
సాక్షి, తిరుపతి: తిరుమల గోశాలలో గోవుల మృతి ఘటనపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ద్వారా తెలిసింది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను’’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.
Fmr TTD Chair Karunakar Reddy has alleged that in the past 3 months, several sacred indigenous cows have died due to illness and lack of proper feed at TTD Goshala. I am gathering more information, Art 48 of the Indian Constitution, its State’s duty to protect them. PIL underway.
— Subramanian Swamy (@Swamy39) April 12, 2025
టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవుల మృతిపై వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న(శుక్రవారం) సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘టీటీడీ గోశాలలో దేశవాలి అవులు వందకు పైగా మృత్యువాత పడ్డాయి. నిర్వాహకులు ఈ విషయం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. డీఎఫ్‌ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.
