నేను 85 కేజీల బరువున్నాను. ఇప్పుడు ఐదవ నెల. 3 కేజీల బరువు మాత్రమే పెరిగాను. మా స్నేహితులు 10 కేజీలు పెరగాలి అంటున్నారు. నా బరువు నియంత్రణలో ఉండటానికి మా డాక్టర్ నన్ను డైట్ ఫాలో అవ్వమన్నారు. దీని వల్ల నాకు ఏదైనా నష్టం ఉందా?
– మౌళి, కోరంగి
గర్భధారణలో బరువు తగ్గడం కష్టం, ఇది మంచిది కూడా కాదు. గర్భంతో ఉన్నప్పుడు సుమారు 8–10 కేజీల బరువు పెరుగుతారు. అంతకంటే ఎక్కువ బరువు పెరగకుండా ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే బీఎమ్‌ఐ 30 కంటే ఎక్కువ ఉంటే, గర్భం ధరించినపుడు, ఆ తరువాత కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ లాంటివి చూస్తున్నాము. మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఒబేసిటీ, దానితో వచ్చే ఇతర ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. డైటీషియన్ ఇచ్చే సలహాలతో అన్ని రకాల కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్‌లతో కూడిన ఆరోగ్యకమైన ఆహారాన్ని ఎంపిక చేసుకుని, తీసుకోవాలి. జంక్‌ఫుడ్ పూర్తిగా మానేయాలి. గర్భధారణ సమయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. వారంలో కనీసం ఐదు రోజులైనా 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. నడిచేటప్పుడు అనువైన షూస్ ధరించండి. నడక, వ్యాయామాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్, ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని స్విమింగ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య ఆక్వా నాటల్ క్లాసెస్ అని కొన్ని స్విమింగ్ సెంటర్లలో నడుపుతున్నారు. అలాంటి స్విమింగ్ ఏ నెలలో అయినా చేయొచ్చు.
ఇప్పటి వరకు వ్యాయామం చెయ్యనివారు నడక, ప్రాణాయామంతో మొదలుపెట్టండి. ఆఫీస్, ఇంట్లో లిఫ్ట్‌కి బదులు మెట్లు వాడటం, ఇంటిపనులు చేసుకోవడం, నడవడం లాంటివి చేయండి. సైకిలింగ్, జాయింట్ స్ట్రెచెస్, ఫిట్‌నెస్ వ్యాయామాలు చెయ్యకూడదు. ఒకవేళ వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం వచ్చినా, ఊపిరి ఆడనట్టు ఉన్నా, ఛాతీలో, కడుపులో నొప్పి, బిడ్డ కదలికలు తగ్గడం లాంటివి ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవండి.
మీ చుట్టపక్కల ఎవరైనా పొగ తాగుతుంటే దూరంగా ఉండండి. గర్భధారణ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. మానసిక సమస్యలకు సంబంధించి ఏమైనా మందులు వాడటం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మీ కోసం కొంత సమయం తీసుకుని ఇష్టమైన పనులు చెయ్యడం, మీకు కావలసిన వ్యక్తులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం, అవసరమైతే వారి సహాయం కోరడం చేయాలి. మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా గర్భవతులు ఉంటే వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామం సమంగా ఉండేటట్లు చూసుకుంటే ఏ విధమైన ఇబ్బందులూ ఉండవు.
హెల్త్ ట్రీట్
ఎండోమెట్రియాసిస్‌తో గుండెజబ్బుల ముప్పు!
చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతుంటారు. దీని వల్ల మహిళలు నానా సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో విపరీతంగా బాధపడుతుంటారు. ఎండోమెట్రియాసిస్ సమస్య కేవలం గర్భాశయ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని డేనిష్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కోపన్‌హేగన్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఇవా హావెర్స్ బార్గర్సెన్ నేతృత్వంలో జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సదస్సులో డాక్టర్ ఇవా ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. డెన్మార్క్‌లో 1977–2021 మధ్య కాలంలో ఎండోమెట్రియాసిస్ బాధితులైన 60 వేల మంది మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి, వైద్య నిపుణులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment