‘అతి’కి ఫుల్‌స్టాప్ పెట్టండిలా!
వాయనం
ఆహారం మితంగా తింటే ఆరోగ్యం, పరిమితి దాటి తింటే అనారోగ్యం అన్న విషయం తెలిసిందే. అయితే వద్దు అనుకున్నా కూడా తినేసే పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతుంది. దానికి కారణం... ఈటింగ్ డిజార్డర్. ఇటీవల జరిగిన ఓ సర్వేలో, ప్రపంచంలో అరవై శాతం మందికి పైగా మహిళలు ఏదో ఒక సమయంలో ఈ డిజార్డర్ బారిన పడుతున్నారని తేలింది. దీని ప్రధాన లక్షణం... బాగా సంతోషం కలిగినా, బాధ కలిగినా, ఒత్తిడిని తట్టుకోలేకపోయినా తమకు తెలియకుండానే ఎక్కువ తినేయటం! అయితే ఇది ఒక రుగ్మత అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అలాగని మరీ భయపడాల్సిన సమస్య కూడా కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తేలికగా బయట పడవచ్చు.
సమస్యని గుర్తించండి: అస్తమానం ఏదో ఒకటి తినాలనిపించినా, ముఖ్యంగా మనసు బాలేనప్పుడు ఏదైనా తినాలనిపిస్తున్నా అది కచ్చితంగా ఈటింగ్ డిజార్డర్ లక్షణమే. కాబట్టి అలాంటప్పుడు ఒక్కసారి మీ పరిస్థితిని అంచనా వేసుకోవడానికి ప్రయత్నించండి.
డాక్టర్ దగ్గరికెళ్లండి: డిజార్డర్ ఉందని అర్థమయ్యాక... తినడం తగ్గిస్తే సరిపోతుందిలే అని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికెళ్లండి. మీలో డిజార్డర్ ఏర్పడటానికి గల కారణాలను గుర్తించి, ఏం చేయాలో సూచిస్తారు.
మనసును నియంత్రించండి: ఏం తినొచ్చో, ఏం తినకూడదో వైద్యులు చెప్పినా కొన్నిసార్లు వాటిని పాటించలేం. మన మనసు అటే లాగుతూ ఉంటుంది. కాబట్టి ముందు మీరు డైటింగ్ కోసం మీ మనసును సిద్ధం చేసుకోవాలి.
నోటికి ప్లాస్టర్ వేయాల్సిందే: ఒక్కసారి తింటే ఏం కాదులే అనుకుంటారు కొందరు. కానీ ఒక్కసారి కాంప్రమైజ్ అయ్యామంటే ఇక కంట్రోల్ చేసుకోవడం మనవల్ల కాదు. కాబట్టి నోటి ప్లాస్టర్‌ని అస్సలు తీయవద్దు. డైట్ చార్ట్‌ని చట్టంలా ఫీలయ్యి ఫాలో అవ్వండి.
చికిత్సను మిస్ కావద్దు: ఒక్కోసారి మనంతట మనం నియంత్రించుకోలేని పరిస్థితికి వెళ్లిపోతుంది రుగ్మత. అలాంటప్పుడు థెరపీలు, కౌన్సెలింగ్ వంటివి సూచిస్తారు వైద్యులు. ఏ ఒక్క సిట్టింగ్‌ను మిస్ కాకూడదు. తర్వాతి సిట్టింగ్‌కు వెళ్దాంలే అని వాయిదా వేస్తే మీకే నష్టం.
అందరితో పంచుకోండి: ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం... ఈటింగ్ డిజార్డర్ ఉంది అని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి. మీ ఇంట్లోవాళ్లు, బంధువులు, తరచుగా కలిసే స్నేహితులకు తప్పక చెప్పండి. ఎందుకంటే విషయం తెలియక వాళ్లు మీ ఎదుట అవీ ఇవీ తినేస్తుంటే మీ మనసు చలించవచ్చు. మీ సమస్య తెలిస్తే వాళ్లు అలా చేయకుండా ఉంటారు. ఒకవేళ మానసిక ఒత్తిడి మీ డిజార్డర్‌కి కారణమైతే... మిమ్మల్ని ఒత్తిడికి గురికాకుండా కూడా చూసుకుంటారు.