
మోసాలకు అడ్డాగా నరసరావుపేట
ఇప్పటికే సాయిసాధన చిట్‌ఫండ్, యానిమేషన్ స్కామ్‌లలో రూ.800 కోట్లకు పైగా స్వాహా
వెలుగులోకి మరో రెండు ఆర్థిక మోసాలు
పెట్టుబడిని 3 నెలల్లో డబుల్ చేస్తామని ఓ గొలుసుకట్టు సంస్థ భారీగా వసూళ్లు
ప్రతి రోజూ 1.8 శాతం వడ్డీ దవస్తుందంటూ ప్రచారం
25 రోజులుగా నగదు ఉపసంహరణ నిలిపివేత
క్రిప్టో కరెన్సీ పేరుతో మరో సంస్థ బురిడీ
ఈ రెండింట్లో రూ.200 కోట్లకు పైగా వసూలు
మాటలతో మైమరపిస్తున్నారు.. ఆకాశాన్ని తెచ్చి అరచేతిలో పెడతామని ఆశలు కల్పిస్తున్నారు.. కో అంటే కోట్లు అలా వచ్చి పడతాయని నమ్మబలుకుతున్నారు. వందకి వెయ్యి, లక్షకి పది లక్షలు అంటూ ఆశల గాలం వేస్తున్నారు. ఇలా నరసరావుపేట కేంద్రంగా ఆర్థిక నేరగాళ్లు ప్రజలను నిండా ముంచేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ.1,000 కోట్ల వరకు ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు. అత్యాశను ఆయుధంగా చేసుకుని సొమ్మంతా లాగేసుకున్నారు. రూ.వెయ్యి కోట్లకుపైగా స్కాములు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.
సాక్షి, నరసరావుపేట/ నరసరావుపేట టౌన్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అడ్డాగా మారుతోంది. సాయి సాధన చిట్‌ఫండ్ స్కామ్, యానిమేషన్ పేరిట వందల కోట్ల రూపాయల వసూలు చేసిన ఘరానా మోసం ఇప్పటికే వెలుగుచూశాయి. ఈ రెండు స్కాంలలో మోసపోయిన బాధితులు నరసరావుపేటలోనే అధికంగా ఉన్నారు. కొత్తగా మరో రెండు గొలుసుకట్టు సంస్థలు ప్రజలను నిండా ముంచేస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు.
నరసరావుపేట కేంద్రంగా జరిగిన సాయిసాధన చిట్‌ఫండ్ స్కాం నాలుగు నెలల క్రితం వెలుగు చూసింది. అదే విధంగా యూపిక్స్ యానిమేషన్ స్కాం ఏడు నెలల నుంచి పెట్టుబడిదారులకు డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేసింది. డబ్బులు ఇస్తానని నిర్వాహకుడు కొన్ని నెలలుగా మభ్యపెడుతూ వచ్చి, చివరకు పరారయ్యాడు. న్యాయం చేయాలంటూ ఐదు రోజులుగా బాధితులు అధికారులను వేడుకొంటున్నారు.
ఈ రెండు వ్యవహారాల్లో సుమారు రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టి నరసరావుపేట వాసులు నిండా మునిగారు. తాజాగా మరో రెండు గొలుసుకట్టు ఆర్థిక మోసాలు వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వీటిలో నరసరావుపేటవాసులు మరో రూ.200 కోట్ల దాకా పెట్టుబడులుపెట్టినట్టు తెలుస్తోంది.
క్రిప్టో పేరుతో కొట్టేశారు!
మరోవైపు క్రిప్టో కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ మరో సంస్థ నరసరావుపేటలో భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. తీరా పెట్టుబడులు పెట్టాక.. ఈ సంస్థలో పెట్టిన కరెన్సీ విలువ అమాంతం పతనమైందని, ఇప్పడు విత్‌డ్రా చేసుకోవడం మంచిది కాదంటూ చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు.
ఈ క్రమంలో మార్కెట్లోకి మరో ఆన్‌లైన్ కరెన్సీ తెరపైకి వచ్చి కొత్తగా నగదు వసూలు చేస్తున్నారు. మే 21న అంతర్జాతీయ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్ అవుతోందంటూ చెప్పుకొస్తున్నారు. ఏమాత్రం గ్యారెంటీ లేని క్రిప్టో కరెన్సీలో రూ.కోట్లు పెట్టుబడి పెట్టి వాటిని వెనక్కి తెచ్చుకోలేక పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
25 రోజులుగా విత్‌డ్రా నిలిపివేత..
గొలుసుకట్టు ఆర్థిక సంస్థకు సంబంధించి 25 రోజులుగా నగదు ఉపసంహరణ నిలిపివేశారు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి రోజూ 1.8 శాతం వడ్డీ రూపంలో ఇస్తారని నమ్మబలికారు. మూడు నెలల్లో పెట్టుబడి డబుల్ అవుతుందని ఆశ చూపించారు. అడిగిన వెంటనే అసలు తిరిగి ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడులన్నీ అమెరికన్ డాలర్ల రూపంలో పెట్టాల్సి ఉండటంతో ఏజెంట్లే నగదును ఎక్స్చేంజ్ చేసి మరీ పెట్టుబడులు పెట్టించారు.
దీనికోసం నరసరావుపేటలోని పలు ప్రముఖ రోడ్లలో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా భారీగా నగదుని పెట్టుబడులుగా పెట్టించారు. నగదు నిలిపివేయడంతో పెట్టుబడిదారులు కార్యాలయాల నిర్వహకులు, ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కంపెనీ షట్‌డౌన్ చేసిందని, మరో ప్లాట్‌ఫాంలో త్వరలో కార్యకలాపాలు కొనసాగుతాయని, మీ డబ్బుకు ఢోకాలేదంటూ చెప్పుకొస్తున్నారు.