pregnancy woman
-
Diabetes: ఎలాంటి డైట్‌తో అదుపులో ఉంచొచ్చు
నాకు ఇప్పుడు 8వ నెల. డయాబెటిస్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. మా తల్లిదండ్రులకు కూడా ఉంది. డైట్ చెయ్యమన్నారు. ఈ సమయంలో ఎలాంటి డైట్‌తో డయాబెటిస్‌ని అదుపులో ఉంచవచ్చు.– శిరీష, మెదక్గర్భధారణ సమయంలో డయాబెటిస్ అనేది ఏ నెలలో అయినా రావచ్చు. కుటుంబ నేపథ్యంలో ఉన్నా, ఊబకాయం ఉన్నా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపు చేయవచ్చు. వీటితో తగ్గనప్పుడు మందులు ఇస్తాం. బిడ్డ పరిణతి, ఎదుగుదల బాగుండాలంటే ఎప్పుడూ డయాబెటిస్ అదుపులో ఉండాలి. గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. ఎక్కువ బరువు పెరిగి డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. డైటీషియన్, న్యూట్రిషన్ కౌన్సెలర్లు మీ బరువు, ఎన్ని నెలలు, మీ ఇష్టాలు వంటి అంశాలను బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచిస్తారు. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర పాళ్లు తక్కువ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారం ఎంచుకోవాలి. అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం– బ్రౌన్ రైస్, అన్ని రకాల గింజలతో తయారు చేసిన పాస్తా, బాస్మతీ రైస్, తృణ ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. కొన్నిరకాల ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచవు. మాంసం, చేప, గుడ్లు, పౌల్ట్రీ, నట్స్, సీడ్స్, పప్పులు, సలాడ్స్ లాంటివి మనం తినే భోజనంలో భాగం చేసుకోవాలి. మీ ఆహారం తీసుకునేటప్పుడు ఒక్కసారే ఎక్కువ మోతాదులో కాకుండా మూడుసార్లుగా విభజించుకోండి. తీపి పదార్థాలు, కేక్స్, బిస్కట్స్, చాక్లెట్స్, పుడ్డింగ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా మానేయండి. వీటికి బదులుగా రైస్ కేక్స్, క్రిస్ప్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ క్రాకర్స్, ఓట్స్ కేక్స్, పాప్‌కార్న్ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకసారి తినే ఆహారంలో 40గ్రాముల కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ (మెటబాలిజమ్) ఒక్కలా ఉండదు. అందుకే 40గ్రాములతో మొదలుపెట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి రెండు గంటలకు అదుపులో ఉంటే కొంచెం పెంచుకోవచ్చు. ఎక్కువ అయితే గ్రాములను కొంచెం తగ్గించాలి. భోజనానికీ భోజనానికీ మధ్యలో ఆకలి వేస్తుందని జంక్ ఫుడ్ తినేస్తారు. అలా కాకుండా 10–15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్న చిరుతిళ్లు మాత్రమే తీసుకోవాలి. అంటే, 200 ఎంఎల్ పాలు, పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పాస్తా, ఒక గుడ్డు లాంటివి. బ్రెడ్, పాస్తా, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. నూనె ఎక్కువగా ఉన్న, వేయించిన పదార్థాలు తినకూడదు. పండ్లరసాలతో చక్కెర శాతం అధికంగా పెరుగుతుంది. అందుకే çపండ్లను నేరుగా తినాలి. గ్రీన్ ఆపిల్, నారింజ, ద్రాక్ష తినాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజుకి 2–3 సార్లు తీసుకోవాలి. 200 ఎంఎల్ పాలు, 125 గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువ తింటే పోస్ట్ మీల్ సుగర్ రాదు, అందుకే ప్రొటీన్‌ను ప్రతి ఆహారంలో చేర్చుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండుగంటలకోసారి నీళ్లు తాగాలి. దీనితో అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. బయట దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది. సుగర్ ఫ్రీ కుకీస్ కూడా ఈ సమయంలో మంచిదికాదు. మీరు డైట్ మొదలుపెట్టిన 2వారాలకి బ్లడ్ çసుగర్ లెవెల్స్ ల్యాబ్‌లో పరిశీలిస్తారు. అదుపులో ఉంటే ప్రసవం అయ్యే వరకూ అదే డైట్‌ను తీసుకోమంటారు. ఒకవేళ 9వ నెలలో ఎక్కువ అయితే తక్కువ మోతాదు సుగర్ మందులను వాడమని చెబుతారు. క్రమం తప్పకుండా ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు గైనకాలజిస్ట్ సలహాలు పాటించాలి. ప్రసవం తరువాత కూడా 95శాతం డయాబెటిస్ తగ్గిపోతుంది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ఈ లెవెల్ 100 ఎంజీ/డీఎల్ ఉంటే, ఒకసారి డయాబెటిస్ నిపుణులను కలవాలి. భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ రాకుండా ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధంచాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. -
Pregnancy: గర్భిణీలు బరువు పెరగడం మంచిదేనా.?
నేను 85 కేజీల బరువున్నాను. ఇప్పుడు ఐదవ నెల. 3 కేజీల బరువు మాత్రమే పెరిగాను. మా స్నేహితులు 10 కేజీలు పెరగాలి అంటున్నారు. నా బరువు నియంత్రణలో ఉండటానికి మా డాక్టర్ నన్ను డైట్ ఫాలో అవ్వమన్నారు. దీని వల్ల నాకు ఏదైనా నష్టం ఉందా? – మౌళి, కోరంగిగర్భధారణలో బరువు తగ్గడం కష్టం, ఇది మంచిది కూడా కాదు. గర్భంతో ఉన్నప్పుడు సుమారు 8–10 కేజీల బరువు పెరుగుతారు. అంతకంటే ఎక్కువ బరువు పెరగకుండా ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే, గర్భం ధరించినపుడు, ఆ తరువాత కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ లాంటివి చూస్తున్నాము. మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఒబేసిటీ, దానితో వచ్చే ఇతర ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. డైటీషియన్ ఇచ్చే సలహాలతో అన్ని రకాల కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్లతో కూడిన ఆరోగ్యకమైన ఆహారాన్ని ఎంపిక చేసుకుని, తీసుకోవాలి. జంక్‌ఫుడ్ పూర్తిగా మానేయాలి. గర్భధారణ సమయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. వారంలో కనీసం ఐదు రోజులైనా 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. నడిచేటప్పుడు అనువైన షూస్ ధరించండి. నడక, వ్యాయామాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్, ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని స్విమింగ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య ఆక్వా నాటల్ క్లాసెస్ అని కొన్ని స్విమింగ్ సెంటర్లలో నడుపుతున్నారు. అలాంటి స్విమింగ్ ఏ నెలలో అయినా చేయొచ్చు. ఇప్పటి వరకు వ్యాయామం చెయ్యనివారు నడక, ప్రాణాయామంతో మొదలుపెట్టండి. ఆఫీస్, ఇంట్లో లిఫ్ట్‌కి బదులు మెట్లు వాడటం, ఇంటిపనులు చేసుకోవడం, నడవడం లాంటివి చేయండి. సైకిలింగ్, జాయింట్ స్ట్రెచెస్, ఫిట్నెస్ వ్యాయామాలు చెయ్యకూడదు. ఒకవేళ వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం వచ్చినా, ఊపిరి ఆడనట్టు ఉన్నా, ఛాతీలో, కడుపులో నొప్పి, బిడ్డ కదలికలు తగ్గడం లాంటివి ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవండి. మీ చుట్టపక్కల ఎవరైనా పొగ తాగుతుంటే దూరంగా ఉండండి. గర్భధారణ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. మానసిక సమస్యలకు సంబంధించి ఏమైనా మందులు వాడటం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మీ కోసం కొంత సమయం తీసుకుని ఇష్టమైన పనులు చెయ్యడం, మీకు కావలసిన వ్యక్తులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం, అవసరమైతే వారి సహాయం కోరడం చేయాలి. మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా గర్భవతులు ఉంటే వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామం సమంగా ఉండేటట్లు చూసుకుంటే ఏ విధమైన ఇబ్బందులూ ఉండవు. హెల్త్ ట్రీట్ఎండోమెట్రియాసిస్తో గుండెజబ్బుల ముప్పు!చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతుంటారు. దీని వల్ల మహిళలు నానా సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో విపరీతంగా బాధపడుతుంటారు. ఎండోమెట్రియాసిస్ సమస్య కేవలం గర్భాశయ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని డేనిష్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కోపన్హేగన్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఇవా హావెర్స్ బార్గర్సెన్ నేతృత్వంలో జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సదస్సులో డాక్టర్ ఇవా ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. డెన్మార్క్‌లో 1977–2021 మధ్య కాలంలో ఎండోమెట్రియాసిస్ బాధితులైన 60 వేల మంది మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి, వైద్య నిపుణులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. -
గర్భవతులు మరింత బరువు పెరిగితే..?
గర్భధారణ సమయంలో కొందరు మహిళలు బరువు పెరగడం మామూలే. అది పరిమితంగానే ఉంటే పర్లేదు. కానీ మరీ ఎక్కువగా బరువు పెరిగితే కొన్ని అనర్థాలు రావచ్చు. అవి తల్లికీ, బిడ్డకూ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.గర్భవతుల్లో స్థూలకాయం అంటే... గర్భవతులు కొంత బరువు పెరగడం సాధారణమే అయినప్పటికీ... బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం... ఆ మహిళ ఎత్తుకు తగినట్లుగా ఉండాల్సిన బరువు కంటే (బీఎమ్ఐ 30 కంటే) ఎక్కువ ఉంటే దాన్ని ఒబేసిటీగా పరిగణించవచ్చు. గర్భిణుల్లో దుష్ప్రభావాలు...సాధారణ సమస్యలు: ఇతర మహిళలతో పోలిస్తే బరువు పెరుగుతున్న గర్భిణుల్లో సాధారణ ఆరోగ్య సమస్యలైన గుండెమంట, ఛాతీలో మంట, కొన్ని మామూలు ఇన్ఫెక్షన్ల వంటివి వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ. జస్టేషనల్ డయాబెటిస్: గర్భవతిగా ఉన్న టైమ్‌లో ఒంట్లో చక్కెర మోతాదులు పెరగడం వల్ల వచ్చే డయాబెటిస్‌ను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు కడుపులోని బిడ్డ బరువు పెరగడంతో తల్లికి ప్రసవం కష్టం కావడం. ప్రీ–ఎక్లాంప్సియా: గర్భంతో ఉన్నప్పుడు వచ్చే అధిక రక్త΄ోటు (హైబీపీ / హైపర్‌టెన్షన్)ను ‘ప్రీ–ఎక్లాంప్సియా’ అంటారు. ఒంట్లోకి చేరిన ద్రవాలు అదే స్థాయుల్లో బయటకు వెళ్లక΄ోవడం వల్ల ఒంట్లో వాపు వచ్చి ‘ప్రీ–ఎక్లాంప్సియా’తో కొన్నిసార్లు కడుపులోని చిన్నారికి రక్తప్రసరణ తగ్గడం. నొప్పులు చాలాసేపు రావడం: బరువు పెరిగిన మహిళల్లో ప్రసవం నొప్పులు చాలాసేపు వస్తూనే ఉండటం. సిజేరియన్‌కు అవకాశాలు పెరగడం: మామూలు ప్రసవానికి అవకాశాలు తగ్గడంతో కొన్నిసార్లు సిజేరియన్ తప్పక΄ోవడం. బిడ్డలకు కలిగే అనర్థాలు మ్యాక్రోసోమియా: కడుపులో బిడ్డ అనూహ్యంగా బరువు పెరగడంతో ప్రసవ మార్గం (బర్త్ కెనాల్) నుంచి తేలిగ్గా ప్రసవం కాకపోవడంతోపాటు... బర్త్కెనాల్ నుంచి బిడ్డ భుజాలు రావడం కష్టం. ఇలాంటి సందర్భాల్లో బిడ్డకు గాయాలయ్యే (షోల్డర్ డిస్టోసియా) ప్రమాదం ఎక్కువ. బిడ్డలో ఎదుగుదల / వికాసం లోపించడం: ప్రసవం తేలిగ్గా జరగకపోవడంతో ఫోర్సెప్స్ డెలివరీ వంటివి జరిగినా లేదా ప్రసవం వెంటనే జరగక బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో బిడ్డ ఎదుగుదల / మెదడు వికాసంలో లోపోలు. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్: బిడ్డ వెన్నుపాము ఎదుగుదల సాధారణ స్థాయిలో జరగకపోవడం వల్ల కలిగే సమస్యను ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్’ అంటారు. బిడ్డ పుట్టుకకు ముందుగా మహిళలు తగినంత ఫోలిక్ యాసిడ్ తీసుకోని సందర్భాల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతున్న మహిళల్లోనూ ఈ ప్రమాదం ఏర్పడే అవకాశం. పిల్లల్లో స్థూలకాయం : తల్లికి స్థూలకాయం ఉంటే పిల్లల్లోనూ ఊబకాయం వచ్చి,పెద్దయ్యాక కూడా అది కొనసాగే అవకాశమెక్కువ. భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే అవకాశాలూ ఎక్కువే. వైద్య పరీక్షలు...గర్భిణులు రొటీన్‌గా చేయించే పరీక్షలపాటు బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తెలుసుకునేందుకు గర్భధారణ తర్వాత మూడోనెలలో అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. (స్థూలకాయం ఉన్నవారిలో... వారి కడుపులోని కొవ్వు పోరల కారణంగా... కొన్ని సమస్యలు స్పష్టంగా తెలియకపోవచ్చు. ఈ రకంగా చూసినా గర్భిణుల్లో బరువు పెరగడం, లావెక్కడం ప్రమాద సూచికలే.) నివారణ / మేనేజ్మెంట్...👉గర్భవతిగా ఉన్నవారు మరీ ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం. 👉ఆ టైమ్‌లో తీసుకోవాల్సిన మంచి సమతులాహారం, చేయాల్సిన వ్యాయామాలపై అవగాహన కలిగి ఉండటం. 👉ముందునుంచే ఎక్కువ బరువు ఉండేవారు గర్భధారణ తర్వాత అకస్మాత్తుగా బరువు తగ్గకూడదు. అలా తగ్గితే బిడ్డకు అందాల్సిన క్యాలరీలుపోషకాలు అందకపోవచ్చు. అందుకే ఆ సమయంలో పిండం ఎదుగుదలకు కావాల్సినంత ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిడ్డలో తెలివితేటలు, వికాసానికి అడ్డుపడే న్యూరల్ ట్యూబ్ సమస్యల నివారణకు ప్రెగ్నెన్సీ ΄్లాన్ చేసుకున్నప్పటి నుంచే ‘ఫోలిక్ యాసిడ్’ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండటం. -
27 వారాల గర్భవిచ్చిత్తికి అనుమతి.. భర్త మృతితో తీవ్ర..
ఢిల్లీ: గర్భం వద్దని కోర్టును ఆశ్రయించిన ఓ మహిళా పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సదరు మహిళ 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భర్త మరణించిన ఓ మహిళ తనకు తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని.. 27 వారాల అబార్షన్‌ను అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటిషిన దాఖలు చేసిన మహిళ ఒక వితంతువని ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె తన భర్తను కోల్పోవడంతో తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ అన్నారు. అయితే ఆమె మానసికస్థితి సరిగా లేనందున, ముఖ్యంగా ఆమె గర్భంతో ఉంటే తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా ఆమెకు 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుతిస్తున్నట్లు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు.. గర్భంతో 24 వారాలు దాటినప్పటికీ సదరు మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ ఆస్పత్రిని ఢిల్లీ కోర్టు కోరింది. చదవండి: బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు మరణాలు -
ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?
నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా? – మాదిరాజు శ్యామల, కొల్లాపూర్ మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్‌తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్ మ్యారెజెస్ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు, బి– కాంప్లెక్స్ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్స్‌ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌తో స్కాన్స్ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్ అబ్నార్మలిటీస్ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్‌ని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్‌గా వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్స్ లాంటివి హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి రొటీన్ చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్ కౌన్సెలింగ్‌కి వెళితే మంచిది. ప్రాపర్ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు. -డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''43 ఏళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చింది.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా''?
నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా? ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్‌నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు ..డౌన్‌సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ టైమ్‌కి చేయవలసిన స్కానింగ్‌లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. - డా భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
‘నా భర్త ఎలా చనిపోయాడో చెప్పండి’
రామగుండం: అంతర్గాం మండలంలోని సోమనపల్లికి చెందిన వార్డు సభ్యురాలు, గర్భిణి ఐట్ల శ్రీవిద్య తన భర్త వేణుగోపాల్ మరణానికి కారణాలు తెలిపి, న్యాయం చేయాలంటూ గురువారం అదే గ్రామానికి చెందిన తన భర్త మిత్రుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె వివరాల ప్రకారం.. వేణుగోపాల్ మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తూ కుటుంబంతో కలిసి, గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వగ్రామానికి చెందిన ఇద్దరు బాల్యమిత్రులు హైదరాబాద్ నుంచి వచ్చారు. వేణుగోపాల్‌తో కలిసి, గత ఏప్రిల్ 21న ఆకెనపల్లి శివారులో మందు పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వేణుగోపాల్ గోదావరిఖని వెళ్లలేక సోమనపల్లిలోని సొంతింట్లో నిద్రించేందుకు బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో ఆ వాహనం అదుపుతప్పి, పడిపోవడంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి మిత్రుడు, స్థానికులు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. మూడు రోజులు చికిత్స పొందాక బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కుటుంబసభ్యులు అతన్ని ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో మృతిచెందాడు. అసలు ప్రమాదం జరగడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి భార్య శ్రీవిద్య కోరుతోంది. మృతుడికి రెండున్నరేళ్ల బాబు ఉండగా భార్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఆమె ఆందోళన చేపడుతున్న విషయం తెలుసుకున్న అంతర్గాం ఎస్సై బోగె సంతోష్‌కుమార్ సోమనపల్లికి చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకొని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగింది. ఆమెకు గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. -
కుమార్తె సీమంతం.. గంటల్లోపే మృత్యు ఒడికి తండ్రి
కళ్యాణదుర్గం: కుమార్తె సీమంతం ఘనంగా జరిపిన 24 గంటల్లోపే ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన గంగవరం గంగన్న (52) ఒక్కగానొక్క కుమార్తె జయంతి సీమంతం వేడుకను బుధవారం బంధువుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక గంగన్న ఛాతినొప్పితో విలవిల్లాడుతుంటే కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న అతను ఛాతి నొప్పి రావడంతో మృతి చెందినట్లు అల్లుడు ప్రవీణ్ తెలిపారు. కాగా, గంగన్న గతంలో ఆర్డీటీ ఉపాధ్యాయుడిగా, ఆయన భార్య హంపమ్మ గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు. (చదవండి: విజయవాడలో దారుణం.. స్నేహితు పనేనా..?) -
గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
చాపాడు: గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు పీహెచ్సీ సిబ్బందికి సూచించారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాధికారి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహించి గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేసి రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన పోషక ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, తల్లీబిడ్డ ఎంసీపీ కార్డులలో వివరాలు నమోదు చేయాలని, వైద్య సిబ్బంది రోజూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. జిల్లా ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా అధికారి వెంకటశివ, జిల్లా పీఎంఎంవీవై జిల్లా కో ఆర్డినేటర్ విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు సురక్షితం ఖాజీపేట: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకోవడం సురక్షితమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు అన్నారు. ఖాజీపేట పీహెచ్‌సీని గురువారం ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో జరిగిన కాన్పుల సంఖ్యపై అధికారులతో ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు, ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య పాల్గొన్నారు. -
పెయిన్ 'కిల్లర్స్'.. 30 నుంచి 80 శాతం గర్భిణులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే..
సాక్షి, అమరావతి: గర్భధారణ సమయంలో.. వైద్యులను సంప్రదించకుండా మహిళలు వాడుతున్న పెయిన్ కిల్లర్ మాత్రలు.. పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే అంశాన్ని యూకేకు చెందిన అబెర్డీన్ విశ్వవిద్యాలయం ఓ నివేదికలో ధ్రువీకరించింది. 1985 నుంచి 2015 మధ్య 1.51 లక్షల మందికి పైగా గర్భిణులపై జరిగిన అధ్యయనం ఆధారంగా పలు అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 80 శాతం మంది మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో వైద్యులను సంప్రదించకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ మాత్రలు వినియోగిస్తున్నట్లుస్పష్టం అయ్యింది. శిశువుపై తీవ్ర ప్రభావం గర్భవతులు పారాసిటమాల్, డైక్లోఫెనాక్, ఆస్పిరిన్, నాప్రోక్సెన్, ఇబుప్రోఫెన్ వంటి ఐదు రకాల మందులను వైద్యులను సంప్రదించకుండా ఎక్కువగా వినియోగిస్తున్నారు. 30 ఏళ్ల అధ్యయన కాలంలో గత ఏడేళ్లలో ఈ మాత్రల వినియోగం 60 శాతం మేర పెరిగింది. తొలి యాంటినేటల్ చెకప్‌కు వచ్చిన మహిళలను ప్రత్యేకంగా ఆరా తీయగా ప్రతి ఐదుగురిలో నలుగురు గర్భిణులు 12 వారాల్లోపు పెయిన్ కిల్లర్ మాత్రలు వినియోగించినట్లు తెలిసింది. మూడు నెలల్లోపు వాడకూడదు.. ఆస్పిరిన్, ఇబుప్రొఫెన్ సహా పలు పెయిన్ కిల్లర్ మందులు నాన్–స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ రకానికి చెందినవి. వీటిని గర్భం దాల్చిన సమయంలో వినియోగించడం శ్రేయస్కరం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో పారాసిటమాల్ వాడితే పర్వాలేదు. ఇక మిగిలిన పెయిన్ కిల్లర్స్ వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. – ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు, గైనకాలజీ, విజయవాడ జీజీహెచ్ -
ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. తీరా గర్భిణి అయ్యాక..
ఖమ్మం క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం రేవతి థియేటర్ ప్రాంతానికి చెందిన ప్రీతిని అదే ప్రాంతానికి చెందిన తేజానూత్ సాయి మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సాయి పాత బస్టాండ్ వద్ద అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. వివాహమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఇరువర్గాల కుటుంబీకులు సర్ది చెప్పడం.. మళ్లీ కలసిపోవడం జరుగుతోంది. కాగా, సైకోలా వ్యవహరించే సాయి.. ఆమెను ఇష్టారీతిగా కొట్టడమేకాకుండా, చుట్టుపక్కల వారు అడ్డుకుంటే వారిపైనా దాడికి పాల్పడుతుండేవాడు. ఇటీవల గర్భం దాల్చిన ఆమెను అలాగే కొడుతుండటంతో పుట్టింటికి వచ్చింది. వీరిద్దరూ కలసి ఉండడం సాధ్యం కాదని భావించిన పెద్దమనుషులు విడాకుల పత్రం రాయించారు. అయినా సాయి వచ్చి ప్రీతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఎప్పటిలాగే మూడు రోజుల క్రితం సాయి మళ్లీ కొట్టడంతో ప్రీతి పుట్టింటికి వచ్చింది. బుధవారం సాయంత్రం ప్రీతి వద్దకు వచ్చిన సాయి, మాట్లాడే పని ఉందని సమీపంలోని తన ఇంటికి తీసుకెళ్లి గొడవ పడుతూ అరటి పండ్లు కోసే కత్తితో ఇష్టారీతిగా శరీరం పై పొడిచి తలుపు వేసి వెళ్లిపోయాడు. అయితే కత్తితో పొడుస్తున్నప్పుడు ఆమె గట్టిగా కేకలు వేసినా, ఎప్పుడూ జరిగే గొడవలే కావొచ్చని ఎవరూ పట్టించు కోలేదు. చివరకు ఆమె గావుకేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూసే సరికి రక్తం మడుగులో ఉంది. వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె శరీరంపై అయిన గాయాలకు 80కుట్లు వేశారు. టూటౌన్ సీఐ శ్రీధర్, ఎస్సై రాము పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి.. -
కట్నం వేధింపులకు మూడు ప్రాణాలు బలి
సాక్షి, పెద్దపల్లి: అత్తింటి వేధింపులకు ఓ అబల బలైంది. అదనపు కట్నం తేవాలన్న వేధింపులతో మనస్తాపానికి గురైన మూడు నెలల గర్భిణి తన 18 నెలల కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. జూలపల్లి మండల కేంద్రానికి చెందిన చిగుర్ల మౌనిక (26)కు ధర్మారం మండలం బంజరుపలిŠల్ గ్రామానికి చెందిన సివిల్ సప్లయిస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేశ్‌తో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం దంపతులిద్దరూ పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో రమేశ్‌కు రూ.27లక్షలు ముట్టజెప్పారు. అయితే పెళ్లి తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని మౌనికను వేధింపులకు గురిచేస్తున్నాడు. బుధవారం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన మౌనిక, తన 18 నెలల చిన్నారితో కలిసి పెద్దపల్లి శివారులోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం మౌనిక మూడు నెలల గర్భవతి. ముక్కుపచ్చలారని 18 నెలల చిన్నారి, కడుపులో ఉన్న మూడు నెలల కళ్లు తెరవని పసికందుతో సహా మూడు ప్రాణాలు బలవడంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్ఐ రాజేశ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బావి నుంచి బయటకు తీయించారు. మౌనిక చావుకు కారణమైన భర్త రమేశ్‌ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మ మనసెరిగి ..
అమ్మాయి జీవితంలో తల్లికావడం అనేది మహత్తర ఘట్టం. గర్భం దాల్చామని తెలియగానే అమ్మాయితోపాటు, అత్తింటివారి నుంచి పుట్టింటిదాక, అంతా అంతో సంబర పడిపోతుంటారు. అయితే ‘‘ఇవి తినండి, అవి తినండి’’ అని చెప్పేవాళ్లే గానీ, గర్భిణి మానసికస్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఆలోచించేవారు తక్కువ. కాబోయే తల్లి ఆనందంతోపాటు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంది. ఆ ప్రభావం పుట్టిన బిడ్డపై పడుతుంది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని గొంతెత్తి చెబుతోంది అన్వితా నాయర్. ఇంజినీరింగ్ పూర్తి చేసిన 22 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ మిస్ అన్విత ఇలా చెప్పడానికి తనకెదురైన ఓ దుర్ఘటనకు పడిన సంఘర్షణ, కుంగుబాటులే కారణం. బెంగళూరుకు చెందిన అన్వితా నాయర్‌కు 2017లో ఒకసారి బాగా జ్వరం వచ్చింది. ఒళ్లంతా జ్వరంతో కాలిపోతుంటే నీరసంగా పడుకుని ఉంది. ఇది చాలదన్నట్టు తనకెంతో ఇష్టమైన ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషాదకర వార్త వినింది. ఈ విషయం తెలిసినప్పుడు అన్విత వయసు 17 ఏళ్లు. తన ప్రాణ స్నేహితురాలు అలా చనిపోవడం జీర్ణించుకోలేక పోయింది. అసలు తను ఎందుకు అలా చేసుకుంది? స్నేహితురాలు లేని లోకాన్ని ఊహించుకోలేక, బాగా కృంగిపోయింది. అలా నాలుగు నెలలపాటు సరిగా నిద్రకూడా పోలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ డిప్రెషనకు లోనైంది. అన్ని రోగాల్లా కాదు.. నెలలతరబడి డిప్రెషన్ లో ఉన్న అన్విత చదువులో బాగా వెనుబడిపోతుండేది. ఫలితంగా ఇంజినీరింగ్ సెమిస్టర్‌ను రాయలేకపోయింది. ‘‘ఇది అన్ని రోగాలలా కాదు. మానసిక వ్యాధి. దీనిలో ఉంటే మరింత దిగజారిపోతావు. మందులు వాడితే బయటపడవచ్చు’’ అని అంతా సలహా ఇవ్వడంతో సైకాలజిస్టుని కలిసి, థెరపీ తీసుకుంది. థెరపీతో త్వరగానే అన్విత మానసిక ఆరోగ్యం కుదుటపడింది. ఒకపక్క ఇంజినీరింగ్ సిలబస్ చదువుతూనే మరోపక్క మానసిక ఆరోగ్యం గురించిన పుస్తకాలు చదివేది. అలా మానసిక సమస్యలపై చక్కటి అవగాహన పెంచకున్న అన్విత..తను ఎదుర్కొన్న మానిసిక సంఘర్షణ, కుంగుబాటులను ఎవరూ ఎదుర్కోకూడదని అందరి దగ్గర డిప్రెషన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి అవగాహన కల్పిస్తుండేది. కేసు స్టడీల ద్వారా... మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తూనే, మానసిక ఆరోగ్యం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు నెట్లో వెతికేది. ఈ క్రమంలో ‘‘12–25 శాతం మంది మహిళలు మాతృసంబంధమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో యాభైశాతంమందికి కూడా తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలియదు. దీని ప్రభావం తల్లీ్లబిడ్డలపై పడుతుంది’’ అని తెలుసుకుంది. అది అలాగే కొనసాగితే పిల్లల భావోద్వేగ, శారీరక, నాడీ సంబంధిత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్రహించింది. ప్రెగ్నెంట్ మహిళ గైనకాలజిస్టుని సంప్రదించినప్పుడు తల్లీ, కడుపులో ఎదుగుతున్న బిడ్డ ఆరోగ్యంపైనే దృష్టి కేంద్రీకరిస్తారుగానీ, తల్లి మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అందువల్ల ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ సమస్య గురించి వెలుగులోకి తెచ్చి అవగాహన కల్పించాలనుకుని అప్పటి నుంచి తల్లి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతోంది. వెబ్సైట్ ద్వారా... గతేడాది ‘ప్యాట్రనస్ మెంటల్హెల్త్ డాట్‌కమ్’ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించి.. మానసిక ఆరోగ్యంపై కంటెంట్‌ను పోస్టు చేస్తుంది. అంతేగాక ఈ ఏడాది జూన్ లో చేంజ్‌డాట్ ఓఆర్జీ వేదికగా, మాతృ సంబంధమైన మానసిక సమస్యలను గుర్తించాలని కోరింది. అంతేగాక కర్ణాటక మానసిక ఆరోగ్యం విభాగం డిప్యూటీ డైరెక్టర్ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ విషయంపై ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని, మాత్ర సంబంధ మానసిక సమస్యలను ఏర్పాటు చేసి, వాటికి ప్రచారం కల్పించాలని ప్రభుత్వాలను కోరుతోంది. నేను తల్లయ్యేనాటికి.. ‘‘ఈ రోజు నేను తల్లిని కాకపోవచ్చు. భవిష్యత్‌లో తల్లినవుతాను. అప్పుడు నెలవారి చెకప్‌లలో భాగంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు మానసిక సమస్యలపై కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను. శారీరక ఆరోగ్యంపై మానసిక సమస్యల ప్రభావం తప్పకుండా పడుతుంది. అమ్మాయిలు విషయాన్ని త్వరగా బయటకు చెప్పుకోలేరు. తమలో తామే కృంగిపోతుంటారు. ఇది అమ్మాయికి గానీ, తన భవిష్యత్ కుటుంబానికిగానీ మంచిది కాదు. అందుకే అందరూ మానసిక సమస్యలపై బాహాటంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి’’ అని అన్విత చెప్పింది. అన్వితా నాయర్ -
Abortion: గర్భ విచ్ఛిత్తి గడువు పెంపు.. 20 నుంచి 24 వారాలు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భ విచ్ఛిత్తిపై కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచి్చంది. ఈ మేరకు మార్చి నెలలో పార్లమెంట్ ఆమోదించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021ను నోటిఫై చేసింది. కొన్ని వర్గాల మహిళలు గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ చట్టం ప్రకారం.. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైధవ్యం పొందడం, విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యం ఉన్నవారు, పిండం పూర్తిగా రూపం దాల్చని పరిస్థితుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఆత్యయిక స్థితిని ప్రకటించినపుడు, విపత్తు సమయాల్లో గర్భం దాల్చిన వారు 24 వారాల్లోగా గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చు. -
ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 27 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లయింది. ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది. ఇప్పుడు నాకు మూడో నెల. ఇటీవలే ‘కోవిడ్’ వచ్చింది. దానికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో గర్భం నిలుస్తుందా లేదా అని భయంగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పద్మజ, పొందూరు మీరు మొదట భయపడటం మానేసి, ఏమైతే అది కానీ అని ధైర్యంగా ఉండటం మంచిది. భయపడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, హార్మోన్లలో మార్పులు తలెత్తి, దానివల్ల కూడా అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల అందరికీ అబార్షన్లు అవ్వాలని ఏమీ లేదు. గర్భంలోని పిండం నాణ్యత కలిగినదైతే అది ఎలాగైనా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ గర్భిణులలో తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ అని నిర్ధారణ అయింది. కాబట్టి కరోనా వైరస్ ప్రభావం బిడ్డపై నేరుగా అంత ఏమీ ఉండదు. తల్లి రోగనిరోధక శక్తి బాగా ఉంటే, డాక్టర్ సంరక్షణలో వారి సలహా మేరకు సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే తల్లి కూడా దీనిపై పోరాడి బయటకు రాగలుగుతుంది. చదవండి: కోవిడ్ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా? ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో కోవిడ్ వల్ల అధికజ్వరం కారణంగా కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా పారాసెటమాల్ మాత్రలు వేసుకోవడం, తడి బట్టతో శరీరాన్ని చల్లగా ఉంచేలా తుడుచుకోవడం చేయాలి. జలుబు, దగ్గు ఉంటే దానికి మందులు వాడుకుంటూ, ఆయాసం లేకుండా ఊపిరి సరిగా ఆడేలా చూసుకోవాలి. గోరువెచ్చని ఉప్పునీటితో నోరు పుక్కిలించడం, ఆవిరి పట్టుకోవడం వంటివి చేసుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు కోవిడ్ వల్ల రక్తంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి సీబీపీ, సీఆర్పీ, డీ–డైమర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఆయాసం ఎక్కువై, ఆక్సిజన్ తగ్గిపోయి మరీ తప్పదు అనుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆక్సిజన్, మిగిలిన అవసరమైన మందులతో చికిత్స తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకుంటూ జాగ్రత్తగా ఉండవచ్చు. కోవిడ్ చికిత్సతో పాటు ప్రెగ్నెన్సీకి వాడే విటమిన్స్ వంటి మందులు కూడా తీసుకోవాలి. అలాగే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, మాంసాహారులైతే గుడ్లు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకుంటూ, మంచినీళ్లు బాగా తాగుతూ, విశ్రాంతి తీసుకోవాలి. పదిహేను– ఇరవై రోజుల తర్వాత గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లి, బిడ్డ ఎలా ఉందో చెకప్ చేయించుకోవాలి. కరోనా లక్షణాలు మీకు తీవ్రంగా ఉండి, చాలా సమస్యలకు గురైతే తప్ప మామూలుగా కొంచెం లక్షణాలకు గర్భంలోని బిడ్డకు ఏమీ కాదు. కాబట్టి కంగారు పడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నా వయసు 30 ఏళ్లు. నాలుగేళ్ల కిందట థైరాయిడ్ సమస్య వచ్చింది. దీనివల్ల 85 కిలోలకు బరువు పెరిగాను. ఇప్పుడు మా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈ సమస్య పెళ్లి తర్వాత సమస్యలేవైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దయచేసి వివరించగలరు. – రాధిక, గుంతకల్ థైరాయిడ్ సమస్య ఉన్నా, దానికి తగిన మోతాదులో మందులు వాడుకుంటూ, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటే, అందరూ బరువు పెరగాలనేమీ లేదు. థైరాయిడ్ అదుపులో లేకపోతేనే బరువు పెరుగుతారు. మీకు పెళ్లి తర్వాత థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉంటే, థైరాయిడ్ వల్ల సమస్య ఉండదు. కాకపోతే మీ బరువు 85 కిలోలు. అంటే అధిక బరువు. దీనివల్ల హార్మోన్ అసమతుల్యతలు ఏర్పడి, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల సాధారణంగా గర్భం నిలవడానికి ఇబ్బంది, ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. చదవండి: నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి? అలాగే అధిక బరువు వల్ల గర్భం దాల్చిన తర్వాత బీపీ, సుగర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి, థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయించుకుని, అదుపులో ఉంటే అదే మోతాదులో థైరాయిడ్ మందులు వాడుతూ, బరువు తగ్గడానికి ఆహార నియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలను ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నట్లయితే, పెళ్లి తర్వాత పెద్దగా సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ అదుపులో లేకపోతే, ఎండోక్రైనాలజిస్టు సూచన మేరకు థైరాయిడ్ మాత్రల మోతాదును పెంచి వాడవలసి ఉంటుంది. చదవండి: అది ఫాలో అవ్వొచ్చా? అలాగే బరువు తగ్గవలసి ఉంటుంది. థైరాయిడ్ లెవెల్స్ అదుపులో లేకపోతే, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం, గర్భం వచ్చినా నిలవకుండా, అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతమేరకు ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే థైరాయిడ్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటూ, బరువు తగ్గడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి, పెళ్లికి ముందే బరువు తగ్గడం మంచిది. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ప్రేమపేరిట మోసపోయి.. శిశువుకు జన్మనిచ్చి..
నిజామాబాద్ అర్బన్: ప్రేమపేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఓ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు పొక్కకుండా చెత్తకుప్పలో పడేసిన శిశువు కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) అమ్మ మ్మ ఇంటి వద్ద ఉంటూ బోధన్‌లో ఇంటర్ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో కడుపునొప్పిగా ఉందని అమ్మమ్మతో కలసి శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ డెలివరీ నిమిత్తం సిబ్బంది పూర్తి వివరాలు అడగడంతో చెప్పడం ఇష్టంలేక ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడే ఆ బాలిక ఆస్పత్రి మెట్ల పక్కన మగశిశువును ప్రసవించింది. వెంటనే శిశువును పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడేసి తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ వైద్యుల వద్దకు వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో డాక్టర్లు తొలుత నమ్మలేదు. అయితే, అప్పటికే ఎక్కువ రక్తస్రావం అవుతుండటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో పారిశుధ్య కార్మికులకు చెత్తకుప్పల్లో శిశువు కనిపించడంతో ఆస్పత్రి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వైద్యులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి కొనఊపిరితో ఉన్న శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపు శిశువు మృతి చెందింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన ప్రేమ వ్యవహారం, గర్భం గురించి పూసగుచ్చినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. -
పురిటినొప్పులతో విలవిల్లాడిన మహిళ.. కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా..
లక్నో: ఒక మహిళా కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు అండగా నిలిచి, తల్లిబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి చేర్చింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాలాబాద్‌కు చెందిన 30 ఏళ్ల రేఖ తన భర్తతో కలిసి ఉంటుంది. కాగా, గర్భవతి అయినా రేఖ కొన్ని రోజులుగా పురిటినొప్పులతో బాధపడుతుంది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన తల్లితో కలిసి గత సోమవారం (జులై 26)న బస్సులో షాహజాన్‌పూర్‌కి బయలుదేరింది. బస్సులోని కుదుపుల కారణంగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, ఆమెకు నొప్పులు మరీ ఎక్కువకావడంతో బాధను తాళలేక విలవిల్లాడింది. ఈ క్రమంలో బింటూ పుష్కర్ అనే మహిళ కానిస్టేబుల్ అదే బస్సులో ప్రయాణిస్తుంది. అంబూలెన్స్ మాత్రం సమయానికి రాకపోవడంతో ఆమె రేఖ, ఆమె తల్లి ఆందోళనకు లోనయ్యారు. దీంతో బింటూ పుష్కర్ వారిద్దరికి ధైర్యం చెప్పింది. అంతటితో ఆగకుండా, రేఖ తల్లితో కలిసి చీరను అడ్డుగా పెట్టి ఆమెకు సపర్యలు చేసింది. కాసేపటి తర్వాత రేఖకు ఒక బాలిక జన్మించింది. తల్లిబిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ క్రమంలో.. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అంబూలెన్స్‌లో తల్లిబిడ్డలను దగ్గర్లోని ఒక మెడికల్ కాలేజీకి తరలించారు. ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో పుష్కర్, బస్సులోని మిగతా ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కష్టకాలంలో మహిళకు అండగా నిలిచినందుకు కానిస్టేబుల్ బింటూ పుష్కర్పై నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది..
మేడం.. నాకు 32 సంవత్సారాలు. ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ. తొలి కాన్పులో బాబు. వాడికిప్పుడు ఏడేళ్లు. ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఏదో ఇన్ఫెక్షన్ రావడం, మందులు వాడడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ లేట్ అయింది. అయితే ఈ టైమ్‌లోనే నాకు హైపోథైరాయిడ్, డయాబెటీస్ కూడా వచ్చాయి. బీపీ నార్మల్‌గానే ఉంది ప్రస్తుతానికైతే. కాని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీ కాదు అంటున్నారు డాక్టర్. పుట్టబోయే బిడ్డకు అవయవలోపాలు, మెదడు ఎదగకపోవడం వంటి సమస్యలైతే రావు కదా మేడం.. భయంగా ఉంది. – అనుపమ, నిర్మల్ ఈ మధ్యకాలంలో చాలా మంది 30–35 సంవత్సరాల మధ్యలోనే రెండోసారి గర్భం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంత మంది ఒక బిడ్డ చాలు అనుకొని, రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయరు. వీరిలో ఆ బిడ్డ 6–7 సంవత్సరాల తర్వాత పెద్దగా అయ్యి ఒక తోడు కోసం తమ్ముడో, చెల్లెలో కావాలని మా ఫ్రెండ్స్‌కున్నారు, నాకు ఎందుకులేరు అని ఒంటరిగా బాధపడుతూ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు బిడ్డకోసం 35 సంవత్సరాల తర్వాత గర్భం ప్లాన్ చేయడం మొదలుపెడతారు. ఈ వయసులో అండాల నాణ్యత తగ్గడం, తల్లిలో బీపీ, షుగర్ పెరగడం వంటి సమస్యల వల్ల ఈ బిడ్డలో మామూలు వారికంటే అవయవ లోపాలు, బుద్ధిమాంద్యంతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటివి ఏర్పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఈ సమస్యలు అందరిలో రావాలని ఏమి లేదు. మీకు 32 సంవత్సరాలు, హైపోథైరాయిడ్, డయాబెటిస్ ఉన్నాయి. వీటికి సక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ, అదుపులో ఉంచుకుంటే బిడ్డ మీద పెద్ద ప్రభావం పడదు. కాన్పు సమయం వరకు బీపీ పెరగకుండా థైరాయిడ్, షుగర్ కంట్రోల్లో ఉండి, బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉంటే, మొదటి కాన్పు నార్మల్‌గా అయ్యి ఉంటే ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దాని గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ థైరాయిడ్, షుగర్ సమస్యలు అదుపులో లేకపోతే బిడ్డ మెదడు ఎదుగుదలలో లోపాలు, అవయవ లోపాలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అలాగే వయస్సుని బట్టి బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు మామూలు వారికంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మీరు 12 వారాల సమయంలో ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోపోతే 5వ నెల మధ్యలో అంటే 18–20 వారాల సమయంలో టిఫా స్కానింగ్‌తోపాటు క్వాడ్రుపుల్ టెస్ట్ అనే రక్త పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. టిఫా స్కానింగ్‌లో బిడ్డ లోపల అవయవాలు అన్నీ ఉండవలసినట్లే ఉన్నాయా, లేదా అనేది 95 శాతం తెలుస్తుంది. గుండెలో రంధ్రాలు వంటివి సరిగా తెలియాలి అంటే ఫీటల్ 2డీ ఈకో స్కానింగ్ చేయించుకోవడం మంచిది. అలాగే క్వాడ్రుపుల్ రక్త పరీక్షలో బిడ్డలో డౌన్స్‌సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిస్తే, సమస్య కచ్చితంగా ఉందా లేదా అని నిర్ధారించుకొని దానికి ఆమినియోసెంటిసిస్ అనే ఉమ్మనీరుని తీసి పరీక్ష చేయడం జరుగుతుంది. లేదా 99 శాతం ఎన్ఐపీటీ అనే రక్తపరీక్ష చేయించుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా పైన చెప్పిన మీ డాక్టర్ సలహామేరకు చేయించుకొని, సరైన మోతాదులో ఆహార నియమాలను పాటిస్తూ, మందులు వాడుకుంటూ, సక్రమంగా చెకప్‌లకు వెళుతూ ఉంటే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. లేటు వయసులో పిల్లల్ని కంటే మానసిక లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నట్టే చిన్న వయసులో కంటే కూడా అలాంటి రిస్క్ ఉంటుందా? ఎందుకంటే నాకు పదహారేళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నేనేమో చదువు మీద దృష్టిపెట్టాను. మీ సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది. – దీపికా వత్సల, చెన్నూరు సాధారణంగా అమ్మాయి గర్భధారణకు శారీరకంగా మానసికంగా సిద్ధం అవ్వడానికి 21 సంవత్సరాలు నిండితే ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడటానికి, లోకం జ్ఞానం తెలియడానికి చదువు కూడా చాలా ముఖ్యం. 21 సం.లకు డిగ్రీ పూర్తవుతుంది. పెళ్లి తర్వాత పిల్లలను కని, పెంచడానికి, చదివించుకోవడానికి, కుటుంబం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సామాజిక పరమైన ఉపయోగాలు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, అమ్మాయి శారీరకంగా పెరగడాని, పెల్విక్ ఎముకలు దృఢంగా తయారు కావడానికి, హర్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి 20 సం.రాలు అవసరం. అంతకంటే ముందు గర్భధారణ వల్ల గర్భం సమయంలో రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, పెల్విక్ ఎముకలు ధృఢంగా లేకపోవడం వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మామూలు వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తల్లిలో పోషకాల లోపం వల్ల కూడా బిడ్డలో మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఎలాగైతే 35 సం.రాలు దాటాక పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, అలాగే మరీ చిన్న వయసులో గర్భం దాలిస్తే కూడా పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మీ ఇంట్లో వాళ్లకి పెళ్లయి మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కనిపిస్తుంది కాని, నీ వయసు కనిపించట్లేదు. అందుకే వాళ్లు కంగారుపడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో అయితే 15–20 సం.రాల లోపలే పిల్లలను కనేవాళ్లు. అప్పటి కాలం పరిస్థితులు, వారి శరీరతత్వాలు, ఆహారపు అలవాట్లు, పనులు చేయడం వంటివి ఇప్పటి పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి అప్పటి వారిలో, ఇప్పడు ఉన్నంత సమస్యలు ఉండేవి కావు. అలాగే తరాలు మారే కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జన్యువులలో కూడా మెల్లగా మార్పులు వచ్చి, తద్వారా పుట్టబోయే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీ వారికి అర్థం అయ్యేటట్లు వివరించి, నీ చదువు పూర్తి చేసుకొని 21 సం.రాలకు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
రాక్షసి: గర్భిణిని చంపి, బిడ్డను తీసుకొని...
టెక్సాస్: అమెరికాలో దారుణం జరిగింది. ఒక నిండు గర్భిణిని చంపి ఆమె కడుపులో నుంచి బిడ్డను తీసుకుంది ఒక మహిళ. టేలర్ పార్కర్(27) అనే మహిళ గత బుధవారం వరకు టెక్సాస్ జైలులో ఉంది. అయితే గత గురువారం నాడు 5 మిలయన్ డాలర్ల పూచికత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిందే తడవుగా ఆమె మరో ఘాతుకానికి పాల్పడింది. ఒక గర్భిణిని చంపి ఆమె బిడ్డను తనకు పుట్టిన శిశువుగా తీసుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చింది. తనకు రోడ్డు పక్కన కానుపు అయ్యిందని ఆసుపత్రిలో వారికి కట్టుకథలు చెప్పింది. శిశువు శ్వాస తీసుకోవడం లేదని చికిత్స చేయాలని కోరింది. బిడ్డను పరిశీలించిన డాక్టర్లు ఆమె మరణించినట్లు ప్రకటించారు. అనంతరం అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పార్కర్‌ను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. చనిపోయిన మహిళ మృతదేహాన్ని పార్కర్ ఉన్న ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలో గుర్తించారు. హత్య, అపహరణ ఆరోపణలపై పార్కర్‌ను పోలీసలు మరోసారి అరెస్ట్ చేశారు. చదవండి: ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్ చేసిన ట్విటర్ -
కాబోయే అమ్మలకు సర్కార్ అండ
సాక్షి, అమరావతి: గర్భిణుల్లో వస్తున్న మధుమేహం (జస్టేషనల్ డయాబెటిస్) నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గర్భిణుల్లో వచ్చే మధుమేహం ప్రమాదకారిగా మారింది. దేశవ్యాప్తంగా 10 శాతం మందిలో ఇది కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనివల్ల లక్షలాది మహిళలు తీవ్ర శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని తేల్చింది. చివరకు టైప్–2 (పెద్దవారిలో వచ్చే మధుమేహం)గా రూపుదాలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ తన నివేదికలో పేర్కొంది. దీంతో ఏపీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో 14 నుంచి 17 శాతం మందికి.. ► రాష్ట్రంలో ఏటా 6.5 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. ఇందులో 3 లక్షల మందికి పైగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకుంటున్నారు. ► కేంద్రం తాజా లెక్కల ప్రకారం ఏపీలో 14 నుంచి 17 శాతం మంది గర్భిణులు మధుమేహానికి గురవుతున్నారని తేల్చారు. ► తమిళనాడు, తెలంగాణలో 17 నుంచి 20 శాతం మంది ఉన్నట్టు తేలింది. మధుమేహం వల్ల కలిగే నష్టాలివీ.. ► గర్భిణిలో మధుమేహం ఉంటే పురిటి నొప్పులు సరిగా రావు. ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ► ఇన్ఫెక్షన్లు సోకి తీవ్ర అనారోగ్యం బారిన పడటం, అబార్షన్లకు దారి తీయడం ఉంటాయి. ► కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే మరణించే ప్రమాదం ఉంది. పుట్టుకతోనే కొన్నిరకాల వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ► నియోనేటల్ హైపోగ్లైసీమియా లేదా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కు గురయ్యే ప్రమాదమూ ఉంది. నియంత్రణ చర్యలిలా.. ► ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు మధుమేహ నిర్ధారణ పరీక్షలు జరిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► మహిళ గర్భం దాల్చినట్టు నిర్ధారణ కాగానే మధుమేహ పరీక్ష చేస్తారు. అప్పుడు లేదని తేలితే 24 నుంచి 28 వారాల గర్భిణికి మరోసారి పరీక్ష చేస్తారు. ► ఒకవేళ డయాబెటిస్ ఉన్నట్టు తేలితే నిపుణులైన వైద్యులతో తగిన తక్షణ చికిత్సలు అందజేస్తారు. ► అలాంటి వారిని ప్రతినెలా పర్యవేక్షణ చేసి.. దీనిని టైప్–2 డయాబెటిస్‌గా మారకుండా నియంత్రిస్తారు. -
లాక్డౌన్ : కాన్పుకు వెళ్తే.. పొమ్మన్నారు
సాక్షి, గద్వాల : పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళితే.. అధిక రక్తపోటు, తక్కువ రక్తం ఉందని వైద్యు లు కాన్పు చేయమన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వేరే ఆస్పత్రికి వెళ్దామన్నా గత్యంతరం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ గర్భిణి ఆసుపత్రి ఆవరణలోనే బెంచీపై పడుకొని తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. పురిటి నొప్పులతో ఆమె పడుతున్న వేదనను చూడలేక భర్త ఆమె బాధను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదంతా జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. (775కు చేరిన కరోనా మృతుల సంఖ్య) మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలింపు.. అయిజ మండలం యాపదిన్నెకి చెందిన జెనీలియా అనే గర్భిణిని డెలవరీ కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రికి భర్త మహేంద్ర తీసుకొచ్చాడు. ఆస్పత్రి సిబ్బంది జెనీలియాకు పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు, తక్కువ రక్తం ఉండడంతో డెలివరీ చేయడం సాధ్యం కాదంటూ బయటకు పంపేశారు. దీంతో భర్త మహేంద్ర ఏం చేయాలో దిక్కుతోచక సంఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై డీఎస్పీ యాదగిరి వెంటనే స్పందించారు. పోలీసు సిబ్బందిని ఆస్పత్రికి పంపించారు. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓతో మాట్లాడి గర్భిణిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) -
నేనూ నీ వెంటే!
చెన్నై,తిరువొత్తియూరు: ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. చిన్నపాటి గొడవలకే కుంగిపోయారు. భర్తలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. భార్య, బిడ్డ మృతికి కారణం తానేనని, వారు లేని జీవితం వ్యర్థమనుకున్న అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బన్రూట్టి సమీపం తిరువదిగైలో కలకలం సృష్టించింది. వివరాలు.. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపం తిరువడిగై ప్రాంతానికి చెందిన అళగానందన్ కుమారుడు మణికంఠన్ (29). అన్నాడీఎంకే ప్రముఖుడు. ఇతను ఆలయాలలో గోపుర విగ్రహాలకు వర్ణం వేసే వృత్తిని చేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి (25). వీరిద్దరూ గత ఏడాది జూన్ 23న ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత అదే ప్రాంతంలో వేరుగా కాపురం ఉంటున్నారు. మహేశ్వరి మూడు నెలల గర్భిణి. దంపతుల మధ్య తరచూ సమస్యలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మణికంఠన్ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.(ప్రేమా.. ఇది నీకు న్యాయమా?) గురువారం బయటకు వెళ్లిన అతను రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చాడు. తరువాత భోజనం చేసి నిద్రపోయాడు. తెల్లవారుజామున మణికంఠన్ ఇంటి తలుపులు తెరి ఉన్నాయి. దీన్ని చూసిన ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా మహేశ్వరి పడక గదిలో శవంగా పడి ఉంది. ఆమె భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్న బన్రూట్టి పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పడకగదిలో తనిఖీ చేయగా మణికంఠన్ రాసిన ఉత్తరం లభ్యమైంది. అందులో తాను గురువారం రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో తన భార్య ఉరి వేసుకుని శవంగా వేలాడుతోందని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆమెను కిందకు దించి పడకపై పడుకోబెట్టానని తెలిపాడు. భార్యలేని జీవితం వద్దనుకుని తనువు చాలిస్తున్నట్టు పేర్కొన్నాడు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష కోసం విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ లోపు మహేశ్వరి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు రేకెత్తించారు. తన కుమార్తెను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆడబిడ్డేనని..దారుణం
కర్నూలు, బనగానపల్లె రూరల్: పుట్టేది ఆడబిడ్డేనని అనుమానించి గర్భస్త్రావం మందులు ఇవ్వడంతో, అవి వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బనగానపల్లెలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు... పట్టణంలోని కరీంబాగ్ కాలనీలో నివాసం ఉండే మల్లికభాను కూతురు షేక్ షాహినాతో ఇదే కాలనీలో నివాసం ఉంటున్న షేక్షావలి కుమారుడు షమీర్‌కు మూడు సంవత్సరాల క్రితం వివాహంమైంది. మొదటి ప్రసవంలో ఆడ పిల్ల పుట్టింది. ప్రస్తుతం షాహిన మళ్లీ గర్భిణి. అయితే భర్త షమీర్ తన భార్యకు మళ్లీ ఆడ పిల్ల పుడుతుందన్న అనుమానంతో గర్భం పోగొట్టాలని తనకు తెలిసిన ట్యాబ్లెట్స్ తినిపించేవాడు. ఈ క్రమంలో షాహినకు మంగళవారం రక్తస్రవం అధికం కావడంతో వెంటనే స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడి వైద్యులు నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక షాహిన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త షమీర్ ట్యాబ్లెట్స్ తినిపించడం వల్లనే షాహినా మృతి చెందిందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ మహేష్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గర్భిణీకి సాయం అందించిన ఎస్సై
నెల్లూరు: నిండు గర్భిణి.. అర్ధరాత్రి ఉన్నట్లుండి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.. భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి నడిపించుకొని వచ్చారు.. వాహనాలు రాకపోవడంతో రోడ్డుపైనే ఉండిపోయారు. రాత్రి గస్తీలో ఉన్న ఎస్సై గమనించి వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చారు. వివరాలు.. మన్సూర్‌నగర్‌కు చెందిన అనిల్, భవాని దంపతులు. సోమవారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకొని రోడ్డుపైకి వచ్చారు. దాదాపు 20 నిమిషాలు వేచి చూసినా ఆటో రాలేదు. పురిటినొప్పులు అధికమవడంతో ఆమె రోడ్డుపైనే కూర్చుండిపోయారు. అదే ప్రాంతంలో రాత్రి గస్తీ విధులు నిర్వర్తిస్తున్న చిన్నబజార్ ఎస్సై రవినాయక్ విషయాన్ని గమనించారు. పాప పరిస్థితి విషమంగా మారుతుండటాన్ని గమనించి గర్భిణి, ఆమె భర్తను తన వాహనంలో ఎక్కించుకొని హుటాహుటిన జీజీహెచ్‌లోని మెటర్నిటీ వార్డుకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ఆస్పత్రిలో చేర్పించి వారి ఫోన్ నంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతటితో సరిపెట్టుకోకుండా అరగంటకోసారి వారికి ఫోన్ చేసి పరిస్థితిని ఆరాతీశారు. సకాలంలో గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్మనిచ్చారు. ఎస్సైకు దంపతులిద్దరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సైను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. -
అబార్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : అబార్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ చేసుకోవాలనే గర్భిణీలకు 24 వారాల వరకు అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం 20 వారాల వరకే గర్భిణీలకు అబార్షన్ చేయించుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గర్భిణీలకు 24 వారాల వరకు అబార్షన్ వెసులుబాటు కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా మహిళల పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే తొలి ఐదు నెలల(20 వారాల) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణీలు అబార్షన్ చేసుకోవాలంటే.. కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహిళలు గర్భాన్ని తొలగించుకునే కాల పరిమితిని పెంచాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నట్టు చెప్పారు. వైద్యులు కూడా ఇదే రకమైన సూచనలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అబార్షన్ కాలపరిమితిని 24 వారాలకు పెంచినట్టు వివరించారు.