
సాక్షి, తిరుమల/మంగళగిరి: తిరుమల దర్శనాల్లో మంత్రి నారా లోకేష్.. పీఏ దందా వెలుగులోకి వచ్చింది. వీఐపీ దర్శనాల కేటాయింపుల్లో అక్రమాలు బయటకు వచ్చాయి. పీఎస్ టూ సీఎంవో అంటూ దర్శన సిఫార్సు లేఖలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాలకు సంబంధించిన దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎస్ టూ సీఎంవో అంటూ సాంబశివరావు.. తిరుమల జేఈవో కార్యాలయానికి దర్శన సిఫార్సు లేఖలు పంపిస్తున్నారు. రోజుకు 12కుపైగా సిఫార్సు లేఖలతో దర్శనాలు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. సాంబశివరావు పనిచేసేది మంగళగిరిలో అయితే తిరుమల జేఈవో కార్యాలయంలో సీఎంవో పేరుతో దర్శనాలు ఇప్పిస్తున్నారు.
ఇక, ఏపీ సీఎంవో పేషీతో ఎలాంటి సంబంధం లేని సాంబశివరావు సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు దర్శనాలు కొనసాగిస్తున్నారు. అయితే, మంత్రుల సిఫార్సు లేఖలతో రోజుకు రెండు దర్శనాలు మాత్రమే అనుమతి ఉంది. వారి సిఫార్సులతో వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే ఒక్క రోజుకు అనుమతి ఉంటుంది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు ఐదు నుంచి ఆరు వేలకు పైగా వీఐపీ దర్శనాలు పెరిగాయి. ఇష్టారాజ్యంగా కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాలను పెంచి సామాన్య భక్తుల దర్శనాలను మరింత ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలపై విచారణ చేపట్టాలని హిందుత్వ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
