నాకు ఇప్పుడు 8వ నెల. డయాబెటిస్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. మా తల్లిదండ్రులకు కూడా ఉంది. డైట్ చెయ్యమన్నారు. ఈ సమయంలో ఎలాంటి డైట్‌తో డయాబెటిస్‌ని అదుపులో ఉంచవచ్చు.
– శిరీష, మెదక్
గర్భధారణ సమయంలో డయాబెటిస్ అనేది ఏ నెలలో అయినా రావచ్చు. కుటుంబ నేపథ్యంలో ఉన్నా, ఊబకాయం ఉన్నా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపు చేయవచ్చు. వీటితో తగ్గనప్పుడు మందులు ఇస్తాం. బిడ్డ పరిణతి, ఎదుగుదల బాగుండాలంటే ఎప్పుడూ డయాబెటిస్ అదుపులో ఉండాలి. గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. ఎక్కువ బరువు పెరిగి డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. డైటీషియన్, న్యూట్రిషన్ కౌన్సెలర్లు మీ బరువు, ఎన్ని నెలలు, మీ ఇష్టాలు వంటి అంశాలను బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచిస్తారు. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర పాళ్లు తక్కువ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారం ఎంచుకోవాలి.
అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం– బ్రౌన్ రైస్, అన్ని రకాల గింజలతో తయారు చేసిన పాస్తా, బాస్మతీ రైస్, తృణ ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. కొన్నిరకాల ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచవు. మాంసం, చేప, గుడ్లు, పౌల్ట్రీ, నట్స్, సీడ్స్, పప్పులు, సలాడ్స్ లాంటివి మనం తినే భోజనంలో భాగం చేసుకోవాలి. మీ ఆహారం తీసుకునేటప్పుడు ఒక్కసారే ఎక్కువ మోతాదులో కాకుండా మూడుసార్లుగా విభజించుకోండి. తీపి పదార్థాలు, కేక్స్, బిస్కట్స్, చాక్లెట్స్, పుడ్డింగ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా మానేయండి. వీటికి బదులుగా రైస్ కేక్స్, క్రిస్ప్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ క్రాకర్స్, ఓట్స్ కేక్స్, పాప్‌కార్న్ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి.
ఒకసారి తినే ఆహారంలో 40గ్రాముల కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ (మెటబాలిజమ్) ఒక్కలా ఉండదు. అందుకే 40గ్రాములతో మొదలుపెట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి రెండు గంటలకు అదుపులో ఉంటే కొంచెం పెంచుకోవచ్చు. ఎక్కువ అయితే గ్రాములను కొంచెం తగ్గించాలి. భోజనానికీ భోజనానికీ మధ్యలో ఆకలి వేస్తుందని జంక్ ఫుడ్ తినేస్తారు. అలా కాకుండా 10–15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్న చిరుతిళ్లు మాత్రమే తీసుకోవాలి. అంటే, 200 ఎంఎల్ పాలు, పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పాస్తా, ఒక గుడ్డు లాంటివి.
బ్రెడ్, పాస్తా, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. నూనె ఎక్కువగా ఉన్న, వేయించిన పదార్థాలు తినకూడదు. పండ్లరసాలతో చక్కెర శాతం అధికంగా పెరుగుతుంది. అందుకే çపండ్లను నేరుగా తినాలి. గ్రీన్ ఆపిల్, నారింజ, ద్రాక్ష తినాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజుకి 2–3 సార్లు తీసుకోవాలి. 200 ఎంఎల్ పాలు, 125 గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువ తింటే పోస్ట్ మీల్ సుగర్ రాదు, అందుకే ప్రొటీన్‌ను ప్రతి ఆహారంలో చేర్చుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండుగంటలకోసారి నీళ్లు తాగాలి. దీనితో అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. బయట దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది. సుగర్ ఫ్రీ కుకీస్ కూడా ఈ సమయంలో మంచిదికాదు.
మీరు డైట్ మొదలుపెట్టిన 2వారాలకి బ్లడ్ çసుగర్ లెవెల్స్ ల్యాబ్‌లో పరిశీలిస్తారు. అదుపులో ఉంటే ప్రసవం అయ్యే వరకూ అదే డైట్‌ను తీసుకోమంటారు. ఒకవేళ 9వ నెలలో ఎక్కువ అయితే తక్కువ మోతాదు సుగర్ మందులను వాడమని చెబుతారు. క్రమం తప్పకుండా ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు గైనకాలజిస్ట్ సలహాలు పాటించాలి. ప్రసవం తరువాత కూడా 95శాతం డయాబెటిస్ తగ్గిపోతుంది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ఈ లెవెల్ 100 ఎంజీ/డీఎల్ ఉంటే, ఒకసారి డయాబెటిస్ నిపుణులను కలవాలి. భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ రాకుండా ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధం
చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment