ఈ వంటలను ఎప్పుడైనా వండి చూశారా..!? | Potato Lemon Poha Dry Fruits Chocolates Yellow Egg Keema Lollipops Recipe Making | Sakshi
Sakshi News home page

ఈ వంటలను ఎప్పుడైనా వండి చూశారా..!?

Published Sun, Sep 1 2024 3:59 AM | Last Updated on Sun, Sep 1 2024 3:59 AM

Potato Lemon Poha Dry Fruits Chocolates Yellow Egg Keema Lollipops Recipe Making

పొటాటో–లెమెన్‌ పోహా..

కావలసినవి:
బంగాళదుంపలు– 2 (ఉడికించి, చల్లారాక తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి),
జీలకర్ర, ఆవాలు– పావు టీ స్పూన్‌ చొప్పున,
కరివేపాకు,
ఎండుమిర్చి– కొద్దికొద్దిగా
వేరుశనగలు– 2 టేబుల్‌ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)
అల్లం తరుగు– కొద్దిగా, వెల్లుల్లి ముక్కలు– పావు టీ స్పూన్‌
నూనె– సరిపడా,
ఉప్పు– రుచికి తగ్గట్టుగా
పసుపు, కారం– అర టీ స్పూన్‌ చొప్పున
నిమ్మరసం– 1 టేబుల్‌ స్పూన్‌ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)
కొత్తిమీర తురుము– 4 టేబుల్‌ స్పూన్లు, అటుకులు– ఒకటిన్నర కప్పులు

తయారీ..
– ముందుగా అటుకులను జల్లెడ తొట్టెలో వేసుకుని మంచినీళ్లు పోసి, 2 సార్లు కడిగి పెట్టుకోవాలి.
– ఆపై ఒక కళాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేడి చేసుకుని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.
– అందులో పసుపు, కారం, తగినంత ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసుకుని, 2 నిమిషాలు మూత పెట్టి చిన్నమంట మీద ఉడకనివ్వాలి.
– అనంతరం కొత్తిమీర తురుము, అటుకులు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి, మూతపెట్టుకుని 2 నిమిషాలు ఉడికించాలి. వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ పోహా.

డ్రైఫ్రూట్స్‌ చాక్లెట్స్‌..
కావలసినవి:
కోకో పౌడర్,
పంచదార పొడి,
కొబ్బరి నూనె (స్వచ్ఛమైనది) – ముప్పావు కప్పు చొప్పున,
మిల్క్‌ పౌడర్‌ – 5 టేబుల్‌ స్పూన్లు,
పిస్తా, బాదం, జీడిపప్పు, వేరుశనగలు(దోరగా వేయించి, తొక్క తీసేసినవి) – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున

తయారీ:
– ముందుగా పిస్తా, జీడిపప్పు, బాదం, వేరుశనగలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
– అనంతరం అదే మిక్సీ బౌల్‌ని కాసిన్ని నీళ్లతో క్లీన్‌ చేసుకుని, దానిలో కోకో పౌడర్, పంచదార పొడి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మిల్క్‌ పౌడర్‌ ఒకదాని తరవాత ఒకటి వేసుకుని క్రీమీగా మారేలా మిక్సీ పట్టుకోవాలి.
– అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, దానిలో డ్రై ఫ్రూట్స్‌ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి.
– అనంతరం నచ్చిన షేప్‌లో ఉన్న ఐస్‌ క్యూబ్స్‌ ట్రేని తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, కొద్దికొద్దిగా ఈ మిశ్రమం వేసుకుని, మూడు నుంచి 5 గంటల పాటు ఆ ట్రేను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం వాటిని ట్రే నుంచి వేరు చేసుకోవచ్చు.

ఎల్లో ఎగ్‌ – కీమా లాలీపాప్స్‌..
కావలసినవి:
గుడ్లు– 6 లేదా 7 (పసుపు సొన మాత్రమే, ఉడికించి చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)
మటన్‌ కీమా– పావుకిలో (మసాలా, ఉప్పు, కారం వేసుకుని కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి)
బ్రెడ్‌ పౌడర్‌– అర కప్పు
ఓట్స్‌ పౌడర్‌– పావు కప్పు,
అల్లం–వెల్లుల్లి పేస్ట్‌– కొద్దిగా
పచ్చిమిర్చి ముక్కలు– ఒకటిన్నర టీ స్పూన్లు,
మిరియాల పొడి, 
జీలకర్ర పొడి– పావు టీ స్పూన్‌ చొప్పున,
ఆమ్‌చూర్‌ పౌడర్‌– 2 టీ స్పూన్లు
ఉప్పు– తగినంత,
గడ్డ పెరుగు– తగినంత
నీళ్లు– కొన్ని (అభిరుచిని బట్టి),
టమాటో సాస్,
కొత్తిమీర తురుము– గార్నిష్‌కి సరిపడా,
నూనె– డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
– ముందుగా పెద్ద బౌల్‌ తీసుకుని అందులో గుడ్ల పసుపు సొన, ఉడికిన మటన్‌ కీమా, ఓట్స్‌ పౌడర్, బ్రెడ్‌ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్‌చూర్‌ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
– అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా గడ్డ పెరుగు వేసుకుని ముద్దగా చేసుకోవాలి.
– ముద్దలా చేసుకోవడానికి పెరుగు చాలకుంటే నీళ్లు కూడా వాడుకోవచ్చు. 
– ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్‌లా లేదా చిత్రంలో చూపిన విధంగా చేసుకుని, ప్రతి లాలీపాప్‌కు ఒక పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి.
– అనంతరం వాటిని మరుగుతున్న నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.
– వెంటనే టమాటో సాస్‌లో వాటిని ముంచి, కొత్తిమీర తురుము జల్లుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement