
సాక్షి, తిరుపతి : కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
.. 21 రోజుల క్రితం ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అగతంకులు దాడి చేశారు. ఆ ఘటనలో ఏం జరిగిందో బాలిక తండ్రి మాట్లాడిన వీడియోల్ని మీడియా ఎదుట బహిర్గతం చేశారు. అనంతరం, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం తనపై పోక్సోకేసు ఎందుకు నమోదు చేసింది. ఎర్రావారిపాలెం మండలంలో ఇద్దరు అగంతకుల దాడిలో తన కుమార్తె అపస్మారక స్థితిలో ఉందని ఓ తండ్రి స్థానిక వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున రెడ్డి సాయంతో నాకు ఫోన్ చేస్తే వాళ్ల ఇంటికి వెళ్లా. ఆపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించా. ఆ ఘటన గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. ఎవరికి చెప్పలేదు.
.. ఈ ఘటన జరిగి.. 22 రెండ్రోజుల తర్వాత సదరు బాలికపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారంటూ పోక్సో కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని ఈనాడు సహా టీడీపీ అనుకూల మీడియా వాళ్లు కథనాలు ఇచ్చారు. మరి వాటి మీద ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలి?. బాలిక తండ్రిని స్టేషన్లకు పిలిపించి పోలీసులు విచారించారు. ఆయనతో బలవంతంగా నాపై అక్రమ కేసులు పెట్టించారు.
.. కూటమి ప్రభుత్వం ఎన్నిక అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వ పెద్దల నేతల కళ్లల్లో ఆనందం కోసం అధికారులు మాపై పెట్టిన కేసులు తాత్కాలికంగా ఇబ్బందులు గురిచేస్తాయి. వాటిపై న్యాయ స్థానంలో పోరాటం చేస్తాం. కానీ అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులు రిటైరైన అదే న్యాయ స్థానం ద్వారా తగిన చర్యలు తీసుకుంటాము’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.
Also Read in English: Watch Video: Chevireddy Bhaskar Reddy: I Will Continue Fighting Even If I'm Jailed