న్యూఢిల్లీ: హస్తినలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎల్‌జేపీ(రామ్ విలాస్ వర్గం) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన హులాస్ పాండేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసుకుంది. పాట్నా, బెంగళూరు, ఢిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలతోపాటు బంధవుల ఇళ్లలోనూ తన బృందాలతో తనిఖీలు జరిపింది.
ఆర్థిక లావాదేవీల అవకతవకలకు సంబంధించి.. హులాస్ పాండే(Hulas Pandey) మీద గతంలో చాలా ఆరోపణ వచ్చాయి. అయితే ఈడీ మాత్రం దాడులకు సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. హులాస్ పాండే ఎల్‌జేపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.
పాండే గతంలో బీహార్ ఎమ్మెల్సీగా పని చేశారు. తొలినాళ్లలో నితీశ్ కుమార్(Nitish Kumar) జేడీయూలో పని చేసిన ఈయన.. తర్వాత ఎల్‌జేపీ(LJP)లో చేరారు. అప్పటికే పాండే.. చిరాగ్‌ల మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. ఇక ఎల్‌జేపీలో చేరాక.. ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటిని ఇతనే చూసుకునేవారు. ఇదిలా ఉంటే.. 2012 నాటి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పాండే పేరును చేర్చారు. దీంతో.. అనివార్య పరిస్థితుల మధ్య కిందటి ఏడాది డిసెంబర్‌లో ఎల్‌జేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పాండే రాజీనామా చేయాల్సి వచ్చింది. వివాదాస్పద ప్రకటనతో అప్పుడప్పుడు వార్తల్లోనూ నిలుస్తుంటారీయన.
ఏమీటా కేసు..
2012 జూన్ 1వ తేదీన రణ్‌వీర్ సేన అధినేత బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా భోజ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ పాండే మీద సంచలన ఆభియోగాలు నమోదు చేసింది. ముఖియాకు పేరు వస్తుండడంతో తన రాజకీయ పలుకుబడి మసకబారిపోతుందనే భయంతోనే పాండే ఈ హత్య చేయించాడని పేర్కొంది. అయితే..
పాండే మాత్రం ఆ ఆరోపణలను రాజకీయ కుట్రగా ఖండిస్తూ వస్తున్నారు. ఈలోపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తప్పుబట్టింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే.. ఈ ఉదయం నుంచి ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ(ED) బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా.. స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకున్నారు ఈడీ అధికారులు.
ఇదీ చదవండి: అయోధ్య గ్రేటర్ దేన్ ఆగ్రా!
Comments
Please login to add a commentAdd a comment