
మాట్లాడుతున్న అసోసియేషన్ నాయకులు
నెల్లూరు(క్రైమ్): పోలీసులపై చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై జిల్లా పోలీసు అధికారుల సంఘ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నెల్లూరులోని సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ మాజీ రాష్ట్ర గౌరవాధ్యక్షడు ఎం.గంగాధర్, జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావులు మాట్లాడారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంతాపసభలో చంద్రబాబు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆయన కొంతకాలంగా ప్రజలను రెచ్చగొట్టి పోలీసులపై ఉసిగొల్పేలా వ్యాఖ్యలు చేయడం బాగోలేదన్నారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు లోబడి చట్టపరిధిలో నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పోలీసు పనితీరును పొగిడిన చంద్రబాబుకు ప్రభుత్వం మారిన నాలుగునెలల్లోనే వారి తీరును తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తోంది పోలీసులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని హుందాగా వ్యహరించాలని కోరారు. మరోసారి పోలీసులను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.సుబ్బరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి యు.మదన్, ఈసీ మెంబర్లు ఎస్‌పీ ప్రసాద్, ఎస్‌కే రఫీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment