‘కనిపించని మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమైతే కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్’ ఈ సినిమా డైలాగ్ వింటే సగటు పోలీసు గుండె పులకరిస్తుంది. అయితే వారి దైనందిన జీవితాన్ని కాస్తా దగ్గరగా పరికిస్తే దయనీయ స్థితి కనిపిస్తుంది. ఊపిరి సలపని విధులతో ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురతున్నారు. మరోవైపు వ్యక్తిగత పనులు చేసుకోలేక, కుటుంబసభ్యులతో గడపలేక
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో శాంతిభద్రతల విభాగంలో ఆరు పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్, సీసీఎస్, మహిళ, ఎస్సీ, ఎస్టీ సెల్ స్టేషన్లున్నాయి. శాంతిభద్రతల విభాగంలోని పోలీసు స్టేషన్లలో గతంలో మూడు సెక్షన్ల విధానం అమలులో ఉండేది. ఒక కానిస్టేబుల్ రాత్రి తొమ్మిదికి విధులకు వస్తే ఉదయం ఆరుగంటలకు ఇంటికి వెళ్లేవాడు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు పనిచేసేవాడు. అనంతరం ఇంటికి వెళ్లి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విధుల్లో ఉండేవాడు. అప్పటినుంచి మరుసటి రోజు రాత్రి 9 గంటల వరకు (అసాధారణ పరిస్థితుల్లో తప్ప) వారికి ఖాళీ ఉండేది. దీంతో వ్యక్తిగత పనులు చూసుకునేవారు. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడిపేవారు.
ఇటీవల నెల్లూరు నగరంలో శాంతిభద్రతలు క్షీణదశకు చేరుకున్నాయనే విషయాన్ని ఊటంకిస్తూ ఉన్నతాధికారులు మూడు సెక్షన్లను రెండు సెక్షన్లుగా కుదించారు. దీని ప్రకారం రాత్రి తొమ్మిదికి నైట్ విధులకు వచ్చిన సిబ్బంది ఉదయం 7 గంటలకు ఇంటికి వెళుతున్నారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి రాత్రి తొమ్మిదికి వెళుతున్నారు. యథావిధిగా మరుసటి రోజు ఉదయం ఏడుకి వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వెళ్లి రాత్రి గస్తీకి వస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 14 గంటలు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇక బందోబస్తులు, ఆందోళనలుంటే ఖాళీ సమయం కూడా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. తీరికలేని విధులు వారిని ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో వ్యక్తిగత పనులు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురతున్నారు.
పెరుగుతున్న అసంతృప్తి
ఉన్నతాధికారుల చర్యలపై సిబ్బంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు సెక్షన్ల వి«ధానం అమలులోకి వచ్చిన కొద్దిరోజులకే సిబ్బంది వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు నగరంలో నేరాలు పెరిగిన దృష్ట్యా కొద్దిరోజులు రెండు సెక్షన్ల విధానం అమలులో ఉంటుందని, ఆపై తొలగిస్తారని వెల్లడించారు. దీంతో వారు విధులు నిర్వహిస్తూ వచ్చారు. నెలన్నరరోజులు గడస్తున్నా రెండు సెక్షన్ల విధానమే కొనసాగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు సెక్షన్ల విధానాన్ని పునరుద్ధరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు
♦ నగరంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ రాత్రి విధులకు వెళ్లాడు. ఉదయం ఏడుగంటల వరకు పనిచేసి ఇంటికి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని తొమ్మిది గంటలకు నిద్రపోయాడు. ఇంతలో అతని కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. నిద్రలేమితోనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించసాగాడు. అప్పటికే మధ్యాహ్నం 12 గంటలైంది. కుమారుడిని కుటుంబసభ్యులకు అప్పగించి హుటాహుటిన ఉద్యోగానికి పరుగులు తీశాడు.
♦ నగరంలో ఓ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఊపిరి సలపని విధులతో అనారోగ్యానికి గురై ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పనిఒత్తిడి వల్లనే అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు వెల్లడించారు.
పరిస్థితిని బట్టే పనివేళలు
స్థానికంగా ఉన్న రోజు వారీ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సి బ్బందిని బట్టే డ్యూటీలుం టాయి. రోజూ అధికగంటలు పనిచేస్తున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. సిబ్బంది ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సమస్యలను నాకు తెలియజేస్తే పరిష్కరిస్తా. సిబ్బంది సంక్షేమం దృష్ట్యా రెండు వారాలుగా వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం.– ఐశ్వర్యరస్తోగి, జిల్లా ఎస్పీ
పునరుద్ధరించాలి
నెల్లూరు నగరంలో రెండు సెక్షన్ల విధానం వల్ల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, నిద్రలేమి కారణంగా అనారోగ్యానికి గురై అస్పత్రి పాలవుతున్నారు. తాజాగా బాలాజీనగర్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఒత్తిడికి లోనై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మూడు సెక్షన్ల విధానాన్ని అమలు చేయాలి. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. – మద్దిపాటి ప్రసాదరావు, పోలీసుఅధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment