ఆయన భారతదేశానికి ప్రతీక | Babu Rajendra Prasad Life History In Telugu | Sakshi
Sakshi News home page

ఆయన భారతదేశానికి ప్రతీక

Published Sun, Aug 25 2019 11:55 AM | Last Updated on Sun, Aug 25 2019 11:55 AM

Babu Rajendra Prasad Life History In Telugu - Sakshi

• ధ్రువతారలు
ఏప్రిల్‌ 10, 1917. చంపారన్‌ రైతు నాయకుడు రాజ్‌కుమార్‌ శుక్లా ఒక వ్యక్తిని తీసుకుని తమ కేసును వాదిస్తున్న న్యాయవాది ఇంటికి వెళ్లారు. నీలిమందు పంటనే పండించాలంటూ ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ బిహార్‌లోని ఆ ప్రాంత రైతాంగం ఉద్యమిస్తున్నది. పట్నాలో ఉన్న న్యాయవాది ఇంటికి శుక్లా తీసుకువెళ్లిన ఆ నల్లటి వ్యక్తి రైతు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చూడ్డానికి రైతులాగే ఉన్నారు. తీరా న్యాయవాది పొరుగూరు వెళ్లారు. మహారాష్ట్ర నుంచి మూడో తరగతి పెట్టెలో ప్రయాణించి బిహార్‌ వచ్చిన ఆ నల్లటి వ్యక్తి తమ బావి వద్ద స్నానం చేయడానికి న్యాయవాది నౌకర్లు అంగీకరించలేదు. పాయఖానాలు ఉపయోగించడానికి కూడా అనుమతించలేదు. శుక్లా, ఆ నల్లటి వ్యక్తి, వీరి వెంటే ఉన్న రైతు బృందం మరొకరి ఇంటికి వెళ్లిపోయారు. ఆ నల్లటి వ్యక్తి మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. అప్పటికే దైవంతో సమానంగా ఆరాధిస్తున్న గాంధీజీ తన ఇంటిని సందర్శించినప్పుడు పొరుగూరు వెళ్లిన ఆ న్యాయవాది బాబూ రాజేంద్రప్రసాద్‌.

బాబూ రాజేంద్రప్రసాద్‌ (డిసెంబర్‌ 3, 1884–ఫిబ్రవరి 28, 1963) స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి (1950–1962). స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీతో ఏ విషయంలోను విభేదించకుండా ఉన్న అనుచరుడు బహుశా రాజేంద్రప్రసాద్‌ (రాజేన్‌బాబు) కావచ్చు. స్వరాజ్య సమరయోధులలో ప్రముఖులంతా గాంధీజీతో ఏదో ఒక అంశంలో విభేదించినవారేనన్నది చారిత్రక సత్యం. అందుకు రాజేంద్రప్రసాద్‌ రాసిన  ‘గాంధీజీ పాదాల వద్ద’ అన్న పుస్తకమే నిదర్శనం. మనసా వాచా గాంధీజీ సిద్ధాంతాన్ని పాటించిన నాయకుడు రాజెన్‌బాబు. ఆయన మేధస్సు, ఆదర్శవంతమైన జీవితం ఎందరినో ప్రభావితులను చేశాయి. వారిలో రాహుల్‌ సాంకృత్యాయన్‌ కూడా ఒకరు.

రాజెన్‌బాబు బిహార్‌లోని జెరదాయి అనే చోట పుట్టారు. సంపన్న కుటుంబం వారిది. తండ్రి మహదేవ సాహే, తల్లి కమలేశ్వరీదేవి. ఈమెకు రాజెన్‌బాబు ఆఖరి సంతానం. ఆయన చిన్నతనంలోనే కన్నుమూశారు. దీనితో పెద్దక్క పెంపకంలో పెరిగారు. ఆనాటికి వారి స్వగ్రామంలో పాఠశాల లేదు. ఒక ముస్లిం మత గురువును నియమించి పర్షియన్, హిందీ, అర్థమేటిక్‌ ఇంటి దగ్గరే తండ్రి చెప్పించారు. సాహే కూడా మంచి పండితుడు. ప్రాథమిక విద్య పూర్తయిన తరువాత చాప్రా జిల్లా పాఠశాలలో చేరారు. కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష రాసి ప్రథమ స్థానంలో నిలిచారు. దీనితో నెలకి రూ. 30 విద్యార్థి వేతనం కూడా లభించేది. 1902లో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1904లో ఎఫ్‌ఏలో ఉత్తీర్ణులయ్యారు. 1905లో ప్రథమ శ్రేణితో పట్టభద్రుడయ్యారు.

రాజేన్‌బాబు సైన్స్‌ విద్యార్థి. అప్పటి ఆయన గురువులు జగదీశ్‌చంద్ర బోస్, ప్రఫుల్లచంద్ర రాయ్‌. పరీక్షలలో రాజేన్‌బాబు ఇచ్చిన జవాబు పత్రాన్ని చూసి ఒక పరీక్షకుడు ఇచ్చిన కితాబు ఇది, ‘పరీక్షకుని కంటే పరీక్ష రాసిన విద్యార్థే మెరుగ్గా ఉన్నారు.’ అప్పుడే బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం మొదలయింది. రాజేన్‌బాబు, ఆయన సోదరుడు ఈడెన్‌ హిందూ విద్యార్థి వసతిగృహంలో ఉండేవారు. అక్కడ ఒక విద్యార్థి విదేశీ వస్తు దహనం నిర్వహించాడు. ఆ రోజున తన వద్ద వెతికితే ఒక్క విదేశీ వస్తువు కూడా రాజేన్‌కు దొరకలేదు. అది ఆ కుటుంబానికి ఉన్న నిబద్ధత. తరువాత అక్కడే ఎంఏ అర్థశాస్త్రం చదువుకున్నారు. గోఖలే స్థాపించిన సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ, డాన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (దీనిని ఆంగ్లేయులకు విశ్వవిద్యాలయాల మీద అసాధారణ అధికారాలు కట్టబెట్టే 1902 చట్టానికి వ్యతిరేకంగా సతీశ్‌చంద్ర ముఖర్జీ స్థాపించిన ఉద్యమ సంస్థ)లలో కూడా ఆయన పనిచేశారు.

డాన్‌ సొసైటీలో రవీంద్రనాథ్‌ టాగోర్, అరవింద్‌ ఘోష్, రాజా సుబోద్‌ చంద్రమల్లిక్, రాయ్‌చౌదరి వంటివారు సభ్యులుగా ఉండేవారు. సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీలో చేరవలసిందని స్వయంగా గోఖలే ఆయనను కోరారు. నిజానికి రాజేన్‌బాబు నాయకత్వ జీవితానికి ప్రెసిడెన్సీ కళాశాలలోనే బీజాలు పడినాయి. అక్కడ విద్యార్థి సంఘానికి ఆయన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1906లో న్యాయశాస్త్రం మీద దృష్టి పెట్టినప్పుడు బెంగాల్‌ విభజన వ్యతిరేకరోద్యమం మొదలైంది. కలకత్తా సిటీ కాలేజీలో అర్థశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తూనే ఆయన నాటి రిప్పన్‌ కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. 1911లో ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా నమోదైన తరువాత విభజన నిర్ణయం వెనక్కి వెళ్లింది. అంటే బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమానికి ఆయన ప్రత్యక్షసాక్షి. అదే ఆయన రాజకీయ వ్యక్తిత్వం మీద గట్టి ప్రభావమే కనిపించింది.  1915లో న్యాయశాస్త్రంలోనే పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేశారు. 1916లో న్యాయవాద వృత్తిని స్వీకరించారు. 1937లో అలహాబాద్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలోనే పరిశోధన పూర్తి చేశారు.

ఉద్యమం, చదువు రాజేన్‌బాబు జీవితంలో రెండుకళ్లలా కనిపిస్తాయి. బెంగాల్‌ విభజన వేడి మొదలయ్యాక 1906లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు జరిగాయి. ఆ సభలలో ఆయన స్వచ్ఛంద సేవకుడు. మళ్లీ 1911లో కలకత్తాలోనే వార్షిక సమావేశాలు జరినప్పుడు లాంఛనంగా ఆ సంస్థలో సభ్యులయ్యారు.
 1916 నాటి లక్నో కాంగ్రెస్‌ సమావేశాలలో గాంధీజీతో తొలిసారి సమావేశమయ్యారు. అప్పుడే చంపారన్‌ రైతుల ఉద్యమం కోసం గాంధీజీ ముందుకొచ్చారు. 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం ఆమోదించిన తరువాత రాజేన్‌బాబు అటు ఆచార్య పదవిని, ఇటు న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి గాంధీ వెంట ఉండిపోయారు. అప్పటికే ఆ రెండు వృత్తులతో ఆయన విశేషంగా ఆర్జిస్తున్నారు. గాంథీజీ ప్రవచించిన స్వదేశీ విద్య నినాదాన్ని తన కుటుంబంలో అమలు చేశారు. తన కుమారుడు మృత్యుంజయ ప్రసాద్‌ను బిహార్‌ విద్యాపీఠంలో చేర్పించారు. 

రెండు పర్యాయాలు రాజేన్‌బాబు జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. మొదటిసారి 1934 నాటి బొంబాయి కాంగ్రెస్‌కు అధ్యక్షుడు ఆయనే. 1939లో నేతాజీ బోస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత ఆ పదవిని అలంకరించినవారు రాజేన్‌బాబు. చివరిసారి క్విట్‌ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన రాజేన్‌బాబు 1945లో విడుదలయ్యారు. 1946 లో నెహ్రూ నాయకత్వంలో పన్నెండు మందితో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సంవత్సరం డిసెంబర్‌ 11న ఆయనకు మరొక ప్రతిష్ఠాత్మక బాధ్యతను భారతదేశం అప్పగించింది. అదే– స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం నిర్మించడానికి ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్ష పదవి. ఆపై భారత తొలి రాష్ట్రపతి పదవి.

తొలి భారత రాష్ట్రపతి ఎంపిక వివాదం కాకుండా ఆ కాలమే జాగ్రత్త పడిందని అనిపిస్తుంది. భారత ఆఖరి వైస్రాయ్‌ భారతీయుడైన రాజాజీ. ఆయనను రాష్ట్రపతిని చేయాలన్నది ప్రథమ ప్రధాని నెహ్రూ అభిప్రాయం. కానీ రాజాజీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ పరిణామం చాలామంది ఎంపీలకు గుర్తుంది. దీనితో బాబూ రాజేంద్రప్రసాద్‌ వైపు మొగ్గారు. ఆయన సర్దార్‌ అభ్యర్థి అన్న పేరుంది. కాబట్టి మెజార్టీ అభిప్రాయాన్ని అనుసరించి నెహ్రూ కూడా రాజేన్‌బాబు అభ్యర్థిత్వానికి అంగీకరించారు. కానీ వారిద్దరి మధ్య తరువాత ఒక అవాంఛనీయమైన వాతావరణమే కొనసాగింది. జనవరి 26,1950న రాజేన్‌బాబును రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. ఆ జనవరి 26 శుభదినం కాదని రాజేన్‌బాబు విశ్వాసం. కానీ నెహ్రూ దేశాన్ని నడపవలసింది జ్యోతిష్కులు కాదని కరాఖండిగానే చెప్పేశారు. కానీ దురదృష్టవశాత్తు 25వ తేదీ రాత్రి రాజేన్‌బాబు సోదరి భగవతీదేవి కన్నుమూశారు. రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన చేసిన తొలి కార్యక్రమం సోదరికి అంత్యక్రియలు.

సోమనాథ్‌ దేవాలయం అంశం మరొకటి. జునాగఢ్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన తరువాత సోమనాథ్‌ దేవాలయం జీర్ణోద్ధరణ చేపట్టాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలలలోనే ఆ పని పూర్తయింది. ఈ పని కోసం ఏర్పాటు చేసిన ఆధికారిక సంఘానికి అధ్యక్షుడు కెఎం మున్షీ. ఆ సమయంలో లింగ ప్రతిష్ఠాపన కూడా చేయాలని ఆలోచించారు. ఇందుకు రాజేన్‌బాబును ముఖ్య అతిథిగా పిలవాలని మున్షీ ఆకాంక్ష. కానీ ఉన్నత రాజ్యాంగ పదవులలో ఉన్నవారు మత ఉత్సవాలకు వెళ్లరాదన్నది నెహ్రూ నిశ్చితాభిప్రాయం. అయినా మున్షీ ఆహ్వానించడం, నెహ్రూ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజేన్‌బాబు హాజరు కావడం జరిగిపోయాయి. రాజేన్‌బాబు నిర్ణయాన్ని సోషలిస్టులు, కమ్యూనిస్టులు విమర్శించారు కూడా. అలాగే హిందూ కోడ్‌ బిల్లును తీసుకురావడానికి రాజేన్‌బాబు వ్యతిరేకి.

అయినా నెహ్రూ ఆ బిల్లును రూపొందించారు. అది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లింది. ఈ బిల్లును ఆమోదించిన పార్లమెంట్‌ ప్రజలు నేరుగా ఎన్నుకున్నది కానందున, ఆ సభ ఆమోదించిన బిల్లు మీద తాను సంతకం చేయబోనని రాజేన్‌బాబు ప్రకటించారు. నెహ్రూ దీని మీద రాష్ట్రపతి కంటే పార్లమెంటే సమున్నతమైనది లేఖ రాశారు. ఇలా విభేదాలు ఇంకా ఎన్నో! 1955లో నెహ్రూ సోవియెట్‌ రష్యా పర్యటన చరిత్రాత్మకమైనది. ఆయనకు ఘన స్వాగతం లభించింది. తరువాత ఆయనను భారతరత్న పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంలో రాజేన్‌బాబు, ‘జవాహర్‌ అంటేనే వాస్తవంగా భారతరత్నమే. ఇక ఆయనను లాంఛనంగా భారతరత్న ఎందకు చేయకూడదు?’ అని శ్లాఘించారు. అయినా ఇద్దరి మధ్య విభేదాలు ఆగలేదు.

రాజేన్‌బాబు పదవీ కాలం పూర్తయిన తరువాత రెండో దఫా అవకాశం ఇవ్వడానికి నెహ్రూ సుముఖంగా లేరు. అప్పుడు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరును ముందుకు తీసుకువచ్చారాయన. మళ్లీ మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించి రెండో దఫా కూడా రాజేన్‌బాబు రాష్ట్రపతి కావడానికి నెహ్రూ అంగీకరించారు. ఆయన హయాంలోనే మొదటిసారి సామాన్యులు రాష్ట్రపతి భవన్‌లోకి వెళే అవకాశం లభించింది. అందులోని ప్రఖ్యాతి వహించిన మొగల్‌ గార్డెన్స్‌ను చూసేందుకు రాజేన్‌బాబు అనుమతి మంజూరు చేశారు. నిజమే ఆయన విశ్వాసాలు ఆయనకు ఉన్నాయి. వాస్తవానికి ఆయన జీవితం మొగల్‌ గార్డెన్‌లోని పూల సమాహారమంతా వైవిధ్యమైనది.

గాంధీజీని జనవరి 30, 1948న నాథూరామ్‌ గాడ్సే కాల్చి చంపాడు. కానీ చాలామంది తెలియని ఒక చారిత్రక రహస్యాన్ని రాజేన్‌బాబు తాను రాష్ట్రపతి అయిన తరువాత వెల్లడించారు. ఆనాటి సంఘటనలో ఒక వంటవాడు నిజాయితీగా వ్యవహరించి జరిగిన విష ప్రయోగం గురించి వెల్లడించి ఉండకపోతే భారత చరిత్ర వేరే విధంగా ఉండేది. 1917లోనే ఇది జరిగింది. దీనికి ప్రత్యక్షసాక్షి రాజేన్‌బాబు. చంపారన్‌ కె స్వతంత్ర సేనాని అనే పుస్తకంలో ఈ ఘటనను నమోదు చేశారు. 
చంపారన్‌ సత్యాగ్రహం కోసం ఆ సంవత్సరం ఏప్రిల్‌లో గాంధీజీ అక్కడకు వెళ్లారు. 15వ తేదీన మోతీహరి రైల్వే స్టేషన్‌ దగ్గర వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అందులో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. వారందరి ఉద్దేశం ఒకటే. తాము తెచ్చిన గుర్రపు బగ్గీలో గాంధీజీని తీసుకువెళ్లాలి. ఆ బండిని గుర్రాలు కాకుండా తాము లాగాలి. అలాగే తీసుకువెళ్లారు. గాంధీకి ఇంతటి ప్రాచుర్యం రావడం, చంపారన్‌ రైతుల ఉద్యమంలో కలగ చేసుకోవడం ఆంగ్లేయులకు సహజంగానే కన్నెర్రగా ఉంది. ఆ సమయంలోనే ఎడ్విన్‌ అనే ఆంగ్లేయుడు గాంధీజీని ఒక రాత్రి విందుకు పిలిచాడు.

అతడు ఒక నీలిమందు ఎస్టేట్‌ మేనేజర్‌. అతడి దగ్గర వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి బాతక్‌ మెయిన్‌. గ్లాసుడు పాలలో అతడి చేత విషం కలిపించాడు. ఇదంతా ఏమీ ఎదిరించకుండానే మెయిన్‌ చేశాడు. కానీ గాంధీకి విషం కలిపిన ఆ పాలగ్లాసు అందిస్తూ విషయం చెప్పేశాడు. గాంధీజీ విష ప్రయోగం నుంచి బయటపడ్డాడు. తరువాత మెయిన్‌ నరకం చూశాడు. ఏదో కేసులో ఇరికించి అతడిని ఎడ్విన్‌ కారాగారం పాల్జేశాడు. స్వగ్రామంలోని అతడి ఇంటిని శ్మశానం కోసం ఇచ్చేశారు. దీనికి సాక్షి రాజేన్‌బాబు.
రాజేన్‌బాబు దేశాధ్యక్షుడైన తరువాత చంపారన్‌ వెళ్లారు. ఒక వ్యక్తి పోలీసు వలయాన్ని తప్పించుకుని తన వద్దకు రావాలని ప్రయత్నిస్తున్న సంగతి రాజేన్‌బాబు గమనించారు. ఆ వచ్చిన వ్యక్తి మెయిన్‌ అని గుర్తు పట్టి రాజేన్‌బాబు స్వయంగా అతడి దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకుని, తన వెంటే వేదిక మీదకు తీసుకువెళ్లారు. పక్కనే ఉన్న ఆసనంలో కూర్చోపెట్టారు. అప్పుడు గాంధీజీపై జరిగిన విష ప్రయోగం, మెయిన్‌ సాహసాల గురించి చెప్పారు. మెయిన్‌ కోల్పోయినదంతా తిరిగి పొందడానికి వీలుగా 24 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్‌ను ఆదేశించారు రాజేన్‌బాబు (ఆ కలెక్టర్‌ ఆ ఆదేశాన్ని అమలు చేయలేదు. ప్రతిభా పాటిల్‌ వచ్చిన తరువాత ఆమె కూడా కలగేచేసుకుని తొలి రాష్ట్రపతి ఆదేశాలను గౌరవించాలని చూశారు. ఇప్పటికీ సాధ్యం కాలేదు).

బాబూ రాజేంద్రప్రసాద్‌ భారతదేశ మహోద్యమానికి సాక్షి. మారుతున్న కాలంతో పాటు మారిన మనిషి. స్వతహాగా మానవతావాది. 1914లో వరదలు వచ్చి బెంగాల్, బిహార్‌ అతలాకుతలమైనప్పుడు కోర్టుకు వెళ్లడం మానేసి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి బాధితులకు ఇచ్చారాయన. ఒక భూస్వామిక కుటుంబం నుంచి వచ్చి జీవితపు చరమాంకంలో ఆ హోదాను పూర్తిగా మరచిపోయిన కర్మయోగి రాజేన్‌బాబు. గాంధీజీని ఆనాడు ఆయన ఇంటి నౌకర్లు లోపలికి అనుమతించకపోవడానికి కారణం ఆయనను కింది కులాల నుంచి వచ్చిన వ్యక్తి అని భావించడమే. తరువాత సాటి మనిషిని అలాంటి పరిస్థితిలోకి నెట్టివేయడం ఎంత ఘోరమో ఆయన గుర్తించారని అనిపిస్తుంది. అంటరానితనం నిర్మూలన  కోసం పనిచేశారు.

తన నివాసాన్ని తనే శుభ్రం చేసుకునేవారు. తన వంట తనే చేసుకునేవారు. పాత్రలు శుభ్రం చేసుకునేవారు. ఇదంతా గాంధీ ప్రభావమే. 1962లో రాజేన్‌బాబు సతీమణి రాజవంశీదేవి కన్నుమూశారు. తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. నెహ్రూ గురించి రాజేన్‌బాబు అభిప్రాయం 1950లోనే మారడం మొదలయింది. 1962 నాటి చైనా యుద్ధం తరువాత నెహ్రూ అభిప్రాయాలు, దృష్టికోణం మొత్తం మారాయి. అందులో రాజేన్‌బాబు మీద ఆయనకు ఉన్న అభిప్రాయం కూడా మారింది. నిజానికి చైనా దురాక్రమణ తొలి రాష్ట్రపతిని, తొలి ప్రధానిని కూడా కలచివేసింది. రాజేన్‌బాబు కన్నుమూసినప్పుడు నెహ్రూ అన్నమాటే అందుకు నిదర్శనం, ‘ఆయన భారతదేశానికి ప్రతీక.  రాజేన్‌బాబు కన్నుల ద్వారా మనం సత్యాన్ని దర్శించవచ్చు.’
- డా. గోపరాజు నారాయణరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement