పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!? | Do You Know What To Eat To Overcome Malnutrition | Sakshi
Sakshi News home page

పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?

Published Sun, Sep 1 2024 1:27 AM | Last Updated on Sun, Sep 1 2024 1:38 AM

Do You Know What To Eat To Overcome Malnutrition

జాతీయ పోషకాహార వారోత్సవం సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు

మన దేశంలో  పోషకాహార లోపం..

ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5%

బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3%

బరువు తక్కువ చిన్నారులు 32.1%

చిన్నారుల్లో స్థూలకాయం 2.4% 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...

  • నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.

  • పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్‌ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్‌ తదితర ఖనిజ లవణాలు, విటమిన్‌–ఎ, విటిమన్‌–బి, విటమిన్‌–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

  • చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.

పోషకాహార లోపానికి కారణాలు..
చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్‌ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:
– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.
– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.
– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.

డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..
మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్‌–ఎ, ఐరన్‌ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్‌–ఎ సప్లిమెంట్‌ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.

ఐరన్‌ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.

పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..
ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:
– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.
– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.
– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.
– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.
– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్‌ఫుడ్‌కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.

కుకింగ్‌ క్లాసెస్‌తో.. 
"విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని విద్యారణ్య, ఓక్రిజ్‌ స్కూళ్లలో కుకింగ్‌ క్లాసెస్‌నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్‌ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్‌ కన్సల్టంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement