ్య కాలంలో ఎండోమెట్రియాసిస్ బాధితులైన 60 వేల మంది మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి, వైద్య నిపుణులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. -
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్‌ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్‌ఫుడ్‌కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్‌తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ కన్సల్టంట్ -
ఇవీ.. వానాకాలం జాతరలు! ‘త్షెచు’ అంటే అర్థమేంటో తెలుసా?
హిమాలయాలకు చేరువలో ఉన్న భూటాన్‌లో ఏటా పలు పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఎక్కువ మంది బౌద్ధమతానికి చెందిన వారే అయినా, వారు తమ వేడుకలను పురాతన సంప్రదాయాల ప్రకారం నేటికీ జరుపుకుంటూ ఉండటం విశేషం. ఏటా వేసవి ముగిసి వానాకాలం వచ్చే రోజుల్లో వానాకాలానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ జరుపుకొనే రెండు వేర్వేరు జాతరలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.వీటిలో మొదటిది ‘నిమాలుంగ్ త్షెచు’. ‘త్షెచు’ అంటే జాతర అని అర్థం. భూటాన్ నడిబొడ్డు ఉన్న నిమాలుంగ్ బౌద్ధ ఆరామంలో ఈ వేడుకలను ఘనంగా మూడురోజుల పాటు జరుపుకొంటారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి 16 వరకు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో సంప్రదాయ నృత్య గానాలతో కోలాహలంగా నిమాలుంగ్ బౌద్ధారమం వరకు ఊరేగింపులు జరుపుతారు. తర్వాత ఆలయంలో ప్రార్థనలు జరిపి, బౌద్ధ గురువుల ఆశీస్సులు తీసుకుంటారు.ఇదేకాలంలో జరుపుకొనే రెండో జాతర ‘కుర్జే త్షెచు’. ఇది భూటాన్‌లోని కుర్జే పట్టణంలోని కుర్జే బౌద్ధారామంలో ఏటా జూన్ 16న జరుగుతుంది. కుర్జేలోని బౌద్ధారామాన్ని భూటాన్ బౌద్ధులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. భూటాన్‌లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన తొలిగురువు పద్మసంభవుడు ఇక్కడ ఎనిమిదో శతాబ్ది ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తనువు చాలించిన తర్వాత ఇక్కడ ఆయన భౌతికకాయం ముద్రను రాతిపై శిల్పంగా చెక్కారు.‘కుర్’ అంటే శరీరం, ‘జే’ అంటే ముద్ర. గురువు శరీర ముద్రను రాతిపై చెక్కి శాశ్వతంగా పదిలపరచడం వల్ల ఈ ప్రదేశానికి కుర్జే అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆరామాన్ని పదిహేడో శతాబ్దిలో నిర్మించారు. ‘కుర్జే త్షెచు’ జాతరలో జనాలు రకరకాల కొయ్య ముసుగులు ధరించి సంప్రదాయ నృత్య గానాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత ఆలయం వద్ద ప్రార్థనలు జరుపుతారు. కొయ్యముసుగులు ధరించి ఊరేగింపు జరపడం వల్ల వానాకాలంలో మంచివానలు కురుస్తాయని, తమ పంటలకు దుష్టశక్తుల బెడద ఉండదని నమ్ముతారు.ఇవి చదవండి: వానా.. వానా.. వల్లప్పా! -
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్‌లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్‌తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్‌లో రెస్టారంట్‌ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా? -
డెలివరీ టైమ్‌లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్‌లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్‌లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్‌లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్‌ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్‌గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్‌కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్‌లు అందరూ సపోర్టివ్‌గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్‌లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్‌లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్‌లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్‌కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్‌లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్‌ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్‌తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్‌లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్‌కి ప్రసిద్ధి. -
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్‌లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్‌ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్‌తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్‌ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్‌లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్‌లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్‌లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్‌ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్‌లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్‌తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్ -
వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
అచ్చమైన తెలంగాణ అమ్మాయి. ఆమె ఇన్‌స్టా కంటెంట్ కూడా తెలంగాణ నేటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. ఫొటోగ్రాఫర్, లిరిసిస్ట్, సింగర్, మ్యుజీషియన్, నేచర్లవర్ ఎట్సెట్రా! ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంది. మోటర్‌సైకిల్ రైడ్ చేస్తుంది. బైక్ రిపేర్ చేస్తుంది. ఇలా పనికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అని ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేస్తోన్న ప్రతిభ ఆమెది.అసలు ఈ పిల్లకు రాని పని అంటూ ఉందా అని ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ అబ్బురపడేలా చేస్తుంది. ధర్మపురికి చెందిన ఈ అమ్మాయి కరోనా టైమ్‌లో తన చుట్టూ ఉన్న డిప్రెసివ్ మూడ్‌ని పోగొట్టడానికి.. తన ఊళ్లో మొక్కలను నాటింది. రాత్రనక పగలనక వాటి ఆలనాపాలనా మీదా అంతే శ్రద్ధను పెట్టింది.ఇప్పుడవి పెరిగి ఆ ప్రదేశమంతా ఓ గార్డెన్‌లా మారింది. గలగలపారే సెలయేరు.. జలజల దూకే జలపాతం.. ఇలా ఏ సినినమ్ అయినా సూటయ్యే ఇన్స్పైరింగ్ గర్ల్ గాయత్రి. ఇప్పుడు ఆమె ‘దేవరకొండాస్ స్పెషల్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌నూ పెట్టింది.ఇవి చదవండి: ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి... -
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
కాసింత ఒళ్లు చేస్తే చాలు.. చాలామందికి డబుల్ చిన్ వచ్చేస్తుంది. దాంతో ముఖంలోని కళే పోతుంది. ఇది వి షేప్ ఫేస్ కోరుకునేవాళ్ల ఆత్మస్థైర్యంతో భలే ఆడుకుంటుంది. మెడ, తలను అటూ ఇటూ తిప్పుతూ.. ఎన్ని ఎక్స్సైజులు చేసినా.. ముఖాన్ని V షేప్‌లోకి తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. అందుకోసమే చిత్రంలోని ఈ డివైస్.ఈ ఎర్గోనామిక్ ఫేస్ లిఫ్టింగ్ మసాజర్.. ముఖాన్ని చక్కటి ఆకృతిలోకి తెస్తుంది. ఈ ఫోల్డబుల్ చిన్ రెడ్యూసర్ను అన్ని వేళలా సులభంగా వాడుకోవచ్చు. చదివేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్‌తో పాటు సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కంఫర్టబుల్ కోర్డ్ (ఛిౌటఛీ.. చెవి పట్టీ) లభిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మెషిన్ ని చేత్తో పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మాత్రం ఆ చెవి పట్టీ సాయంతో డివైస్‌ను చెవులకు బిగించుకుంటే చాలు.. గడ్డం కింద మెషిన్ దాని పని అది చేసుకుంటుంది. దీన్ని చార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనితో ప్రయాణాల్లోనూ ట్రీట్మెంట్ పొందొచ్చు. ధర 28 డాలర్లు. అంటే 2,341 రూపాయలు అన్నమాట!ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
May-5: 'జపాన్‌లో బాలల దినోత్సవం'! ఎలా జరుగుతుందో తెలుసా!
జపాన్‌లో బాలల దినోత్సవం ఏటా మే 5న జరుగుతుంది. జపాన్ రాచరిక సంప్రదాయం ప్రకారం ఏటా జరిగే ఐదు వార్షిక ఉత్సవాలలో ఇది ఒకటి. జపాన్‌లో దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. రకరకాల ప్రదర్శనలు చేస్తారు. జపాన్‌లో బాలల దినోత్సవం పన్నెండో శతాబ్దిలో పరిపాలించిన కమకురా వంశస్థుల హయాం నుంచి జరుగుతూ వస్తోంది.తొలినాళ్లలో బాలల దినోత్సవాన్ని ఏటా చాంద్రమానం ప్రకారం ఐదో నెలలోని పున్నమి తర్వాత వచ్చే ఐదో రోజున జరుపుకొనేవారు. తర్వాత పంతొమ్మిదో శతాబ్ది నుంచి ఈ వేడుకను గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఏటా మే 5న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ వేడుకలో ఊరూరా ఆరుబయట ఎత్తుగా నిలిపిన స్తంభాలకు కట్టిన దండాలకు చిత్ర విచిత్రమైన రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. వీటిని ‘కొయినొబొరి’ అంటారు.అలాగే, ఇంటింటా బయటి ఆవరణల్లో గాని, పెరటి స్థలాల్లోగాని నిలిపిన స్తంభాలకు సంప్రదాయకమైన ‘నొబోరి’, ‘ఫుకునుకె’ జెండాలను ఎగురవేస్తారు. బహిరంగ వేదికల మీద సమురాయ్ బొమ్మలను ప్రదర్శనతో పాటు చిన్నారుల విచిత్ర వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో జనాలు ఆరుబయట విందుభోజనాలు చేస్తారు.ఈ విందుభోజనాల్లో ఓక్ ఆకుల్లో చుట్టిన రెడ్బీన్స్ జామ్ నింపిన బియ్యప్పిండి ముద్దలను ఆవిరిపై ఉడికించిన వంటకం ‘కషివామొచి’, గంజితో తయారు చేసే మద్యం ‘సాకె’లను తప్పనిసరిగా వడ్డిస్తారు. ఓక్ ఆకులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఈ వేడుకల్లో ఓక్ ఆకుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు.ఇవి చదవండి: రేటే 'బంగారమాయెనే!' -
Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'!
30 నవంబర్, 2017.. అండర్–11 జాతీయ చాంపియన్‌గా నిలిచిన అబ్బాయిని ‘నీ లక్ష్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. ‘చెస్‌లో ప్రపంచ చాంపియన్ కావడమే’ అని సమాధానమిచ్చాడు. సాధారణంగా ఆ స్థాయిలో గెలిచే ఏ పిల్లాడైనా అలాంటి జవాబే చెబుతాడు. అతను కూడా తన వయసుకు తగినట్లుగా అదే మాట అన్నాడు. కానీ ఆరున్నరేళ్ల తర్వాత చూస్తే అతను వరల్డ్ చాంపియన్ కావడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఆ కుర్రాడిలోని ప్రత్యేక ప్రతిభే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.పిన్న వయసులో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందడం మొదలు వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్‌కు సవాల్ విసిరే చాలెంజర్‌గా నిలిచే వరకు అతను తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ కుర్రాడి పేరే దొమ్మరాజు గుకేశ్. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు.క్యాండిడేట్స్‌తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది చివర్లో.. చైనా ఆటగాడు డింగ్ లారెన్తో జరిగే పోరులోనూ గెలిస్తే అతను కొత్త జగజ్జేత అవుతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 37 ఏళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.‘త్యాగం’.. తనకు నచ్చని పదం అంటారు గుకేశ్ తండ్రి రజినీకాంత్. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధానికి త్యాగం అనే మాటను జోడించడం సరైంది కాదనేది ఆయన అభిప్రాయం. గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత అతని కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారు త్యాగాలు చేశారని చెబుతుంటే ఆయనలా స్పందించారు. చెన్నైలో స్థిరపడిన తెలుగువారు ఆయన. రజినీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్‌గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్‌తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించాల్సి వచ్చిందనేది వాస్తవం.‘పిల్లలను పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. వారి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా పేరెంట్స్ కాక ఇంకెవరు శ్రమపడతారు! నేను గుకేశ్‌లో ప్రతిభను గుర్తించాను. అందుకు కొంత సమయం పట్టింది. ఒక్కసారి అది తెలిసిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలిచాం. నాకు టెన్నిస్ అంటే పిచ్చి. దాంతో మా అబ్బాయిని అందులోనే చేర్పిద్దాం అనుకున్నాను. కానీ బాబు చెస్‌లో ఆసక్తి చూపిస్తున్నాడని నా భార్య చెప్పింది.ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో..అంతే.. ప్రోత్సహించేందుకు మేం సిద్ధమైపోయాం. చెన్నై చుట్టుపక్కల ఎన్ని టోర్నీలు జరుగుతాయి, ఎలాంటి శిక్షణావకాశాలు ఉన్నాయి, వేరే నగరాలకు వెళ్లి ఎలా ఆడాలి.. ఇలా అన్నీ తెలుసుకున్నాం.. ప్రోత్సహించాం.. అబ్బాయి చదరంగ ప్రస్థానం మొదలైంది’ అని రజినీకాంత్ అన్నారు. గుకేశ్ క్యాండిడేట్స్ గెలిచిన సమయంలో అతని పక్కనే ఉన్న ఆ తండ్రి ఆనందం గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. విజయానంతరం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు గుకేశ్‌ను హత్తుకొని తల్లి కళ్లు చెమర్చాయి.అంచనాలకు అందకుండా రాణించి..కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్యాండిడేట్స్ టోర్నీకి గుకేశ్ అర్హత సాధించడం సందేహంగానే కనిపించింది. వరుసగా కొన్ని అనూహ్య పరాజయాలతో అతను వెనకబడ్డాడు. చివరకు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ గెలవడంతో అతనికి అవకాశం దక్కింది. అయితే టోర్నీకి ముందు.. గుకేశ్ గెలవడం కష్టమంటూ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్య తనపై కాస్త సందేహాన్ని రేకెత్తించింది. అంచనాలు అన్నీ నిజం కావు కానీ కార్ల్సన్ చెప్పడంతో మనసులో ఎక్కడో ఒక మూల కాస్త సంశయం.సాధారణంగా గుకేశ్ టోర్నీలు ఆడే సమయంలో ప్రతి రోజూ రెండుసార్లు తన తల్లికి ఫోన్ చేసేవాడు. గేమ్ ఓడినప్పుడైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరేవాడు. అప్పుడా అమ్మ.. తన కొడుకుకి.. క్రీడల్లో పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ సత్తా చాటి పైకెగసిన పలువురు దిగ్గజ క్రీడాకారుల గురించి చెబుతూ స్ఫూర్తినింపేది. ఆ ప్రయత్నం ఇటీవల రెండు సార్లు ఫలితాన్నిచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు మళ్లీ అతను ఆత్మవిశ్వాసం సాధించి పట్టుదలగా బరిలోకి దిగేందుకు ఇది ఉపకరించింది.రెండోసారి ఈ మెగా టోర్నీలో ఏడో రౌండ్లో అలీ రెజా చేతిలో ఓటమి తర్వాత అమ్మ మాటలు మళ్లీ ప్రభావవంతంగా పనిచేశాయి. గుకేశ్ స్వయంగా చెప్పినట్లు ఆ ఓటమే తన విజయానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్యాండిడేట్స్ టోర్నీ 14 రౌండ్లలో ఈ ఒక్క గేమ్‌లోనే ఓడిన అతను ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయాడు. గుకేశ్ వాళ్లమ్మ మాటల్లో చెప్పాలంటే.. గతంలో టోర్నీలో ఒక మ్యాచ్ ఓడితే ఆ తర్వాతి రౌండ్లలో అతని ఆట మరింత దిగజారేది. పూర్తిగా కుప్పకూలిపోయేవాడు. కానీ ఇప్పుడు గుకేశ్ ఎంతో మారిపోయాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో ఇంత పరిపక్వత అంత సులువుగా రాదు. ఒక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ సమరోత్సాహంతో బరిలోకి దిగడాన్ని అతను నేర్చుకున్నాడు.ఆత్మవిశ్వాసంతో..గుకేశ్ గతంలో ఏ ప్రశ్ననైనా అవును, కాదు అంటూ రెండేరెండు జవాబులతో ముగించేవాడు. కానీ ఇప్పుడు విజయాలు తెచ్చిన ఆత్మవిశ్వాసం అతని వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు తెచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు అతనికి 24 గంటలూ చెస్ ధ్యాసే. మరో జీవితమే లేకుండా పోయింది. కానీ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అతను చెస్‌తో పాటు ఇతర అంశాల్లో కూడా సమయం వెచ్చించాడు. యోగా, టెన్నిస్ ఆడటం, సినిమాలు, మిత్రులను కలవడం, తగినంత విశ్రాంతి.. ఇలా అన్ని రకాలుగా అతను తనను తాను మలచుకున్నాడు. ఈ కీలక మార్పు కూడా అతని విజయానికి ఒక కారణమైంది.తల్లిదండ్రులతో..ఒత్తిడిని అధిగమించి..గుకేశ్‌కు ఇది తొలి క్యాండిడేట్స్ టోర్నీ. ఈ టోర్నీలో అతను అందరికంటే చిన్నవాడు కూడా. ప్రత్యర్థుల్లో కొందరు నాలుగు లేదా ఐదుసార్లు ఈ టోర్నమెంట్లో ఆడారు. రెండుసార్లు విజేతైన ఇవాన్ నెపొమినియాచి కూడా ఉన్నాడు. కానీ వీరందరితో పోలిస్తే గుకేశ్ ఒత్తిడిని సమర్థంగా అధిగమించాడు. పైగా ఇందులో రెండో స్థానం వంటి మాటకు చాన్స్ లేదు. అక్కడ ఉండేది ఒకే ఒక్క విజేత మాత్రమే.‘టొరంటోకు నేను ఒకే ఒక లక్ష్యంతో వెళ్లాను. టైటిల్ గెలవడం ఒక్కటే నాకు కావాల్సింది. ఇది అంత సులువు కాదని నాకు తెలుసు. నా వైపు నుంచి చాలా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను. ప్రత్యర్థులతో పోలిస్తే నా ఆటలో కూడా ఎలాంటి లోపాలు లేవనిపించింది. అందుకే నన్ను నేను నమ్మాను’ అని గుకేశ్ చెప్పాడు. అయితే గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం అతని విజయంపై అతిగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక్కడి అనుభవం.. వచ్చే క్యాండిడేట్స్ టోర్నీకి పనికొస్తే చాలు అని మాత్రమే తండ్రి అనుకున్నారు. కానీ వారి టీనేజ్ అబ్బాయి తల్లిదండ్రుల అంచనాలను తారుమారు చేశాడు.అండర్ 12 వరల్డ్ చాంపియన్‌గా.. , క్యాండిడేట్స్ టోర్నీ గోల్డ్ మెడల్‌తో.. సవాల్‌కు సిద్ధం..గుకేశ్ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్ (ప్రస్తుతం 2743) దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొలి 8 గేమ్‌లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత విజేత, చైనాకు చెందిన డింగ్ లారెన్తో గుకేశ్ తలపడతాడు.31 ఏళ్ల డింగ్‌కు మంచి అనుభవం ఉంది. 2800 రేటింగ్ దాటిన ఘనత పొందిన అతను చైనా చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఒక దశలో వరుసగా 100 గేమ్‌లలో ఓటమి ఎరుగని రికార్డు అతనిది. అయితే ఇప్పుడు గుకేశ్ చూపిస్తున్న ఆట, ఆత్మవిశ్వాసం, సాధన కలగలిస్తే డింగ్ని ఓడించడం అసాధ్యమేమీ కాదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
'అతిగా దాచుకోవడం కూడా జబ్బే..' అని మీకు తెలుసా!?
రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయి ఇద్దరు పిల్లలు. భార్య కూడా ప్రభుత్వోద్యోగి. ఇటీవల కాలంలో వారిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులో లేక అభిప్రాయభేదాలో కాదు. రాజీవ్‌కున్న వింత అలవాటు. అది దినపత్రికల్లో, మ్యాగజై¯Œ్సలో వచ్చే నచ్చిన స్టోరీలను దాచుకునే అలవాటు. అందులో వింతేముంది? నచ్చిన పుస్తకాలు దాచుకున్నట్లే అదికూడా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇల్లంతా ఆ ఫైల్స్‌తోనే నిండిపోతే? వాటినుంచి వచ్చే దుమ్ము వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే? ఆ విషయం తెలిసినా ఆ ఫైల్స్ పడేయడానికి ఒప్పుకోకుంటే? వాటిని బయట పడేయడానికి ప్రయత్నించే భార్యతో గొడవ పడుతుంటే? ఆమె వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకపోతే? భార్యాపిల్లల కంటే ఫైల్సే ముఖ్యమనుకుంటే? దాన్నే హోర్డింగ్ డిజార్డర్ అంటారు. అంటే అవసరం లేని వస్తువులను అతిగా దాచుకునే మానసిక వ్యాధి. పేపర్ క్లిపింగ్సే కాదు పెన్నులు, పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కర్చీఫ్‌లు.. ఇలా ఏదైనా సరే అతిగా దాచుకుంటున్నారంటే ఈ వ్యాధి బారిన పడినట్లే. వస్తువులను దాచుకోవడమే కాదు, అతిగా జంతువులను పెంచుకోవడం కూడా ఈ రుగ్మత కిందకే వస్తుంది. అతిగా ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని ఎవరికీ ఇవ్వకుండా దాచుకోవడం కూడా ఈ రుగ్మత పరిధిలోనిదే. హాబీ, హోర్డింగ్ డిజార్డర్ వేర్వేరు.. హాబీలకు, హోర్డింగ్ డిజార్డర్‌కు తేడా ఉంది. స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ వంటి హాబీలున్నవారు అనేక అంశాలు శోధించి, సేకరిస్తారు. వాటిని ప్రదర్శిస్తారు. ఈ సేకరణలు భారీ స్థాయిలో ఉండవచ్చు. కానీ అవి చిందరవందరగా ఉండవు. చక్కగా, ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. కానీ హోర్డింగ్ డిజార్డర్‌లో ఇందుకు భిన్నంగా చిందరవందరగా ఉంటాయి. అందువల్ల ఇవి రెండూ వేర్వేరు. టీనేజ్ లో మొదలు.. హోర్డింగ్ సాధారణంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. వయసుతో పాటు సమస్య కూడా పెరుగుతుంది. చివరకు భరించలేనిదిగా తయారవుతుంది. ఈ డిజార్డర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.. తమకు నచ్చిన వస్తువులు ప్రత్యేకమైనవని లేదా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమని నమ్మడం వాటితో మానసికంగా కనెక్ట్ అయినట్లు అనిపించడం.. అవి చుట్టూ ఉన్నప్పుడు సురక్షితంగా ఫీలవ్వడం, ఓదార్పును అనుభవించడం.. అవసరం లేకపోయినా దాచుకోవడం, విలువ లేకపోయినా విసిరేయ లేకపోవడం.. వస్తువులను భద్రపరచాలని భావించడం, వదిలించుకోవాలంటే కలత చెందడం.. మీ గదులను ఉపయోగించలేని స్థాయిలో వస్తువులను నింపడం.. అపరిశుభ్రమైన స్థాయిలకు ఆహారం లేదా చెత్తను దాచడం.. దాచుకున్న వస్తువుల కోసం ఇతరులతో విభేదాలు.. అస్పష్టమైన కారణాలు.. హోర్డింగ్ డిజార్డర్‌కు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. జన్యుశాస్త్రం, మెదడు పనితీరు, ఒత్తిడితో కూడిన సంఘటనలు సాధ్యమయ్యే కారణాలుగా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ డిజార్డర్ ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం కూడా బలమైన కారణమని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి మరణం, విడాకులు తీసుకోవడం లేదా అగ్నిప్రమాదంలో ఆస్తులను కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన సంఘటనను ఎదుర్కొన్న తర్వాత కొందరిలో ఈ డిజార్డర్ మొదలవుతుంది. తక్షణ చికిత్స అవసరం.. కొందరు తమ జీవితాలపై హోర్డింగ్ డిజార్డర్ చూపించే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించరు, చికిత్స అవసరమని భావించరు. ఈ డిజార్డర్‌ను అధిగమించేందుకు సైకోథెరపీ అవసరం. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. దాచుకోవడానికి కారణమైన నమ్మకాలను గుర్తించాలి , వాటిని సవాలు చేయాలి. మరిన్ని వస్తువులను పొందాలనే కోరికల నియంత్రణ అలవరచుకోవాలి. ఏయే వస్తువులను వదిలించుకోవచ్చో వాటిని వదిలించుకోవాలి. డెసిషన్ మేకింగ్‌ను.. కోపింగ్ మెకానిజాన్ని మెరుగుపరచుకోవాలి. గందరగోళాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటిని చక్కగా నిర్వహించుకునేందుకు సాయం తీసుకోవాలి. హోర్డింగ్ ఒంటరితనానికి దారితీస్తుంది కాబట్టి ఇతరులకు చేరువవ్వాలి. ఇంటికి సందర్శకుల హడావిడిని వద్దనుకుంటే మీరే బయటకు వెళ్లొచ్చు. హోర్డింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్‌లో చేరాలి. ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. హోర్డింగ్ డిజార్డర్‌కి సిఫారసు అయిన మొదటి చికిత్స.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ రుగ్మత వల్ల వచ్చే ఆందోళన, నిరాశ వంటి వాటికి మందులు ఇస్తారు. థెరపీ షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా అనుసరించాలి. దాచుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
ఫన్డే: ఈ వారం కథ: 'లెఫి బొ'
"ఆఫీస్‌కి వెళ్ళబోతున్న భర్తకు ‘బై’ చెప్పడం కోసం గడపదాటి వసారాలోకొచ్చి, నవ్వుతూ చేయి వూపింది ఆద్విక. అతిలోకసౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్‌కి. అతను కూడా నవ్వుతూ ‘బై’ చెప్పాడు. ‘లోపలికెళ్ళి తలుపేసుకో. సాయంత్రం నేను తిరిగొచ్చేవరకు తలుపు తీయకు’ అన్నాడు. ‘నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా?’ చిలిపిగా నవ్వుతూ అంది. ‘దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాల్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాలకన్నా విలువైనదానివి’ అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది." అందం, అణకువ ఉన్న ఆద్విలాంటి స్త్రీలని కిడ్నాప్ చేసి, సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్ళు, కొన్ని మార్పులు చేర్పులు చేసి, అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగేవరకు చూసి, లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావడంతో ఆగి.. అటువైపు చూసింది ఆద్విక. అనుమానం కాదు. నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. ముప్పయ్యేళ్ళకు మించని వయసు, నవ్వుతున్నట్టు కన్పించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం.. అతన్ని యింతకు ముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కన్పించలేదు. మెల్లగా యింటిలోపలికి నడిచి, తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి, ధడాల్న తలుపు మూసి, గడియ పెట్టింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో.. యింటివైపు చూస్తున్నాడేమో.. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడేమో.. అతని కళ్ళలో కన్పించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురిచేస్తోంది. దొంగ కాదేమో.. ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో.. తనేమైనా పొరపడిందా? అది దైన్యం కాదేమో.. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకుని ఉన్నాడేమో? మొదట నిషిత్‌కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకతన్ని మరింత ఒత్తిడికి లోనుచేయడం? సాయంత్రం యింటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ యింటికి తిరిగొచ్చేలోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతకుడు లోపలికొచ్చి, ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. ఐనా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా. ఎలా వస్తాడు? అనుకుంటున్నంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనే నేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. మెల్లగా కదిలి, తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. పదహారంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కన్పించింది. అతనే.. తన భర్త ఆఫీస్కెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి.. ఆడియో కూడా ఆన్ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా విన్పిస్తున్నాయి. ‘భువీ.. నన్ను గుర్తుపట్టలేదా? నేను భువీ.. రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా? ప్లీజ్ భువీ.. నీకు చాలా విషయాలు చెప్పాలి’ అతని గొంతులో ఆవేదన.. కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. ‘మీరేదో పొరబడినట్టున్నారు. నాపేరు భువి కాదు. ఆద్విక.. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి యిక్కణ్ణుంచి వెళ్ళిపోండి’ అంది. ‘అయ్యో భువీ.. నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరబడ్తానా? లేదు. నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని.’ ‘క్షమించాలి.. నా భర్త పేరు నిషిత్. మరొకరి భార్యని పట్టుకుని మీ భార్య అనడం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపొండి. లేకపోతే మీపైన సెక్యూరిటీ సెల్‌కి కంప్లెయింట్ చేయాల్సి వస్తుంది.’ ‘నన్ను నమ్ము భువీ. ఒక్కసారి తలుపు తెరువ్. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క పది నిమిషాలు చాలు. ప్లీజ్ తలుపు తెరువు’ అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు. ఆద్విలో దయాగుణం .. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగడంతో తలుపు తెరిచి, ‘లోపలికి రండి. దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు’ అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూచున్నాక, అతనికి గ్లాసునిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గటగటా తాగి, గ్లాస్‌ని టీపాయ్ మీద పెట్టాక, అతని ఎదురుగా కూచుంటూ ‘ఇప్పుడు చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో’ అంది. ‘నా పేరు రియాన్. ఎనిమిదేళ్ళ క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినపుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే. అప్పుడు నా వయసు ఇరవై రెండేళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెల్సుగా. సిఓవై కాయ్.. కంపానియన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ’ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు. ‘తెలుసు. మూడేళ్ళ క్రితం నన్ను నిషిత్ తెచ్చుకుంది అక్కడినుంచే’ అంది ఆద్విక. ‘నాకు మొదట కాయ్ని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని, ఒకర్నో యిద్దర్నో పిల్లల్ని కని.. ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ళ కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకోసం అత్యంత అందమైన ఆడ ఆండ్రాయిడ్లను తయారుచేసి, అమ్మకానికి పెడ్తున్నారని విన్నప్పుడు, ఎంత అందమైన ఆడవాళ్ళని తయారుచేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. ఎనిమిదేళ్ళ క్రితం ఒక్కో ఆండ్రాయిడ్ ధర యాభైలక్షల పైనే ఉండింది. మనక్కావల్సిన ఫీచర్స్‌ని బట్టి కోటి రూపాయల ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంతడబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన పాతిక్కి పైగా ఉన్న ఆడవాళ్ళలో నిన్ను చూశాక, చూపు తిప్పుకోలేక పోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని! అందుకే ఎనభై లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన ఐదేళ్ళ కాపురంలో ఎన్ని సుఖాలో.. ఎన్ని సంతోషాలో.. నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారిపోయింది.’ ‘ఐదేళ్ళ కాపురమా? నాకేమీ గుర్తులేదే.. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమొరీ చాలా షార్ప్. మీరు చెప్పేది కట్టు కథలా ఉంది’ అంది ఆద్విక. ‘నేను చెప్పేది నిజం భువీ.’ ‘నా పేరు భువి కాదని చెప్పానా.. అలా పిలవొద్దు. ఆద్విక అనే పిలవండి.’ ‘సరే ఆద్వికా. అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమొరీని పూర్తిగా ఎరేజ్ చేసి, మళ్ళా నిన్ను ఫ్రెష్‌గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావడం లేదు.’ ‘నా మెమొరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు?’ ‘ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్లని అమ్మడమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర కోటిన్నర వరకు పలుకుతోంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి, మెమొరీ మొత్తాన్ని తుడిచేసి, కొత్త ఆండ్రాయిడ్ అని కస్టమర్లను నమ్మించి కోటిన్నరకు అమ్ముకుంటారు.’ ‘అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు?’ అంది ఆద్విక. ‘నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు. ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువీ నేను ప్రేమలో పడింది.. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు..’ ‘ఇవేమీ నమ్మశక్యంగా లేవు.’ ‘నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు’ అంటూ చూపించాడు. వాటిల్లో తనలానే నాజూగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కన్పించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న ఆద్వికతో ‘యిది నువ్వే భువీ..’ అన్నాడు రియాన్. ‘మీరు చూపించిన ఫొటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంతమాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? యిప్పుడున్న టెక్నాలజీతో ఎన్నిరకాల మాయలైనా సాధ్యమే. యిక మీరు వెళ్ళొచ్చు’ అంది లేచి నిలబడుతూ. ‘నువ్వు నా భువివే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమొరీని ఎరేజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెంట్‌గా ఉంటుంది. దాన్ని రిట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నాకో అవకాశం యివ్వు. రేపు మళ్ళా వస్తాను. నాతో బైటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బైటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స ఎక్స్పర్ట్ దగ్గరకు పిల్చుకెళ్తాను. జస్ట్ వన్ అవర్. ప్లీజ్ నాకోసం.. కాదు కాదు. మనకోసం..’ ‘మీరు మొదట బైటికెళ్ళండి’ కోపంగా అంది. ‘నిజమేమిటో తెల్సుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. ఒక్క గంట చాలు. రేపు మళ్ళా వస్తాను’ అంటూ అతను వేగంగా బైటికెళ్ళిపోయాడు. ∙∙ రాత్రి పన్నెండు దాటినా నిషిత్‌కి నిద్ర పట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కోక ముందు రియాన్ తో ఐదు సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమొరీని ఎరేజ్ చేసి, తనకు అమ్మారా? ఎంత మోసం.. ఇలా ఫస్ట్ సేల్ అని చెప్పి తనలాంటివాళ్ళని ఎంతమందిని మోసం చేసి, పాత ఆండ్రాయిడ్లని అంటగడ్తున్నారో! కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ ఇరవై యేళ్ళ వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. ఇరవై యేళ్ళే ఉంటుంది. అతనికి ఆద్వికను కొనడం కోసం కాయ్ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా.. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తీయటి జ్ఞాపకమో.. అతనికి పాతికేళ్ళ వయసులో జోషికతో పెళ్ళయింది. యిద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేసేవారు. పెళ్ళయిన ఏడాదివరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట.. ఎంత ఓపికతో భరించాడో.. అందమైన పూలవనాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు .. ఆ కోరిక తీరనే లేదు. ఎన్నేళ్ళయినా జోషికలో మార్పు రాలేదు. పోనుపోను మరింత మొండిగా, మూర్ఖంగా తయారైంది. యిద్దరు పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవడం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అన్పించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి జీవితంలో స్థిరపడ్డాక, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. తర్వాత రెండేళ్ళ వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అన్పించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలుదువ్వే రకమైతే.. నో.. అన్నింటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం. ఆ రెండేళ్ళు యింటిపని, వంటపని యిబ్బంది అన్పించలేదు. ప్రతి పనికీ రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్‌లో ఫీడ్ చేస్తే చాలు. కూరలు కడిగి, తరిగి, నూనెతో పాటు కారం, ఉప్పులాంటి అవసరమైన దినుసులూ వేసి, వండి హాట్ బాక్స్‌లో పెట్టేస్తుంది. కాని యిబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవడం. మనసులోని భావాలు పంచుకోడానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్ కంపెనీ గుర్తొచ్చింది. అప్పటికే కాయ్ కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. కోటి కోటిన్నర పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్ళయినా వన్నె తరగని, వయసు పెరగని ఇరవై యేళ్ళ అందమైన ఆండ్రాయిడ్లను కొనుక్కోడానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన, ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. ‘గొడవలూ కొట్లాటలూ లేని ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన, అణకువ గల ఇరవై యేళ్ళ ఆండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతమవుతుంది. భార్యగా కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా లేదా ఆల్ ఇన్ వన్ నెరజాణ కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి ఆండ్రాయిడ్లని అందించే బాధ్యత మాది. రిపేరింగ్, సర్వీసింగ్ అవసరం లేని, మెయింటెనెన్ ్సకి రూపాయి కూడా ఖర్చు లేని ఆండ్రాయిడ్లు.. ఇరవై యేళ్ళ అమ్మాయి చేయగల అన్ని పనులను ఎటువంటి లోటూ లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖసంతోషాలే మాకు ముఖ్యం.. మీ మనశ్శాంతే మా లక్ష్యం’ అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనిక్కావల్సింది కూడా అదే. భార్యగా అన్ని విధుల్ని నిర్వర్తిస్తూ, మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ. ఓ రోజు ఆఫీస్‌కి వెళ్ళకుండా నేరుగా కాయ్ కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేల్మనిపించేలా అధునాతనంగా అలంకరించిన పదంతస్తుల భవనం.. యం.డి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ‘మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న ఆండ్రాయిడ్లనే చూపిస్తాం. వాళ్ళలోంచి మీక్కావల్సిన అమ్మాయిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే, వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి, మీకు అందచేస్తాం’ అన్నాడు. ‘నాదో సందేహం. నేను మొత్తం ఎమౌంట్ కట్టేసి, అమ్మాయిని యింటికి పిల్చుకెళ్ళాక, ఏదో ఓ సందర్భంలో నాతో గొడవపడితే ఏం చేయాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు’ అన్నాడు నిషిత్. అదేదో జోక్ ఆఫ్ ది ఇయర్ ఐనట్టు యం.డి పెద్దగా నవ్వాడు. ‘దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగటివ్ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగడం, ఎదురుచెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్‌నెస్.. ఇవేవీ మీకు కన్పించవు. రెండు వందల యేళ్ళ క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెట్ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞల్లో ఉంటూ, అణకువతో మసలుతూ, దాసిలా సేవలు చేస్తూ, రంభలా పడగ్గదిలో సుఖాలు అందిస్తూ.. యిక అందంలో ఐతే అప్సరసల్తో పోటీ పడ్తారు. అందుకే మా ఆండ్రాయిడ్లకు ‘లెఫి బొ’ అని పేరు పెట్టాం. ఫ్రెంచ్‌లో లెఫి బొ అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్‌గా డిమాండ్ ఉన్న ప్రాడక్ట్ మాది. మీరు రిగ్రెట్ అయ్యే చాన్సే లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది. మగవాళ్ళకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపానియన్ ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందని కలలు కన్నానో, అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారుచేయించాను’ చెప్పాడు. ‘ఖరీదు ఎంతలో ఉంటుంది?’ ‘మీరు మొదట పై అంతస్తుల్లో ఉన్న మా మోడల్స్‌ని చూశాక, ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా మాడిఫికేషన్ ్స కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను’ అన్నాడు. అతనికి ఆద్విక బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె కళ్ళు.. ‘గుడ్ చాయిస్ సర్. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్’ అంటూ దాని ధరెంతో చెప్పాడు. అతనడిగినంత ధర చెల్లించి, ఆద్వికను యింటికి తెచ్చుకున్నాడు. ఆద్విక యింటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే.. కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే.. దుఃఖాలు లేవు. అశాంతులు లేవు. కానీ ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పడం ఏమిటి? అతని మనసునిండా అలజడి.. ఆందోళన.. అశాంతి. కాయ్ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్ ఓ రోజుముందే తయారై వచ్చిన ఫ్రెష్ పీస్ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచనల్తో నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయం నిషిత్ ఆఫీస్కెళ్ళిన పది నిమిషాల తర్వాత రియాన్ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక, నిజమేమిటో తెల్సుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో, ఆద్విక ఇంటికి తాళం వేసి, అతన్తోపాటు బయల్దేరింది. కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో, ఆద్విక తలలో అమర్చి ఉన్న చిప్‌ని బైటికి తీసి, ఎరేజ్ చేయబడిన మెమొరీని రిట్రీవ్ చేసి, మళ్ళా చిప్‌ని లోపల అమర్చాడు. ఆద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్ వైపు చూసింది. రియాన్.. తన భర్త.. ఐదేళ్ళు అతన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకో విషయం అర్థమైంది. తను మొదట రియాన్ భార్యగా ఐదేళ్ళు గడిపాక, ఇప్పుడు మూడేళ్ళ నుంచి నిషిత్‌కి భార్యగా కొనసాగుతోంది. ‘భువీ.. నేను చెప్పింది నిజమని యిప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువీ. నువ్వోరోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చిపట్టినట్టు నీకోసం ఎన్ని వూళ్ళు తిరిగానో.. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కల్సుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువీ. నాతో వచ్చేయి. నువ్వు లేకుండా బతకలేను భువీ’ అన్నాడు రియాన్. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది ఆద్విక. ‘ఆలోచించుకోడానికి నాక్కొంత సమయం ఇవ్వండి’ అంది. ‘యిందులో ఆలోచించడానికి ఏముంది భువీ. నువ్వు నా భార్యవి. మనిద్దరం ఐదు సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బులు సంపాదించే ముఠా నిన్ను ఎత్తుకెళ్ళి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్ కొనుక్కున్నాడు. యిందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావడానికి యింకా సంశయం దేనికి?’ అన్నాడు రియాన్. ‘నేను ప్రస్తుతం నిషిత్ భార్యని. అతన్ని వదిలేసి ఉన్నపళంగా మీతో వచ్చేస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి’ అంది ఆద్విక. మరునాడు రియాన్ రావడంతోటే ‘అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా’ అన్నాడు. ‘సారీ.. నేను నా భర్త నిషిత్ని వదిలి రాను’ అంది ఆద్విక. ‘నీకో విషయం అర్థం కావడం లేదు. నిషిత్‌కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువ్వి. అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి. నా ఆరాధ్య దేవతవి. నా ప్రేమ సామ్రాజ్ఞివి. మన ప్రేమను తిరిగి బతికించుకోడానికి నువ్వతన్ని వదిలి రాక తప్పదు భువీ’ అన్నాడు. ఆద్విక మెత్తగా నవ్వింది. ‘మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్‌ని. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం, అన్యాయాలు చేయడం మాకు చేతకాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవీ మా సిస్టంలో లోడ్ అయి లేవు. యిక ప్రేమంటారా? కాయ్ కంపెనీతో నిషిత్‌కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాల్ని తీర్చాలి. అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్‌ని ఉల్లంఘించడం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు.’ ‘భువీ.. నేను నిన్ను ప్రేమించాను.’ ‘మీతో కాపురం చేసిన ఐదేళ్ళు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను.’ ‘అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి?’ ‘మీ వద్దనుంచి నన్నెవరో కిడ్నాప్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమొరీని ఎరేజ్ చేసి మరొకరికి అమ్మడంలో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు ఆండ్రాయిడ్‌ని’ ఆద్విక లేచి, తలుపు తీసి, ‘యిక వెళ్ళండి’ అనేలా అతని వైపు చూసింది.+ – సలీం. ఇవి చదవండి: Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..! -
పిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసేలా నేర్పించండిలా!
‘కోటి విద్యలు కూటి కోసమే’ అని లోకోక్తి. కానీ, ‘కూటి విద్యను నేర్చుకున్నాకే కోటి విద్యలూ’ అనేది ఈతరం సూక్తి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అందుకు స్వయంపాకమైతే దీ బెస్ట్ అనే సలహా ఇస్తారు ఆరోగ్య స్పృహ కలిగినవాళ్లెవరైనా! చదువు, కొలువుల కోసం ఉన్న ఊరును వదిలి.. పరాయి చోటుకు పయనమయిన.. అవుతున్న వారంతా ఆ సలహాకే పోపేస్తున్నారు. ఎసట్లో నాలుగు గింజలు ఉడికించుకుంటున్నారు. వర్కింగ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకూ ఇది అవసరంగా మారుతోంది. పిల్లల చేతికి గరిటెనందిస్తోంది. రకరకాల వంటకాలను నేర్చుకునేందుకు ప్రేరేపిస్తోంది. అలా పిల్లలు ఆడుతూ పాడుతూ వండుకునే మెనూస్నీ.. వంటింటి చిట్కాలనూ తెలుసుకుందాం! వంట చేయడం ఓ కళైతే.. దాన్ని వారసత్వంగా పిల్లలకు అందించడం అంతకు మించిన కళ. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను యుక్తవయస్సు దాటేవరకు వంట గదివైపే రానివ్వరు. కానీ.. ఏ విద్యలోనైనా అనుభవజ్ఞులు నేర్పించే పాఠం కంటే అనుభవం నేర్పించే పాఠం ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచి పిల్లల్ని వంట పనుల్లో, ఇంటిపనుల్లో భాగం చేయడం అవసరం. సలాడ్స్ చేయడం.. రెసిపీలు కలపడం వంటి చిన్న చిన్న పనులతో పాటు.. ఏ కూరగాయ ఎలా ఉడుకుతుంది? ఏ బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టాలి? ఏ వంటకానికి ఎలా పోపు పెట్టాలి? వంటి వాటిపై అవగాహన కల్పించాలి. సాధారణంగా వంటింట.. పదునైన కత్తులు, బ్లేడ్లు, ఫ్లేమ్స్.. వేడి నూనెలు, నెయ్యి ఇలా చాలానే ఉంటాయి. అందుకే పిల్లల్ని ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటారు పేరెంట్స్. నిజానికి వంటగదిలోకి రానివ్వకుండా ఆపడం కంటే.. పర్యవేక్షణలో అన్నీ నేర్పించడమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతివాళ్లకూ ఏదో ఒకరోజు తమ వంట తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కత్తి తెగుతుందని, నిప్పు కాలుతుందనే విషయం తెలిసే వయసులోనే పిల్లలు ఉప్పుకారాల మోతాదులు అర్థంచేసుకుంటే మంచిది అంటున్నారు కొందరు పెద్దలు. దీనివల్ల సెల్ఫ్డింపెడెన్సే కాదు.. జెండర్ స్పృహా కలుగుతుందని అది అత్యంత అవసరమనీ పెద్దల అభిప్రాయం. అందుకే పాఠ్యాంశాలతోపాటు పాకశాస్త్రాన్నీ సిలబస్‌లో చేర్చాలని.. ఒకవేళ సిలబస్‌లో చేర్చలేకపోయినా హోమ్‌వర్క్‌లో మస్ట్‌గా భాగం చెయ్యాలని అనుభవజ్ఞుల సూచన. ఎందుకంటే..? ► వంట పనుల్లో భాగం అయినప్పుడు పిల్లలకు అది ఒక ప్రాక్టికల్ శిక్షణలా ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్ నేర్చుకోవడానికి.. ఒక మార్గం అవుతుంది. ఎలా అంటే.. కొలతలు, వినియోగం వంటి విషయాల్లో ఓ లెక్క తెలుస్తుంది. అలాగే నూనె, నీళ్లు ఇలా ఏ రెండు పదార్థాలను కలపకూడదు? ఏ రెండు పదార్థాలు కలపాలి? అనే విషయం వారికి అర్థమవుతూంటుంది. ► చిన్న వయసులోనే వంట నేర్చుకోవడంతో.. ఓర్పు నేర్పు అలవడుతాయి. శుచీశుభ్రత తెలిసొస్తుంది. అలాగే ప్రిపరేషన్, ప్రికాషన్స్ వంటివాటిపై క్లారిటీ వస్తుంది ► బాల్యంలోనే రెసిపీల మీద ఓ ఐడియా ఉండటంతో.. ఒక వయసు వచ్చేసరికి వంట మీద పూర్తి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ► తక్కువ సమయంలో ఏ వంట చేసుకోవచ్చు.. ఎక్కువ సమయంలో ఏ కూర వండుకోవచ్చు వంటివే కాదు.. కడుపు నొప్పి, పంటినొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు చిట్కాలూ తెలుస్తాయి. ► రెసిపీలు విఫలమైతే పిల్లలు.. విమర్శలను సైతం ఎదుర్కోవడం నేర్చుకుంటారు. వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని బోధపడుతుంది. గెలుపోటములను సమంగా తీసుకునే మనోనిబ్బరాన్ని అలవరుస్తుంది. ► స్కూల్లో, బంధువుల ఇళ్లల్లో.. ఇతరులతో కలిసేందుకు ఈ ప్రయోగాలన్నీ పిల్లలకు ప్రోత్సాహకాలవుతాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వంట నేర్చుకోబోయే పిల్లల్ని.. వయసు ఆధారంగా చేసుకుని.. నాలుగు రకాలుగా విభజించుకుంటే.. వంట నేర్పించడం చాలా తేలిక అంటున్నారు నిపుణులు. 3 – 5 ఏళ్ల లోపున్న పిల్లలు మొదటి కేటగిరీకి చెందితే.. 5 – 7 ఏళ్లలోపు పిల్లలు రెండో కేటగిరీలోకి వస్తారు. ఇక 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు మూడో కేటగిరీలోకి, 13 ఏళ్ల తర్వాత పిల్లలంతా నాలుగో కేటగిరీలోకి వస్తారు. మొదటి రెండు కేటగిరీల్లో పిల్లలకు చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే.. ఎదిగే కొద్దీ వాళ్లలో నైపుణ్యం పెరుగుతుంది. సాధారణంగా మూడు నుంచి ఐదు ఏళ్లలోపు పిల్లల్లో.. పెద్దలు చేసే ప్రతి పనినీ తామూ చేయాలని.. పెద్దల మెప్పు పొందాలనే కుతూహలం కనిపిస్తూంటుంది. వంటగదిలో కొత్త పనిని ప్రయత్నించడానికి ఉత్సాహంగా ఉంటారు. అయితే వారికి చేతుల్లో ఇంకా పట్టు.. పూర్తి అవగాహన ఉండవు కాబట్టి.. అలాంటి పిల్లలకు చిన్నచిన్న పనులను మాత్రమే చెప్పాలి. వారికి నెమ్మదిగా అలవాటు చేయడానికి వీలుండే పనులను, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేని వాటిని వారి చేతుల్లో పెట్టొచ్చు. ఎక్కువగా కూర్చుని చేసే పనులను వారికి అప్పగించాలి. చేయించదగిన పనులు.. - పండ్లు, కూరగాయలు కడిగించడం, చపాతీ పిండి కలపడంలో సాయం తీసుకోవడం. - పాలకూర వంటివి కడిగి.. తురుములా తెంపించడం. - బనానా వంటివి గుజ్జులా చేయించడం.(ఆ గుజ్జు బ్రెడ్, ఐస్‌క్రీమ్ వంటివి తయారుచేసుకోవడానికి యూజ్ అవుతుంది) ఐదేళ్లు దాటేసరికి.. పిల్లల్లో మోటార్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఏ పనిలోనైనా ఫర్ఫెక్ట్‌నెస్ పెరుగుతూంటుంది. అలాంటివారికి ఆహారాన్ని సిద్ధం చేయడంలో మెలకువలు నేర్పించొచ్చు. అప్పుడప్పుడే చదవడం, రాయడం ప్రారంభిస్తుంటారు కాబట్టి.. వారికి వంటకాలను పరిచయం చేయడానికి ఈ వయసే మంచి సమయం. వంటలో వాళ్లు మనకు సహాయపడగలిగే సులభమైన రెసిపీలను చెబుతుండాలి. వారు ఉపయోగించగలిగే చాప్ బోర్డ్స్, ఇతరత్రా చిన్నచిన్న కిచెన్ గాడ్జెట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. చేయించదగిన పనులు.. - పొడి పదార్థాలను నీళ్లు పోసి కలపడం - ఇన్‌గ్రీడియెంట్స్‌ని కొలవడం, లేదా లెక్కించడం ∙డైనింగ్ టేబుల్ని సర్దించడం - గుడ్లు పగలగొట్టించడం (పెంకుల విషయంలో కాస్త దగ్గరుండాలి) - పిండి వంటల్లో కానీ.. స్నాక్స్‌లో కానీ ఉండలు చేసే పనిని వారికి అప్పగించడం - మృదువైన పండ్లు, కూరగాయలను కట్ చేయించడం - రెసిపీని పెద్దగా రెండు మూడు సార్లు చెప్పించడం.. ఖాళీ సమయాల్లో ఒకటికి రెండు సార్లు ఆ వివరాలను గుర్తుచేయడం - చిన్న చిన్న చపాతీలు చేయించడం ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లల్లో స్వతంత్ర ఆలోచనలు పెరుగుతుంటాయి. తమ పనులను తాము చేసుకుంటూంటారు. ఈ వయసు వచ్చేసరికి వంట గదిలో వారికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం ఉండదు. సొంతంగా ఎవరి సాయం లేకుండానే వీరు చిన్నచిన్న ఫుడ్ ఐటమ్స్ సిద్ధం చేయగలరు. తిన్న ప్లేట్ లేదా బౌల్ కడిగిపెట్టడం, లంచ్ బాక్స్ సర్దుకోవడం, కిరాణా సామాన్లు జాగ్రత్త చేయడం వంటివన్నీ వాళ్లకు అలవాటు చేస్తూండాలి. చేయదగిన పనులు.. - కూరగాయలు లేదా పండ్ల తొక్క తీసుకుని, కట్ చేసుకుని సలాడ్స్ చేసుకోవడం - శాండ్విచెస్, బ్రెడ్ టోస్ట్‌లు చేసుకోవడం, ఆమ్లెట్స్ వేసుకోవడం - జ్యూసులు తీసుకోవడం ∙మరమరాలు, అటుకులతో పిడత కింద పప్పు, పోహా వంటివి చేసుకోవడం, ఇన్‌స్టంట్‌గా తీపి లేదా కారం రెసిపీలు చేసుకోవడం చిన్నప్పటి నుంచి కుకింగ్ మీద అవగాహన ఉన్నవారికి.. సుమారు 13 ఏళ్లు వచ్చేసరికి కిచెన్‌లోని ప్రతి వస్తువును ఎలా వాడాలి? ఏది ఎప్పుడు వాడాలి? అనేది తెలుస్తూంటుంది. వీరిలో తగు జాగ్రత్తే కాదు చక్కటి నైపుణ్యమూ ఉంటుంది. ఇప్పటి తరానికి స్మార్ట్ గాడ్జెట్స్ పైన బీభత్సమైన కమాండ్ ఉంది. కాబట్టి ఓవెన్‌ని ఉపయోగించడం, ఇండక్షన్ స్టవ్ వాడటం వంటివి వీరికి ఈజీ అవుతాయి. చేయదగిన పనులు.. - గ్యాస్ స్టవ్‌పై ఆమ్లెట్స్ వేసుకోవడం - ఎలక్ట్రిక్ కుకర్‌లో జొన్నకండెలు, చిలగడ దుంపలు, గుడ్లు వంటివి ఉడికించుకోవడం - పదునైన కత్తులు జాగ్రత్తగా వాడటం - పెద్దల సమక్షంలో బ్లెండర్, ఫుడ్ ప్రాసెసర్, గార్లిక్ ప్రెస్, కాఫీ మేకర్, వాఫిల్ మేకర్ వంటి వివిధ కిచెన్ గాడ్జెట్ల వాడకాన్ని నేర్చుకోవడం, మైక్రోవేవ్‌పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఐస్‌క్రీమ్ వంటివి సిద్ధం చేసుకోవడం - కిచెన్ క్లీనింగ్ నేర్చుకోవడం వంటి విషయాలపై శ్రద్ధ కల్పించాలి. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?
శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోక వైకుంఠమైన వెంకటాద్రిపై కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రాన దివ్యమైన ముహూర్తంలో అర్చారూపంలో స్వయంవ్యక్తమూర్తిగా శ్రీవేంకటేశ్వరునిగా వెలశాడు. శ్రీస్వామి ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్త ప్రియుడు. కోరినవారికి కొంగు బంగారమై కోర్కెలు నెరవేర్చే ఆ శ్రీవేంకటేశ్వరుని 'వైభోగం న భూతో న భవిష్యతి!'. వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. • దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. • సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయమే. • వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా ఉత్సవాలను అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదవ నాడు.. మహారథానికి (చెక్కరథం) బదులు ముందు వరకు వెండి రథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుండి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై ఊరేగింపు సాగింది. 2012లో దాని స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం.. వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)– శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. • శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది. అంకురార్పణం (14–10–2023) (రాత్రి 7 నుండి 9 గంటల వరకు): వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారికి ఆలయ మాడ వీథుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంగారు తిరుచ్చి ఉత్సవం (15–10–2023) (ఉదయం 9 గంటలకు): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. పెద్దశేషవాహనం (15–10–2023) (రాత్రి 7 గంటలకు): మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. చిన్నశేషవాహనం (16–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి. హంస వాహనం (16–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు. సింహ వాహనం (17–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం. ముత్యపుపందిరి వాహనం (17–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. కల్పవృక్ష వాహనం (18–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీ«థుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సర్వభూపాల వాహనం (18–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహినీ అవతారం (19–10–2023) (ఉదయం 8 గంటలకు): బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు. గరుడ వాహనం(19–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు. హనుమంత వాహనం (20–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది. పుష్పకవిమానం (20–10–2023) (సాయంత్రం 4 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి పుష్పకవిమానంపై విహరిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. గజవాహనం(20–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది. సూర్యప్రభ వాహనం (21–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీ«థుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం (21–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాలలో అనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. స్వర్ణరథం (22–10–2023) (ఉదయం 7.15 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అశ్వవాహనం (22–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం (23–10–2023) (ఉదయం 6 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. -లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!? -
శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. తొమ్మిదిరోజుల పాటు సప్తగిరులు గోవిందనామ ధ్వనులతో మారుమోగనున్నాయి. అసలు వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి, బ్రహ్మోత్సవాలు ఎందుకు జరిపేవారు, ఎన్నివాహనాలపై గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చేవాడు.. బ్రహ్మోత్సవాల చరిత్రను తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం. లోక కల్యాణం కోసం తనకు ఉత్సవాలు జరపమని ఆ గోవిందుడే బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపించారట! వెంకన్న ఆదేశాలమేరకే బ్రహ్మదేవుడు ఏటా ఈ ఉత్సవాలు జరుపుతాడని ప్రతీతి. కన్యామాసం (అశ్వయుజం) లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు ముందు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. బ్రహ్మే స్వయంగా ఉత్సవాలను నిర్వహించారు కాబట్టే ఈ ఉత్సవాలకు ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలను ఒకదశలో నెలకొకటి వంతున ప్రతి ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు జరిగేవట! స్వయంగా బ్రహ్మే ఈ ఉత్సవాలను జరుపుతాడని చెప్పడానికి ప్రతీకగా ప్రతిరోజూ వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ఒక్క రథోత్సవం రోజు మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు స్వయంగా ఆ బ్రహ్మదేవుడే పగ్గాలు స్వీకరించి రథం నడుపుతాడని చెబుతారు. అంకురార్పణతో మొదలయ్యే ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, చినశేషవాహనం, పెద్దశేషవాహనం, సింహవాహనం, ముత్యాలపందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహినీ అవతారం, గరుడవాహనం, గజవాహనం, సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, రథోత్సవం, బంగారు తిరుచ్చి వంటి వాహనాలపై దేవదేవుడు కొలువై భక్తకోటికి దర్శనమిస్తారు. క్రీస్తుశకం 614లో పల్లవరాణి సమవాయి.. మనవాళ పెరుమాళ్ అనే భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించింది. అప్పట్లో ఈ విగ్రహాన్ని ఊరేగించి బ్రహ్మోత్సవాలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రీస్తుశకం 1254 చైత్రమాసంలో తెలుగురాజు విజయగండ గోపాలదేవుడు, 1328లో ఆషాఢమాసంలో ఆడితిరునాళ్లు పేరిట త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవ రాయలు ఉత్సవాలు జరిపారు. అలాగే 1429లో ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహర రాయలు. 1530లో అచ్యుతరాయలు బ్రహ్మోత్సవాలు జరిపారు. ఇలా 1583 ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు ఏడాదిలో ప్రతినెలా జరుగుతుండేవి. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఈ ఉత్సవాలు అర్ధంతరంగా ఆగిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఏడాదికి పన్నెండుసార్లు జరిగే ఈ ఉత్సవాలు క్రీస్తుశకం 1583 నాటి వరకు కొనసాగాయి. అయితే కాలక్రమేణా మార్పులు జరిగి ఏడాదికి పది రోజుల పాటు నిర్వహించడం మొదలుపెట్టారు. బ్రహ్మోత్సవాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది గరుడ వాహనం. అంత పేరున్న గరుడ వాహనాన్ని క్రీ.శ 1530కి ముందు వాడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. సూర్యప్రభ వాహనం, గజవాహనం క్రీ.శ 1538లో ప్రారంభించారు. సింహవాహనం క్రీ.శ 1614లో మొదలైంది. మట్ల కుమార అనంతరాజు క్రీ.శ 1625లో శ్రీవారికి బంగారు అశ్వవాహనం, వెండి గజవాహనాన్ని, సర్వభూపాల వాహనాన్ని బహూకరించారు. ఇటివల టీటీడీ సర్వభూపాల వాహనాన్ని కొత్తగా తయారు చేయించింది. ప్రస్తుతం ఈ వాహనాన్నే వినియోగిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమవు తున్నాయి అని ప్రకటించే విధానం అప్పట్లో విచిత్రంగా ఉండేది. శ్రీవారి ఆలయం ముందు పెద్ద పేలుడు సంభవించినట్టు శబ్దం చేసి మంటను వేసేవారట. ఈ పద్ధతిని ఆదిర్వేది అనేవారు. తొలిసారిగా ఈ విధానాన్ని క్రీ.శ 1583లో ప్రారంభించినట్టు శాసనాధారం ఉంది. ఉత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని వైదిక ఆచారాలతో శుద్ధి చేసేందుకు క్రీ.శ 1583లో ప్రవేశపెట్టిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం నేటికీ సాగుతోంది. 2020, 2021లో కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నుంచి బ్రహ్మోత్సవాలను యథాప్రకారం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. గత నెల సెప్టంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలను కూడా గొప్పగా జరపడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. - తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి -
సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా
ఏడాది క్రితం.. స్పెయిన్‌లో మాడ్రిడ్ ఓపెన్.. కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్లే కోర్టుపై అప్పటికే అతను చెప్పుకోదగ్గ విజయాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. క్వార్టర్స్ సమరంలో ప్రత్యర్థి ఎవరో తెలియగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. దిగ్గజ ఆటగాడు, తాను ఆరాధించే, అభిమానించే రాఫెల్ నాదల్ ఎదురుగా ఉన్నాడు. ఇద్దరు స్పెయిన్ స్టార్ల మధ్య వారి సొంతగడ్డపై పోరు అనగానే ఆ మ్యాచ్‌కు ఎక్కడ లేని ఆకర్షణ వచ్చింది. చివరకు నాదల్‌పై సంచలన విజయంతో తన 19వ పుట్టిన రోజున అల్కరాజ్ తనకు తానే కానుక ఇచ్చుకున్నాడు. అతను అంతటితో ఆగలేదు. సెమీస్‌లో జొకోవిచ్‌నూ మట్టికరిపించి ఒకే క్లే కోర్టు టోర్నీలో ఆ ఇద్దరినీ ఓడించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అక్కడే అతను ఏమిటో ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్తులో సాధించబోయే ఘనతలకు అది సూచిక అయింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వింబుల్డన్ గెలవడం, వరల్డ్ నంబర్ వన్ కావడం తన కల అని చెప్పుకున్నాడు. క్లే కోర్టు వేదిక ఫ్రెంచ్ ఓపెన్ చాలా ఇష్టమైనా, వింబుల్డన్‌కు ఉండే ప్రత్యేకత వేరని అన్నాడు. 17 ఏళ్ల వయసులో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనతలన్నీ సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. నాదల్ దేశం నుంచి వచ్చి.. నాదల్ తరహాలోనే బలమైన షాట్లు ఆడుతూ, అతనిలాగే క్లే కోర్టును ఇష్టపడే అల్కరాజ్ను అందరూ నాదల్కు సరైన వారసుడిగా గుర్తించారు. బేబీ నాదల్ అంటూ పేరు పెట్టారు. నాలుగేళ్ల క్రితం వింబుల్డన్ గ్రాస్ కోర్టుల్లో ఫెడరర్‌తో కలసి ప్రాక్టీస్ చేసిన అతను ఇప్పుడు అదే వింబుల్డన్‌ను ముద్దాడి కొత్త చరిత్ర సృష్టించాడు. అసాధారణంగా.. సమకాలీన టెన్నిస్‌లో అల్కరాజ్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. తండ్రి గొన్జాలెజ్ అల్కరాజ్ మాజీ టెన్నిస్ ఆటగాడు. ఒకప్పుడు స్పెయిన్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. సహజంగానే తండ్రి వల్లే అతనికి ఆటపై ఆసక్తి పెరిగింది. ముర్షియా పట్టణంలో గొన్జాలెజ్ ఒక టెన్నిస్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు అల్కరాజ్. సహజ ప్రతిభ ఉన్న అతను ఆటలో వేగంగా దూసుకుపోయాడు. దిగువ స్థాయి జూనియర్ టోర్నీలలో అతను రెగ్యులర్‌గా ఆడాల్సిన అవసరమే లేకపోయింది. 15 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్‌గా మారి వరుస విజయాలు సాధించడంతో సర్క్యూట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత యువాన్ కార్లోస్ ఫెరీరోను కోచ్‌గా పెట్టుకోవడం అతని కెరీర్లో కీలక మలుపు. ముడి పదార్థంలా ఉన్న అల్కరాజ్ను ఫెరీరో మెరిసే బంగారంగా తీర్చిదిద్ది.. అద్భుతమైన అతని ఆటలో తన వంతు పాత్ర పోషించాడు. అన్నీ సంచలనాలే.. ఏటీపీ టూర్లో అల్కరాజ్ ఎన్నో అరుదైన విజయాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం పిన్న వయస్సులోనే సాధించిన ఘనతలుగా గుర్తింపు పొందాయి. టీనేజర్‌గా ఉండగానే 9 టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. ఏటీపీ 500 స్థాయి టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా, ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. తనపై ఉన్న అంచనాలను అతను ఎప్పుడూ వమ్ము చేయలేదు. వాటికి అనుగుణంగా తన ఆటను మెరుగుపరచుకుంటూ, తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు. అతని కెరీర్లో అన్నింటికంటే అత్యుత్తమ క్షణం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాన్ని పొందడం! వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన చిన్న వయస్కుడిగా, మొదటి టీనేజర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. ఈ మైలురాయిని దాటాక అతని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. కేవలం అతని ఆట, అతను సాధించబోయే టైటిల్స్‌పైనే అందరి చూపులు నిలిచాయి. గ్రాండ్‌గా విజయాలు.. 17 ఏళ్ల వయసులో తొలిసారి అల్కరాజ్ వింబుల్డన్ బరిలోకి దిగాడు. ఇదే అతనికి మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. అయితే క్వాలిఫయింగ్ దశను అధిగమించలేకపోయాడు. తర్వాత ఏడాదికే యూఎస్ ఓపెన్‌లో ఏకంగా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. 1963 తర్వాత ఎవరూ 18 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించలేకపోవడం అతని విజయం విలువను చూపించింది. 2022లో తనకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు చేరిన అల్కరాజ్ ఏడాది చివరికల్లా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించడం విశేషం. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకొని మొదటిసారి అతను మేజర్ విజయాన్ని చవి చూశాడు. అప్పటికే వరల్డ్ నంబర్ వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్కరాజ్ అదే స్థానంతో ఏడాదిని ముగించాడు. అనూహ్య గాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం చేయగా.. గాయం కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను మళ్లీ రివ్వున పైకి ఎగిశాడు. పూర్తి ఫిట్నెస్ను సాధించిన తర్వాత గ్రాస్ కోర్టు టోర్నీ క్వీన్స్ క్లబ్ విజేతగా.. వింబుల్డన్‌పై గురి పెట్టాడు. గ్రాస్ కోర్టుపై తన ఆట కాస్త బలహీనం అని తాను స్వయంగా చెప్పుకున్నా.. పట్టుదల ఉంటే ఎక్కడైనా గెలవొచ్చని ఈ స్పెయిన్ కుర్రాడు నిరూపించాడు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన తీరు కొత్త శకానికి నాంది పలికింది. గత రెండు దశాబ్దాల్లో ముగ్గురు దిగ్గజాలు మాత్రమే శాసించిన వింబుల్డన్‌ను గెలుచుకొని తాను టెన్నిస్‌ను ఏలడానికి వచ్చానని సూత్రప్రాయంగా చెప్పాడు. పదునైన ఆటతో.. అల్కరాజ్ ఆటలోకి వచ్చినప్పుడు అతను క్లే కోర్టు స్పెషలిస్ట్ మాత్రమే అన్నారు. అతను ఆరంభంలో అతను సాధించిన టైటిల్స్, నాదల్ వారసుడిగా వచ్చిన గుర్తింపు ఒక్క సర్ఫేస్కే పరిమితం చేసేలా కనిపించింది. కానీ ఏడాది తిరిగే లోపే అది తప్పని నిరూపించాడు. తొలి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్టు కాగా, ఇప్పుడు సాధించిన వింబుల్డన్ గ్రాస్ కోర్టు. ఇక క్లే కోర్టులో ఫ్రెంచ్ ఓపెన్ బాకీ ఉంది. దాన్ని సాధించేందుకూ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇప్పుడతను ఆల్‌రౌండ్ ప్లేయర్. పదునైన ఫోర్హ్యండ్ అతని ప్రధాన బలం. అతని డ్రాప్ షాట్లు నిజంగా సూపర్. ఆ షాట్ బలమేమిటో తాజాగా వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ రుచి చూశాడు. ఫిట్నెస్, ఫుట్ స్పీడ్, దృఢమైన శరీరంతో అతను యువ నాదల్‌ను గుర్తుకు తెస్తున్నాడు. అల్కరాజ్ ఇప్పటికే తన ఆటతో ప్రపంచ టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నాడు. కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోనే జీవితకాలం సంతృప్తి పొందే ఆటగాళ్లతో పోలిస్తే రెండు పదుల వయసులోనే అతను రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. మున్ముందు గాయాల బారిన పడకపోతే పెద్ద సంఖ్యలో టైటిల్స్ అతని ఖాతాలో చేరడం ఖాయం. 2021లో క్రొయేషియా ఓపెన్ గెలిచి తన తొలి ట్రోఫీని అందుకున్న అల్కరాజ్ తర్వాతి ఏడాది వచ్చేసరికి 5 టైటిల్స్ గెలిచాడు. 2023లో ఇప్పటికే 6 టైటిల్స్ అతని ఖాతాలో చేరాయంటే అతను ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడో అర్థమవుతోంది. ముగ్గురు దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ తర్వాత టెన్నిస్‌ను శాసించగల ఆటగాడిగా అతని పేరు ముందుకొచ్చేసింది. దాంతో సహజంగానే ఎండార్స్మెంట్లు, బ్రాండ్లు అతని వెంట పడ్తున్నాయి. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కంపెనీలు నైకీ, బబోలట్, రోలెక్స్, ఎల్పోజో, బీఎండబ్ల్యూ, కెల్విన్ క్లీన్, లూయీ విటాన్ అతనితో జత కట్టాయి. ఆటలో ఇదే జోరు కొనసాగిస్తే అల్కరాజ్ ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలవడం ఖాయం. చదవండి: #StuartBroad: రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్ -
18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం
21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్‌షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి. 18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్‌స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు. 'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్‌లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్‌హ్యాండ్‌ను, ఇటు బ్యాక్‌హ్యాండ్‌ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్‌కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్‌హ్యాండ్‌కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే. 13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్‌ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్‌లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్‌హ్యాండ్‌పై దృష్టి పెట్టాడు. ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్‌కు ‘ఐస్‌బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌తో మొదలు.. స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్‌లో ఆడే అవకాశం బోర్గ్‌కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్‌లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్‌ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆక్లాండ్‌లో గ్రాస్‌కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్‌స్లామ్ చాంప్‌గా కూడా అవతరించాడు. రోమ్‌లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్గారోస్లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు. తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్‌ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్‌లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ ధమాకా.. రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్‌కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు. రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్‌ను తన కోర్ట్‌లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్‌తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు. ముగింపు...పునరాగమనం... బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్‌లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్‌స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్‌ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్లో, పాతతరం వుడెన్ రాకెట్‌తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్‌కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్‌కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్‌లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం.. -
అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..!
వెదురుతో చేసిన విల్లు, బాణాలు.. అడవిలో సరదాగా పోటీలు.. చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం..15 ఏళ్ల వయసు వచ్చే సరికి కూడా అతనికి అదే జీవితం.. ఏనాడూ అతను తన విలువిద్యతో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అంది పుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు. సరైన మార్గనిర్దేశనంతో అతను ఏకంగా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్‌గా మారి తర్వాతి రోజుల్లో భారత్‌లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. ఒక దశలో ఆ క్రీడలో అతని పేరు మినహా ఇంకెవరినీ.. సాధారణ క్రీడాభిమాని గుర్తు పట్టలేని స్థాయికి చేరిన ఆ వ్యక్తి లింబా రామ్. అతిసాధారణ గిరిజన నేపథ్యం నుంచి ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు పొందిన ఆర్చర్. 1987.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి బియ్యాల పాపారావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ‘సాయ్’లో వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ‘సాయ్’లో ఒక రకమైన ప్రత్యేక టైమ్‌టేబుల్‌తో పాటు అక్కడ శిక్షణ కోసం ఎంపికయ్యేందుకు దాదాపు ఒకే తరహా పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనేది పాపారావు ఆలోచన. సహజ ప్రతిభను వెలుగులోకి తెచ్చి తగిన రీతిలో శిక్షణ ఇస్తే సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సత్తా చాటగలరనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన దృష్టి్ట గిరి పుత్రులపై పడింది. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్‌కి చెందిన వ్యక్తి కావడంతో వారి గురించి ఆయనకు అవగాహన ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ‘స్పెషల్ ఏరియా గేమ్స్’ పేరుతో కొత్త తరహా సెలక్షన్స్‌కి శ్రీకారం చుట్టారు. ఆర్చరీలో కూడా ఇదే తరహాలో సెలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు అడవిలో విల్లు, బాణాలతో వేటకే పరిమితమైనవారికి ఇలా ఓపెన్ సెలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. కొందరు మిత్రులు ఇచ్చిన సమాచారంతో లింబా రామ్ కూడా దీనికి హాజరయ్యాడు. అతనిలోని సహజ ప్రతిభను అధికారులు గుర్తించి వెంటనే ఎంపిక చేశారు. అక్కడినుంచి లింబా రామ్ ప్రయాణం ఢిల్లీలోని ‘సాయ్’ కేంద్రానికి సాగింది. అది ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు చేరింది. అడవి బిడ్డ నుంచి ఆర్చర్‌గా.. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లా సరాదీత్ గ్రామం లింబా రామ్ స్వస్థలం. ఐదుగురు సంతానంలో అతనొకడు కాగా, తండ్రి వ్యవసాయ కూలీ. వారి కుటుంబం ‘అహారి’ అనే గిరిజన తెగకు చెందింది. పేదరికం కారణంగా లింబా రామ్.. తన సోదరుల్లాగే కూలీ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. స్నేహితులతో కలసి సరదాగా వేటకు కూడా వెళ్లేవాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ‘అర్జున్ రామ్’ అనే పేరు పెట్టారు. అయితే చిన్న వయసులో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైన అతను దాదాపు మృత్యువుకు చేరువగా వెళ్లాడు. అదృష్టవశాత్తు కోలుకోవడంతో అర్జున్ అనే పేరు తీసేసి స్థానిక దేవత పేరు మీద ‘లింబా’ అని చేర్చారు. అలా ఆ పేరులోంచి అర్జునుడు పోయినా.. ఆ తర్వాత భవిష్యత్తులో అతను అభినవ అర్జునుడిలా బాణాలు సంధిస్తూ విలువిద్యలో నేర్పరి కావడం దైవానుగ్రహమే కావచ్చు! వెదురు బాణాలతో వేటాడటం, స్థానికంగా కొన్ని పోటీల్లో పాల్గొనడం మినహా ఆర్చరీ అనే ఒక అధికారిక క్రీడ ఉందని, అందులో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చనే విషయం అప్పటికి లింబా రామ్‌కి అసలు తెలీదు. అయితే ‘సాయ్’ సెలక్షన్స్ అన్నీ మార్చేశాయి. సరైన చోట, సరైన శిక్షణతో.. స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో కొత్త విద్యార్థిగా చేరిన లింబా రామ్‌కి అక్కడి ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వెదురు విల్లుకే పరిమితమైన అతని చేతికి తొలిసారి ఆధునిక విల్లు, బాణాలు వచ్చాయి. భారత కోచ్ ఆరెస్ సోధీ పర్యవేక్షణలో శిక్షణ మొదలైంది. రష్యా కోచ్ అలెగ్జాండర్ నికొలయ్ జట్టుకి కోచ్‌గా కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ‘నువ్వు ఈ ఆట కోసమే పుట్టావురా’ అంటూ సోధీ చెప్పిన మాట లింబా రామ్‌లో స్ఫూర్తి నింపి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ ఎంపికకు కారణమైన పాపారావు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లింబా రామ్‌ని ప్రోత్సహించారు. దాని ఫలితాలు కొన్ని నెలలకే కనిపించాయి. బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో విజేతగా నిలవడంతో లింబా రామ్‌పై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాతా అదే జోరును కొనసాగించిన అతను సంవత్సరం తిరిగే లోపే జాతీయ స్థాయి సీనియర్ చాంపియన్‌గా కూడా మారాడు. దాంతో 16 ఏళ్ల వయసులోనే భారత ఆర్చరీ టీమ్‌లో లింబా రామ్‌కి చోటు దక్కింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు భారత ఆర్చరీపై తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో ఘనతలను తన ఖాతాలో లిఖించుకున్నాడు. ప్రపంచ రికార్డు కూడా.. 1989లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్ షిప్ తొలిసారి లింబా రామ్‌కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును అందించింది. ఈ ఈవెంట్లో అతను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆసియన్ కప్‌లో చక్కటి ప్రదర్శనతో లింబా ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టీమ్ ఈవెంట్లో భారత్‌కి రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాతి ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కి నాలుగో స్థానం దక్కడంలో అతనిదే ప్రధాన భూమిక. మరో రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియన్ ఆర్చరీ చాంపియన్ షిప్ లింబా రామ్ కెరీర్లో అత్యుత్తమ దశ. బీజింగ్‌లో జరిగిన ఈ పోటీల వ్యక్తిగత విభాగంలో అతను స్వర్ణం సాధించడంతో పాటు 358/360 స్కోరుతో అప్పటి ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ఆర్చరీ చాంపియన్ షిప్లో కూడా అతను ఒక స్వర్ణం, ఒక రజతంతో మెరిశాడు. కెరీర్ చివర్లో కుర్రాళ్ల మధ్య మరోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచి లింబా తన ఆటను ముగించాడు. అచ్చిరాని మెగా ఈవెంట్.. ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒలింపిక్స్ పతకం సాధించడం ఒక కల. లింబా రామ్‌కి వరుసగా మూడు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చినా పతకం మాత్రం దక్కలేదు. ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు తెచ్చుకున్నా, మూడుసార్లూ నిరాశే ఎదురైంది. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఆడినా.. అందులో అతని అనుభవరాహిత్యం కనిపించింది. 1992 బార్సిలోనా సమయంలోనైతే అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజా వరల్డ్ రికార్డుతో అతనిపై మంచి అంచనాలూ ఉన్నాయి. తనపై మెడల్ గురించి ఉన్న ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. ‘నువ్వు పతకం గెలవడం ఖాయం. ఇక్కడి నుంచే మెడలో పతకంతో తీసుకెళ్లి భారత్‌లో మా భుజాలపై ఊరేగిస్తాం’ అంటూ ఫెడరేషన్ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. చివరకు అక్కడ నిరాశే ఎదురైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో కూడా ఆటగాడిగా మెరుగైన స్థితిలోనే ఉన్నా.. ఒలింపిక్స్ కొద్ది రోజుల ముందు ఫుట్‌బాల్ ఆడుతున్న అతని భుజానికి తీవ్ర గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. లింబా రామ్ ఘనతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో అతనిని గౌరవించింది. ఈతరం ఆధునిక ఆటగాళ్ల ప్రదర్శనలతో పోలిస్తే లింబా రామ్ సాధించిన విజయాలు తక్కువగా అనిపించవచ్చు. కానీ భారత్‌లో ఆర్చరీకి గుర్తింపు తెచ్చి కొత్త బాట చూపించినవాడిగా అతని పేరు ఎప్పటికీ నిలిచిపోంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది