
ఇటీవల మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
తెలంగాణలో తలదాచుకున్నా వదలని పోలీసులు
ప్రైవేట్ వాహనంలో వెళ్లి మాచవరం వైస్ ఎంపీపీ కుమారుడి అరెస్ట్
రంజాన్ ఉపవాసంలో ఉన్నారని విన్నవించినా బలవంతంగా ఎత్తుకెళ్లారు
పల్నాడు జిల్లా మాచవరం మండల వైస్ ఎంపీపీ నన్నే ఆవేదన
నర్సరావుపేట: పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు తెలంగాణలో తలదాచుకున్నా పోలీసులు వదలడం లేదు. టీడీపీ నేతలు చెప్పినట్లుగా వెంటాడి వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండల వైస్ ఎంపీపీ కుమారుడు, పిన్నెల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు చింతపల్లి జానీబేగం భర్త, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు పెద్ద సైదాను తెలంగాణ రాష్ట్రం మల్లారెడ్డిగూడెంలో శనివారం దాచేపల్లి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్లు ఆయన బంధువులు తెలిపారు.
ఈ సందర్భంగా మాచవరం వైస్ ఎంపీపీ, సైదా తండ్రి చింతపల్లి నన్నే మాట్లాడుతూ ఉదయం ఓ ప్రైవేటు వాహనంలో దాచేపల్లి సీఐతోపాటు మరికొందరు పోలీసులు మల్లారెడ్డిగూడెంలోని తాము ఉంటున్న ఇంటి వద్దకు వచ్చారని చెప్పారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉండి ఇంట్లో నిద్రిస్తున్న తన కుమారుడు సైదాను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు స్పందించి తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని నన్నే కోరారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అల్లాభక్షును కూడా అరెస్ట్ చేశారు.
మాజీ సీఎం జగన్‌ను కలిశారనే అక్కసు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని విధ్వంసానికి పాల్పడ్డారు. అనేకమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో గ్రామాన్ని విడిచి వందలాది కుటుంబాలు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను, గ్రామంలో జరుగుతున్న అరాచకాలను, అక్రమాలను, దౌర్జన్యాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చట్టపరమైన అనుమతులతో ఏప్రిల్ నెలలో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమం చేపట్టి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను తిరిగి గ్రామంలోకి తీసుకొచ్చే బాధ్యతను వైఎస్ జగన్ తీసుకున్నారనే విషయం తెలిసి... ఎలాగైనా వారు రాకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతోనే టీడీపీ నాయకులు మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నారు.