ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా?.. మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా..
ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన?
విజయవాడలో వరదలు వచ్చినప్పుడు పునరావాస శిబిరాలు ఎక్కడ పెట్టారు?
కోటి మందికి రూ.368 కోట్లతో భోజనాలు పెట్టారా?
కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, జనరేటర్లకు రూ.23.02 కోట్లు వ్యయం చేశారా?
ఈ అవినీతిపై ప్రశ్నించిన ‘సాక్షి’పై కేసులు పెడతారా?
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ఇలాగైతే మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కదని హెచ్చరిక
విజయవాడలో బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా? మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన..?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రశ్నించే స్వరమే వినిపించకూడదని ఆరాటపడుతూ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ‘సాక్షి’ ఎడిటర్‌పై పెట్టిన కేసే తార్కాణమని చెప్పారు. ‘ఇలాగైతే ప్రజలు మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కకుండా చేస్తారు...’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకో..
చంద్రబాబు అధికారంలో ఉన్నంత మాత్రానా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. అప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేస్తుంది. ఎప్పటికైనా చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే.. ఆ వ్యక్తిలో పరివర్తన వస్తే కొద్దో గొప్పో సానుకూలత పెరుగుతుంది. అంతేగానీ తప్పు కనిపించకూడదు... దాని గురించి ఎవరూ మాట్లాడకూడదంటే ఎవరూ హర్షించరు.
రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మద్యం విషయంలో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు. ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లతోపాటు క్యాష్ పేమెంట్లను అందుబాటులో ఉంచాం. ప్రతి దుకాణంలో పీవోఎస్‌లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లే నడుపుతున్నారు.
స్ట్రైక్ రేటు చూసుకుని స్కాములు చేస్తామంటే ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుంది. జమిలి ఎన్నికలు మన చేతుల్లో లేవు. ఏం జరిగినా పార్టీని సన్నద్ధంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. గ్రామ స్థాయిలో పార్టీకి బూత్ కమిటీలు నియమించి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం.
వరదల్లోనూ స్కామ్‌లేనా?
చంద్రబాబు స్కామ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో విజయవాడలో వరదల సమయంలో చూశాం. బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు.
వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. ఇంత దారుణంగా స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైగా ఇవే ప్రశ్నలు అడిగినందుకు ‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు పెట్టారు. ఇంత దారుణంగా ప్రభుత్వ పాలన చేస్తుంటే ప్రశ్నించకూడదా? వీళ్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదా? అసలు వీళ్లు పరిపాలన చేయడానికి యోగ్యులేనా? ప్రజలందరూ ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment