దంపతులను ఆస్పత్రికి తరలిస్తున్న ఎస్సై రవినాయక్
నెల్లూరు: నిండు గర్భిణి.. అర్ధరాత్రి ఉన్నట్లుండి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.. భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి నడిపించుకొని వచ్చారు.. వాహనాలు రాకపోవడంతో రోడ్డుపైనే ఉండిపోయారు. రాత్రి గస్తీలో ఉన్న ఎస్సై గమనించి వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చారు. వివరాలు.. మన్సూర్‌నగర్‌కు చెందిన అనిల్, భవాని దంపతులు. సోమవారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకొని రోడ్డుపైకి వచ్చారు. దాదాపు 20 నిమిషాలు వేచి చూసినా ఆటో రాలేదు. పురిటినొప్పులు అధికమవడంతో ఆమె రోడ్డుపైనే కూర్చుండిపోయారు. అదే ప్రాంతంలో రాత్రి గస్తీ విధులు నిర్వర్తిస్తున్న చిన్నబజార్ ఎస్సై రవినాయక్ విషయాన్ని గమనించారు.
పాప
పరిస్థితి విషమంగా మారుతుండటాన్ని గమనించి గర్భిణి, ఆమె భర్తను తన వాహనంలో ఎక్కించుకొని హుటాహుటిన జీజీహెచ్‌లోని మెటర్నిటీ వార్డుకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ఆస్పత్రిలో చేర్పించి వారి ఫోన్ నంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతటితో సరిపెట్టుకోకుండా అరగంటకోసారి వారికి ఫోన్ చేసి పరిస్థితిని ఆరాతీశారు. సకాలంలో గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్మనిచ్చారు. ఎస్సైకు దంపతులిద్దరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సైను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment