చైన్ లింక్‌కు మోసపోయిన మహిళలు
బంగారు తాకట్టుపెట్టి, అప్పులు చేసి కట్టారు
జిల్లాలో కోట్లు పోగొట్టుకున్న బాధితులు
కొంపలు ముంచుతున్న మాయదారి యాప్‌లు
పలమనేరు: మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా రాజేష్ పనిచేస్తున్నాడు. ఇతని స్నేహితుడు పట్టణానికే చెందిన ఓ హోటల్ యజమాని ద్వారా బయటి వ్యక్తుల ద్వారా డాయ్ యాప్ కథ మొదలైంది. రాజేష్ పనిచేసే కార్యాలయంలో 26 వార్డులకు చెందిన 40మంది దాకా ఆర్‌పీ(రిసోర్స్‌పర్సన్)లున్నారు.
వీరి ఆధ్వర్యంలో పట్టణంలోని పది వేలమంది గ్రూపు సభ్యులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. తొలుత కార్యాలయంలోని ఆర్‌పీలు, సీవోలను ఇందులోకి దించి వారికి నిత్యం డబ్బులు ఖాతాలోకి వచ్చేలా చేశారు. వీరి ద్వారా గ్రూపుల్లోని మహిళలను ఇందులోకి వచ్చేలా చేసి మోసానికి పాల్పడ్డారు.
ఇప్పటికే పలు చోట్ల ఇదేతరహా మోసాలు
పలమనేరులో జరిగినట్టే చిత్తూరులోనూ యాప్ మోసం తాజాగా బయటపడింది. ఇక్కడే కాక గుంటూరు, అనంతపూర్, తెలంగాణాలోని పలుచోట్ల గతంలో యాప్ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి పోలీసులు సైతం యాప్‌లను నమ్మి మోసపోరాదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలో కొన్నాళ్ల పాటు స్థానికుల ద్వారా యాప్ కార్యకలాపాలను నిర్వహించి ఆపై యాప్‌ను మాయం చేస్తున్నారు. మోసపోయామని గమనించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది. పలమనేరులో ఈ నెల 21న యాప్ కనిపించకుండా పోయేనాటికి దీని బారిన వేలాది మంది పడినట్టు తెలుస్తోంది.
ఏఐ టెక్నాలజీతో నడిచేయాప్
డాయ్ యాప్ సాధరణ ప్లేస్టోర్‌లా కాకుండా లింక్‌ద్వారా మాత్రమే ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది పూర్తిగా ఆరి్టఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడుస్తుంది. మనకు యాప్ నుంచి వచ్చే కాల్స్ కేవలం వినేందుకు మాత్రమే మాట్లాడేందుకు వీలు కాదు. వీటికి ఎలాంటి అనుమతులుండవు. కేవలం సిస్టమ్ ద్వారా ఎక్కడినుంచో మొత్తం నెట్‌వర్క్ జరుగుతుంది. ఇందులో కాస్త తెలివైన వారిని మేనేజర్‌గా నియమించుకొని మొత్తం వ్యవహారాన్ని నడుపుతుంటారు. మొదట్లో జనానికి ఆశచూపి క్రెడిట్ అవుతున్న మొత్తం భారీ స్థాయిలో చేరే సరికి యాప్‌ను కనిపించకుండా చేసేస్తారు. ఆపై ఏమీ చేసినా యాప్ కనిపించదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు.
» పలమనేరుకు చెందిన రాజేశ్వరి, మహిళా గ్రూపులోని ఆర్‌పీ మాటలు నమ్మి అప్పులు తెచ్చి రూ.1.90 లక్షలు డాయ్ యాప్‌లో కట్టి మోసపోయింది. ఇదంతా తన భర్తకు తెలియకుండా చేసింది. ఇప్పుడు భర్త ఆమెతో గొడవపడి,ఇంటి నుంచి తరిమేశాడు.
» పట్టణానికి చెందిన అనిల్‌కుమార్ అప్పు చేసి మరీ రూ.93 వేలను యాప్‌లో కట్టి పోగొట్టుకున్నాడు.
» స్థానిక కొత్తపేటకు చెందిన భాగ్యలక్ష్మి బంగారాన్ని తాకట్టు పెట్టి ఇందులో రూ.లక్ష కట్టింది.
» భర్తలేని వసంతి చిన్నకొట్టు ద్వారా జీవనం సాగిస్తూ ఇందులో రూ.3 లక్షలు పోగొట్టుకుంది. ఇంకా అనురాధ, వాణి, దివ్యలే కాదు జిల్లాలోని వేలాదిమంది గొలుసుకట్టు యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయలు మోసపోయారు.
డాయ్ యాప్ ఘటనపై విచారణ కమిటీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలమనేరులో జరిగిన డాయ్ యాప్ ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ పలమనేరు ప్రాంతంలో డాయ్ యాప్ వలలో బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
మెప్మా పీడీ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించామన్నారు. కమిటీలో రెవెన్యూ శాఖ తరపున డిప్యూటీ తహసీల్దార్, పోలీసుశాఖ తరపున సీఐ సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఈ నెల 29, 30 తేదీల్లో పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి కార్యాలయపు పనివేళల్లో విచారణ జరుపుతుందన్నారు. డాయ్ యాప్ బాధితులు విచారణ కమిటీకి ఫిర్యాదులు చేయవచ్చని కలెక్టర్ వెల్లడించారు.
» ‘డాయ్’ బాధితులకు బెదిరింపులు
» చైన్ లింక్‌లో ‘మెప్మా’ పేరు వాడొద్దంటూ హుకుం
» రూ.30 లక్షల వరకు మహిళలకు కుచ్చు టోపీ
» ‘లక్కీ’ వారియర్ వాట్సప్ గ్రూప్ పేరిట లావాదేవీలు
చిత్తూరు అర్బన్: సామాన్యుల ఆశ ను ఆధారంగా చేసుకుని రూ.కోట్లలో దోచుకున్న ‘డాయ్’ (డాటామీర్ ఏఐ) సంస్థ బాధితులు చిత్తూరు నగరంలోనూ వెలుగు చూస్తున్నారు. పలమనేరు పట్టణంలో వెలుగు చూసిన ఈ భారీ మోసంలో దాదాపు రూ.30 కోట్ల వరకు బాధితుల నుంచి రాబట్టుకున్న డాయ్ సంస్థ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. దీని బాధితులు చిత్తూరులో కూడా ఉన్నారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లో పనిచేసే ఓ ఉద్యోగి పాత్ర ఇందులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవో) కొందరు ఈ స్కీమ్‌లో చేరి మహిళలపై ఒత్తిడి పెంచి డాయ్ సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. ఈ చైన్‌లింక్ ద్వారా రూ.30 లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నట్లు పలువురు స్వయం సహాయక మహిళలు ఆరోపిస్తున్నారు. మొబైల్‌ఫోన్ యాప్‌లలో వచ్చే పలు ప్రకటనలకు రేటింగ్ ఇచ్చి.. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తుందనే అత్యాశతో ఈ సంస్థలో పెద్ద సంఖ్యలో మహిళలు చేరి, బాధితులుగా మారారు. యాప్‌లో ఒకర్ని చేర్చి, వారు మరో పది మందిని ఇందులో చేరి్పస్తే కమిషన్ రూపంలో పెద్ద మొత్తంలో నగదు వస్తుందనే మరో మోసానికి కూడా తెరతీశారు.
చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఇద్దరు ఉద్యోగులను నమ్మిన మహిళా సంఘాల సభ్యులు రూ.30 లక్షల వరకు ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. ప్రధానంగా మహిళా సంఘాలను పర్యవేక్షించే కొందరు రిసోర్స్ పర్సన్లు కమిషన్‌కు ఆశపడి పెద్ద సంఖ్యలో మహిళల్ని ఇందులో సభ్యులుగా చేరి్పంచారు. కార్పొరేషన్‌కు చెందిన మహిళా మార్టు, స్వయం సహాయక సంఘాల్లోని పలువురు సభ్యులు ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ఆటో నడుపుతున్న వ్యక్తి భార్య ఒకరు తన చుట్టుపక్కల మహిళల ద్వారా రూ.10 లక్షలను డాయ్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు వెలుగుచూసింది. ఈ మోసం బయటకు పొక్కడంతో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ మెప్మా పేరు ఎక్కడా వాడొద్దని, ఎదైనా ఉంటే పలమనేరు వెళ్లి తేల్చుకోవాలని ఓ ఉద్యోగి బాధిత మహిళల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
రూ.3 వేలకు వారంలో రూ.5,292
డాయ్ యాప్‌లో సభ్యులుగా చిత్తూరుకు చెందిన మహిళల్ని పెద్ద సంఖ్యలో చేరి్పంచడంలో మెప్మాలోని ఉద్యోగితో పాటు కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. లక్కీ వారియర్ పేరిట వాట్సప్ గ్రూప్‌ను తయారుచేసి, పెట్టుబడులు పెట్టేవాళ్లను సభ్యులుగా చేర్చారు. ఎఫ్‌ఈ రూబోట్ పేరిట ఒక్కసారి రూ.3 వేలు పెడితే రోజుకు రూ.756 చొప్పున వారంలో రూ.5,292, రూ.7 వేలు పెడితే రూ.13,813, రూ.9 వేలు పెడితే అయిదు రోజుల్లో రూ.13,365 వస్తుందని ప్రచారం చేశారు. మహిళల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని బోర్డు తిప్పేశారు.
బాధ ఎవరికి చెప్పుకోవాలో
గ్రూపుల్లో ఉండే మాకు యాప్ గురించి ఏమీ తెలీదు. మా ఆర్‌పీ డబ్బులు బాగా సంపాదించే మార్గమని మా చేత కట్టించారు. నేను అప్పు చేసి ఇందులో డబ్బులు కట్టా. ఇప్పుడు ఆర్‌పీలను అడిగితే మాకు రూ.లక్షల్లో నష్టం వచ్చింది మేమేమి చేసేదంటున్నారు. ఇంక మేము ఎవరికి చెప్పినా పోయిన డబ్బు వచ్చేలాలేదే. – రాజేశ్వరి, గ్రూపు సభ్యురాలు, పలమనేరు
లాభం వస్తా ఉందని నమ్మి..
నాకు తెలిసిన వాళ్లు చెప్పినమాట విని రెట్టింపు లాభం ఉంటుందని డబ్బులు కట్టా. మొదట్లో కొన్ని రోజులు డబ్బులు వచ్చాయి. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టా. ఆపై మొబైల్‌లో యాప్ కనిపించకుండా పోయింది. అప్పుచేసిన డబ్బు మొత్తం పోయింది. ఇప్పుడు ఏమి చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచడం లేదు. – అనిల్‌కుమార్, పలమనేరు
నగలు తాకట్టు పెట్టి కట్టా
మా ఆర్‌పీ చెప్పింది కాబట్టి నమ్మి ఇందులో చేరా. రోజుకి 200 వస్తా ఉంది కదా ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తాయన ఆశపడ్డా. దీంతో నగలను తాకట్టు పెట్టి ఇందులో కట్టాను. ఇప్పుడు మోసపోయానని తెలిసింది. మా ఇంట్లోవాళ్లు ఎందుకు ఇలా చేశావని గొడవకు దిగారు. ఇకపై గ్రూపుల్లో అప్పు డబ్బు కట్టేందుకు కూడా కుదరకుండా పోయింది. – భాగ్యలక్ష్మి, పలమనేరు
యాప్‌లను నమ్మి మోసపోకండి
గొలుసుకట్టు, యాప్‌లను నమ్మి డబ్బులు కట్టొద్దని ముందునుంచి చెబుతూనే ఉన్నాం. కానీ అత్యాశకుపోయి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఊరికే డబ్బులిస్తామా. దానికి గ్యారెంటీ చూస్తాం కదా ఇందులో మాత్రం ఎలా పెడతారో అర్థంకాదు. ఇకనైనా ప్రజలు ఇలాంటి వాటి జోలికెళ్లకుండా ఉండాలి. – విష్ణు రఘువీర్, డీఎస్పీ, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment