ఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మన్మోహన్‌కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ కోరడంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే లేఖపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. మరోవైపు, అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే మన్మోహన్‌కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో.. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంతిమ సంస్కారాలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని ఖర్గే గుర్తు చేశారు. భారత ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవి’ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
అయితే, ఈ లేఖపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవన్ మాట్లాడుతూ..‘స్మారకాలను నిర్మించే సంప్రదాయాల గురించి మోదీకి కాంగ్రెస్ లేఖరాయడం విడ్డూరంగా ఉంది. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీవీకి స్మారకం నిర్మించలేదు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కేవలం ప్రధాని మోదీ ఆయనకు స్మారకం నిర్మించారు. 2024లో భారతరత్న ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చారు. అంతేకాదు, ఢిల్లీలో పీవీ అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ కనీసం చోటు కూడా ఇవ్వలేదని మన్మోహన్ సింగ్ మీడియా సలహదారు సంజయ్ బారు తన పుస్తకంలో రాశారు. ఢిల్లీకి బదులు హైదరాబాద్‌లో నిర్వహించే విషయమై పీవీ పిల్లలతో సంజయ్ మాట్లాడానని తెలిపారు’ అని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. స్మారక చిహ్నంపై కేంద్రం హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించింది కేంద్రం. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది మాట్లాడుతూ..‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్మారక స్థలి నిర్మాణానికి అవసరమైన భూమి, ట్రస్టు ఏర్పాటుకు కొంత సమయం పడుతుంది. కేంద్ర క్యాబినెట్ స్మారక స్థలి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేకు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తాము. మన్మోహన్ జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవించలేదు. ఇప్పుడు ఆయన స్మారక నిర్మాణంపై రాజకీయాలు చేస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment